పిపిపి పేర ప్రభుత్వ వైద్య రంగం ప్రైవేట్‌ గుప్పెట్లోకి

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకర ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్య (పిపిపి) విధానానికి తెర లేపింది. వైసిపి ప్రభుత్వం స్థాపించిన, నేడు నూతనంగా చేపడుతున్న ప్రభుత్వ వైద్య కళాశాలలను, వీటికి అనుబంధంగా ఏర్పడే ఆసుపత్రులను ప్రైవేట్‌ సంస్థల ఆధీనంలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

వైసిపి ప్రభుత్వ కాలంలో మంజూరైన 17 వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పిపిపి పద్ధతిలో రూ.8548 కోట్ల నిధులు ఆమోదించగా కేవలం నాలుగేళ్లలో రూ.2225 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఐదు కళాశాలలను అరకొరకగా పూర్తి చేసిందని ప్రస్తుత కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో పిపిపి విధాన అమలుకు పూనుకుందని చెబుతూ ఈ విధానం ఎంతో గొప్పదని, ప్రజలకు చాలా మేలు చేస్తుందని ప్రచారం చేస్తున్నది. పైపెచ్చు పిపిపి అంటే ప్రైవేటీకరణ కాదని కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, ఆసుపత్రులు అన్నీ ప్రభుత్వ అజమాయిషీలోనే ఉంటాయని, కావాలనే ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతున్నాయని ప్రజలను నమ్మించటానికి ప్రయత్నం చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు పిపిపి పద్ధతిలో మొత్తం 157 వైద్య కళాశాలలు మంజూరు చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి 17 కేటాయించింది. వీటిని పిపిపి పద్ధతిలోనే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు, ఆపరేషన్‌, మెయింటినెన్స్‌ ఉండాలని షరతు విధించింది. ఒక్కో వైద్య కళాశాలకు దాని అనుబంధ ఆసుపత్రి నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ప్రాజెక్టు వ్యయంగా నిర్ణయించారు. ఇందులో 40 శాతం చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు (200+200 కోట్లు) రూ.400 కోట్లు భరించాలి. మిగిలిన రూ. 100 కోట్లు పిపిపి పద్ధతిలో ప్రైవేట్‌ సంస్థల నుండి సేకరించాలి. అయితే కారణాలేమైనా వీటిని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిపిపి పద్ధతిలో కాకుండా…రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా నిర్మించటానికి పూనుకుంది. ఈ వైద్య కళాశాలలకు అవసరమైన భూములు కేటాయించినప్పటికి వీటిని సకాలంలో పూర్తి చేయడానికి తీవ్ర నిర్లక్ష్యం వహించింది. పూర్తయిన కళాశాలలు దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను కూడా అరకొరగానే పూర్తి చేసింది. కేవలం ఐదు వైద్య కళాశాలల్లోనే గత ఏడాది అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.

అయితే ఆ కాలేజీలకు మంజూరైన ఎంబిబిఎస్‌ మెడికల్‌ సీట్ల భర్తీ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లుగా భర్తీ చేసేందుకు పూనుకుంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీటుకి రూ.12 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీటుకి ఏడాదికి రూ.20 లక్షల చొప్పున నిర్ణయించి అమలుకు పూనుకుంది. కన్వీనర్‌ కోటాను కుదించడంతో పాటు జనరల్‌ కేటగిరి సీట్లకు కూడా భారీగా ఫీజులు నిర్ణయించింది. ఈ పద్ధతిని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అధికారంలోకి వస్తే ఈ పద్ధతిని, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ఫీజులను పూర్తిగా రద్దు చేస్తామని, ఈ కళాశాలలన్నింటి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని ప్రచారం చేసింది. పూర్తి కాని కళాశాలలను, ఆసుపత్రులను కూడా ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహిస్తుందని వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకిచ్చిన వాగ్దానానికి తిలోదకాలిచ్చి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ పద్ధతి రద్దు చేయకుండా గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తూ వైద్య విద్యార్థులపై తీవ్ర భారానికి నిస్సిగ్గుగా జై కొట్టింది. భవిష్యత్‌లో కన్వీనర్‌ కోటా సీట్లు తగ్గిపోయి క్రమేణా సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్లుగా మారిపోనున్నాయి. దీంతో సామాన్య, పేద, దిగువ తరగతి విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించినా భారీ ఫీజులు చెల్లించుకోలేక వైద్య విద్యకు దూరమవుతారు.
వైద్య రంగంలో పిపిపి అంటే?
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరం నుండి వైద్య రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధాన అమలుకు పూనుకుంది. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్‌ చార్జీల వసూలుకు ప్రభుత్వాలే పూనుకునేవి. లేబరేటరీలు, స్కానింగ్‌ వంటి సేవలు ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా వీటితో పాటు 104, 108 అంబులెన్స్‌ సేవలు కూడా ఈ పద్ధతిలో కొనసాగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానానికి పూర్తిగా భిన్నమైంది. 2020 వరకు దేశంలో ప్రభుత్వ, ప్రవేట్‌ వైద్య కళాశాలలే ఉండేవి. ఈ నూతన పిపిపి విధానంలో వైద్య కళాశాలల స్థాపనకుగాను ప్రైవేట్‌ సంస్థలకు ప్రభుత్వమే అన్ని సదుపాయాలు సమకూరుస్తుంది. దీనికిగాను మౌలిక సదుపాయాల కల్పనలో వయబిలిటీ గ్యాప్‌ ఫండ్స్‌ (వైజిఎఫ్‌) అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా చేపట్టే మౌలిక సదుపాయాలన్నీ పిపిపి లో ప్రైవేట్‌ సంస్థల ఆధీనంలోనే చేపట్టాలి. ఇందుకయ్యే ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 30 నుండి 40 శాతం నిధులు గ్రాంట్‌ రూపంలో చెల్లిస్తుంది. ఈ విధానం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయటానికి కూటమి ప్రభుత్వం తొలిసారిగా గత బడ్జెట్లో రూ.2 వేల కోట్లను కూడా వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద కేటాయించింది.

ఈ పథకం క్రింద వైద్య కళాశాలకు, దానికి అనుబంధంగా నిర్మించే ఆసుపత్రికి అవసరమైన భూమిని ప్రైవేట్‌ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా లీజుకిస్తుంది. లీజు కాల పరిమితి 60 నుండి 99 ఏళ్ల వరకు ఉంటుంది. భూమితో పాటు కళాశాలకు, ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా 80 శాతం గ్రాంట్‌ రూపంలో ప్రైవేట్‌ సంస్థకి ఇస్తాయి. మిగిలిన 20 శాతం పెట్టుబడిని లీజు భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి ప్రైవేట్‌ సంస్థ రుణ రూపంలో సమకూర్చుకుంటుంది. వైద్య కళాశాల ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌లో 50 శాతం ఐదేళ్ల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. అంతేగాక వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రిని ప్రభుత్వ, ప్రైవేటు అనే రెండు విభాగాల కింద వేరు చేసి నిర్వహించబడుతుంది. ఉదాహరణకు 1000 పడకల పిపిపి ఆసుపత్రిలో పేదలకు 440 పడకలు కేటాయిస్తే మిగిలిన 560 పడకలు వాణిజ్య ప్రాతిపదికన నిర్వహించబడతాయి. వాటికి ప్రైవేట్‌ రంగంలో కార్పొరేట్‌ వైద్య రేట్లు నేడు ఎలా అమలు చేస్తున్నారో అలా నిర్ణయించబడతాయి. పేదలకు కేటాయించిన పడకల నిర్వహణ, ఓపి ఫీజు, శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య ఖర్చులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థకు చెల్లించాలి. కొంత భాగాన్ని యూజర్‌ చార్జీల రూపంలో పేదల నుండి కూడా వసూలు చేస్తారు.

ఈ వైద్య కళాశాల నిర్వహణ మొత్తం ప్రైవేట్‌ సంస్థే చూస్తుంది. కళాశాల, ఆసుపత్రిపై పూర్తి అధికారాలు ప్రైవేట్‌ సంస్థకే కల్పించబడతాయి. అలాగే విద్యార్థుల హాస్టళ్లు, మెస్‌ వంటి నిర్వహణ కూడా ప్రైవేట్‌ సంస్థకే చెందుతుంది. ఒకవేళ వైద్య కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి నిర్మించకపోతే జిల్లా కేంద్రంలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తిగా అన్ని విభాగాలు ఉపయోగించుకోవడానికి, ఆసుపత్రిని కూడా ప్రైవేట్‌ సంస్థకు అనుబంధంగా మార్చటానికి అనుమతిస్తారు. వీటిలో పని చేసే డాక్టర్లను విద్యార్థుల బోధనకు కూడా వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ ఆసుపత్రిపై కూడా పూర్తి ఆధిపత్యం ప్రైవేట్‌ సంస్థకే కల్పించబడుతుంది. ఈ విధంగా ప్రభుత్వ పెట్టుబడితో నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, ఆసుపత్రులను ప్రైవేట్‌ సంస్థల లాభాల కోసం బలిస్తున్నారు.

రాష్ట్రంలో పిపిపి పద్ధతిలో వస్తున్న 17 వైద్య కళాశాలలు వీటికి అనుబంధంగా వచ్చే ఆసుపత్రులు పూర్తిగా ప్రైవేటు సంస్థల గుత్తాధిపత్యంలోనే వస్తాయి. కాని, ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి అనే ప్రభుత్వ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. కేవలం ప్రజలను మోసగించడానికే ఈ ప్రచారం.
పిపిపి విధానం కొత్తగా స్థాపిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలలకే పరిమితం కాదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న వైద్య కళాశాలల్లో కూడా ఒక్కొక్క విభాగాన్ని విడదీసి ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తారు. జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ దశలవారీగా ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెడతారు. కొత్తగా స్థాపించే ఆసుపత్రులు కూడా పిపిపి పద్ధతిలోనే చేపడతారు. మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నడిచే వైద్య, విద్య, ఆసుపత్రులు ఇతర అన్ని రకాల ఆరోగ్య సేవల నిర్వహణ బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకొని ప్రైవేట్‌ సంస్థల పరం చేస్తోంది.

ఉన్నత విద్యా రంగంలో కూడా!

వైద్య రంగంలోనే కాకుండా విద్యా రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి హానికర విధానాన్ని గత కొంత కాలం నుండి అమలు చేసేందుకు పూనుకుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ పిపిపి విధానం అమలుకు 2017లోనే ఉన్నత విద్య ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ (హెచ్‌ఇఎఫ్‌ఏ) అనే సంస్థను ఏర్పాటు చేసి ప్రైవేటీకరణ విధానాలు అమలు చేస్తున్నది. ఈ సంస్థకు కేంద్ర బడ్జెట్‌ నుండి నిధులు కేటాయించి వాటిని ఉన్నత విద్యారంగంలోని ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఎం, ఇతర సెంట్రల్‌ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పన, పరిశోధనల అభివృద్ధి పేర రుణాల రూపంలో నిధులు ఇస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కింద అయ్యే మొత్తం వ్యయానికి సరిపడా నిధులు ఇవ్వదు. ప్రాజెక్టు వ్యయంలో కేవలం 50 శాతం మాత్రమే రుణ రూపంలో ఇస్తుంది. మిగిలిన 50 శాతం ప్రైవేట్‌ సంస్థల నుండి పిపిపి పద్ధతిలో సేకరించుకోవాలి. దీని ద్వారా ఉన్నత విద్యా సంస్థలోకి ప్రైవేట్‌ సంస్థలను కేంద్ర ప్రభుత్వం చొప్పిస్తున్నది. ఈ సంస్థలు విద్యార్థుల నుండి వివిధ రూపాల్లో అధిక ఫీజులు, చార్జీల వసూలు ద్వారా లాభదాయకమైనవిగా వాటిని మార్చుకుంటున్నాయి. అంతేగాక కొత్తగా రకరకాల సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు కూడా ఏర్పాటు చేస్తూ తద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రైవేట్‌ సంస్థలకు ప్రభుత్వ విద్యా సంస్థల యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలకే పరిమితం కాదు. ఇప్పుడు రాష్ట్రాలకు కూడా ఈ విధానాన్ని విస్తరించటానికి పథకం రూపొందించింది. దీనిని కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నది.

మొత్తంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలు వేగంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మౌలిక సదుపాయాల రంగంలో ప్రభుత్వ పాత్ర వదులుకొని కార్పొరేట్‌ శక్తుల గుత్తాధిపత్యాన్ని పెంచుతున్నది. సామాజిక రంగంలో కూడా ఇదే వైఖరిని అవలంబిస్తున్నది. రాష్ట్రాలకు పిపిపి, వయబిలిటీ గ్యాప్‌ ఫండ్స్‌ పేర నిధులు ఎరేసి రాష్ట్ర ప్రభుత్వాలను లోబర్చుకుంటున్నది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై కూటమి ప్రభుత్వం పెదవి విప్పడంలేదు. పైగా కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను తలకెత్తుకొని, బిజెపితో అంటకాగుతూ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నది. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ప్రైవేట్‌ శక్తుల గుప్పెట్లో పెట్టడానికి సిద్ధమైంది. ఈ ప్రమాదకర విధానాన్ని వెనక్కి కొట్టటమే రాష్ట్ర ప్రజల ముందున్న కర్తవ్యం.

 వ్యాసకర్త : డా.బి.గంగారావు, సెల్‌ : 9490098792

➡️