జీవాలకు, నిర్జీవాలకు సంధానకర్తలుగా వున్న వైరస్‌లు ఇంకా అత్యంత శక్తివంతమైనవిగా ఎలా మనగలుగుతున్నాయి? పంట మొక్కలను తెగుళ్ల రూపంలో, మనుషులను రోగాల రూపంలో ఈ వైరస్‌లు దాడి చేస్తూ ఎలా బెదిరించగలుగు తున్నాయి? కరోనా, క్యాన్సర్ కారకాల్లాంటివి మానవులకూ, మిర్చి పైరునాశించే బొబ్బర వైరస్ తెగుళ్లు, అపరాల పంటలను ఆశించే ఆకు ముడత, ఆకు మచ్చ (పండాకు) తెగుళ్ల లాంటివి మొక్కలకూ అంతు చిక్కని బెడదగా ఎలా పరిణమించగలిగాయి? మందుల కంపెనీలు, ”సర్వ జ్ఞాన” సైంటిస్టులు వాటి అదుపునకు ఘాటు రసాయనాలు కనిపెట్టీ కనిపెట్టక ముందే ఈ వైరస్‌లు ఇన్ని భిన్న రూపాలను ఎలా సంతరించుకోగలుగుతున్నాయి?
కరోనా వచ్చిన సంవత్సరానంతర కాలంలో రైతులు, రైతు కూలీలు, భవన నిర్మాణ కార్మికుల వంటి శ్రమజీవులు తప్ప మిగిలిన ప్రజలందరూ మాస్క్‌లు, శానిటైజర్లు వాడారు. అవి వైరస్‌ను అరికడతాయని ప్రచారం జరిగింది. అదే విధంగా పంట వైరస్ తెగుళ్ల అదుపు కోసం కూడా కొత్త కొత్త కృత్రిమ రసాయనాలను వాడి పంటలను రక్షించుకోండి అంటూ నిపుణులు సూచిస్తూనే ఉన్నారు. రైతులు కోట్లు కుమ్మరించి వాటిని వాడుతూనే ఉన్నారు. అయినా జరిగే నష్టం పెరగడమే తప్ప తరగడం లేదు.
కావాల్సింది రోగనిరోధకత
కరోనా వైరస్ వ్యాధి నిరోధక శక్తి కలిగిన వారికి, తెగుళ్ల వైరస్‌లు వాటిని తట్టుకోగలిగిన పంట రకాలకు రావడం లేదని తెలుస్తూనే వుంది. అలానే మంచి పోషకాలున్న ఆహారం పొందగలిగిన మనుషులకూ, సమగ్ర పోషణ రక్షణలో పెరుగుతున్న పంటలకూ ఈ వైరస్‌ల దాడి తక్కువని కూడా తేలింది. అయినా ప్రభుత్వం, దాని నీడలో బతికే మందుల కంపెనీలు మాత్రం ప్రజల్ని గందరగోళంలోకి నెడుతూనే వున్నాయి. మధ్యలో ఆనందయ్యలు, రాందేవ్ బాబాలు రంగంలోకి దిగి మరింత గజిబిజి సృష్టిస్తూనే వున్నారు.
నిజానికి టీకా (వ్యాక్సిన్) మూల లక్షణం వ్యాధి నిరోధక శక్తిని పెంచడం. అంటే వైరస్‌ను ఎదుర్కోగలిగిన శక్తిని జీవుల్లో కలిగించడం. అయితే అమెరికా వంటి ధనిక దేశాలూ, మన లాంటి వర్థమాన దేశాలు కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ఏ లక్ష్యాన్ని పట్టించుకోవడం లేదు. లాభాల పోటీల్లో కంపెనీలు ప్రాథమిక ఆరోగ్య నియమాల్ని గాలికి వదిలేశాయి. అలానే వైరస్ తెగుళ్ళను రసాయనాలు అరికట్టలేవని తెలిసి కూడా పదేపదే అదే దిశలో ప్రచారం నడుస్తున్నది. దీనికి ముఖ్య కారణం సామాన్యులకు, రైతులకు కార్యకారక సంబంధాల పరంగా వైరస్ జబ్బుల అదుపు గురించి తెలియకపోవడమే.
బలహీన జీవులూ బతకగలవు
జీవ పరిణామం నేపథ్యంలో వివిధ జీవులు (తమకు అవసరమైన ప్రత్యేక లక్షణాలను సంతరించుకున్న ప్రాణులుగా) ఉద్భవించి భిన్న స్థితి లక్షణాల్ని సంతరించుకున్న జీవులుగా మారినా మొదటి మూల దశ జీవులు యథాతథంగానే కొనసాగ గలవు. దానికి ముఖ్య కారణం ప్రతి జీవికి దిగ్విజయంగా జీవనం కొనసాగించగలిగిన ప్రత్యేక జీవ ప్రక్రియల నిలయం /కాలం పద్ధతి ఒకటి ఏర్పాటై వుండడం. ఈ ప్రత్యేక నిలయం/ ఆవాసం యొక్క పరమార్థం మనకు ఒక జీవి మరో జీవితో పోటీ పడే ప్రక్రియలో అర్థమవుతుంది. ఒకే తిండి, ఒకే కాలం, ఒకే జీవన విధానంగల జీవులు సమాంతరంగా మనలేవు. కొన్ని తొలగిపోతాయి. అనగా జీవుల మనుగడకు మూలమైన ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి ప్రక్రియలకు స్థానిక కొరత ఏర్పడుతుంది. ఈ స్థితిలో కొన్ని జీవులు పోటీకి నిలవలేనివి అనివార్యంగా అంతరించిపోతాయి. పరిణామ క్రమంలో అనేక జీవులు అంతరించడాన్ని వివిధ దశల్లో మనం గమనించాం.
అయితే జీవులు పోటీకి తట్టుకునే క్రమంలో తమ ఆహార, ఆవాస, పునరుత్పత్తి ప్రక్రియల్ని మార్చుకోగలవు. దీన్ని పురుగుల్లో కూడా మనం చూడవచ్చు. ఈ ప్రక్రియ వల్ల కొన్ని బలహీనమైన జీవులు కూడా పోటీలో తట్టుకునే స్థితిని సంతరించుకుంటాయి.
జన్యుపరమైన వైవిధ్యత, బాహ్య శరీర నిర్మాణాలపై పరిసరాల ప్రభావం ఎక్కువ. డిఆక్సీ (రైబోజ్) న్యూక్లికామ్లాల కలయిక (ఆర్‌ఎన్‌ఏ) ద్వారా నిర్మించబడుతున్న మూల జన్యువులు తమ నిరంతర కలయిక ద్వారా, మార్పుల ద్వారా జీవి రూపాలను ప్రభావితం చేస్తంటాయి. వీటిని ప్రాథమికమైనవనో, బలహీనమైనవనో భావించడం అశాస్త్రీయం. ముఖ్యంగా పరాన్న జీవులైన వైరస్‌లు, బ్యాక్టీరియా జీవులు నిర్మాణ రీత్యా జన్యుపర సౌలభ్యతకు ప్రతీకలు. కానీ ఉన్నత జీవులుగా మనం పేర్కొనే మనుషుల శరీరం నిర్మాణం జన్యు పరంగా ఉత్పరివర్తన (మ్యుటేషన్) చెందడానికి అంత అనుకూలం కాదు. పైగా మానవుల 90 శాతం జన్యువులు ఒకే తరహా ప్రక్రియకు మూలాలు. ఇప్పుడు మనం మనుషుల మధ్య చూస్తున్న వైవిధ్యతలన్నీ పరిసరాల ప్రభావంతో మాత్రమే కొనసాగుతున్నవని గుర్తించాలి.
వైరస్‌లే వేగంగా మారగలవు!
మరో ముఖ్యమైన అంశం ఏమంటే జీవ పరిణామం ఒకే దిశలో జరుగుతూ వుండదు. పునరుత్పత్తి, జన్యు వైవిధ్యత, మూల వనరుల లభ్యత వంటి అనుకూలతలు గల్గిన జీవుల నుండే ఉన్నత స్థాయి జీవులు రూపొందే అవకాశం ఉంటుందనేది సరైన అభిప్రాయం కాదు. దీన్ని శాస్త్రవేత్తలు నిరూపించారు. వివిధ సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో జరిగిన జన్యు కలయికలను బట్టి భిన్నమైన దశలో జీవ పరిణామం జరిగిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
సూక్ష్మ క్రిములుగా పిలవబడే వైరస్, బూజు, ఫంగస్, మైకో ప్లాస్మా, బ్యాక్టీరియాల్ని తరచుగా ప్రాథమిక జీవులుగా పేర్కొనడం జరుగుతున్నది. వాటి జన్యుపరమైన నిర్మాణం సంక్లిష్టంగా లేకపోవచ్చు గానీ అవే విజయవంతంగా మనుషుల మీదా, జీవుల మీదా, వృక్షాల మీదా దాడి చేయగలుగుతున్నాయి. వాటి మీద బతకగల్గుతున్నాయి. వేగంగా రూపాంతరం చెందగలుగు తున్నాయి. మన కొలమానాల ప్రకారం ప్రాథమిక జీవులైన వాటికి ఉన్నత జీవులు లొంగిపోతున్నాయి. దీనికి కారణం ఏమంటే జన్యుపరమైన సంక్లిష్టతలు తక్కువగా ఉన్న సూక్ష్మజీవులు మనుగడకు అవసరమైన జన్యు నిర్మాణాన్ని వేగంగా సమకూర్చుకోగలవు. దాన్నే జన్యుపరంగా మ్యుటేషన్ అంటారు. దీన్ని ”తన మనుగడకు తగిన స్థాయిని పెంచుకోవడం, మార్పులు చేసుకోగల్గడం” అనుకోవచ్చు. ఇలా వైవిధ్య రూపాలు (వేరియంట్లు) అనివార్యంగా అవతరిస్తాయి.
మారాల్సింది మానవుడు!
కోవిడ్ 19 నేపథ్యంలో ఆలోచిస్తే ”ఒక ప్రాథమిక జీవి బారిన ఒక ఉన్నత స్థాయి జీవి పడ్డది” అనేది అశాస్త్రీయ అవగాహన. నిజానికి మనుషులు ఎప్పుడూ ఉన్నత స్థాయి జన్యపర నిర్మాణం ద్వారా వైరస్‌లను దాటిపోలేదు. వాస్తవానికి మనుషుల సంక్లిష్ట జన్యు నిర్మాణమే సూక్ష్మాతి సూక్ష్మజీవులతో పోటీ పడాల్సి వస్తోంది.
ఇలా వైరస్‌లు నిరంతరం రూపాంతరం చెందుతూ తమ మనుగడను కొనసాగిస్తున్నాయి. జీవుల్ని వివిధ రకాల జబ్బుల రూపంలో ప్రభావితం చేస్తున్నాయి. మొదటి, రెండవ తెరల కోవిడ్ వల్ల లక్షల మంది చనిపోయారు. మూడవ తెరగా మారిన కొత్త రూపాలను (వేరియంట్లను) చూశాం. అయినా మనుషుల ధోరణి మారడం లేదు.
టీకా ఆవిష్కరణ గొప్ప పరిష్కారం చూపిస్తుందని ఆశించాంగానీ దాన్ని పేటెంట్ చట్టంలో ఇరికించి పూర్తి వ్యాపార వస్తువుగా మార్చేశారు. టీకా వాడుక ఉద్యమాలు ధనిక దేశాల్లో విస్తరించినంతగా పేద దేశాల్లో విస్తరించడం లేదు. పైగా వైరస్‌లు రూపాంతరం చెందుతూ పాత టీకాల ప్రభావాన్ని దిగజార్చే స్థాయికి చేరుకొంటున్నాయి. ఇలా సైన్సు, సాంకేతికాలు వ్యాపార వస్తువులవుతున్నంత కాలం వైరస్ లాంటి సూక్ష్మాతి సూక్ష్మజీవులు మనుషుల్ని వణికిస్తూనే వుంటాయి.
వ్యాసకర్త విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొ||యన్. వేణుగోపాలరావు