పేదల ఆకలి పట్టని రేషన్‌ డిపోలు

రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన పేదలకు ఉచిత బియ్యంతో పాటు రాయితీపై కందిపప్పు, పంచదారను కూడా సరఫరా చేయాల్సి ఉంది. కానీ గత నాలుగైదు నెలలుగా కార్డుదారులకు కేవలం ఒక్క బియ్యం మాత్రమే సరఫరా చేస్తూ కొన్ని ప్రాంతాల్లో అరకొరగా పంచదార ఇస్తున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి రేషన్‌ డిపోలు, గోదాముల్లో తనిఖీలు చేపట్టినప్పుడు పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనె ప్యాకెట్లు బరువు తక్కువగా ఉన్నట్లు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె ఇతర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఇదే సాకుగా చూపుతూ జ్యుడీషియల్‌ ప్రివ్యూ నుంచి అనుమతులు లభించిన తర్వాత కూడా కందిపప్పు టెండర్ల ప్రక్రియను ముందుకు తీసు కెళ్లకుండా పౌర సరఫరాల శాఖ నిలిపివేసింది. చక్కెర సరఫరాదారులు ఎక్కువ ధరలు కోట్‌ చేశారనే కారణంతో అధికారులు ఆ టెండరును కూడా రద్దు చేసేశారు. దీంతో గత మూడు నెలలుగా రాష్ట్రం మొత్తంగా పంచదార పంపిణీని కూడా నిలిపివేశారు. అనూహ్యంగా పెరు గుతున్న ధరలలో భాగంగా బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.200 దాటి పోగా… పంచదార కిలో దాదాపు రూ.50 పైమాటే చేరువైంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వస్తు దిగుమతులపై పన్నుల శాతాన్ని పెంచిన దరిమిలా వంటనూనెలు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వారు సత్వరం స్పందించి పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల నిత్యావసరాలను పూర్తి స్థాయిలో రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి.

– అప్పన్న గొనప

➡️