విధానాలు- పోరాటాలే కమ్యూనిస్టుల విశ్వనీయతను పెంచుతాయి

Jun 18,2024 05:22 #Articles, #Communists, #edite page

సందర్భం ఏదైనా కమ్యూనిస్టుల మీద ముఖ్యంగా సిపిఎం మీద దాడి చేయడం కొందరికి మహా ఇష్టమైన వ్యసనం. అందులోనే వారికి ఆనందం, పరమానందర. జూన్‌ 6న ఆంధ్రజ్యోతి పత్రికలో చెరుకూరి సత్యనారాయణ రాసిన ‘జన ఝంఝూ ప్రభంజనం ధాటికి కొట్టుకెళ్లిన ‘జగ’జ్జనులు’ వ్యాసంలో సిపిఎం పై అనేక నిందారోపణలు చేశారు. ఈ వ్యాసంలో ఎక్కడా బిజెపి ప్రమాదం గురించి ఒక్క మాటకూడా మాట్లడలేదంటే ఇది రాసింది నేనెరెగిన చెరుకూరి గారేనా లేకా బిజెపి వారా అనే అనుమానం కలిగింది. దేశ ప్రజలందరూ గుర్తించిన మోడీ మతోన్మాద రాజకీయాలను ‘వామపక్షవాది’ సత్యనారాయణ గుర్తించలేదంటే నమ్మగలమా? పదేళ్ళ మోడీ పాలనానుభవం చూసినతర్వాత ప్రతి అభ్యుదయ, వామపక్షవాది రాజ్యాంగాన్ని, అందులోని లౌకిక, ఫెడరల్‌ విధానాలను, సామాజిక భద్రతను, దేశసమైక్యతను కాపాడుకోవాలంటే ఆయనను గద్దె దించాల్సిందే అని ఏకోన్ముఖ నిర్ణయానికి వచ్చారు. ఇండియా వేదికలోలేని మరికొన్ని వామపక్ష పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో సిపిఎంను బలపరిచాయి. వారి ఓట్లను వేయించాయి. దేశమంతా ఒకదారి, నాదారి మరోదారి అన్నట్లు ‘ఎపి వరకు ఆలోచిస్తే అధికార పార్టీల జయాపజయాలు ఎలా ఉన్నా, ఓడిపోయింది ‘మా వామపక్ష సోదరులే’ అంటూ చెరుకూరి ‘మా’ పై దాడికి సిద్ధపడ్డాడు. ‘ముచ్చటగా మూడవసారి కూడా వారికి ప్రవేశం లేకుండానే ఆంధ్ర శాసనసభ కొలువుదీరబోతుంది’ అని కమ్యూనిస్టుల ప్రాతినథ్యం లేనందుకు ముచ్చట పడుతున్నట్లు వుంది. విధానాలకు కట్టుబడి, గాలివాటం రాజకీయాలకు కొట్టుకపోనందుకు మమ్మల్ని నిందిస్తున్నాడు. ”నడిరే యాకస మావర్తించిన, మేఘా లావర్షించిన, ప్రచండ ఝంఝూ ప్రభంజనం గజగజలాడించిన”అని శ్రీశ్రీ అన్నట్లు, ఎన్నికల ధన ప్రళయ భీకర ప్రవాహాంలో కూడా అటు ఇటు మొగ్గకుండా సిపిఎంకు అండగా అరకు పార్లమెంట్‌లో లక్షపాతిక వేలు, ఈ పార్లమెంట్‌ పరిధిలోని అరకు అసెంబ్లీ లో 45 వేలు, పాడేరులో 27,700, రంపచోడవరంలో సుమారు 25 వేల మంది ఓటువేయడం సత్యానారాయణ గారి దృష్టిలో కమ్యూనిస్టులకు దక్కిన ‘గౌరవప్రదంగా’ కనిపించలేదు.
‘ఈ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపినీ, రాష్ట్రంలో వైసీపీనీ వ్యతిరేకించమని, సాగనంపమని పిలుపునిచ్చిన వామపక్షాలు రాష్ట్రంలో వారి పిలుపునకు అనుగుణ్యమైన ప్రత్యామ్నాయం చూపడంలో విఫలం’ అయ్యాయట! రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే కదా సిపిఎం, సిపిఐ పార్టీలు కాంగ్రెసును కలుపుకుని ఇండియా వేదిక తరుపున పోటీచేసింది. ఈ వేదికను బలపరుస్తూ వడ్డేశోభనాద్రీశ్వరరావు, కె.ఎల్‌. విజయరావు, చలసాని శ్రీనివాసరావు, ఎంఎల్‌సీలు లక్ష్మణరావు, ఐ. వెంకటేశ్వరరావు లాంటి అనేకమంది అభ్యుదయ ప్రజాతంత్ర వాదులు వారి వయసును, ఆరోగ్యాన్ని సహితం ఖాతరు చేయకుండా వామపక్షాలు పోటీచేసిన నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ప్రచారం చేశారు. అరకు పార్లమెంట్‌లో బిజెపి గెలవకుండా కిశోర్‌చంద్రదేవ్‌ లాంటి వారు సిపిఎంకు అండగా నిలిచారు. బిజెపి ఉపద్రవాన్ని సాహిత్యం ద్వారా, సోషల్‌మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి, ఆంధ్రావనికి ఇదే ప్రత్యామ్నాయమని వేలాదిమంది చాటిచెప్పారు. కానీ ‘మా’ అని చెప్పే వారు ఈ రాజకీయ కృషిలో ఎక్కడున్నారు? దేశంలో ఏర్పడిన ఇండియా వేదికేకదా నేడు మతోన్మాద, రాజ్యాంగ వ్యతిరేక బిజెపిని కొంతైనా నివారించింది. అందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెసుతో కలిసి పనిచేయడం ‘షర్మిల దగ్గర దేబిరించి, ఆమె కూడా కాదంటే ఢిల్లీ స్థాయిలో పైరవీ చేసే’ స్థాయికి కమ్యూనిస్టుల పరపతి పడిపోయినట్లు మీకు కనిపించడం వింతగావుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రరాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెసుతో ‘దేబిరించి…. పైరవీ’లు చేసి కమ్యూనిస్టులు ఎందుకు పోటీ చేశారో మీకు తెలియదా? పదవుల కోసం ఏ గడ్డైనా కరిసి, రోజుకో పార్టీ మార్చే నేటి రోజుల్లో రాజకీయ విధానం కోసం ఓర్పుతో కాంగ్రెసును కలుపుకుని కమ్యూనిస్టులు పనిచేయడం మీకు నేరంగా కనిపిస్తుందా? గత పది సంవత్సరాల్లో రాజ్యాంగవ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగస్ఫూర్తిని మంటగలుపుతూ, మతోన్మాద రాజకీయాలతో, కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలతో దేశాన్ని సర్వనాశనం వైపు తీసుకుపోతున్న బిజెపితో పరోక్షంగా వైసిపి, ప్రత్యక్షంగా టిడిపి జతకట్టడం దేశానికి, రాష్ట్రానికి ప్రమాదం కాదా?
‘మోడీ తో కలిసాడని చంద్రబాబుని ఆడిపోసు’కున్నామట, ఆయన మోడీతో కలిస్తే కమ్యూనిస్టులకు మాత్రమే కాదు, రాష్ట్రానికి నష్టమన్నది గత అనుభవం. దేశంలో మోడీ ప్రత్యక్షంగా జతకట్టిన పార్టీలన్నీ ముఖ్యంగా తమిళనాడులో అన్నాడిఎంకె, ఒరిస్సాలో బిజెడి, మహరాష్ట్రలో శివసేన పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? పరోక్షంగా మోడీని మోసిన బిఎస్‌పి, బిఆర్‌ఎస్‌ పార్టీలకు ఒక్క ఎంపీ సీటుకూడా ఎందుకు రాకుండ పోయిందో మీకు తెలియదా? మీరు అన్నట్లు ‘మా ఆడిపోసుకోవడా’నికి కారణం ఈ పార్టీలకు పట్టిన దుర్గతి తెలుగుదేశానికి రాకూడదని, ఆంధ్రావని మరో మతోన్మాద ప్రయోగశాల కారదనే. దేశంలో మెజారిటీ సీట్ల తిరస్కరణకు గురైన బిజెపి కూటమిలో చేరిన టిడిపి భవిష్యత్తు మరో విషాద అనుభవంగా వుండరాదని ఆశిద్ధాం. దేశవ్యాప్త రాజకీయ లక్ష్యం కోసం కాంగ్రెసుతో కలిసి కమ్యూనిస్టులు కృషి చేయడం ‘షర్మిలను దేబరింపులాగా, పైరవీ’లలాగా ఈయనకు కనిపించడం, హతవిధి! ‘అభ్యర్థిత్వం ఆదాయ వనరుగా మారినపుడు’ అని చెత్తరాత రాసి, తన వక్రబుద్ధిని బయట పెట్టుకున్నాడు. దళిత, గిరిజన పేదలు, కష్టజీవులు, చాలీచాలనీ వేతనాలతో బతికే అసంఘటిత కార్మికులు తమ కష్టాదాయంలో నుంచి ఇచ్చిన డబ్బుతో పోటీ చేసిన కమ్యూనిస్టులను ఆదాయం కోసం పోటీ చేస్తారని శత్రవులు సహితం విమర్శించలేని స్థాయికి ‘మా’ సత్యనారాయణ దిగజారిపోయాడు. ‘ప్రజలు కోరుకుంటున్నట్లు చంద్రబాబు విజయానికి సహకరించి ఎన్నికల తర్వాత ఆయన సహకారం అవసరమైతే ఇండియా కూటమికి జతచేసేటట్లుగా ప్రయత్నించవచ్చు కదా!’ అని అమాయకంగా అడుగుతున్నాడు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును కమ్యూనిస్టులు బలపరచివుంటే, మేము చెప్పినట్లు ఎన్నికల తర్వాత ఆయన ఇండియా వేదికకు జతకట్టేవాడన్నట్లు వంకర టింకర వాదన చేశాడు. చంద్రబాబునాయుడు అంత ఆమాయకుడా! కమ్యూనిస్టులు ఎలా చెబితే అలా వినేటట్లు వుంటే గత కొన్ని సంవత్సరాలుగా మతోన్మాద బిజెపితో కలవొద్దని కమ్యూనిస్టులుగా చెబుతూనే వచ్చాముకదా!
1984 ఆగస్టులో కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ను అధికారం నుండి బర్తరప్‌ చేస్తే, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జరిగిన పోరాటాల్లో 1985 మధ్యంతర ఎన్నికల్లో అన్ని పక్షాలు కలిసి పనిచేయడాన్ని, నేటి పరిస్థితులను ముడివేయాలని చూస్తున్నాడు. తక్షణావసరంగా బిజెపితో కలిసిన ఎన్‌టిఆర్‌ ఆ తర్వాత కొద్దికాలానికే అదే బిజెపికి వ్యతిరేకంగా కేంద్రంలో వివిధ పార్టీలతో కలిసి నడచిన విషయం మీ జ్ఞాపకాల్లో ఎలాలేకుండ పోయింది? ‘ఏపీలో కూడా మరోరకమైన ఎత్తుగడ ఎందుకు అనుసరించలేదు?’ అని కమ్యూనిస్టులను ప్రశ్నిస్తున్నాడు. అంటే బిజెపితో కలిసిన వారితో మీరు ఎందుకు స్నేహం చేయలేదన్నది ఆయన ప్రశ్న. ఈయన కోరినట్లు చేయడం కమ్యూనిస్టుల మౌలిక స్వభావానికే కాక, నేటి తక్షణ దేశ పరిస్థితులకు అత్యంత ప్రమాదకరం కాదా! బిజెపిని బలపరిచే విధానాన్ని తప్పుపట్టినందుకు ‘వామపక్ష శ్రేణులు ముఖ్యంగా సీపీఎం గాని, ఆ పార్టీకి చెందిన కొందరు మేధావులు గాని ఇద్దరు దొంగలపై పెట్టే విమర్శల్లో పెద్దదొంగ పట్ల పట్ల విమర్శల స్థాయి తక్కువ చేసి తమ విశ్వనీయతను పోగొట్టుకున్నారట’ ఈయన దృష్టిలో పెద్ద దొంగ అంటే వైసీపీ కావొచ్చు. మరీ బీజేపీ ఏ స్థాయి దొంగో చెప్పలేదు! కమ్యూనిస్టుల విశ్వనీయత అవి అనుసరించే ప్రజానుకూల విధానాల ద్వారా, చేసే ప్రజాపోరాటాల ద్వారా వస్తుందే తప్ప సీట్ల కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం ద్వారా రాదు.
‘పార్టీ పార్లమెంటరీ ప్రజాపంథా స్వీకరించిన నాటినుంచి… ఎత్తుగడల వైఫల్యాలు వున్నాయి’ అని చెబుతున్నాడు. పార్లమెంటరీ పంథా అంటే కేవలం ఓట్లు, సీట్లు అని ఈయన అనుకుంటున్నాడు. పోనీ అదే అనుకున్నా పశ్చిమబెంగాల్‌, త్రిపుర ల్లో సుదీర్ఘకాలం, ప్రస్తుతం కేరళలో పరిపాలిస్తున్నది వామపక్షాలే కదా! సిపిఎం దృష్టిలో ‘ఎత్తుగడలు’ అంటే కేవలం ఎన్నికల కోసం వేసే జిమ్మిక్కులు కాదు, విప్లవోద్యమాన్ని నిర్మించే కృషిలో భాగంగా పార్లమెంటరీ, పార్లమెంటరేతర రంగాల్లో అనుసరించే ఆచరాణత్మక పట్టువిడుపులు. చెరుకూరు వారు మాత్రం ‘విప్లవోద్యమాన్ని ఎలాగూ నిర్మించలేం. కనీసం పార్టీని పార్లమెంటరీ పంథాలోనైనా సరైన ఎత్తుగడలతో నడిపి మరో ఐదేళ్ళ తర్వాతనైనా’ అసెంబ్లీలోకి వెళ్ళమని మాకు సలహా ఇస్తున్నాడు. విప్లవోద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఎవరైనా కలుస్తారు, నిలుస్తారు. కానీ శత్రువు కొత్తరూపాల్లో ప్రజలను భ్రమింపచేస్తున్నప్పుడు, ఎదురుదెబ్బలు తీవ్రమౌతున్నపుడు, భౌతికశక్తి సన్నగిల్లుతునప్పుడు నమ్మిన ఆశయాన్ని తుదకంటూ కొనసాగించే కష్టజీవులు, వారికి నాయకత్వం వహించే కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఇప్పటి వరకు చరిత్రగతిని మార్చాయి. ప్రస్తుత పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత అసమానకరమైందో, ఎంత అనాగరికమైందో, ఎంత దుర్మార్గమైందో ప్రపంచ ఆర్థికవేత్తలు తాజాగా ప్రకటిస్తున్న నివేదికలు చాటిచెబుతున్నాయి. ఈ స్థితికి ప్రత్యామ్నాయం ఈ సమాజాన్ని మార్చడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఏముంది? ఒకవైపు పోరాటాల ద్వారా, అనుభవాల ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంచడం, మరోవైపు శత్రువులు వారి అవసరాల కోసం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుంటూ తక్షణ లక్ష్యాన్ని సాధించడానికి ఆచరణాత్మక విప్లవ ఎత్తుగడలు రూపొందించుకోవడం సిపిఎం విధానం.
ఈ ఐదేళ్ళ కాలంలో వైసీపీ ప్రభుత్వ వినాశకర విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమరశీల ప్రజా, కార్మిక ఉద్యమాలు సత్యనారాయణ గారికి గర్తులేవోమో కాని, ఈ తెలుగునేలమీద పోరాడిన ప్రతిఒక్కరికి సీపీఎం పోరాట విశిష్టత ఏమిటో తెలుసు. నాటి ఉద్యమాలకు ఏనాడూ కనీస మద్ధతు కూడా ఇవ్వని వారు ‘మా’ ముసుగులో మాపై దాడి చేయడాన్ని ప్రజలు, కార్మికులు, అభ్యుదయ, ప్రజాతంత్రవాదులు హర్షించరు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా మార్క్సిజం వెలుగులో పీడిత, తాడిత ప్రజల పక్షాన నిలబడడం, ఎంత పెద్ద ప్రజా శత్రువైనా ఎదురేగి కలబడడం, విజయాన్ని సాధించేవరకు పోరాడడం సిపిఎం విధానం. అది ఎవరు అధికారంలో వున్నా కొనసాగుతూనే వుంటుంది.

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. రాంభూపాల్‌

➡️