పశ్చిమ హిమాలయాల్లో ప్రాజెక్టులను సమీక్షించాలి

Dec 2,2023 07:13 #Editorial

సహాయక కార్యకలాపాల సమయంలో, వివిధ సంస్థలకు చెందిన సాంకేతిక నిపుణులు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సొరంగ ప్రదేశంలోని నేల స్వభావం కారణంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారీ ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రం పనిచేస్తుండగా, ఆ చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నేల గట్టిగా లేకపోవడం వల్ల శిధిలాలు పడుతుండడాన్ని వారు గమనించారు. పైగా సొరంగం పైభాగం నుండి నిలువుగా కొండను తవ్వడంతో సహా భారీ యంత్రాలతో కార్యకలాపాలు నిర్వహించడం చాలా రిస్క్‌తో కూడినదే. ఎందుకంటే ఆ ప్రకంపనల ధాటికి మళ్లీ సొరంగం కూలిపోవడమో లేదా కొండచరియలు విరిగిపడడమో జరుగుతుందనే భయాందోళనలు కూడా సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఈ కారణాలవల్లే ఈ ప్రాజెక్టును చేపట్టినప్పటి నుండి వివిధ రంగాల నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల వారు అందరూ కూడా హెచ్చరిస్తూనే వచ్చారు. రోడ్లు వెడల్పు చేయడం, వాలును తగ్గించడం, పేలుళ్ళు, సొరంగాలు తవ్వడం, శిధిలాలను కిందనున్న నదుల్లోకి తోసివేయడం వంటి చర్యల వల్ల… సున్నితంగా, పెళుసుగా వుండే హిమాలయ పర్వత ప్రాంతంలో తలెత్తే ప్రమాదాల గురించి అపమ్రత్తం చేస్తూనే వున్నారు.

             ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీ జిల్లాలో సిల్క్‌యారా సొరంగం కూలిపోవడంతో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికుల 17 రోజుల వ్యథాభరిత నిరీక్షణకు తెరపడింది. మొత్తంగా కార్మికులందరినీ క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. వీరిలో ఎక్కువమంది వలస కార్మికులే. వీరిని కాపాడేందుకు పలు సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీలు, విదేశీ నిపుణులు, సైన్యానికి చెందిన ఇంజనీర్లు, ఇతర రంగాల కార్మికులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వైమానిక బలగాలు తీసుకువచ్చిన భారీ, సంక్లిష్టమైన యంత్రాలు, సొరంగాన్ని మూసివేసిన 60 మీటర్ల శిధిలాల గుట్టలు, వాటిని తవ్వేందుకు వివిధ రకాల్లో అనుసరించిన పద్ధతులు, అప్పటికప్పుడు తీసుకున్న అత్యవసర నిర్ణయాలు, ఇవన్నీ ఫలించి ఎట్టకేలకు వారిని రక్షించి బయటకు తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఒక్కొక్క కార్మికుడి కోసం ఒక్కో అంబులెన్సును మోహరించారు. ఇవన్నీ సొరంగం పక్కనే కార్మికుల కోసం ఎదురుచూస్తూ వరుసగా వేచి వున్నాయి. సొరంగం నుండి బయటకు తీసుకురాగానే అక్కడే ఏర్పాటు చేసిన ఫీల్డ్‌ ఆస్పత్రిలో ప్రాథమిక పరీక్షలు పూర్తయిన అనంతరం వారిని సమీపంలోన చినయాలిసర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఒకవేళ ఏదైనా తీవ్ర గాయాన్ని లేదా అస్వస్థతను కార్మికులు ఎదుర్కొంటున్నట్లైతే వారి కోసం తీసుకున్న అపారమైన ముందస్తు జాగ్రత్తల్లో ఇవన్నీ పాక్షికమే. అయితే, గత కొద్ది రోజులుగా వారితో జరిపిన ఫోన్‌ సంభాషణలు, ఇతర రకాల కమ్యూనికేషన్ల ద్వారా వారందరూ బాగున్నారని, ఎలాంటి గాయాలు లేవని తేలింది. కానీ, అదే సమయంలో ఇదంతా కూడా ఒక రకంగా నాటకీయంగా తీసుకున్న చర్యలుగా కూడా కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు కార్మికుల ఆరోగ్యం, వారి భద్రత కోసం అపారమైన ప్రయత్నాలు చేపట్టాయని ప్రజలకు చూపించుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేశారు. అనేకమంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం సంఘటనా స్థలానికి విచ్చేశారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి కూడా వివిధ సమయాల్లో సొరంగం వద్దకు వచ్చి పనులను పర్యవేక్షించారు.

అంతా సవ్యంగానే జరిగి, సంతోషకరమైన ఫలితమే వచ్చినందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుత సంతోషకరమైన వాతావరణాన్ని చూసి అంతా బాగానే వుంటుందని అన్ని స్థాయిల్లోని అధికారులు భావించకూడదు. సున్నితమైన హిమాలయ ప్రాంతంలో మౌలిక వసతులను అభివృద్ధి పరచడమన్నది ఓ వ్యాపారం మాదిరిగానో లేదా ఏదో సాధారణ పద్ధతిలోనో చేపట్టడానికి వీల్లేదని తెలుసుకోవాలి. ఈ సొరంగం కుప్పకూలడమన్నది పెను విషాదానికి దారి తీసే పరిస్థితే. అయితే సొరంగం మొదట్లోనే ఇది సంభవించింది కాబట్టి సరిపోయింది.

900 కిలోమీటర్ల పొడవైన చార్‌ధామ్‌ హైవే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆమోదించి, అమలు చేస్తున్న సమయంలో ఇదే తీరులో వివిధ సంస్థలు సమన్వయంతో కృషి చేస్తూ, వృత్తిపరమైన సామర్ధ్యాలను, వివిధ రంగాల నిపుణుల అభిప్రాయాలను గౌరవించాలని అందరూ భావిస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే సిల్క్‌యారా సొరంగాన్ని నిర్మిస్తున్నారు. సహాయక కార్యకలాపాల సమయంలో, వివిధ సంస్థలకు చెందిన సాంకేతిక నిపుణులు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది సొరంగ ప్రదేశంలోని నేల స్వభావం కారణంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారీ ఆగర్‌ డ్రిల్లింగ్‌ యంత్రం పనిచేస్తుండగా, ఆ చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నేల గట్టిగా లేకపోవడం వల్ల శిధిలాలు పడుతుండడాన్ని వారు గమనించారు. పైగా సొరంగం పైభాగం నుండి నిలువుగా కొండను తవ్వడంతో సహా భారీ యంత్రాలతో కార్యకలాపాలు నిర్వహించడం చాలా రిస్క్‌తో కూడినదే. ఎందుకంటే ఆ ప్రకంపనల ధాటికి మళ్లీ సొరంగం కూలిపోవడమో లేదా కొండచరియలు విరిగిపడడమో జరుగు తుందనే భయాందోళనలు కూడా సర్వత్రా వ్యక్తమయ్యాయి.

ఈ కారణాలవల్లే ఈ ప్రాజెక్టును చేపట్టినప్పటి నుండి వివిధ రంగాల నిపుణులు, భూగర్భ శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజలు, ప్రజా సంఘాల వారు అందరూ కూడా హెచ్చరిస్తూనే వచ్చారు. రోడ్లు వెడల్పు చేయడం, వాలును తగ్గించడం, పేలుళ్ళు, సొరంగాలు తవ్వడం, శిధిలాలను కిందనున్న నదుల్లోకి తోసివేయడం వంటి చర్యల వల్ల…సున్నితంగా, పెళుసుగా వుండే హిమాలయ పర్వత ప్రాంతంలో తలెత్తే ప్రమాదాల గురించి అపమ్రత్తం చేస్తూనే వున్నారు. ఈ కారణాల వల్లనే పశ్చిమ హిమాలయాల్లో తరచుగా, తీవ్ర స్థాయిల్లో విపత్తులు సంభవిస్తున్నాయి. పదే పదే విరిగిపడే కొండ చరియల వల్ల హైవేకి తీవ్రంగా నష్టం వాటిల్లడమో లేక పూర్తిగా మూసుకుపోవడమో జరుగుతోంది. భయంకరమైన వరదలు సంభవిస్తున్నాయి. తపోవన్‌-విష్ణుగఢ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. చార్‌థామ్‌ సర్క్యూట్‌లో యాత్రా స్థలాలకు కీలకమైన గేట్‌వే అయిన జోషిమఠ్‌ పట్టణం కుంగిపోతోంది. ఇవన్నీ కూడా పేలవమైన ప్రణాళికల వల్ల, పైగా హిమాలయ ప్రాంతంలో భౌగోళిక, భౌగోళిక-సాంకేతికమైన సున్నిత పరిస్థితుల పట్ల ఆందోళన కొరవడడం వల్లనే సంభవిస్తున్నాయి. పర్యావరణ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం, ప్రాథమికంగా కొండలు, రోడ్లు, పట్టణాలు, యాత్రా స్థలాలు ఎంత మాత్రం భారం మోయగలవనే అంశాలను పట్టించుకోకపోవడం వల్లే ఇవి జరుగుతున్నాయి. పర్యావరణ ప్రభావ మదింపును నిర్వహించే బాధ్యత నుండి తప్పుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 900 కిలోమీటర్ల హైవే ప్రాజెక్టును 53 చిన్న చిన్న విభాగాలుగా విభజించిందనే విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. పైగా కూర్పులో అవకతవకలు జరగడంతో ప్రాజెక్టును పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ అభిప్రాయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేరు. చివరగా, హైవేని విస్తరించేందుకు సుప్రీంకోర్టు కూడా ఆమోదం ఇచ్చేలా ఒత్తిడి తెచ్చేందుకు జాతీయ భద్రత అనే ట్రంప్‌ కార్డును కూడా కేంద్రం ఉపయోగించింది.

తాజా ఘటన తర్వాత, పశ్చిమ హిమాలయాల్లో చేపట్టిన అన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులపైన సమగ్రంగా, స్వతంత్రంగా సమీక్ష జరపాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. అన్ని యాత్రా స్థలాలు, హిల్‌ స్టేషన్లు, ఆ ప్రాంతంలోని ఇతర పట్టణాల కేరీయింగ్‌ కెపాసిటీ (భరించే సామర్ధ్యం)ని కూడా సమీక్షించాల్సిన అవసరముంది. అన్ని నిర్మాణ పనులకు తగిన సాంకేతిక కోడ్‌లను అభివృద్ధి పరచాలి. ఈ నియమ నిబంధనలన్నీ సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించేందుకు, వాటి అమలు జరిగేలా చూసేందుకు సమర్ధవంతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాల్సి వుంది. ఇటువంటి చర్యలు తీసుకోకపోతే, నిర్దేశించబడిన ఈ ప్రాంత అభివృద్ధి పెను విపత్తుకు కారణంగా మారిపోయే ప్రమాదముంది.

( ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️