పేదరికం – సంపద – గతితర్కం

Oct 29,2024 05:35 #Articles, #edite page

”దేశాల సంపద పెరుగుదలకు దోహదం చేసే అంశాలు ఏవి? ఆటంకపరిచే అంశాలు ఏవి?” అన్న విషయం మీద చేసిన పరిశోధనలకు గాను ముగ్గురు అమెరికన్‌ ఆర్థికవేత్తలకు ఈ ఏడాది నోబెల్‌ బహుమతి (సరిగ్గా చెప్పాలంటే అది రిక్స్‌ బ్యాంక్‌ బహుమతి) దక్కింది. సంపద పెరుగుదలలో ఆ యా దేశాలలో ఉనికిలో ఉండే వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వారి పరిశోధనలో నిర్ధారించారు. ఎన్నికల ప్రజా స్వామ్యం వంటి పశ్చిమ దేశాల వ్యవస్థలు సంపద పెరుగుదలకు దోహదం చేస్తాయని వారు తెలిపారు. వలసవాదం ఎక్కడెక్కడ ”వలస వచ్చిన వారితో స్థిర నివాసాలు” ఏర్పరచిందో అక్కడల్లా సంపద బాగా వృద్ధి చెందిందని వారు నిర్ధారించారు. అటువంటి స్థిర నివాసాలు ఏర్పరచకుండా, వలసల నుండి ”పిండుకునే వ్యవస్థలను” మాత్రమే ఏర్పరచిందో అటువంటి చోట్ల అవి సంపద వృద్ధికి హానికరంగా పరిణమించాయని భావించారు.
ఈ ఆర్థికవేత్తల పరిశోధన, నిర్ధారణలు అనేక విమర్శలకు దారి తీశాయి. పశ్చిమ దేశాల మాదిరి ప్రజాస్వామ్య వ్యవస్థలు లేకుండానే తూర్పు ఆసియా దేశాలు ఆర్థికాభివృద్ధిలో విజయాలు సాధించాయని, దానితోబాటు ఆ దేశాలు అవినీతి రహితంగా వృద్ధి చెందాయని, అదే పశ్చిమ దేశాలు వేగంగా వృద్ధి చెందిన కాలంలో వృద్ధి తోబాటు తీవ్ర స్థాయిలో అవినీతి కూడా చోటు చేసుకుందని విమర్శకులు అన్నారు. తమ వెంట తమ బంధుమిత్రులను, అనుచరులను తెచ్చుకుని కొత్త ప్రదేశాలలో స్థిరనివాసాలు ఏర్పరచుకోవడం జరిగిందే తప్ప తక్కిన వారిని అనుమతించలేదని మరికొందరు అన్నారు. పశ్చిమ దేశాల వ్యవస్థలను పవిత్రమైనవిగా చిత్రించే ప్రయత్నం చేశారే తప్ప వలసవాదం సాగించిన అణచివేతను వారి పరిశోధన విస్మరించిందని మరి కొందరు అన్నారు.
ఇక్కడ మనం ఆ పరిశోధకుల వాదనల లోతుల్లోకి గాని, వారిని విమర్శించే వారు సహేతుకంగా విమర్శించినా, లేకున్నా, ఆ విమర్శల లోతుల్లోకి గాని పోవడం లేదు. అటు పరిశోధకులు, ఇటు విమర్శకులు ఇరు పక్షాలూ వృద్ధి, వెనుకబాటుతనం గురించి వ్యక్తం చేసిన అవగాహనలోనే మౌలికమైన లోపం ఉందన్న సంగతిని నొక్కి చెప్పదలుచుకున్నాను. పేదరికం అంటే ఆర్థిక వృద్ధి లేకపోవడమే అని వారు భావిస్తున్నారు. వృద్ధితోబాటు పేదరికం కూడా పెరుగుతుందన్న గతితార్కిక అవగాహన వారికి లోపించింది. ఒక దేశాన్ని మొత్తంగా ఒక జాతిగా పరిగణిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలున్న దేశాలు ఆర్థికవృద్ధి చెందాయని, కొల్లగొట్టే వ్యవస్థలు ఏర్పడిన దేశాల్లో ఆర్థిక వెనుకబాటుతనం ఉన్నదని వారు నిర్ధారించారు. కొన్ని దేశాలు ముందుకు పోయినందువల్లే మరికొన్ని దేశాలు వెనుకబడిపోయాయన్నది అంతర్లీనంగా వారి వాదన సారాంశం. వారు విస్మరించిన అంశం ఏమంటే, అసలు పెట్టుబడిదారీ ఆర్థికవృద్ధి అంటేనే దానితోబాటు పేదరికం కూడా పెరుగుతుందన్న మౌలిక వాస్తవం. దీనినే ఏండ్రి గుండెర్‌ ఫ్రాంక్‌ ”వెనుకబాటుతనపు అభివృద్ధి” అన్న పదంతో వర్ణించారు. వెనుకబాటుతనం అంటే వృద్ధి లేకపోవడం కాదని, సంపద వృద్ధి చెందే క్రమంలోనే వెనుకబాటుతనం కూడా వృద్ధి చెందుతుందని దానర్ధం. సంపద పెరుగుదలతోబాటు పేదరికం కూడా పెరుగుతుందనే మౌలికాంశాన్ని రిక్స్‌ బ్యాంక్‌ బహుమతి గ్రహీతలు పూర్తిగా విస్మరించారు.
సంపద పెరగడంతోబాటు పేదరికం ఎందుకు పెరుగుతుంది? కొన్ని దేశాలు ఆర్థిక వృద్ధి సాధించగా మరికొన్ని దేశాలు ఎందుకు వెనుకబడిపోతాయి? పెట్టుబడిదారీ ఆర్థికాభివృద్ధి అనివార్యంగా కొల్లగొట్టి పోగేసుకున్న పెట్టుబడితో ముందుకు సాగుతుంది. అలా కొల్లగొట్టబడ్డ చిన్న చిన్న ఉత్పత్తిదారులంతా పేదరికంలోకి దిగజారిపోతారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వారిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే తన పెట్టుబడిదారీ ఉత్పత్తి వ్యవస్థలోకి కార్మికులుగా, ఉద్యోగులుగా ఇముడ్చుకుంటుంది. ఒకపక్క కొల్లగొట్టే ప్రక్రియ కొనసాగుతూనే వుంటుంది. మరోపక్క పెట్టుబడిదారీ వ్యవస్థలో స్థానం పొందలేని వారంతా పేదరికంలోకి దిగజారిపోతూనే వుంటారు. ఒకవేళ పేదరికంలోకి జారిపోయిన వారి సంఖ్య పెరగకపోయినా, వారి పేదరికం మాత్రం పెరుగుతూనే వుంటుంది. కొల్లగొట్టి పోగేసుకోవడం అనే పెట్టుబడిదారీ క్రమం నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ. అందుచేత పేదలూ పెరుగుతూంటారు. వారి పేదరికమూ పెరుగుతూపోతుంది.
అందువల్లనే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒకవైపు సంపద పోగుబడుతూ వుంటే మరోపక్క పేదరికం కూడా పెరుగుతూనే వుంటుంది. ఈ పెట్టుబడిదారీ విధానంలో సంపద పోగుబడే తీరును మొత్తంగా చూడకుండా, విడివిడిగా చూడడం వల్ల సమగ్రమైన అవగాహన ఏర్పడకుండా పోతుంది.
1850 దశకం నుండి 1914 (మొదటి ప్రపంచ యుద్ధం) వరకూ పెట్టుబడిదారీ వ్యవస్థ సుదీర్ఘకాలం పాటు వేగంగా వృద్ధి సాధించింది. ఈ కాలంలో పెట్టుబడిదారీ విధానం ఒక ప్రపంచవ్యాప్త వ్యవస్థగా బలపడింది. బ్రిటన్‌ నుండి యూరప్‌ ఖండానికి మొత్తంగా విస్తరించింది. యూరప్‌ నుండి శీతల ప్రదేశాలైన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా వంటి చోట్లకు వలసలు పోయారు. (ఈ దేశాలనే ”కొత్త ప్రపంచం” అని అంటారు) అక్కడికి కూడా పెట్టుబడిదారీ విధానం విస్తరించింది. ఇలా వలసలు పోయి స్థిరపడిన దేశాలకు యూరప్‌ నుండి పరిశ్రమలు కూడా తరలివెళ్ళాయి. బ్రిటన్‌ ఈ కొత్త ప్రాంతాల నుండి దిగుమతులకు తన దేశంలో అవకాశాలు కల్పించింది. దానితోబాటు తన దేశం నుండి ఈ దేశాలకు పెట్టుబడిని ఎగుమతి చేసింది. ఇలా ఇతర దేశాలకు వలస పోయి ఆక్రమించుకుని పెట్టుబడిదారీ వ్యవస్థను విస్తరించడాన్ని ”సెటిలర్‌ కొలోనియలిజం” అని అంటాం. పెట్టుబడిదారులతో బాటు యూరప్‌ నుండి కొత్త ప్రదేశాలకు యూరప్‌ ఖండపు ప్రజానీకం పెద్ద సంఖ్యలో తరలిపోయారు.
1810 దశకం నుండి (నెపోలియన్‌ యుద్ధాల కాలం 1803-1815) మొదటి ప్రపంచ యుద్ధకాలం వరకూ మధ్యలో కనీసం 5 కోట్లమంది యూరప్‌ ఖండం నుండి వలసలు పోయారని అంచనా. ఇలా వలసలు పోయినవారు తాము ప్రవేశించిన చోట స్థానికుల నుండి భూములను లాక్కున్నారు. చావగా మిగిలిన స్థానికులను కొద్దిపాటి భూభాగాలలోకి నెట్టి అక్కడికే వారిని పరిమితం చేశారు. అత్యధికంగా వలసలు బ్రిటన్‌ నుండే జరిగాయి. ఆ కాలంలో బ్రిటన్‌లో ఎంత జనాభా పెరిగిందో, అందులో సగం పైగా సంఖ్యలో వలసలు పోయారు.
ఇలా కొత్తగా ఆక్రమించుకుని స్థిరపడిన దేశాలనుండి ముడిసరుకులను, పారిశ్రామిక ఉత్పత్తులను తన దేశంలోకి దిగుమతి చేసుకునే అవకాశాన్ని బ్రిటన్‌ కల్పించింది. దానితోబాటు తన దేశం నుండి ఆ ”కొత్త ప్రపంచానికి” పెట్టుబడులను ఎగుమతి చేసింది. ఆ క్రమంలో చాలా పెద్ద స్థాయిలో ”చెల్లింపుల లోటు”ను కొనసాగించింది. ఇలా పెద్ద స్థాయిలో ఆ ”కొత్త ప్రపంచం” నుండి సరుకులను దిగుమతి చేసుకోవడం వలన నిజానికి బ్రిటన్‌లో ఉన్న పరిశ్రమల సరుకులు మిగిలిపోయి, బ్రిటిష్‌ పరిశ్రమలు మూతబడే ప్రమాదం ఏర్పడి వుండాలి. కాని అలా జరగలేదు. దానికి కారణం తమ వద్ద ఉన్న అధికోత్పత్తినంతటినీ బ్రిటన్‌ ఉష్ణమండల దేశాలకు (భారతదేశం వగైరా) ఎగుమతి చేసింది. దాని ఫలితంగా ఈ ఉష్ణమండల దేశాలలో అంతవరకూ నడిచిన పరిశ్రమలు కాస్తా మూతబడ్డాయి. ముఖ్యంగా సాంప్రదాయ చేతివృత్తులన్నీ దెబ్బ తిన్నాయి. వారి ఆదాయాలు బాగా పడిపోయి తీవ్ర పేదరికంలోకి వారంతా నెట్టబడ్డారు. ఇలా చితికిపోయిన వృత్తుల్లో నేత వృత్తి ప్రధానమైంది.
”కొత్త ప్రపంచపు” దేశాల నుండి బ్రిటన్‌ దిగుమతి చేసుకున్న సరుకులకు చెల్లించవలసిన మొత్తం లోటుగా పెరిగిపోయింది. ఆ లోటును భర్తీ చేయడానికి ఉష్ణ దేశాలకు అమ్మిన సరుకుల ద్వారా వచ్చిన సంపదను వాడుకున్నారు. ఉష్ణదేశాల నుండి బ్రిటన్‌ కొనుగోలు చేసిన ముడి సరుకుకు చెల్లించవలసిన మొత్తాన్ని చెల్లించకుండా తమ వద్దే అట్టిపెట్టుకుని దానితో తమ వ్యాపార చెల్లింపుల లోటును భర్తీ చేసుకున్నారు.
అప్పట్లో భారతదేశం నుండి యూరప్‌కు, ”కొత్త ప్రపంచ దేశాలకు”, జపాన్‌కు భారీగా సాగుతూ వచ్చిన ఎగుమతుల కారణంగా వ్యాపార చెల్లింపులలో మిగులు చాలా ఎక్కువగా ఉండేది. ప్రపంచంలోని దేశాలలో ఇలా వ్యాపార చెల్లింపులలో మిగులును అత్యధికంగా కలిగి వుండిన దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉండేది. ఇంత భారీ మిగులును కాస్తా బ్రిటన్‌ అప్పనంగా కాజేసి తన వ్యాపార లోటును భర్తీ చేయడానికి వాడుకుంది. అప్పనంగా కాజేయడం ఎలా సాధ్యపడింది? బ్రిటన్‌ ప్రభుత్వం భారతీయ రైతుల నుండి భారీగా పన్నులు వసూలు చేసింది. అలా వచ్చిన సొమ్ముతోటే ఆ రైతుల నుండి ముడిసరుకులను కొనుగోలు చేసింది. అంటే అప్పనంగా కాజేసినట్టే కదా ?
ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధ కాలం దాకా దీర్ఘకాలం పాటు యూరప్‌ లోను, ”కొత్త ప్రపంచం” లోను సాగిన పెట్టుబడిదారీ వృద్ధికి ప్రతిగా భారతదేశం తదితర ఉష్ణ మండల దేశాలలో పేదరికం పెరిగింది. తరచూ కరువులు సంభవించేవి.
కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ”కొత్త ప్రపంచపు” దేశాలు వలస సామ్రాజ్యవాదానికి ఉదాహరణలైతే, భారతదేశం, తక్కిన ఆసియా, ఆఫ్రికా దేశాలు స్వాధీనపరుచుకున్న వలసలకు ఉదాహరణలు.
భారతదేశం మొదటి నుంచీ పేద దేశం అని భావించడం తప్పు. మొఘల్‌ పాలకుల కాలంలో తలసరి ఆదాయం (1575 నాటి అబుల్‌ ఫైజల్‌ లెక్కల ఆధారంగా)తో పోల్చితే 1910 నాటికి ఐదో వంతుకు పడిపోయింది. బ్రిటిష్‌ పాలకులు అంత భారీగా కొల్లగొట్టారన్నమాట.
1850 నుండి సాగిన పారిశ్రామిక పెట్టుబడి విస్తరణ ఉష్ణ దేశాలలోని మిగులు సంపదను పీల్చి పిప్పి చేయడం ద్వారా సంభవించింది. ఆ దేశాల మార్కెట్లనూ బ్రిటన్‌ తన సరుకులతో ఆక్రమించింది. కొల్లగొట్టి పోగేసుకునే పెట్టుబడి క్రమం ఇది. దీని ఫలితంగా ఉష్ణ మండల దేశాల్లో పేదరికం పెరిగింది. ఇలా కొల్లగొట్టినన సంపద లబ్ధిదారులు మాత్రం యూరప్‌, ”కొత్త ప్రపంచపు” దేశాలు. అక్కడ సంపద భారీగా పెరిగింది.
ఆ విధంగా ఒకవైపు సంపద పెరగడం, మరోవైపు పేదరికం పెరగడం అనే క్రమం గతితార్కిక సంబంధం కలిగి వుంది. ఇది పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలోనే అంతర్లీనంగా ఉంది. కాని పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ఎవరూ ఈ నిజాన్ని ఒప్పుకోడానికి సిద్ధపడరు.

(స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

➡️