కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తాజా చర్య! కోల్‌కతాలోని ఆర్‌జి కార్ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్‌పై జరిగిన అమానుష కాండ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆ దారుణం జరిగినప్పటికీ ఇంత వరకు నేరస్తులెవరో తేలలేదు. మరోవైపు దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రమౌతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సూమోటోగా ఈ కేసును విచారణకు తీసుకుంది. విచారణ ప్రారంభించిన మొదటి రోజే ‘మరో అత్యాచారమో… హత్యో జరిగేంతవరకు చూస్తూ ఊరుకోవాలా..?’ అని ప్రశ్నించింది. ఈ పరిణామాలన్నీ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా మహిళల పనిగంటలు తగ్గించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘సాధ్యమైనంత వరకు మహిళలకు రాత్రి డ్యూటీని నివారించాలి’ అని మార్గదర్శకాలను జారీ చేసింది. భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఇది మహిళల ఉపాధి అవకాశాలపై గొడ్డలి వేటుగా మారనుంది. మహిళలకు అరకొరగా ఉన్న ఉపాధి అవకాశాలను సైతం ఈ నిర్ణయం గండి కొడుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, మమతా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తిరోగమన చర్య. మభ్య పెట్టే ఈ తరహా విధానాలకు బదులు అసలైన రక్షణ చర్యలు తీసుకోవాలి.
నయా ఉదారవాద, ఆర్థిక విధానాల ఫలితంగా కుటుంబంలోని భార్య, భర్త ఇద్దరూ పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అనివార్యంగా మహిళలు కూడా ఏదో ఒక పనిచేయాల్సి వస్తోంది. కోల్‌కతా వంటి మహానగరంలో వైద్య ఆరోగ్య రంగంతో పాటు, గిగ్ వర్కర్లు, ఫ్యాక్టరీలు, కాల్ సెంటర్లు, హోటళ్లు, పారిశుధ్య కార్మికులుగా లక్షలాది మంది మహిళలు పనిచేస్తున్నారు. ఆటో డ్రైవర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా పురుషులతో సమానంగా రాత్రి పూట కూడా వీరు పనుల్లో భాగస్వాములవుతున్నారు. ‘ఎక్కడైనా.. ఎప్పుడైనా’ వీరందరికి సురక్షిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆ పని చేయడానికి బదులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేతులెతేస్తోంది. మరో విధంగా చెప్పాలంటే మహిళలు ఇళ్లనుండి బయటకొచ్చి రాత్రిపూట పనిచేస్తున్నారు కాబట్టే, అత్యాచారాలు జరుగుతున్నాయన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇది ఒక రకంగా సంఫ్‌ుపరివార్ వాదనే! ఈ నిర్ణయంతో మహిళల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా కుదించుకుపోతాయి. అంతిమంగా శ్రామిక శక్తి నుండి మహిళలను దూరం చేస్తుంది. అదే సమయంలో వేధింపులు, అత్యాచారాల నుండి మహిళలకు లభించే భద్రత మాత్రం ప్రశ్నార్థకమే! పగటి పూట వేధింపులు జరగవన్న గ్యారంటీ ఏమిటి? రాత్రి పూట ఇళ్ళ వద్ద ఉన్నా భద్రత ఉంటుందన్న నమ్మకం ఏమిటి?
మహిళలు రాత్రి పూట పనిచేయడంపై చర్చ ఇప్పటిది కాదు. స్వాతంత్య్రానికి పూర్వమే రామ్ చంద్ వర్సెస్ మథురా చంద్ కేసులో న్యాయస్థానం భద్రత సాకుతో మహిళలను నైట్‌డ్యూటీల నుండి దూరం పెట్టడాన్ని తప్పు పట్టింది. స్వాతంత్య్రం తరువాత కూడా అత్యున్నత న్యాయస్థానం ఇదే స్ఫూర్తిని కొనసాగించింది. కె.ఎస్ త్రివేణి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆర్ వసంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. ఎటువంటి వివక్షా లేని సమానత్వాన్ని ఆర్టికల్ 14 దేశ ప్రజలందరికీ దఖలు పరుస్తోందని స్పష్టం చేసింది. ఫ్యాక్టరీస్ యాక్ట్‌లో దీనికి భిన్నంగా ఉన్న నిబంధనలను కొట్టివేసింది. ఈ తీర్పుల స్ఫూర్తితో పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు (నివారణ, నిషేధం, పరిహారం) చట్టం 2013, లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 రూపొందాయి. ఇప్పటికీ వీటి అమలు అంతంత మాత్రమే! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాల మేరకైనా భద్రతా చర్యలను తక్షణం అమలుచేయాలి. అమలు చేయని సంస్థలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలపట్ల హింసకు, దౌర్జన్యాలకు, లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి.
