మరి కొద్ది వారాల్లో ఉక్రెయిన్-రష్యా సంక్షోభం నాలుగో సంవత్సరంలో ప్రవేశించనుంది. ఒప్పంద గడువు ముగియటంతో తూర్పు ఐరోపా దేశాలకు సరఫరా అవుతున్న రష్యా సహజవాయువును తమ భూభాగంలోని పైప్‌లైన్ నుంచి జనవరి ఒకటి నుంచి నిలిపివేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఒప్పంద పునరుద్ధరణ సంప్రదింపులకు ససేమిరా అంది. ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మకమైనదిగా వర్ణించింది. ఈ చర్య ద్వారా రష్యాను ఆర్థికంగా దెబ్బ తీసి, పోరు నిలిపివేసేందుకు ఒత్తిడికి పూనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అనేక ఐరోపా దేశాలు ఆంక్షల అమల్లో భాగంగా రష్యా నుంచి గ్యాస్ కొనుగోళ్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. చట్టపరంగా లేదా సాంకేతికంగా చేయగలిగిందేమీ లేదని రష్యా పేర్కొన్నది. ఈ పరిణామంతో ఇప్పటికే గణనీయంగా పడిపోయిన ఎగుమతులు మరింతగా తగ్గనున్నాయి. దీని వలన రష్యాకు జరిగే నష్టం కంటే గ్యాస్ దిగుమతి చేసుకొనే దేశాల మీద ఆర్థిక భారం పడనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. మూడు సంవత్సరాలుగా పశ్చిమ దేశాలు అమలు జరుపుతున్న ఆంక్షల వలన తనదైన తీరులో పుతిన్ పరిస్థితికి తగినట్లుగా కొత్త మార్కెట్లను వెతుకుతున్నాడు. ఈ పైప్‌లైన్ ద్వారా రష్యాకు ఏటా ఐదు బిలియన్ డాలర్లు, ఉక్రెయిన్‌కు ఒక బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చేది. టర్కీ ద్వారా మరోపైప్ లైన్ ద్వారా సరఫరా అవుతున్న రష్యన్ గ్యాస్‌కు ఎలాంటి అంతరాయం లేదు. ఐరోపాకు రష్యా నుంచి జరుగుతున్న 35 శాతం సరఫరాలకు ఇప్పుడు పదికి పడిపోయాయి. తమ రెండు దేశాల మధ్య సాగుతున్న పోరుకు త్వరలో ముగింపు పలకనున్నట్లు రష్యా అధినేత పుతిన్, ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ 2024 సంవత్సర ముగింపులో ప్రకటించారు తప్ప ఎలా అన్నది చెప్పలేదు.తాను అధికారానికి వచ్చిన 24 గంటల్లోనే ఉక్రెయిన్ పోరుకు స్వస్తి పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. మరోవైపు పదవి నుంచి దిగిపోతున్న తరుణంలో జో బైడెన్ ఉక్రెయిన్‌కు పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటు ఆరుబిలియన్ డాలర్ల గ్రాంట్ అందచేయనున్నట్లు ప్రకటించాడు.
మూడు సంవత్సరాల సైనిక చర్యను చూసినపుడు పశ్చిమ దేశాల మీడియా ఎన్నిక కట్టుకథలు చెప్పినప్పటికీ ప్రారంభ దినాలతో పోలిస్తే రష్యా ఆధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్ ప్రాంతాలు పెరిగాయి. జనం నమ్మక పోవటంతో ఇప్పుడు తగ్గించాయి. రష్యా 2023లో స్వాధీనం చేసుకున్న విస్తీర్ణంతో పోల్చితే 2024లో ఏడు రెట్లు అదనంగా నాలుగు వేల చదరపు కిలోమీటర్లలో చొచ్చుకు పోయింది. ప్రారంభంలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకుండా వేగాన్ని తగ్గించి మెల్లమెల్లగా ముందుకు పోతున్నది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తున్నది. గతేడాది ఎదురు దాడులకు దిగిన ఉక్రెయిన్ తన సరిహద్దు సమీపంలోని రష్యాలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడే తిష్టవేసింది. మూడు సంవత్సరాల రష్యా దాడులకు కొత్త సంవత్సరంలో స్వస్తి పలుకుతామని, ఈ ఏడాది తమదే అని జెలెన్‌స్కీ నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నాడు. ఈ పోరులో అమెరికా తమవెంటే ఉందన్నాడు. తమ భూభాగం నుంచి గ్యాస్ రవాణా నిలిపివేత రష్యాకు అతి పెద్ద ఓటమి అన్నాడు. నూతన సంవత్సరంలో పరిస్థితి నాటకీయంగా మారిపోతుందని పుతిన్ వార్షిక విలేకర్ల సమావేశంలో చెప్పాడు. మూడేళ్ల పోరులో పది లక్షల మంది మరణించటం లేదా గాయపడినట్లు, ఉక్రెయిన్ ఓటమి బాటలో ఉన్నట్లు బిబిసి పేర్కొన్నది. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ చేసిన ప్రకటన మీద సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే పైకి ఏం మాట్లాడినప్పటికీ విశ్వసనీయత లేని ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. తొలి విడత అధికారానికి వచ్చినపుడు నాటో ఏర్పాటుతో లబ్ధి పొందుతున్నది ఐరోపా కాగా దాని కోసం తామెందుకు ఖర్చు పెట్టాలంటూ ట్రంప్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీరుతో గడచిన నాలుగు సంవత్సరాలుగా అనేక దేశాలు నాటో కూటమితో పాటు తమ మిలిటరీ బడ్జెట్‌లను కూడా గణనీయంగా పెంచాయి. ఉక్రెయిన్ పోరులో ఉక్రెయిన్ ఓడిపోతే ఐరోపా దేశాలకు రష్యా నుంచి ముప్పు పెరుగుతుందని అమెరికా భయపెడుతోంది. అయితే అవగాహనకు విరుద్ధంగా ఉక్రెయిన్‌కు నాటో తీర్ధమిచ్చి తమ ముంగిట్లోకి ముప్పు తెస్తున్నారనే కారణంతోనే అడ్డుకొనేందుకు పుతిన్ సర్కార్ మిలిటరీ చర్యకు పూనుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ పైకి ఏమి చెప్పినప్పటికీ నాటో రంగం నుంచి అమెరికా తగ్గి ఐరోపాను స్వతంత్రంగా పని చేయనివ్వటం కలలో మాట. పశ్చిమ దేశాలను ఎదుర్కొనేందుకు రష్యా-చైనా మరింత సన్నిహితం అవుతున్నాయి. ఈ పూర్వ రంగంలో ట్రంప్ యంత్రాంగం అదిరించి బెదిరించి ఐరోపాను తమ పరిధిలో ఉంచుకుంటుంది తప్ప వదలి వేసే అవకాశమే లేదు.
– ఫీచర్స్ అండ్ పాలిటిక్స్