ప్రజా ఉద్యమాలతోనే పురోగతి

గత 30 ఏళ్ళ సంస్కరణల ఫలితంగా భౌతిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ప్రభావం ప్రజా ఉద్యమాలపై వివిధ రూపాల్లో ఎలా పడిందో గత వారం వ్యాసంలో చర్చించాము. అయితే కమ్యూనిస్టులు ఎప్పుడూ భౌతిక పరిస్థితులపై నెపం నెట్టి తమ బాధ్యతల నుండి తప్పించుకోరు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఎప్పటికప్పుడు విధానాలను, నినాదాలను సమీక్షించుకుంటూ అవసరమైన మార్పులు, సర్దుబాట్లు చేసుకుంటూ వస్తుంటారు. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య సిపిఐ(యం), కమ్యూనిస్టు ఉద్యమం నిలబడి వుందన్న విషయం మనం మరచిపోకూడదు. ”నిర్దిష్ట పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించడమే మార్క్సిజం సారం” అని లెనిన్‌ చెప్పాడు. మార్క్సిస్టు, లెనినిస్టు సూత్రాలను భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు వర్తింపజేసుకొని ఈ దేశంలో దోపిడీ లేని సమ సమాజాన్ని నిర్మించడానికి సిపిఐ(యం) అంకితమైంది. దీనికనుగుణంగా ప్రజా ఉద్యమాల రూపకల్పన జరుగుతుంది. వివిధ ప్రజారంగాల్లో పనిచేసే పార్టీ సభ్యులు ఈ అవగాహనకనుగుణంగా ప్రజలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సమస్యలపై స్పందించడంలోనూ, ప్రజల్ని కదిలించి ఉద్యమాలు నిర్వహించడంలోనూ కమ్యూనిస్టులకు ఎవరూ సాటి రారు. అయినా పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదన్న ప్రశ్న అభిమానుల్ని వేధిస్తున్నది.

సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ
కార్ల్‌మార్క్స్‌ అన్నట్లుగా ”తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరివిధాలుగా విశ్లేషించారు. కానీ చేయాల్సింది దానిని మార్చడం”. సామాజిక మార్పు వర్గ పోరాటం ద్వారానే జరుగుతుందని చరిత్ర రుజువు చేసింది. గత 30 సంవత్సరాలుగా పెట్టుబడిదారీ విధానం సంస్కరణల ద్వారా తనను తాను కూడగట్టుకొని బలపడినందున అదే శాశ్వతం అని భ్రమించేవారి సంఖ్య భారీగానే ఉంది. అభ్యుదయ వాదులు సైతం దీనికి గురయ్యారు. ఇప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ 21వ శతాబ్దం ప్రారంభంలో ఉన్నట్లు లేదు. ఆ వ్యవస్థే సంక్షోభంలో పడింది. తాజా ఎకనమిక్‌ సర్వే 2023-24లో చెప్పినట్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇది ఏదో ఒక రంగానికో, ఒక ప్రాంతానికో పరిమితమైందీ కాదు, తాత్కాలికమైందీ కాదు. ఇది వ్యవస్థీకృత సంక్షోభం. నేడు ప్రపంచాన్ని పీడిస్తున్న ఈ సంక్షోభం రేపు భారతదేశాన్ని కూడా ఆవహిస్తుంది. ఆ ఛాయలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభ భారాల ఫలితంగానే గత ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అనేక దేశాల్లో, రాజకీయ రంగాల్లో జరుగుతున్న మార్పులు కూడా దీనినే ప్రతిబింబిస్తున్నాయి. 30 ఏళ్ళ క్రితం కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడిన నేపథ్యంలో దానికి భవిష్యత్‌ లేదని, పాతాళానికి తొక్కేశామని ప్రపంచ పెట్టుబడిదారులు సంబరపడ్డారు. అంతమైందనుకున్న కమ్యూనిస్టు ”భూతం” నేడు అమెరికాను ఆవహించింది. తిరిగి కమ్యూనిజమే తమకు ప్రధాన శతృవు అని ప్రకటించుకోవాల్సిన స్థితి ఈ సామ్రాజ్యవాద దిగ్గజానికి ఏర్పడింది. కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కినా, ఆకాశానికి ఎగరగలిగిన శక్తి దానికుందని ప్రస్తుత ప్రపంచ పరిణామాలు విదితం చేస్తున్నాయి.

కార్యకర్తల బలమే పార్టీకి పునాది
గత 30 ఏళ్ళల్లో కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడిన నేపథ్యంలో కొందరికి మార్క్సిజంపైనే విశ్వాసం తగ్గి రాజకీయ రంగం నుండి వైదొలిగారు. మరికొందరు కొత్త కొత్త పార్టీలపై భ్రమలతో పార్టీని వీడారు. మరికొందరు విశ్వాసం సడలిపోయి ఉద్యమాల్లో కొనసాగుతానే ఉత్సాహంతో పనిచేయలేకున్నారు. అయినా ఆటుపోట్లు తట్టుకొని భవిష్యత్‌ మీద విశ్వాసంతో, నిబద్దతతో పనిచేస్తున్న వారి సంఖ్య పార్టీలో ఇప్పటికీ గణనీయంగానే ఉంది. అయితే కొందరికి వయస్సు మీదపడడం, వృద్ధాప్యం, అనారోగ్యం వంటి సమస్యలతో పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకున్నారు. పని తగ్గుతున్నవారి స్థానంలో కొత్త శక్తులు వచ్చి చేరడం నెమ్మదిగా జరుగుతోంది. 21వ శతాబ్దంలో అడుగిడిన యువతరం కమ్యూనిస్టు ఉద్యమానికి దూరం కాగా ఆ తరువాత వస్తున్న ప్రస్తుత తరం సంక్షోభం సుడిగుండంలో సైద్ధాంతిక గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. విద్యా విధానంలో వచ్చిన మార్పులు, ఈ తరాన్ని ప్రభావితం చేసే వారి ఆలోచనలో వచ్చిన మార్పులు, బయట మార్కెట్‌, మతోన్మాద, అస్తిత్వవాద ఆలోచనా విధానాలు యువతరాన్నే కాదు కమ్యూనిస్టులను కూడా కొంత వరకు తాకాయి. మార్క్సిస్టేతర సిద్ధాంతాల ప్రభావం పెరిగింది. మార్క్సిజం కన్నా ఇంకేదన్నా గొప్పదుందేమోనన్న భ్రమల్లో కొందరు మునిగిపోతే, మరికొందరు మార్క్సిజాన్ని అర్థం చేసుకొని వర్తింపజేయడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారన్న నిస్పృహతో ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కార్యకర్తల సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ నైపుణ్యాన్ని సుసంపన్నం చేసేందుకు సిపిఐ(యం) ఈ కాలంలో అనేక విధాలుగా ప్రయత్నించింది. మోడీ ప్రభావం తగ్గడంతో కొత్త ఆలోచనలకు అవకాశం ఏర్పడింది. ప్రజలు సంక్షోభంలో వుంటే రూ. 5 వేల కోట్లు పెట్టి పెళ్లి చేసిన అంబానీ దానికోసం జియో ఛార్జీలు పెంచడాన్ని యువతరం జీర్ణిరచుకోలేకపోతున్నది. ఇలాంటి ఘటనలు యువతరం ఆలోచనల్లో మార్పు తెస్తాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాల్ని చేపట్టింది. అయితే ఈ కాలానికి అది సరిపోదు. దీన్ని అధిగమించేందుకు సైద్ధాంతిక నిబద్దత, కార్యకర్తల నిర్మాణం, నైతిక బలం పునాదిగా సిపిఐ(యం) తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.

బలమైన ప్రజావాణిగా సిపిఐ(యం)
మారుతున్న పరిస్థితులకనుగుణంగా సిపిఐ(యం) తన రాజకీయ, నిర్మాణ విధానాలను, పద్ధతులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ సరిదిద్దుకుంటూ వస్తున్నది. 1964లో పార్టీ ఏర్పడిన తరువాత తీవ్రమైన నిర్బంధాన్ని ఎదుర్కొని ఒంటరి పోరాటాన్ని సాగించింది. చీలికల అనంతరం కొద్ది బలంతో పున:నిర్మాణం చేసుకొని ఎమర్జెన్సీ అనంతరం అతి పెద్ద వామపక్ష శక్తిగా అవతరించింది. ఎమర్జెన్సీ అనుభవంతో ఐక్య సంఘటనా ఎత్తుగడలను అనుసరించి విస్తరించింది. 1978లో సాల్కియాలో ప్లీనం జరుపుకొని పార్టీని దేశవ్యాపితంగా విస్తరింపజేసేందుకు నడుం కట్టింది. ప్రజా సమస్యలను జాతీయ స్థాయిలో చేపట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించింది. రైతులకు గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాపిత ఆందోళనల్లో సిపిఐ(యం) ముందున్నది. కార్మికులకు పోరాడే హక్కుతో సహా వేతనాల పెంపుదల, పెన్షన్‌ వంటి అనేక సమస్యలపై గళమెత్తింది. బయట పోరాటాలు చేస్తూ వాటికి మద్దతుగా పార్లమెంటులోనూ బలమైన వాణిని వినిపించింది. సమస్యలపై కలిసొచ్చే శక్తులను కలుపుకొని పోరాడింది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులను, మహిళలను, యువజన, విద్యార్థులను కూడగట్టేందుకు నిర్మాణ చర్యలు చేపట్టింది. 1980లో దేశవ్యాపితంగా దళితులపై పెరిగిన దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ ఎదుర్కొని పోరాడింది. దళిత ఉద్యమాలకు మద్దతుగా కార్మిక, కర్షక సంఘీభావానికి కృషి చేసింది.
అయితే 1991 తరువాత ఉద్యమాల ఊపు తగ్గింది. అయినా 2000 సంవత్సరంలో మన రాష్ట్రంలో విద్యుత్‌ ఉద్యమం, భూపోరాటాలు కొత్త తరానికి స్ఫూర్తినిచ్చాయి. 2004లో యుపిఏ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వచ్చిన కొత్త అవకాశాలను ఉపయోగించుకొని అటవీ సంరక్షణ చట్టం, ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం లాంటి అణగారిన వర్గాల హక్కులకు చట్టబద్దత కల్పించేందుకు తన పలుకుబడిని ఉపయోగించింది. ఈ చట్టాలు తీసుకురావడానికి ముందు ఆయా తరగతులను కూడగట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అయితే అమెరికాతో అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వామపక్షాలు తరువాత యుపిఏకి మద్దతు ఉపసంహరించుకున్నాయి. ఇది గిట్టని సామ్రాజ్యవాదులు, వారి కనుసన్నల్లో పని చేసే బడా పెట్టుబడిదారీ వర్గం, బడా కార్పొరేట్‌ మీడియా వామపక్షాలను ప్రత్యేకించి బెంగాల్‌, త్రిపుర, కేరళలో దెబ్బ తీసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేసింది. ప్రభుత్వాల నిర్వహణలో జరిగిన లోపాలు, పార్టీ నిర్మాణ బలహీనతల వల్ల ప్రజలకు, పార్టీకి మధ్య దూరం పెరిగింది. బూర్జువా పార్టీలు దీనిని అవకాశంగా తీసుకొని ఎదురుదాడి చేసి ఓడించాయి. బెంగాల్‌, త్రిపురల్లో నేటికీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ప్రజల మధ్య పనిచేస్తున్నారు.

రాష్ట్ర విభజన అనంతర ఉద్యమాలు
తెలుగు ప్రజల ఐక్యత కోసం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నికరంగా నిలబడ్డ ఏకైక పార్టీ సిపిఐ(యం). విభజన అనంతరం పార్టీ ఇతర వామపక్షాలతోనూ, అభ్యుదయవాదులతోనూ కలిసి అనేక ఉద్యమాలు నిర్వహించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పట్టు వదలకుండా పోరాడుతున్నది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక పోరాటాలకు మద్దతునివ్వడమేగాకుండా స్వతంత్రంగా ఉద్యమాలు నిర్వహించింది. 42 రోజుల చారిత్రాత్మక అంగన్‌వాడీల సమ్మె, మున్సిపల్‌ వర్కర్స్‌ సమ్మె, ఆశాల ఆందోళనలకు వెన్నుదన్నుగా నిలిచింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పింది. కార్మిక ఉద్యోగుల పోరాటాలకు చురుకైన మద్దతునివ్వడం, విద్యుత్‌ చార్జీలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా, దళితులు, మహిళలపై దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించింది. ప్రత్యేకించి భూపోరాటాలకు సిపిఐ(యం) అండగా నిలిచింది. బలవంతపు భూసేకరణను వ్యతిరేకించింది. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా జాబ్‌ క్యాలెండర్‌ కోసం పోరాడిన యువతీ యువకులకు అండగా నిలబడింది. ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతు ఉద్యమంలో పార్టీ క్రియాశీల పాత్ర పోషించింది.

క్షేత్ర స్థాయి నాయకత్వం – స్థానిక సమస్యలపై కృషి
2024 ఎన్నికల్లో ప్రజలతో పార్టీ సంబంధాలు బలహీన పడటాన్ని గుర్తించింది. క్షేత్ర స్థాయిలో ప్రజల తక్షణ సమస్యలపై నిరంతరాయంగా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఐ(యం) ఏజెన్సీలో ఒక రాజకీయ శక్తిగా అవతరించింది. అటవీ హక్కుల సవరణ చట్టానికి వ్యతిరేకంగా, పోడు భూముల పట్టాల కోసం పోరాడింది. తునికాకు కార్మికుల కనీస వేతనాలు, ఆదివాసీ యువతకు ఉద్యోగాలు కల్పించే జి.వో.నెంబర్‌ 3ని పునరుద్ధరించి స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించాలని, రిజర్వేషన్లు కాపాడాలని, భాషా వలంటీర్లను రెగ్యులరైజ్‌ చేసి జీతాలు పెంచాలని డిమాండ్‌ చేయడమేగాకుండా దీనికోసం ఆదివాసీ గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన రెండు బంద్‌లకు అండగా నిలబడింది. పోలవరం నిర్వాసితుల పునరావాసం కోసం పాదయాత్రలతో సహా వివిధ రూపాల్లో ఆందోళనలను సాగించడమేగాక సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్ళింది. ఈ పోరాటాలన్నీ సిపిఐ(యం)ను గిరిజనుల కోసం పోరాడే యోధునిగా నిలబెట్టింది. ఆ విశ్వాసంతోనే ఈ ఎన్నికల్లో సాధారణ ఆదివాసీలతోపాటు విద్యావంతులైన యువతీ యువకులు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వేశారు. అయితే మిగతా రాష్ట్రంలో నిరాశాజనకమైన ఫలితాలే వచ్చాయి. సాంప్రదాయకంగా బలంగా ఉన్న కేంద్రాల్లో కూడా బలహీనపడ్డాం. నూతనంగా ఆవిర్భవించిన నయా ధనిక వర్గాలను క్షేత్ర స్థాయిలో ఎదుర్కొని నిలబడగలిగే నాయకత్వ కొరత ఏర్పడింది. పార్టీ శాఖలు స్వంత చొరవతో ప్రజా సమస్యలను చేపట్టి సమరశీల పోరాటాలు నిర్వహించడం ద్వారా ఈ బలహీనతను అధిగమించగలం.

ప్రజా పునాదిపై పార్టీ నిర్మాణం
ఇన్ని సమస్యలపై నిరంతరం పనిచేస్తున్నా ప్రజా పునాది ఎందుకు బలహీన పడుతుందన్న అంశంపై పార్టీ ఆత్మావలోకనం చేసుకుంది. పోరాటాన్ని నిరంతరాయంగా, ఏదో ఒకటి సాధించేదాకా కొనసాగించడంలో లోపాలు జరుగుతున్నాయి. సమస్యలపై పోరాడే క్రమంలో వారిని రాజకీయంగా నిలబెట్టుకునే ప్రయత్నం తక్కువగా జరిగింది. ప్రజా ఉద్యమాలతో రాజకీయ కృషిని జోడించడంలో బలహీనత వుంది. పార్టీలో తలెత్తిన అవకాశవాద పార్లమెంటరీ ధోరణులు ఇందుకు కారణమని ఎన్నికల సమీక్షలో కేంద్ర కమిటీ పేర్కొన్నది. సిపిఐ(యం) సభ్యులు, కార్యకర్తలు వివిధ సంఘాల ద్వారా ప్రజా సమస్యలపై కృషి చేస్తున్నారు. బూర్జువా పార్టీలకు భిన్నంగా సిపిఐ(యం) పని శైలి ఉంటుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న సూత్రాన్ని నమ్మి ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను ఒక సంఘటిత శక్తిగా మార్చడమే సిపిఐ(యం) రాజకీయ కర్తవ్యంగా చేపట్టింది.
పార్టీ నిర్మాణంలో ప్రవేశించిన అనేక తప్పుడు ధోరణులను ఎదుర్కొనడానికి ప్రత్యేకంగా దిద్దుబాటు ఉద్యమాలు చేపట్టింది. తద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల, సభ్యుల నాణ్యతలోనూ మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఇవన్నీ పూర్తిగా సత్ఫలితాలనిచ్చాయని చెప్పలేకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు తప్పులు గుర్తించి సరిదిద్దుకునే శక్తి పార్టీకి ఉందని రుజువు చేస్తుంది. తప్పులు జరగకుండా నివారించలేం. కానీ ఆ తప్పులను సరిదిద్దుకొనే శక్తి పార్టీకి ఉందా లేదా అనేది ముఖ్యం. ఇప్పటికీ కమ్యూనిస్టు ఉద్యమానికి ఆ శక్తి ఉంది. పోరాట అనుభవాలతోపాటు సమాజంలో వస్తున్న మార్పుల్ని అధ్యయనం చేస్తూ దానికనుగుణంగా నినాదాలను రూపొందించుకుంటూ ముందుకుపోయే క్రమం కొనసాగుతుంది. 2025 ఏప్రిల్‌లో జరగనున్న 24వ పార్టీ మహాసభ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది.

వ్యాసకర్త సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

➡️