ఫెడరలిజం పరిరక్షణ!

Feb 10,2024 07:25 #Editorial

                 కేరళ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు దేశ రాజధానిలో చేసిన ధర్నా ఫెడరలిజం పరిరక్షణకు జరుగుతున్న పోరాటంలో ముఖ్యమైన ఘట్టంగా పేర్కొనవచ్చు. పన్ను వాటాను నిరాకరించడం, గ్రాంట్లు నిలిపివేయడం, రుణ పరిమితిని కుదించడం వంటి కేంద్ర ప్రభుత్వ దురుద్దేశపూరిత చర్యలను ధర్నా ద్వారా ఎండగట్టారు. ఈ ఆందోళన ద్వారా బిజెపి యేతర ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న వివక్షపై దేశవ్యాపిత చర్చ ముమ్మరమైంది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల సమతుల్యతను కాపాడుకోవడం, రాష్ట్రాలకు సమాన హోదా కోసం, సమాఖ్య నిర్మాణాన్ని పరిరక్షించడం కోసమే ఈ పోరాటమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తమ లక్ష్యాన్ని స్పష్టం చేశారు. ‘యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ అనే భావనపై ఆధారపడిన ప్రజాస్వామ్యం ‘యూనియన్‌ ఓవర్‌ స్టేట్స్‌’ అనే అత్యంత అప్రజాస్వామిక పరిస్థితిలోకి నెట్టబడుతున్నదన్న ఆయన విమర్శ అక్షర సత్యం. అయితే, దీన్ని ఉత్తర-దక్షిణ సమస్యగా చిత్రీకరించేందుకు ప్రధాని యత్నించడం బాధ్యతారాహిత్యమే!

ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ, కేరళ ప్రభుత్వ సొంత ఆదాయం అనూహ్యంగా పెరిగింది. కేంద్రం దెబ్బ తిన్నప్పుడు కూడా కేరళలో ఆర్థిక స్తబ్ధత లేదు. అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు రుణాలు తీసుకోకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. కేరళ ప్రస్తుత జిఎస్‌డిపి దాదాపు రూ.11 లక్షల కోట్లు. రుణ పరిమితుల కారణంగా కేరళ ఇందులో 10 శాతం నష్టపోతోంది. పన్ను ఆదాయంలో ఉత్తరప్రదేశ్‌కు 100కి 46, బీహార్‌కు 100కి 70 ఇస్తే, కేరళకు 100కి 21 మాత్రమే ఇచ్చారు. ఇది వివక్ష కాదా? పన్నుల్లో వాటాను 3.89 శాతం నుంచి 1.92 శాతానికి తగ్గించడం వల్ల కేరళకు అపార నష్టం వాటిల్లింది. కేంద్రం వివక్షను, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ కేంద్రానికి లేఖలు రాసినా, వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. కేరళ విపత్తును ఎదుర్కొంటున్న తరుణంలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యతిరేక చర్యలు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 8న జరిగిన ధర్నాకు ‘ఇండియా’ వేదిక లోని డిఎంకె, ఆప్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తదితర పార్టీలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు పాల్గొని సంఘీభావం తెలపడం ముదావహం.

రాష్ట్ర జాబితాలో శాంతిభద్రతలు సహా వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, విద్య, సహకారం వంటి అంశాలపై రాష్ట్రాల అధికారాలను హరించివేసే చట్టాలను కేంద్రం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను లొంగదీసుకోవడానికి, హింసించడానికి గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగం ప్రకారం, భారతదేశం రాష్ట్రాల యూనియన్‌. కానీ బిజెపి మోడీల దృష్టిలో రాష్ట్రాలు లేవు. యూనియన్‌ మాత్రమే ఉంది. ‘రాష్ట్రాలు జోలె పట్టి కేంద్రాన్ని దేబిరించాలని వారు కోరుకుంటున్నారు. అలా ఎన్నటికీ జరగనివ్వరాదు. మోడీ రాష్ట్రాలను మున్సిపాలిటీలుగా భావిస్తున్నారన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విమర్శ సత్యదూరం కాదు. విద్యా హక్కులను, భాషా హక్కులను, చట్టపరమైన హక్కులను ఇలా అన్నింటినీ లాక్కుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులను, నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయి. గతంలో ఎవరైనా నేరారోపణలు వచ్చినప్పుడు దాన్ని కూలంకషంగా విచారించి దోషిగా తేలి జైలుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ వ్యక్తిని ముందుగా అరెస్ట్‌ చేసి జైల్లో పెడతారు. ఆ తర్వాత కేసు పెడతారు. ప్రభుత్వాలను కూలదోస్తారు. తాజాగా, వారు జార్ఖండ్‌ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారు. రేపు ఇంకొక ముఖ్యమంత్రినో మంత్రులనో అరెస్టు చేయవచ్చు. అటు ఆర్థికంగా ఇటు చట్టపరంగా మరోవైపు గవర్నర్లను, కేంద్ర దర్యాప్తు సంస్థలనూ సాధనాలుగా చేసుకుని ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాలను బిజెపి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఫెడరల్‌ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న ఈ పరిస్థితిని వ్యతిరేకిస్తూ రాష్ట్రాలన్నీ ఒక్క తాటిపైకి రావాలి. అన్ని రాష్ట్రాలను సమానంగా గౌరవించే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మతతత్వ కార్పొరేట్‌ కూటమిని ఓడించాలి.

➡️