పౌరహక్కుల పరిరక్షణ : అప్రమత్తత అవసరం

ప్రస్తుత 18వ లోక్‌సభలో పార్టీల బలాబలాలు మారాయి. గత సభలో తన పార్టీకి ఉన్న మందబలం వల్ల మోడీ ఏం చేసినా చెల్లింది. ఎన్‌.డి.ఎ లోని మిగతా పార్టీలు బిజెపి కి తందాన దాసులే. కనుక తన రాజకీయ ఎజెండాకు అనుగుణంగా బిజెపి గత పదేళ్లలో మానవ హక్కులపై తీవ్రమైన దాడి చేసింది. మానవ హక్కుల కోసం, ప్రజాస్వామిక విధానాల కోసం నిలిచిన వారిపై దాడుల పరంపరను కొనసాగించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు అంకెలతో సహా భారతదేశం లోని మానవ హక్కుల దుస్థితిని వెల్లడించాయి.
గత పదేళ్లలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అమలు చేసిన ప్రజా వ్యతిరేక చట్టాలు కాంగ్రెస్‌ కాలంలో ఆమోదించినవే. వాటికి మోడీ మరింత పదును పెట్టి వాడారు. కాంగ్రెస్‌ అనుసరించిన ఆ విధానాల పట్ల వ్యక్తమైన వ్యతిరేకత మూలంగానే బిజెపి దాని మిత్రపక్షాలు అధికారానికి ఎగబాకాయి. ఈ దశలో కాంగ్రెస్‌ ఆ విధానాలను అడుగడుగున వ్యతిరేకించి మోడీ ప్రభుత్వాన్ని నిలేస్తుందా? ఉపేక్షిస్తుందా? అన్నది ముఖ్యమైన ప్రశ్న.
ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించడంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు ప్రజాసంఘాలతో పాటు మీడియా కూడా ప్రధాన పాత్ర వహించాలి. కాని మోడీ హయాంలో అది గోడీ మీడియా (మోడీ బడిలో చేరిన మీడియా)గా మారింది. ఆ బంధనాల నుండి మీడియా సంస్థలు ఇప్పుడైనా బయటపడి స్వేచ్ఛగా వ్యవహరిస్తాయా? అన్నది కూడా ఇంకా ప్రశ్నార్థకమే.
భారత రాజ్యాంగం పనికి రాదని, అది అతుకుల బొంత అని మోడీ మొన్నటి దాకా అన్నారు. ఎన్నికల ఫలితాల్లో తల బొప్పి కట్టేసరికి రాజ్యాంగాన్ని కళ్లకద్దుకొన్నారు. ఆయన అవకాశవాద మిత్రుల్లో ఒకరైన చంద్రబాబు గతంలో ఒకసారి తానే కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పాననే భ్రమల్లో ఉండిన, ఈసారి కూడా తాను చక్రం తిప్పబోతున్నట్లు జనాన్ని నమ్మించే పనిలో ఉన్నారు. నితీష్‌ కుమార్‌, పాశ్వాన్‌లు అగ్నివీర్‌ పథకాన్ని సమీక్షించాలని ఓ మాటైనా అన్నారు. కాని మోడీ వాచ్‌మెన్‌ (దేశానికి కాపరి) కాదు, ఒట్టి అబద్ధాలకోరు అని ఆక్రోశించిన తనే ఇప్పుడు నమో మోడీ అంటున్నారు.
మోడీ సర్కార్‌ ఈసారి నీట్‌ స్కామ్‌తో పాలన మొదలెట్టింది. పోయిన సారి పి.ఎం కేర్స్‌, ఎన్నికల బాండ్లు, గుత్త పెట్టుబడిదార్లకు కోటానుకోట్ల అప్పుల రద్దు వంటి అవినీతి స్కామ్‌లతో పాటు మానవ హక్కుల పట్ల కూడా మోడీ దుర్మార్గంగా వ్యవహరించారు. ఆ దుర్మార్గాల్లో ఒకటి బీమా కోరేగావ్‌ కేసు. అర్థం పర్ధం లేని ఆరోపణలతో ఆ కేసు బనాయించారు. కేసులో అరెస్టయిన స్టాన్‌స్వామి లాంటి వృద్ధ సంఘ సేవకుడు జైల్లో అమానుష పరిస్థితుల్లో చనిపోయినా మోడీ ప్రభుత్వానికి దున్నపోతు మీద ఈగ వాలినట్లు కూడా కాలేదు. ఆ కేసులోని మరో ముద్దాయి విరసం నేత వరవరరావు కండిషనల్‌ బెయిల్‌ మీదే ఇంకా బొంబాయిలోనే ఉన్నారు. ఆ కేసు విచారణ ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని స్థితి. వెనుకటికి టాడా చట్టాన్ని వ్యతిరేకించిన బిజెపి తన హయాంలో ఉపా చట్టం కింద బెయిల్‌కు కూడా అవకాశం లేకుండా సవరణ చేసింది. అనేక మంది పాత్రికేయులను అది రాచి రంపాన పెట్టింది. వారి ఇళ్లపై దాడి చేసింది. న్యూస్‌క్లిక్‌ యూట్యూబ్‌ చానెల్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పురకాయస్థ వంటి వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 2022 నుండి 2024 వరకు రెండేళ్ల కాలంలో ఉపా కింద దేశంలో 10,552 మందిని అరెస్టు చేశారు. అదే సమయంలో అహ్మదాబాదు హింసాకాండలో జీవిత ఖైదు పడిన వారికి మాత్రం శిక్ష ముగియక ముందే రెమిషన్‌ ఇచ్చి వదిలేశారు.
ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్‌ అకౌంట్‌ను, కేరళలో సిపిఎం జిల్లా కమిటీ అకౌంట్‌ ఒకదాన్ని స్థంభింపచేయడంతో పాటు తనకు వ్యతిరేకులైన రాజకీయ నేతలపై ఆర్థిక నేరాలు మోపి ముప్పుతిప్పలు పెట్టింది. ఇద్దరు ముఖ్యమంత్రులను సైతం జైల్లో పెట్టింది. ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కొన్న వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు తమ పార్టీలను వదలి బిజెపిలో చేరారు. మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా వారి కేసులను పక్కకు పెట్టింది. ఆ ధోరణి మోడీ మూడో అవతారంలోనూ కొనసాగవచ్చు. లోక్‌సభలో పార్టీల బలాబలాలు మారిన స్థితిలోనైనా మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పార్లమెంట్‌లో, వెలుపలా తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఎంత బలంగా ముందుకొస్తుందో చూడాల్సిందే.
భారతదేశంలో నియంతృత్వం రాజ్యమేలుతున్న విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు సరిగ్గానే గుర్తించాయి. ఆ సంస్థల విమర్శలకు జవాబు చెప్పలేని మోడీ ‘మా దేశంలో నియంతృత్వం లేదని, ఆదిమ కాలం నుండే భారతీయుల నరనరాల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని’ ఐరాస వేదికపై సెంటిమెంటల్‌ డైలాగులు చెప్పారు. అదే మోడీ న్యూఢిల్లీలో గత ఏడాది జరిగిన జి 20 దేశాల సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను సైతం మీడియాతో మాట్లాడనివ్వలేదు.
నిరుడు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తన రిపోర్టులో ఇండియాలో మానవ హక్కులపై వివిధ రూపాల్లో దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక నేరాలపై దర్యాప్తు జరపాల్సిన సంస్థలు అధికార బిజెపి చేతిలో ఆయుధాలయ్యాయని అది పేర్కొంది. మానవ హక్కుల సంఘాల కార్యకర్తలపై, జర్నలిస్టులపై, విమర్శకులపై, అలాగే ముస్లింలపై దాడులు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయని వెల్లడించింది. ముస్లింల ఆస్తులపై, ఇళ్లపై, ప్రార్థనా స్థలాలపై దాడులు చేసిన వారికి శిక్షలు కూడా పడటంలేదని ఎత్తి చూపింది.
కాశ్మీర్‌, మణిపూర్‌ లోనే కాదు పంజాబ్‌లోనూ దేశంలో ఇతర ప్రాంతాల్లోనూ మోడీ ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవలను నిలిపేసింది. అక్కడ కొన్ని చోట్ల చాలా కాలం పాటు నిలిపేస్తే కొన్ని చోట్ల స్వల్ప కాలం నిపిపేసింది. సాగుతున్న హింసాకాండ వివరాలు బయటి ప్రపంచానికి వెల్లడి కాకుండా చూశారని ఆమ్నెస్టీ ఎత్తి చూపింది. మణిపూర్‌లో క్రైస్తవ ఆదివాసీలపై అమానుష దాడులు జరుగుతుండగా ప్రభుత్వం వాటిని నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ట్విట్టర్‌ (ఈనాడు)పై కూడా నిషేధాలు విధించే ప్రయత్నం చేశారు. సోషల్‌ మీడియాలో తమను ప్రశ్నించిన వారిని సంఫ్‌ు పరివార్‌ సహించలేదు. తాము అట్టడుగు వారి కోసం ఎన్నో పథకాలు చేపట్టామనే నమో ప్రభుత్వం మాన్యువల్‌ స్కావెంజింగ్‌ను నిషేధించినప్పటికీ దేశంలో 2018 నుండి సివరేజి కాలువలను శుభ్రం చేస్తూ 300 మంది చనిపోయారు. 2021లో దేశంలో రోజుకు సగటున మహిళలపై 86 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వీటిలో బలహీన వర్గాలపై బలవంతులు చేసిన అత్యాచారాలే ఎక్కువ.
జి20 సమావేశాల నేపథ్యంలో యు.ఎన్‌ మానవ హక్కుల కౌన్సిల్‌తో భారత్‌ ఒక ఒప్పందానికి వచ్చింది. దేశంలో కుల వివక్షను తొలగిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛకు గ్యారెంటీ ఇస్తామని, మతపర మైనారిటీల హక్కుల్ని రక్షిస్తామని భారత ప్రభుత్వం ఒప్పుకొంది. విదేశీ విరాళాల చట్టం (ఎఫ్‌సిఆర్‌ఏ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, (ఉపా), దేశద్రోహ చట్టం, నేరపూరిత పరువు నష్టం చట్టం వంటి వాటిలో ప్రజాస్వామిక సవరణలు చేస్తామని అంగీకరించింది. కాని వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. దళితులు, ఆదివాసీలపై వేధింపులు అత్యాచారాలు కొనసాగాయి. ముస్లింలను నేరస్తులుగా చూపడానికి మాత్రమే పౌరసత్వ చట్టంలో మార్పు చేసింది.
రాజద్రోహం కేసులన్నీ రాజకీయ దృష్టితో పెట్టినవవే. అందులో సందేహం లేదు. కాగా ఆ చట్టం కింద విధించే శిక్షను ఏడేళ్ల నుండి పదేళ్లకు పెంచింది. కోర్టు తీర్పులనూ పట్టించుకోలేదు. విధాన పరమైన అంశాలపై పరిశోధన చేసే సెంటర్‌ ఫర్‌ ఈక్విటీ స్టడీస్‌ లైసెన్సును ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేసింది. ప్రముఖ మానవ హక్కుల నాయకుడు, మాజీ ఐఏఎస్‌ అధికారి హర్ష మందర్‌ ఆధ్వర్యంలో నడిచే సంస్థ అది. ఆయన నడిపే అమన్‌ బిరాదరి (ఇరుగు పొరుగులో శాంతి) అనే సంస్థపై కూడా విచారణకు ఆదేశించారు. సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చి, ఆక్స్‌ఫాం ఇండియా, కేర్‌ ఇండియా సంస్థలకు ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశారు. దేశంలోని బలమైన మీడియా మోడీకి బంటుగా మారింది. కనుక పౌరహక్కుల సంరక్షణలో అది తన బాధ్యత నిర్వహిస్తుందని ఇప్పట్లో ఆశించలేము. అభ్యుదయ మేధావులు, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాలు నేడు ముందుకొచ్చి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి. కాంగ్రెస్‌తో సహా ‘ఇండియా’ బ్లాకులోని అన్ని పక్షాలు పౌరహక్కుల కోసం నేడు ఉద్యమాలను నిర్మించడానికి ముందుకు రావాలి.

వ్యాసకర్త ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్‌. వినయకుమార్‌

➡️