వక్ఫ్‌ చట్ట సవరణలు – తూతూ మంత్రంగా ప్రజాభిప్రాయ సేకరణ

వక్ఫ్‌ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి లక్షలాది ఎకరాల భూములను కాజేసే దురుద్దేశంతో కేంద్ర బిజెపి ప్రభుత్వం వక్ఫ్‌ చట్టానికి అనేక మౌలిక సవరణలను ప్రతిపాదించింది. ఇవి ఆమోదం పొందితే వక్ఫ్‌ ఆస్తుల స్వభావం పూర్తిగా మారిపోతుంది. వక్ఫ్‌ ఆస్తులు కలెక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సి వస్తుంది. ముస్లింల స్కూళ్లు, ఇతర విద్యాలయాలు, ధార్మిక సంస్థలు తమ ఆస్తులను కోల్పోవలసి వస్తుంది. వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ కూడా ముస్లింలకు సంబంధం లేకుండా చేసే అనేక సవరణలు ఇందులో ఉన్నాయి. పార్లమెంటులో వామ పక్షాలు, ‘ఇండియా’ బ్లాక్‌ పార్టీలు పెద్ద ఎత్తున ఈ సవరణలను వ్యతిరేకిస్తూ, ఆందోళన చేయటంతో ఈ బిల్లు జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీకి (జె.పి.సి) పంపబడింది. యథారూపంలో ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదింపచేసుకునే బలం బిజెపికి లేకపోవటం కూడా దీనిని జె.పి.సి కి పంపటానికి ఒక కారణం.
ఈ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ బిల్లు పట్ల లేనంతగా తొందర పడుతోంది. అందుకవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. ఒక నెలలో మూడు సార్లు జె.పి.సి ని సమావేశ పరచటం బహు అరుదుగా జరుగుతుంది. వక్ఫ్‌ సవరణలపై వేసిన జె.పి.సి లో స్టేక్‌ హోల్డర్ల అభిప్రాయాలను తీసుకోవాలని బలమైన అభిప్రాయం రావటంతో జెపిసి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాష్ట్రాలకు వచ్చి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని తీర్మానించింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రెండు ప్రభుత్వాల, మైనారిటీ సంఘాల, వాటి సంస్థలతో పాటు పెద్దల అభిప్రాయాలు ముస్లిం సంస్థలు ఇతర పెద్దల అభిప్రాయాలను సేకరిస్తామని జె.పి.సి తరఫున ప్రకటించింది. సెప్టెంబరు 28న హైదరాబాద్‌లోని తాజ్‌ బంజారా హోటల్‌లో జె.పి.సి సమావేశం జరగనున్నందున తమ అభిప్రాయాలను తెలిపేందుకుగాను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొంత మందిని ఎంపిక చేసింది. అధికారులు, రిటైర్డు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఎంపిక చేసి జె.పి.సి కి తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు అవకాశం కల్పించింది.
అయితే జె.పి.సి ఛైర్మన్‌, మెజార్టీగా ఉన్న బిజెపి ఎంపీలు ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఒక తూతూ మంత్రంగా మార్చేసి తమ అభిప్రాయాలనే ప్రజాభిప్రాయంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలనే పట్టుదలతో ఉన్నట్లుగా అర్ధమైంది. రిటైర్డు ఐఎఎస్‌ అధికారి, చాలా కాలం ఉమ్మడి రాష్ట్ర వక్ఫ్‌ బోర్డుకు స్పెషల్‌ ఆఫీసర్‌గా పనిచేసిన షఫిఖుజ్జమాన్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంపిక చేసి తమ వాదనలను వినిపించమని కోరింది. అయితే, జె.పి.సి ఛైర్మన్‌ ఆయనకు అడుగడుగునా అడ్డు పడుతూ తాము ఎంపీలమని, తమకు అన్ని విషయాలు తెలుసని, మీరు చెప్పింది చాలంటూ బలవంతంగా ఆయనను ఆపారు. జె.పి.సి లోని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజవాది పార్టీ, ఎం.ఐ.ఎం ప్రతినిధులు పెద్ద ఎత్తున గొడవ చేసి ఛైర్మన్‌ ముందుకు వచ్చి మీ వ్యక్తిగత ధోరణి వల్ల జె.పి.సి ఉద్దేశం నెరవేరకుండా పోతుందని, ఈ ఏకపక్ష ధోరణి నశించాలని నినాదాలు చేశారు. గొడవ చల్లారాక…ఈ సవరణలు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన రాయితీలకు వ్యతి రేకంగా ఉన్నాయని, ఎండోమెంట్స్‌ యాక్టును మార్చకుండా కేవలం వక్ఫ్‌ యాక్టును సవరించటం మైనారిటీల పట్ల వివక్షత చూపటమేనని ఆయన తిరిగి చెబుతూండగనే సమయం అయి పోయిందంటూ బలవంతంగా ఆపేశారు. మరల అందరూ గొడవ చేస్తే ఇతర ప్రతినిధులు రెండేసి నిమిషాల చొప్పున మాట్లాడవచ్చని అవకాశం కల్పించారు. మాజీ శాసనసభ్యుడిగా, బోర్డు సభ్యుడిగా నేను అవకాశం తీసుకొని ఈ సవరణలు రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు భిన్నమైనవని ఆర్టికల్‌ 26 ఎ, ఆర్టికల్‌ 30లలో మైనారిటీలకు కల్పించిన ప్రాథమిక హక్కును కాలరాస్తున్నాయని మాట్లాడుతుండగానే ఒక్క నిమిషం కూడా పూర్తి కాకముందే సమావేశం ముగిస్తున్నట్లుగా ఛైర్మన్‌ ప్రకటించారు. మిగతా సభ్యులు ఎంత గొడవ చేసినా వినకుండానే వారేం చెప్పబోతున్నారో, ఏం చేయాలో కూడా తనకు తెలుసని గట్టిగా తగవుకు దిగటంతో అభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది.
ఈ ప్రజాభిప్రాయ సేకరణకు వందలాది మంది ముస్లిం పెద్దలు రెండు రాష్ట్రాల నుండి హజరయ్యారు. కాని వారికి జె.పి.సి తో కలసి తమ అభిప్రాయాల్ని చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నోట్‌ ఏదైనా ఉంటే ఇచ్చిపోండని అధికారులతో చెప్పించారు. తెలంగాణ తరఫున హాజరైన పెద్దల అనుభవం కూడా ఇదే. విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా వైసిపి తరఫున కొంతమంది పెద్దలను ఈ ప్రజాభియ సేకరణకు హాజరయ్యేలా చూశారు. ప్రధానంగా రిటైర్డు ఐఎఎస్‌ అధికారి ఇంతియాజ్‌ ఈ సవరణలను వ్యతిరేకిస్తూ మాట్లాడుతుండగానే వారి పట్ల కూడా తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసిన జెపిసి ఛైర్మన్‌ మధ్యంతరంగానే వారిని ఆపివేశారని తెలుస్తున్నది.
31 మంది ఎంపీలు ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బసచేసి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను ఒక తంతుగా మార్చి…తమ అభిప్రాయాలను మెజారిటీ సభ్యుల నివేదికగా ఇవ్వటం ద్వారా…వచ్చే పార్లమెంట్‌ సమావేశంలో ఈ సవరణలను ఆమోదించేలా బిజెపి ముందస్తు ప్రణాళికతో ఉందని తెలుస్తున్నది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులుగా వెళ్లిన మమ్మల్ని ప్రతిపక్ష ఎంపీలు పక్కకు తీసుకువెళ్లి కనీసం మహారాష్ట్ర ఎన్నికలు అయ్యేంత వరకైనా ఈ బిల్లు పార్లమెంట్‌కు రాకుండా సి.ఎం చంద్రబాబు ఒత్తిడి చేసేలా చెప్పమని కోరారు. వైసిపి వ్యతిరేకిస్తున్నందున తెలుగుదేశం కూడా అదే వైఖరి తీసుకుంటే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందదు. మరి టిడిపి ఏ వైఖరి తీసుకుంటుందోనని ముస్లిం ప్రజలు ఎదురు చూస్తున్నారు.

వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్‌

➡️