రైతు కోసం గళమెత్తిన సంస్కర్త ఫూలే

Nov 28,2024 05:35 #Articles, #edite page

పందొమ్మిదవ శతాబ్దపు సంఘ సంస్కర్తల్లో రైతుల గురించి పోరాడిన ఏకైక సంస్కర్త జోతిరావు ఫూలే. జోతిరావు తండ్రి గోవింద్‌ రావు పూల వ్యాపారి. ఆయనకు కొంత భూమి ఉండేది. ఆ భూమిలో పూలు పండించి పూనాలోని తన అంగట్లో అమ్మేవాడు. చిన్నతనంలో జోతిరావు కూడా పొలంలో, అంగడిలో పనిచేశాడు. అలా రైతు నేపథ్యం నుండి వచ్చిన ఫూలే ఆనాటి శూద్రులు, అతి శూద్రులు ఎదుర్కొంటున్న వివిధ సామాజిక సమస్యలతో పాటు రైతు, కార్మిక సమస్యలపై కూడా పోరాడారు.
ఖండే అనే నాయకుడితో కలిసి బొంబాయిలో కార్మిక సంఘం నెలకొల్పారు. సామాజిక ఆర్థిక పోరాటాలు రెండింటినీ ఆయన నిర్వహించారు. చాలా వరకు సామాజిక దోపిడి. ఆర్థిక దోపిడి కలిసే ఉంటాయి. మన దేశంలో మరీనూ. ప్రతిఘటన లేని ఆర్థిక దోపిడీకి సామాజిక పెత్తనం ఒక అదనపు సాధనం. కనుక ఫూలే రెండు రంగాల్లోనూ పోరాడారు. పూనా ప్రజల చేత ‘మహాత్మా’ అన్న బిరుదు పొందిన ఫూలే 1827 ఎప్రిల్‌ 11న పూనాలో పుట్టారు. 1890 నవంబర్‌ 28న మరణించారు.
ఆనాటి రైతు సమస్యలను బ్రిటిష్‌ పాలకుల దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి ఫూలే పలు చర్యలు సూచించారు. దాదాపు 150 ఏళ్ల క్రితం 1883లో సేత్కార్యాచ అసూడ్‌్‌ (సేద్యగాని చర్నాకోల) పేరుతో మరాఠీలో రైతు సమస్యలపై ఒక పుస్తకం రాశారు. అందులో రైతు శ్రమ ఫలితాన్ని మతాచారాల పేర పురోహితులు, భూవివాదాల్లో రైతులను మోసగించి కులకర్ణీలు, బ్రాహ్మణ ఉద్యోగులు అలాగే ప్రభుత్వం వారిని ఎలా దోచుకొంటుందో వివరంగా చెప్పారు. ఆ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సూచనలు నేటికీ ప్రాసంగికమైనవే.

సనాతన ధర్మం ఎంతో గొప్పదని ఎవరు ఎంత భుజం చరిచినా అది శూద్రులను, అతిశూద్రులను ఎలాంటి హక్కుల్లేని దాసులుగా మార్చిందన్నది దాచిపెట్టలేని నిజం. వర్ణాశ్రమ ధర్మాన్ని, పురాణాలను, వేదాలను సవాలు చేసిన ఫూలే రైతుల కోసం కూడా గళం విప్పారు. ఫూలేకు ముందు ఆ తర్వాత వచ్చిన అనేక మంది సంస్కర్తలు ఆంగ్లేయ విద్యతో, యూరపు ఉద్యమాలతో స్ఫూర్తి పొంది హిందూ మతంలో సంస్కరణల కోసం కృషి చేశారు. జవహర్‌ లాల్‌ నెహ్రు చెప్పినట్లు ఆ సంస్కరణలు సమాజంలోని అట్టడుగు తరగతులకు చేరలేదు. ఫూలే దానికి ఒక మినహాయింపు.
హిందూ మతంలో సముద్రయానంపై విధించిన నిషేధం కూడా దోపిడీలో భాగమేనని ఫూలే చెప్పారు. పశ్చిమ దేశాల విజ్ఞానాన్ని, అక్కడి మానవ హక్కులను మన దేశ వాసులు గమనిస్తే తమ ఆధిపత్యానికి, దోపిడికి ప్రమాదం ఏర్పడుతుందని భావించిన ఆధిపత్య వర్గాలు భయపడ్డాయన్నారు. శూద్ర రైతుల దయనీయ స్థితికి మతపరమైన, సమాజపరమైన కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నింటినైనా చర్చకు పెట్టాలన్న ముఖ్య ఉద్దేశంతో తాను ఆ గ్రంథం రాశానని చెప్పారు. మతం మానవ కల్పితమే కాదు, అది క్రూరమైందని కూడా ఆయన అన్నారు. బ్రాహ్మణోమ దైవతం ( బ్రాహ్మణుడే నా దైవం) అన్న భావన శూద్ర రైతుల్లో ఉన్నంత కాలం వారు పీడన నుండి బయటపడరని చెప్పారు.
రైతును పురోహితులు దోచుకోవడం అతను పుట్టక ముందు నుండే మొదలు పెడ్తారు. అతను చనిపోయాక ఉత్తర క్రియలు, శ్రాద్ధకర్మల పేర కూడా ఎలా దోచుకుంటారో ఫూలే తన పుస్తకంలో వివరంగా చెప్పారు.

బ్రిటిష్‌ పాలనలో రైతులపై విధిస్తున్న భూమి శిస్తును కట్టలేని స్థితిని వివరిస్తూ ఫూలే ఒక విషయం చెప్పారు. గతంలో రాజుల దగ్గర సైనికులుగా, గుర్రాలు, పశువులు, ఒంటెలు, ఏనుగులకు సంరక్షకులుగా శూద్ర అతిశూద్రుల కుటుంబాల నుండి ఎవరో ఒకరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు. దాని వల్ల ఆ కుటుంబాలకు భూమి శిస్తు చెల్లించడం ఒక సమస్యగా ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఉద్యోగాలు లేవు రైతులు భూమి శిస్తు చెల్లించలేక పోతున్నారని చెప్పారు. కేవలం కొద్ది పాటి భూమిపై ఆధారపడి జీవించే వారి స్థితి నేటికీ అలాగే ఉంది. భూమి శిస్తు లేకపోయినా రైతులు రకరకాల దోపిడీకి గురవుతున్నారు.
తక్కువ భూమి గల రైతులు గొర్రెలు, మేకలు, పశువులు పెంచుకొని కొంత ఆదాయం పొందేవారు. బ్రిటిష్‌ పాలకులు పచ్చిక బయళ్లను కూడా అడవులుగా గుర్తించడం వల్ల జీవాలకు మేత లేదు. కనుక అడవుల్లో కొంత భాగాన్ని పచ్చిక బయళ్ల కోసం గ్రామాలకు అప్పగించాలని కోరారు. బ్రిటిష్‌ వారి పారిశ్రామిక ఉత్పత్తులతో పోటీ పడలేక దేశంలోని వృత్తిదార్లు బతుకుదెరువు కోల్పోయారు. తిండి దొరకని స్థితికి చేరారు. అర్ధాకలితో చస్తున్నారని ఫూలే చెప్పారు. రైతులు ఆత్మహత్యల గురించి ఆయన ప్రస్తావించలేదు. కాని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మాత్రం వారికి కల్గుతోందని చెప్పారు.

బ్రిటిష్‌ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన వదల్లేదు. చదువు పేర స్థానిక పన్నుల రూపంలో లక్షల రూపాయలను వసూల్‌ చేస్తున్నారు. అందులో మూడవ వంతు మాత్రమే అక్కడో ఇక్కడో స్థాపించిన బడులపై ఖర్చు చేస్తున్నారు. పిల్లలను బడికి పంపిస్తున్న రైతుల సంఖ్య చాలా తక్కువ. రైతులందరూ తమ పిల్లలను తప్పక బడికి పంపాలన్న ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేయాలని ఫూలే కోరారు. అలా నిర్బందోచిత విద్య ఆవశ్యతను ఆయన శతాబ్దంన్నర క్రితమే చెప్పారు. పాఠాలు చెప్పాల్సిన పంతుళ్లు పవిత్రం అపవిత్రం అంటూ విద్యార్థులపై ఆంక్షలు పెడతారు. పైగా క్రతువుల నిర్వహణల్లో మునిగి చదువు చెప్పరు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. కనుక రైతుల పిల్లలు ఎంతమంది చదువుకొన్నారు. వారిలో ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగంలో చేరగల విద్యను పొందారు అన్న విషయాలను ప్రభుత్వం రాజ పత్రం (గెజిట్‌)లో ప్రచురించాలని ఫూలే డిమాండ్‌ చేశారు.

అన్ని ఉద్యోగాలను బ్రాహ్మణులే కాజేయకుండా వారికి వారి జనాభా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించి మిగిలిన ఉద్యోగాలను శూద్ర అతిశూద్రులకు ఇవ్వాలన్నారు. రైతుల పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే రైతు కుటుంబాల నుండే టీచర్లు ఉండాలి. విద్యార్థులకు ఒక నిర్ణీత కాలం సాధారణ విద్యనందించి ఆ తర్వాత వ్యవసాయ సంబంధ శిక్షణనివ్వాలి. వారిలో సత్ప్రవర్తన గల విద్యార్థులను 6వ తరగతి పాసయ్యాక గ్రామ పాటిళ్లుగా నియమించాలి. అలాచేస్తే బ్రాహ్మణ కులకర్ణీ (కరణాల)లు పెట్టే బాధల నుండి రైతులను తప్పించవచ్చు. కొంత కాలం పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడం ఆపేసి ఆ ఉద్యోగాల్లోకి రైతు కుటుంబాల యువకులను తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. బ్రిటిష్‌ పాలకులు ఆ పని చేయకపోయినా ఫూలే అభిమాని సాహు మహరాజు తన రాజ్యంలో బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లను అమలు చేశారు.
ముప్పయ్యేళ్లకు ఒకసారి ప్రభుత్వం భూమి శిస్తును సవరిస్తుంది. ఆ సమయంలో ఎంతోకొంత శిస్తును పెంచకుండా బ్రిటిష్‌ అధికార్లు ఒప్పుకోరు. పైగా భూమిని సర్వే చేస్తున్నప్పుడు అక్కడ ఉండాల్సిన బ్రిటిష్‌ అధికార్లు ఆ పనిని బ్రాహ్మణ ఉద్యోగులకు వదిలి వేటకు వెళ్తారు. ఒక క్రమ పద్ధతి లేకుండా బ్రాహ్మణ ఉద్యోగులు శిస్తును పెంచుతారు. భూ వివాదాల కేసుల్లో బ్రాహ్మణ గుమస్తాలు రైతుల స్టేట్‌మెంట్లను మార్చి రాస్తారు. వాటి ఆధారంగా మెజిస్ట్రేట్లు తప్పుడు తీర్పులిచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఎక్కువ భూమిగల రైతులు తమ భూమిని సాగు చేయక పడావు పెడుతున్నారు. ఫలితంగా తిండి గింజల ఉత్పత్తి తగ్గుతోంది. పెరుగుతున్న జనాభాకు తగినట్లు పంటల ఉత్పత్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టదు. తమ గోడును కలెక్టర్‌కు చెప్పుకోవడానికి వచ్చిన రైతును బ్రాహ్మణ ఉద్యోగులు గోస పెడ్తారు. తప్పుడు సాకులతో రైతులను అరెస్టు చేయిస్తారు. కేసులు ఎత్తేయడానికి గుమాస్తాలు, పోలీసులు లంచాలు గుంజుతారు. వారు వడ్డీ వ్యాపారుల నుండి కూడా లంచాలు తీసుకొని రైతులను కష్టాల పాల్జేస్తున్నారు. మద్యం, వేట ఈ రెండింటి మైకంలో పడిన ఆంగ్లేయ అధికారులు రైతుల గోస పట్టించుకోరని ఫూలే విమర్శించారు.

వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి కూడా ఫూలే పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో యూరపు దేశాల తరహాలో ఆధునిక పనిముట్లను ప్రవేశపెట్టాలి. వాటి ఉపయోగంపై శిక్షనివ్వాలన్నారు. గోమాంస భక్షణను ఆయన వ్యతిరేకించలేదు. అయితే వ్యవసాయానికి అవసరమైన పశువుల సంఖ్య తగ్గకుండా ముస్లింలు, ఆంగ్లేయులు విదేశాల నుండి దిగుమతి చేసుకొని వాటి మాంసం తినాలన్నారు. వాగులపై ప్రభుత్వం చిన్న చిన్న ఆనకట్టలు కట్టి వర్షపు నీటితో పాటు నదుల్లోకి పశువులను వెళ్లే భూసారాన్నీ కాపాడాలని కోరారు. కొండలు, గుట్టల్లో వీలైనన్ని చెరువులు కట్టించాలి. వాటి వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. పంటల దిగుబడులూ పెరుగుతాయి. సేద్యపు బావులు తవ్వుకొనే రైతులకు ప్రోత్సాహాలు అందించాలి. విదేశాల నుండి మేలు జాతి గొర్రెలను ప్రభుత్వమే దిగుమతి చేసుకొని ఆ జాతిని అభివృద్ధి చేయాలి. అడవి జంతువుల నుండి పంటలు కాపాడుకోవడానికి రైతులకు తుపాకీ ఉంచుకోవడానికి అనుమతినివ్వాలి. లేదంటే పంట నష్టాన్ని ఉన్నతాధికారుల జీతాల్లో కోసి రైతులకివ్వాలి.

కమ్మరి, వడ్రంగి పని నేర్చుకొన్న రైతు కుటుంబాల పిల్లల్ని విదేశాలకు తీసుకెళ్లి అక్కడి వ్యవసాయ పాఠశాలలను, పంటపొలాలలను చూపెట్టాలి. దాని వల్ల వారు మెరుగైన వ్యవసాయ పరికరాలను తయారు చేయగలరు. లక్షలాది రైతులు సరైన తిండికీ, బట్టకు నోచుకోలేని దశలో పోలీసు, న్యాయ శాఖ, మిలిటరీ, రెవెన్యూ తదితర ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా వేతనాలు, పింఛన్లు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు? అలా అని తక్కువ జీతం పొందే సైనికులు, కమ్మర్లు, వడ్రంగుల వంటి వారి జీతాలు తగ్గించరాదు. ఉన్నతాధికారుల జీతాలు తగ్గించాలని కోరారు. చిన్ననాటి ముస్లిం స్నేహితుల వల్ల తనకు హిందూ మతంలోని స్వార్ధం ఏమిటో అర్ధమయిందంన్నారు. తనకు జ్ఞానభిక్ష పెట్టిన స్కాటిష్‌ మిషన్‌కు, ప్రభుత్వ పాఠశాలకు కృతజ్ఞతలు తెలిపారు. తన అభిప్రాయాలను పుస్తక రూపంలో తెలియచేయడానికి స్వేచ్ఛనిచ్చిన బ్రిటిష్‌ ప్రభుత్వ రాజకీయ వ్యవస్థకు, పుస్తకం ప్రచురణకు ఆర్థిక సహాయం చేసిన బరోడా మహారాజుకు కూడా ఫూలే కృతజ్ఞతలు తెలిపారు.

వ్యాసకర్త ‘ప్రజాశక్తి’ పూర్వ సంపాదకులు, ఎస్‌. వినయకుమార్‌
సెల్‌ : 9989718311 /

➡️