సంయమనం అవసరం

Sep 27,2024 05:55 #Articles, #edite page, #Tirupati, #TTD LADDU

తిరుపతి లడ్డూ – కల్తీ నెయ్యి అంశంపై వారం రోజులుగా చర్చ సాగుతోంది. నిజానిజాలను నిర్ధారించి, కారకులపై చర్యలు తీసుకోవడంపై చూపాల్సిన శ్రద్ధను- అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానిపై ఒకటి తీవ్రమైన నిందారోపణలు చేసుకోవటంపైనే ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. భక్తుల మనోభావాలు, క్షేత్ర పవిత్రత అంటూ పైకి చెబుతూనే మత వైషమ్యాలను రెచ్చగొట్టే సంఘ్ పరివార్‌ శక్తులకు ఊతమిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక మంది సందర్శించే తిరుపతి – తిరుమల క్షేత్రంలో ఇచ్చే లడ్డూ ప్రసాదం అనేకమంది భక్తుల మనోభావాలు, నమ్మకాలతో ముడిపడినది. అందులో వాడాల్సిన అన్ని రకాల దినుసులూ నాణ్యంగా ఉండాలి. తిరుమల క్షేత్రంలోనే కాదు; ఎక్కడైనా సరే ప్రసాదంగానో, ఆహారంగానో ఇచ్చే ఏ పదార్థమైనా కల్తీ కాకుండా ఉండాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు నిర్ధారించాల్సిన యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలి. ఏ దినుసులో నాణ్యత లోపించినా, కల్తీ కనిపించినా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి. ఆయా దినుసులను వాడకంలోకి వెళ్లకుండా నిలిపివేసి, సరఫరా సంస్థలపైనా, నిర్లక్ష్యం వహించిన వ్యక్తుల పైనా తగు చర్యలు తీసుకోవాలి. భక్తుల మనోభావాలను గౌరవించాలన్నా; పౌరుల ఆహార నాణ్యతకు, ఆరోగ్య భద్రతకు రక్షణ కల్పించాలన్నా – ఇదీ, పాటించాల్సిన పద్ధతి!
అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం… తిరుమల క్షేత్రంలో ఇలాంటి తనిఖీ, నియంత్రణ వ్యవస్థలు చాలా ఏళ్లుగా అమలులో ఉన్నాయి. సరఫరా సంస్థలు పంపే దినుసులు నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయా? లేదా? అని తనిఖీ చేసి, సరిగ్గా ఉన్నవాటిని స్వీకరించటం, లేనివాటిని వెనక్కు పంపటం చేస్తున్నాయి. గతంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు, అవి నియమించిన పాలకవర్గాలూ అధికారంలో ఉన్నప్పుడు ఇలా నాణ్యత లేని నెయ్యిని తిప్పి పంపిన ఉదంతాలు ఉన్నాయని చెబుతున్నారు. తనిఖీ వ్యవస్థ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యమూ లేదా ఉద్దేశపూర్వక విస్మరణ ఎక్కడ, ఏ దశలో జరిగినా గుర్తించటం చాలా సులభం. కారకులను గుర్తించి చర్యలు తీసుకోవడం కూడా సులభం. ఈ పనులన్నీ చేయటానికి అధికారిక వ్యవస్థలూ, దొంతరలూ తిరుమలలో నడుస్తూనే ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం వీటి ఆధ్వర్యాన సమస్యను సరిచేయాలి తప్ప వివాదాస్పదం చేయడం తగదు. మనోభావాలను గాయపరిచే, మత వైషమ్యాలను రెచ్చగొట్టే పరిభాషను ఎంచుకోవటం మరీ ప్రమాదకరం. కల్తీని కనుక్కోవటానికి, కారకులను శిక్షించటానికి రాజ్యాంగబద్ధమైన పద్ధతులను అవలంబించాల్సిన ఉప ముఖ్యమంత్రి ఏకంగా మత వైషమ్యాలను రెచ్చగొట్టే మాటలతో లడ్డూ అంశాన్ని మరింత వివాదాస్పదం చేశారు. కొన్ని మతాలను, ఆ మతస్తుల ప్రార్థనా స్థలాలను ప్రస్తావించారు. ఇలా వైషమ్యాలను సృష్టించటం అభ్యంతరకరం. చాలా సాధారణంగా, సరళంగా పరిష్కరించాల్సిన అంశానికి మతపరమైన ఉద్రేకాలను, ఉద్రిక్తలను అంటుగట్టి, రాష్ట్రంలో మతోన్మాద శక్తుల వీరంగానికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద పొరపాటు. అధికార టిడిపి- జనసేన, ప్రతిపక్ష వైసిపి ఈ విధమైన పొరపాట్లతో సామరస్యానికి చేటు తెస్తున్నాయి. ఒక పార్టీ ప్రాయశ్చిత్తమంటే- మరొక పార్టీ దేవాలయాల్లో పూజలు చేస్తామంటూ ప్రకటించింది. రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రజలను పట్టి పీడిస్తున్న జీవనోపాధికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి తప్ప వ్యక్తిగత మత విశ్వాసాలపై కాదు. మతాన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవటంపై అసలే కాదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, వరద బాధితులకు కేంద్ర సహాయంలో నిర్లక్ష్యం తదితర అనేక ప్రజా సమస్యలు పక్కకుపోతున్నాయి. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మతోన్మాదాన్ని ఎగదోసి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి – ఆర్‌ఎస్‌ఎస్‌ పొంచి చూస్తున్నాయి. అంతర్వేది, రామతీర్థం తదితర అంశాలను ఎంచుకొని ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. ఇలాంటి కుయుక్తులపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన తరుణంలో తిరుపతి లడ్డూ అంశాన్ని రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు, సామరస్యానికీ ప్రమాదకరం. సిట్‌ నివేదిక వచ్చేవరకూ రాజకీయ పార్టీలు లడ్డూ అంశంపై ఎలాంటి ఉద్రేక ప్రకటనలూ చేయకుండా సంయమనం వహించాలి.

➡️