మత విద్వేషం

Jan 12,2025 05:56 #Articles, #edit page

పావురాలు స్వేచ్ఛగా ఎగురుతుంటాయి. ‘మనం గుడి, మసీదు, చర్చి, గురుద్వారాలన్నిటి మీదా వాలుతాం. అక్కడ కనిపించిన గింజలు ఏరుకుని తింటాం. మనలాగే మనుషులు కూడా వాటిలో తిరుగుతూ…ప్రార్థనలు చేస్తుంటారు కానీ, వాళ్లలో వాళ్లు తన్నుకుంటారెందుకు? మన పావురాల్లో అలాంటి కొట్లాటలు, రాళ్ళు విసరడాలు, నరికి చంపడాలు ఉండవు కదమ్మా?’ అని ఓ బుల్లి పావురం తల్లి పావురాన్ని అడిగిందట. ‘మనం మనుషుల కన్నా ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్ళం. పైపైకి ఎగిరినకొద్దీ అందమైన, అద్భుతమైన దృశ్యాల్ని చూస్తాం! మనది స్వేచ్ఛా ప్రపంచం. జీవరాశులన్నింటిలోనూ మనుషులు వివేకం, విజ్ఞానం కలిగినవాళ్లే గానీ…వాళ్ల చుట్టూ కుల, మత, జాతి, లింగ, వర్గ, వర్ణ, ప్రాంతాల వంటి ఎత్తైన అడ్డు గోడలు కట్టుకుని, తమ వివేకానికి, విజ్ఞానానికి మకిలి పట్టించుకుంటున్నారు’ అని చెప్పింది తల్లి పావురం. ‘మతము మత్తుగూర్చు మార్గమ్ము కారాదు/ హితముగూర్చవలయు నెల్లరకును/ హితము గూర్పలేని మతము మానగవలె’ అంటారు పోతులూరి వీరబ్రహ్మం. మతం మనుషుల్ని కలపాలేగాని, ద్వేషం పెంచేదిగా వుండరాదు. మతం మనుషుల మధ్య వుండే అడ్డుగోడల్ని పగులగొట్టాలి.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో గత దశాబ్ద కాలంగా మనుషుల్ని విభజించే, భయాన్ని సృష్టించే, మన సమాజంలోని పెద్ద సెక్షన్‌ ను వేరు చేసే విద్వేష రాజకీయాలను చూస్తున్నాం. ‘రామరాజ్యమంటే నా దేశం హిందూ రాజ్యం కాదు. రామరాజ్యమంటే దైవ పాలన. భూమిపై దేవుని రాజ్యం’ అంటారు గాంధీజీ. కానీ, భారత దేశాన్ని విద్వేష సునామీ ముంచెత్తుతోంది. సామాజిక జీవనంలో మత విద్వేషం బుసలు కొడుతున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ‘ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌’ తాజా నివేదిక వెల్లడించింది. 198 దేశాల్లో ‘సామాజిక వర్గాల మధ్య శత్రుత్వ భావన (ఎస్‌హెచ్‌ఐ)’ అన్న అంశంపై అధ్యయనం చేసిన ‘ప్యూ’ సంస్థ తాజా ఇండెక్స్‌ ప్రకారం భారత్‌ 9.3 పాయింట్లతో తొలి స్థానంలో ఉండటం అత్యంత విషాదం. 2024కి సంబంధించి దేశంలోని ప్రముఖ ఆంగ్లపత్రికల క్లిప్పింగ్‌లను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా మతపరమైన హింసాకాండ 84 శాతం పెరిగిందని ‘సెంటర్‌ స్టడీ ఆఫ్‌ సొసైటీ అండ్‌ సెక్యులరిజం’ నివేదిక తెలిపింది. 2024 లోనే భారత్‌లో క్రైస్తవులపై 834 దాడులు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని యూసీఎఫ్‌ విడుదల చేసిన సమాచారం బట్టి తెలుస్తోంది. ఈ మధ్యనే కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌ సాక్షిగా అంబేద్కర్‌పై విషం చిమ్మిన సంగతి తెలిసిందే. ఇక ప్రధాని మోడీ.. దేశంలోని ముస్లింలు, మైనారిటీలకు వ్యతిరేకంగా చేసిన విద్వేష ప్రసంగాలు కోకొల్లలు. మతోన్మాద ఘటనలు నానాటికీ పెరుగుతున్నాయన్నది మన జీవితానుభం. ఇది మెజార్టీ లేదా మైనార్టీ మతోన్మాదం ఏదైనా ప్రమాదకరమే!

సమాజంలోని మనమంతా ఒక్కటే. మనకు కావాల్సింది సమతా ధర్మం. ఏ మతాన్ని విశ్వసిస్తారు, ఏ దేవుడ్ని పూజిస్తారన్నది వ్యక్తిగతం. అది ఇంటి లోపలే వుండాలి. గడప దాటితే మనమంతా భారతీయులం. ఎవరి స్వేచ్ఛ వారిది. కాదనే హక్కు ఎవరికీ లేదు. ‘మతమన్నది నా కంటికి మసకైతే/ మతమన్నది నా మనసుకు మబ్బయితే/ మతం వద్దు గితం వద్దు-మాయా మర్మం వద్దు’ అన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి మానవత్వంపై నమ్మకమున్న కవి. కనుకనే మతాన్ని తీవ్రంగా నిరసించాడు. అసలైన దేశభక్తి మనుషులను ప్రేమించడంలో ఉందని-‘అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నీ మెలగవలెనోయి/మతం వెరైతేను యేమోయి/ మనసులొకటై మనుషులుంటే’ అని వందేళ్ల కిందటే మహాకవి గురజాడ చెప్పిన మాటలు ఇంకా మతోన్మాదుల బుర్రకెక్కలేదు. ‘బతకడమే సమస్యగా/ పరిణమింప జేసినట్టి/ అన్యాయాలన్నిటినీ/ హతమార్చాలంటాడు’ మహాకవి శ్రీశ్రీ. మత విశ్వాసాన్ని, మత విద్వేషాన్ని వేర్వేరుగా చూడాలి. ‘గడప లోపలే మతం, కులం. గడప దాటితే మనమంతా హిందువులం’ అని చెప్పడంలోనే బిజెపి ద్వంద్వనీతి వుంది. ఇలా చెప్పడమంటే…కుల, మత విద్వేషాన్ని చిమ్మడమే.

➡️