కదిలింది పల్లె జీవితం!!

Feb 15,2024 07:18 #Farmers Protest, #Poetry
Farmers protest in delhi

మట్టిని చెరబట్టే

చట్టాలను నిలదీస్తూ..

మూగ నేల గొంతయి

నిలదీస్తూ, నినదిస్తూ

దిక్కులన్ని పిక్కటిల్ల

ఢిల్లీ గుండె దద్దరిల్ల

రగిలింది రైతు భారతం

కదిలింది పల్లె జీవితం

భూమి.. పంట.. రైతు బంధాన్ని తెంచేసి..

జై కిసాన్‌ నినాదాన్ని భవితలో చెరిపేసి..

దేశానికి వెన్నెముక రైతే అంటూ..

ఆ వెన్నెముకను విరిచేసే

చట్టాలివి అంటూ..

రగిలింది రైతు భారతం

కదిలింది పల్లె జీవితం!

కౌలుదారు.. పాలేరుగా

రైతు మారిపోవాలా?

అన్నదాత అన్న పేరు

రైతు మరచిపోవాలా?

కార్పొరేట్ల చుట్టాలుగా

తెచ్చిన ఈ చట్టాలు

మోడీ సర్కారు

బిగించిన చట్రాలేనని

రగిలింది రైతు భారతం

కదిలింది పల్లె జీవితం!

పొగ మంచు, చలిగాలులు

అడుగడుగున బారికేడ్లు!

జల ఫిరంగులు, లాఠీలు,

భాష్పవాయు గోళాలు!

దాడులెన్ని చేస్తున్నా

దారులే మూసేస్తున్నా!

రగిలింది రైతు భారతం

కదిలింది పల్లె జీవితం!!

 

– నల్లి ధర్మారావు, సెల్‌ : 76609 67313

➡️