ప్రజాతీర్పు

జమ్ముకాశ్మీర్‌లో కమలం పార్టీకి ఓటర్లు బుద్ధిచెప్పారు. అతివిశ్వాసం, కుమ్ములాటలతో హర్యానాలో విజయాన్ని కాంగ్రెస్‌ చేజార్చుకుంది. జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తినిచ్చే చారిత్రాత్మక 370 అధికరణాన్ని రద్దు చేసి, కాశ్మీరీ ప్రజలను, నేతలను ఏళ్ల తరబడి నిర్బంధించినందుకు తగిన ఫలితాన్ని బిజెపి అనుభవించింది. రాష్ట్రహోదా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ పునరుద్ధరించకపోవడంపై ప్రజానీకం తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. కాశ్మీర్‌ ప్రాంతంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) నేతృత్వంలోని ఇండియా వేదిక క్లీన్‌స్వీప్‌ చేసింది. ‘నయా కాశ్మీర్‌’ అంటూ మాయ చేసేందుకు బిజెపి చేసిన ఎత్తులు చిత్తయ్యాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రైనాను సైతం ఓడించి, బిజెపిని పూర్తిగా తిరస్కరించారు. 90 స్థానాలకు గాను 48 స్థానాలను సాధించిన ఎన్‌సి – కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. కుల్గాం స్థానం నుంచి వరుసగా ఐదోసారి యూసఫ్‌ తరిగామిని గెలిపించడం ద్వారా ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. 2019లో నిషేధించిన జమాతే ఇస్లామీ పార్టీ, అవామీ ఇత్తెహాద్‌ పార్టీ (ఎఐపి) స్వతంత్రులకు మద్దతిస్తూ, ప్రచారం చేసేందుకు సైతం అనుమతించడం ద్వారా లబ్ధి పొందాలనీ కమలం పార్టీ ప్రయత్నించింది. యుఎపిఎ కింద అరెస్టయిన ఎఐపి నేత ఇంజనీర్‌ రషీద్‌తో ప్రచారం చేయించి, ఇండియా వేదిక ఓట్లను చీల్చాలని చేసిన ఎత్తులు పారలేదు.
హర్యానాలో బిజెపి వ్యతిరేక ఓట్ల చీలిక, అతివిశ్వాసం, కుమ్ములాటలు కాంగ్రెస్‌ పార్టీ పుట్టిముంచాయి. కిసాన్‌, జవాన్‌, పహిల్వాన్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న హర్యానాలో… ఆ మూడు పక్షాలూ వ్యతిరేకంగా ఉన్నా, అధికారం వెలగబెట్టిన పదేళ్లలో చేసిన నిర్వాకాలతో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నా… ఎన్నికల ఫలితాల్లో వ్యక్తం కాకపోవడానికి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ బలహీనతలు కారణమయ్యాయి. జాట్‌లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాకపోగా, జాట్‌లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసుకోగలిగింది. కాంగ్రెస్‌ అగ్రనేతలు హుడా, సెల్జా మధ్య విభేదాలు బహిరంగంగానే బయట పడటం, కుమారి సెల్జాను పక్కనపెట్టడం కొన్ని తరగతుల ప్రతినిధులను దూరం చేశాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఆప్‌ ఒంటరిగా పోటీ చేయడం, స్థానికంగా ఉంటున్న జెజెపి, దళితుల మద్దతున్న భీమ్‌ ఆర్మీ పార్టీతోనూ, ఐఎన్‌ఎల్‌డి బిఎస్‌పితోనూ పొత్తు పెట్టుకోవడం కూడా ఓట్ల చీలికకు దారితీసింది. వెయ్యి నుంచి ఐదు వేల ఓట్ల తేడాతో 10 స్థానాల్లోనూ, ఐదు వేల నుంచి పదివేల ఓట్ల తేడాతో ఐదు స్థానాల్లోనూ కమలం పార్టీ గెలుపొందడమే ఆ పార్టీ వ్యతిరేక ఓట్ల చీలికను ఎత్తిచూపుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు దూరమైన ఓటర్లను దరిచేసుకునేందుకు కాషాయ పార్టీ చేసిన ఎత్తులు ఫలించాయి. అగ్నివీర్‌లకు రాష్ట్ర ఉద్యోగాల్లో కోటా ఇస్తామని, దళితుల్లో నాన్‌ జాతవ్‌లకు 14 శాతం రిజర్వేషన్లిస్తామని… ఇలా చేసిన ఆపద మొక్కులు ఫలితాన్నిచాయి.
కమలం పార్టీతో పొత్తు ధృతరాష్ట్ర కౌగిలి అని మరోసారి రుజువైంది. 2015లో బిజెపితో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన పిడిపి మూడు స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా సైతం ఓటమి పాలయ్యారు. హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్‌ జనతా పార్టీ (జెజెపి) అధినేత దుష్యంత్‌ చౌతాలా అవమానకరంగా ఐదో స్థానానికి పరిమితమయ్యారు. పంజాబ్‌లో శిరోమణి అకాళీదళ్‌కు, అస్సాంలో అస్సాం గణపరిషత్‌కు, తమిళనాడులో అన్నాడిఎంకెకు, మహారాష్ట్రలో శివసేనకు, బీహార్‌లో జెడి(యు)కు, కర్ణాటకలో జెడిఎస్‌కు సామాన్యుడు ఇదే సన్మానం చేసినా… మన రాష్ట్రంలో నేతలు ఒకరికి మించి మరొకరు ఆ రంగు పులుముకునేందుకు తహతహలాడుతుండటం గమనార్హం. సమానదూరం అంటూ… సర్కర్‌ చేసిన టిఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, బిజూ జనతాదళ్‌ పార్టీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధికోసం అంటకాగితే ఫలితం ఎలా ఉంటుందనడానికి తాజా ఫలితాలు మరో నిదర్శనం.

➡️