‘పి4’ విధానం ద్వారా రాష్ట్రంలోని పేదరికాన్ని (జీరో పావర్టీ) సమూలంగా నిర్మూలిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. సమాజంలో ఉన్నత స్థితిలో వున్న 10 శాతం మంది, పేదరికంలో అట్టడుగున వున్న 20 శాతం పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందంటున్నారు. ఆయన చేసిన విజ్ఞప్తులకు స్పందించి దానధర్మాలు చేయడానికి సంపన్నులు క్యూలో సిద్ధంగా వున్నారట. అందుకని పేదలను గుర్తించే పని వేగంగా చేయాలని ఈ ఉగాది నుండే ఈ కార్యాన్ని ప్రారంభించాలని అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టిస్తునారు. పి4 విధానం ద్వారా పేదరికాన్ని నిర్మూలించి విజనరీ (దార్శానికుడుగా) నాయకుడుగా నిలువనున్నారని ఆయన అనుయాయులు, మీడియా అనుచరులు సంబరపడిపోతున్నారు. పేదరికాన్ని నిర్మూలించడం ఇంత తేలకైన వ్యవహారమా?
‘పి4’ అంటే ఏంటి?
‘పి4’ అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్. ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు, ప్రజలు కలిసి భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈయన 1995లో అమలు చేసిన ప్రపంచబ్యాంకు సంస్కరణల్లో భాగంగా ‘పి3’ పబ్లిక్, ప్రైవేటు, పార్టనర్షిప్ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించానని ఆ స్ఫూర్తితో ‘పి4’ రూపొందించానంటున్నారు. ఈసారి ప్రజల భాగస్వామ్యం ఎందుకు చేరింది? కంపెనీలు పరిశ్రమలు పెట్టాలంటే భూసేకరణ చేయాలి. అందుకు చట్టబద్ధంగా పరిహారం ఇవ్వాలి, పునరావాసం, ఇతర సదుపాయాలు కల్పించాలి. ఇవి అమలు చేయడం కంపెనీల యజమానులకు ఇష్టం లేదు. భూ సేకరణ చట్టాన్ని మార్చాలని చాలా కాలంగా వారు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్నికల్లో తమకు అండగా నిలిచే యజమానులకు అదనపు లాభాలు రావాలంటే చట్టాన్ని సవరించాలి, సవరిస్తే భూమి కోల్పోయిన రైతులు నుండి వ్యతిరేకత వస్తుంది. ఈ పరిస్థితి నుండి బాధిత రైతులను, ప్రజలను మభ్యపెట్టేందుకు కనుక్కున్నదే ఈ పి4 విధానం. ప్రభుత్వ భూ సేకరణలో ఆస్తులు కోల్పోయిన వారిని కంపెనీల్లో భాగస్వాములుగా చేర్చుకుంటే ఎలాంటి పరిహారం, పునరావాసం కల్పించాల్సిన అవసరం వుండదు. ఒకే బోనులో పులి, మేక వుంటే ఏం జరుగుతుందో వేల కోట్ల రూపాయల పెట్టుబడి వున్న యజమానులతో, తమకున్న కొద్దిపాటి ఆస్తి కోల్పోయిన పేదలు భాగస్వాములుగా మారితే అదే జరుగుతుంది. ఇప్పటికే సోలార్ ఎనర్జీ పేరుతో లక్షల ఎకరాల భూమిని అదాని, అంబానీ, టాటా లాంటి పెద్ద కంపెనీలకు ప్రభుత్వమే రైతుల నుండి కౌలు పేరుతో అప్పగిస్తుంది. ఎకరం భూమి సంవత్సరానికి రూ.30,000 కౌలు ఇచ్చేటట్లు ఒప్పందాలు చేయిస్తుంది. ఈ కంపెనీలు ఆ భూమిని బ్యాంకులో తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని చెల్లించకపోయినా, రైతుకు సకాలంలో లీజు చెల్లించకపోయినా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందో లేదో స్పష్టం చేయడంలేదు. కంపెనీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానం ద్వారా రైతు రక్షణ పొందవచ్చు అని ప్రభుత్వ నేతలు సూక్తులు వల్లిస్తున్నారు. ఆస్తి కోల్పోయిన వారు కోర్టుకు వెళ్లడం, న్యాయాన్ని పొందడం ఎంత వరకు సాధ్యం?
పేదలను కోత కోయడం
2047 వికసిత ఆంధ్రప్రదేశ్ విజనరీలో భాగంగా ముఖ్యమంత్రి ఈ ‘పి4’ కు మరో కొత్త భాష్యం చెబుతున్నారు. పబ్లిక్, ప్రజలు, దాతలు (ఫిలాంత్రఫిక్), పార్టనర్‌షిప్ అంటున్నారు. అట్టడుగునున్న 20 శాతం పేదలను, అత్యున్నతంగా వున్న 10 శాతం సంపన్నులు దాతృత్వం ద్వారా ఆదుకుంటారట! దీనిద్వారా 2023 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తారట! మొదట రాష్ట్రంలో 4 గ్రామాల్లో పి 4 విధానాన్ని 5,869 కుటుంబాలకు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తారు. దాతల సహాయంతో పేదరికాన్ని నిర్మూలించే ఈ విధానాన్ని రానున్న ఉగాది నుండి రాష్ట్రమంతటా అమలు చేస్తారు. ఇందుకోసం ఇంటింటి సర్వే ద్వారా అర్హులను గుర్తించే పని చేస్తున్నారు. మొదటి దశ కింద 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే జరుగుతుంది. రెండవ దశలో మిగిలిన 16 జిల్లాల్లో మార్చి 8 నుంచి సర్వే ప్రారంభమవుతుంది. మొదటి దశ కింద 52 లక్షల కుటుంబాలు, రెండవ దశ కింద 76 లక్షల కుటుంబాలను సర్వే చేస్తారు. 27 ప్రశ్నలతో ఉన్న ఈ సర్వే పత్రంలో 2 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి, 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వాడుతున్నవారిని, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి వున్నవారిని, నాలుగు చక్రాల వాహనం వున్నవారిని, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఆదాయపన్ను చెల్లిస్తున్నవారిని, ఇంటి స్వభావాన్ని బట్టి, వారు వాడుతున్న గ్యాస్ వినియోగాన్ని బట్టి ఈ సర్వే నుండి మినహాయిస్తారు. అంటే వారంతా పేదలు కాకుండా పోతారు. ఇలా అన్ని రకాల మినాహాయింపుల తర్వాత మిగిలాల్సిన కుటుంబాలు 40 లక్షలట! సర్వే చేయకుండానే కుటుంబాల సంఖ్య తేల్చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ పొందుతున్న పేదలు ఒక కోటి 48 లక్షలమంది వున్నారు. ఇందులో కోటి ఎనిమిది లక్షల మంది ఈ సర్వే నుండి మినహాయించబడతారు. సర్వే పేరుతో కోటి మందిని పేదరికం నుండి నిర్మూలించేస్తారు. మిగిలిన 40 లక్షల మందిని ‘సమృద్ధి బంధనమ్’ అనే ప్లాట్‌ఫాంలో చేరుస్తారు. రాష్ట్రం, దేశం, విదేశాల్లో వున్న సంపన్న దాతలు ఈ పేదలను ఎంచుకుని వారికి దానధర్మాలు చేసి వారి దాతృత్వాన్ని చాటుకుని పేదరికం నుండి విముక్తులను చేస్తారు. ఇందులో ప్రభుత్వం పాత్ర మ్యాచింగ్, ఎనర్జింగ్, ట్రాకింగ్‌కే పరిమితం అవుతుందని, అంతకు మించి ఎలాంటి ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చదని పాలకులు చెబుతున్నారు.
దానధర్మాలతో పేదరికం అంతం కాదు
దాతల దాతృత్వ విధానం కొత్తదేమీ కాదు. రాజుల కాలం నుండి ఇలాంటి దానధర్మాల సిద్ధాంతం వుంది. కొందరి దగ్గర సంపద పోగుబడడం, అత్యధికమంది పేదరికంలో మగ్గడం పెట్టుబడిదారీ వ్యవస్థ వున్నంత కాలం కనిపించే శాశ్వత సమస్య. ఈ అసమానతలు తగ్గించేందుకు రాజ్యం సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందించాలని కీన్స్ లాంటి ఆర్థికవేత్తలు చెప్పారు. తాము పోగేసుకున్న కోట్ల సంపదలో అప్పుడప్పుడు తృణమో, ఫణమో విదల్చి కీర్తిప్రతిష్టలు పోగేసుకుంటున్న కార్పొరేట్ యజమానులు వున్నారు. యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలనే మహాత్మా గాంధీ ధర్మకతృత్వ సిద్ధాంతం, భూస్వాముల నుండి భూదానం పొంది పేదలకు పంచిపెడతానని 1951 ఏప్రిల్ 18న తెలంగాణలో పోచంపల్లిలో వినోభా బావే ప్రారంభించిన భూదానోద్యమం ఏమైందో చూస్తున్నాము. పేదరిక నిర్మూలన కోసమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ప్రకటించి వేల కోట్లు కేటాయిస్తున్నా అది ఎందుకు అంతం కావడంలేదు? పేదరిక నిర్మూలన అనేది దాతల సహాయంతో, ప్రభుత్వాల అరకొర పథకాలతో పరిష్కారమయ్యే సమస్య కాదన్నది జగమెరిగిన సత్యం. పేదరికం శాశ్వతంగా నిర్మూలించబడాలంటే ఈ వ్యవస్థను సమూలంగా మార్చడమే పరిష్కారం. ఈ వాస్తవాన్ని ప్రజలు గమనించకుండా మభ్యపెట్టేందుకు పాలకులు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారు. అందులో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తులు.
రాష్ట్రంలో పేదరికం
ఇటీవల అసెంబ్లీలో ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారం దేశంలో మన రాష్ట్రం ఎనిమిదో అతి పెద్ద రాష్ట్రం. కానీ పేదరికంలో తొమ్మిదో స్థానంలో వున్నాం. పౌష్టికాహారంలో పదవ, శిశు మరణాలలో పదకొండవ, పాఠశాలలో వుండాల్సిన పిల్లల్లో 25వ, తాగునీటి సమస్యలో 18వ స్థానాల్లో వున్నాం. గిరిజనులు ఎక్కువగా వున్న విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు, వ్యవసాయం మీద ఆధారపడిన కర్నూలు, ప్రకాశం, అనంతపురం లాంటి జిల్లాలు అత్యధిక పేదరికంలో వున్నాయని ఈ రిపోర్టు తేల్చింది. పెరుగుతున్న నిరుద్యోగం, వ్యవసాయంలో ఉపాధి తగ్గిపోవడం, భూమి, ఇల్లు, మంచినీరు, విద్య, వైద్యం, విద్యుత్ లాంటివి అత్యధిక మందికి లేకపోవడం పేదరికానికి కారణాలు. వీటిని దాతలు ఎలా పరిష్కరిస్తారు? ఒకవైపు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సమస్యల్లో కూరుకుపోతుంటే సంపన్నులు దానాలు ఎందుకు చేస్తారు? డాలర్లు సంపాదిద్దామని వెళ్లిన వారిలో కొందరు సంకెళ్ళతో తిరిగి వస్తుంటే, మరికొందరు ఆందోళనలతో గడుపుతుంటే ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దాతలకు ‘పి4’ విధానం గురించి బహిరంగ లేఖ రాశారు. 1995లో తాను చేపట్టిన సంస్కరణల వల్లే రాష్ట్రంలో ఉపాధి పెరిగి, సంపద సృష్టి జరిగి, సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన వారు ఉన్నత స్థానాలకు చేరారని, గ్లోబల్ సిటిజన్ల నుండి గ్లోబల్ లీడర్లుగా ఎదిగారని ఆ లేఖలో చెప్పుకున్నారు. తాజాగా పది సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047 విజన్‌ను అమలు చేసి తెలుగుజాతిని ప్రపంచంలో నెంబర్1 చేసేందుకు మీ సహాయం కావాలని దాతలను కోరారు.
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు పేదల దత్తత అందుకున్నారు. గతంలో జన్మభూమి పేరుతో గ్రామాల దత్తత, ఇప్పుడు పేదల దత్తత సంక్షేమ పథకాల కోతలో భాగమే. గారడీ విద్యతో కొంత కాలం భ్రమలు కలిగించవచ్చు గానీ, వాస్తవాలను ఎల్లకాలం కప్పి వుంచలేరు. / వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
వి. రాంభూపాల్