ఎర్ర జెండా రెపరెపలు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) 24వ అఖిల భారత మహాసభ తమిళనాడులోని మదురై నగరంలో విజయవంతంగా నిర్వహించడం ముదావహం. గత దశాబ్ద కాలంలో పార్టీ అనుసరించిన రాజకీయ విధానం, దాని అమలు తీరును ఆత్మవిమర్శనా పూర్వకంగా ఒక సమీక్షా నివేదికను రెండు నెలల ముందే పార్టీ శ్రేణులకు అందించి దానిపై శాఖ మొదలు అన్ని స్థాయిల్లో చర్చ అనంతరం మహాసభలో కూలంకషంగా చర్చించడం ప్రజాస్వామిక పని తీరుకు నిదర్శనం. రాజకీయ విధాన సమీక్ష ప్రాతిపదికగా రూపొందించిన రాజకీయ తీర్మానాన్ని బహిరంగంగా విడుదల చేసి సవరణలు, సూచనలు, సలహాలు ఆహ్వానించి, వాటిపైనా మహాసభ చర్చించింది. ఆమోదించిన రాజకీయ విధానాన్ని ఆచరణలోకి తేవడానికి పార్టీ నిర్మాణ పటిష్టత పెంచడానికి తీసుకోవలసిన చర్యలను గురించి నిర్మాణ నివేదిక మార్గ నిర్దేశనం చేసింది. ఈ మూడు డాక్యుమెంట్లపై కూలంకషమైన చర్చ సాగించి అన్నిటినీ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించడం ఒక ముందడుగు. ఆ రీత్యా ‘పార్టీ ఐక్యతకు పటిష్టతకు ఈ మహాసభ ప్రతీక’ (దిస్‌ ఈజ్‌ ఎ కాంగ్రెస్‌ ఆఫ్‌ యూనిటీ అండ్‌ కన్సాలిడేషన్‌) అని వ్యాఖ్యానించడం సరైనది. సిపిఐ(ఎం) స్వతంత్ర శక్తిని పెంచుకోవాలనీ వామపక్ష ఐక్యతను పెంపొందించాలని మహాసభ తీసుకున్న నిర్ణయం ఎంతో సబబైనది. సామ్రాజ్యవాదాన్ని, అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడిని నఖశిఖ పర్యంతం వ్యతిరేకించడం, సోషలిజం పట్ల మహాసభ అచంచల విశ్వాసం వ్యక్తం చేయడం కొనియాడదగినది. దేశంలో నయా ఫాసిస్టు ధోరణులు వ్యక్తమవుతున్నాయనీ కార్పొరేట్‌-మతతత్వ కూటమిని ఒంటరి చేసి ఓడించాలని మహాసభ ఏకగ్రీవంగా నిర్ణయించిన కీలక పిలుపు ఆచరణాత్మకమైనది. ఈనాటి పరిస్థితులను మార్చి శ్రమజీవుల రాజ్యానికి బాట వేసేందుకు అదే సరైన మార్గం!

అఖిల భారత మహాసభలో పార్టీ విధాన నిర్ణయాలు చేసే కేంద్ర కమిటీని, వాటిని అమలు చేయడానికి పొలిట్‌బ్యూరోను, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఎ బేబి ఎన్నికయ్యారు. 85 మందితో కూడిన కేంద్ర కమిటీలో 35 మంది కొత్తగా రావడం, అందులో మహిళలు, అణగారిన తరగతులకు చెందినవారి ప్రాతినిధ్యం పెరగడం శ్లాఘనీయం. పార్టీ నిబంధనలు అందరికీ శిరోధార్యమంటూ నిర్దేశిత వయసు మీరిన హేమాహేమీలు స్వచ్ఛందంగా తప్పుకొని తమ బాధ్యతలను తమకంటే చిన్నవారికి అప్పగించడం ఆ పార్టీకే చెల్లింది! కొన్ని ప్రధానమైన జాతీయ అంతర్జాతీయ సమస్యలపై వివిధ తీర్మానాలను మహాసభ ఆమోదించింది. తద్వారా పాలకుల విధానాలను ఎండగట్టడంతోపాటు ఆయా అంశాలపై పార్టీ వైఖరిని కూడా వెల్లడించింది.

భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో పార్టీ అఖిల భారత మహాసభలను మూడు సార్లు నిర్వహించిన ఘనత మదురై నగరానికి దక్కింది. మహాసభకు ముందు మదురైలో, తమిళనాట నలుదిక్కులా వివిధ సమకాలీన అంశాలపై 50కి పైగా సదస్సులు నిర్వహించారు. నిష్ణాతులైన నిపుణులూ ఉద్దండ రాజకీయవేత్తలూ వాటికి హాజరు కావడంతో రాష్ట్రమంతటా విస్తారమైన చర్చకు దోహదపడడం గమనార్హం. ఏప్రిల్‌ 3న ఫెడరలిజంపై జరిగిన సదస్సు వాటికి కొస మెరుపు! కేరళ, తమిళనాడు ముఖ్యమంత్రులు హాజరై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ట్రాలపట్ల అనుసరిస్తున్న వివక్షను ఎండగట్టారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను దెబ్బతీస్తున్న నిరంకుశ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకికవాదులు, దేశభక్తియుత శక్తులు ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. చెన్నై మహానగరంలో మహనీయుడు కారల్‌ మార్క్స్‌ విగ్రహాన్ని ప్రతిష్టిస్తామన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటన స్వాగతించదగినది. మహాసభ ముగింపుగా ఆదివారంనాడు మదురై అరుణార్ణవమైంది. భారీ బహిరంగసభ సిపిఐ(ఎం) ప్రతిష్టను ఇనుమడింపజేసింది. వేలాదిమంది యువతీ యువకులతో సాగిన ఎర్ర దండు కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముమ్మాటికీ ‘భవిష్యత్తు ఎర్ర జెండాదే’నని సిపిఐ(ఎం) అఖిల భారత మహాసభ చాటి చెప్పింది.

➡️