పార్లమెంటు 1991లో రూపొందించిన ప్రార్థనా స్థలాల చట్టం (ప్రత్యేక నిబంధనలు) ప్రాధాన్యత ఏమిటో ఇటీవల సంభవించిన సంభాల్ మసీదు ఘటనలు, అయిదుగురు ముస్లిం యువకుల మరణాలు నొక్కిచెప్పాయి. ఏదైనా ప్రార్థనా స్థలం మార్పిడి (సెక్షన్3)ని ఆ చట్టం నిషేధిస్తున్నది. ‘ఏదైనా ప్రార్థనా స్థలం 1947 ఆగష్టు 15వ తేదీన మత పరంగా ఎలాంటి స్వభావం కలిగివుందో దాని కొనసాగింపు’ (సెక్షన్ 8) జరగాలని చెబుతున్నది. ఏ వ్యక్తి అయినా ‘ఏ మత సంబంధమైన లేదా అందులో ఒక తరహాకు చెందిన ప్రార్థనా స్థలాన్ని గానీ లేదా అందులో కొంత భాగాన్ని కానీ అదే మతానికి సంబంధించిన మరో విశ్వాసానికి లేదా మరో మతానికి మార్చడం’ కుదరదని చెప్పింది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని మాత్రం ఈ చట్టం పరిధిలోకి తీసుకోకుండా మినహాయింపునిచ్చింది.
2019లో అయోధ్య వివాదంపై వెలువడిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు కూడా ప్రార్థనా స్థలాల చట్టం చెల్లుబాటును పునరుద్ఘాటించింది. ప్రస్తుతమున్న ప్రార్థనా స్థలాలకు వ్యతిరేకంగా ఎలాంటి దావాలను స్వీకరించడానికి లేదని ప్రకటించింది. అయితే 2022 మే నెలలో సుప్రీం కోర్టు వారణాసి లోని గ్యానవాపి మసీదు సర్వేకు అనుమతినిచ్చింది. ఒక ఆలయ శిథిలాలపై ఆ మసీదు నిర్మించబడిందని జిల్లా కోర్టులో దాఖలైన ఒక పిటిషన్ పేర్కొంది. అప్పుడు సిజెఐ గా వున్న చంద్రచూడ్ అధ్యక్షతనగల ధర్మాసనం సర్వేను కొనసాగించడానికి అనుమతినిచ్చింది. ఒక మత ప్రదేశం స్వభావం ఏమిటో కనుగొనడం 1991 చట్టం కింద నిషేధించబడలేదని అభిప్రాయపడింది. పిపిటిషన్‌దారుడు 1947 ఆగష్టు 15వ తేదీ నాటికి ఆ ప్రార్థనా స్థలం పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారే గానీ చట్టం చెప్పిన ప్రకారం దాని స్వభావాన్ని మార్చడం లేదా మార్పిడి చేయడం జరగాలని కోరడం లేదని కూడా కోర్టు భావించింది.
మసీదు వివాదాల ప్రజ్వలన
సందేహాస్పదమైన ఈ తీర్పుతో ఎక్కడెక్కడ మసీదులు వున్నా వివాదాలు రగిలించేందుకు హిందూ మతతత్వ వాదులకు తలుపులు బార్లా తెరచినట్టయింది. గ్యానవాపి మసీదు సర్వే కోర్కె తర్వాత మధుర ఈద్గా మైదానంలోనూ అలాంటి కేసే రాగ్తా జిల్లా కోర్టు సర్వేకు ఉత్తర్వునిచ్చింది. ఆ వరుసలో తర్వాత సంభాల్ వచ్చి చేరింది. 1526లో మొఘల్ యుగంలో నిర్మించిన ఈ మసీదుపై విష్ణుశంకర్ జైన్ అనే ఒక న్యాయవాది అభ్యర్థనపై నవంబరు 19న జిల్లా కోర్టు సర్వేకు అనుమతినిచ్చింది. అంతకు ముందు మధుర, వారణాసిలపై జిల్లా కోర్టులో పిటిషన్లు వేసింది కూడా ఈయనే. ఆ మసీదు రక్షిత కట్టడంగా వున్నప్పటికీ ఆ దరఖాస్తుకు వెంటనే అనుమతి లభించింది. దిగ్భ్రాంతి కలిగించేంత వేగంతో కోర్టు న్యాయవాదుల కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజే సర్వే చేయాలని చెప్పింది. నవంబరు 29న సర్వే నివేదిక ఇవ్వాలన్నది. మసీదు కమిటీ వాదన సరిగా వినిపించడానికి కూడా సమయం ఇవ్వలేదు.
మసీదు కమిటీ పూర్తి సహకారంతో సర్వే పూర్తయింది. అయితే నవంబరు 24న మరోసారి సర్వే చేయాలని సర్వే బృందం అక్కడకు చేరుకుంది. అయితే ఈసారి వారితో పాటు పోలీసులేగాక ‘జై శ్రీరాం’ అని నినాదాలిస్తూ భారీ జన సమూహం కూడా వచ్చింది. ముస్లింలు కూడా సమీకృతులయ్యారు. కొద్ది సేపట్లోనే పరిస్థితి అదుపు తప్పిపోయింది. రాళ్లు రువ్వడం లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం కాల్పుల దాకా వెళ్లింది. తుపాకి తూటాలు తగిలి ముగ్గురు ముస్లిం యువకులు కాల్పుల్లో చనిపోగా మరో ఇద్దరు తర్వాత గాయాలతో మరణించారు. స్థానిక సమాజ్‌వాది పార్టీ ఎంపీి, ఆయన కుమారుడు అల్లర్లు, హింసాకాండ రెచ్చగొట్టారంటూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.
ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఏదో ఒక సాకుతో ముస్లింలపై దాడికి దిగడం పూర్తి స్థాయిలో సాగిపోతున్నది. కొద్ది వారాల కిందట బV్‌ారైచ్‌లో జరిగిన మత హింసాకాండ ముస్లింలపై నిర్బంధానికి దారితీసింది. డజన్ల కొద్ది ముస్లిం పురుషులను అరెస్టు చేశారు. హిందూత్వ సంస్థలు అనేక మసీదులను టార్గెట్ చేసుకుని లీగల్ వివాదాలను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి.
సుప్రీంకోర్టు తక్షణ జోక్యం
సంభాల్‌లో 16వ శతాబ్ది నాటి మసీదు వివాదం రగిలించేందుకు జరిగిన ప్రయత్నాలకు నాయ వ్యవస్థ కుమ్మక్కు దోహదపడింది. యు.పి లోని స్థానిక కోర్టులలో (వారణాసి, మధుర తర్వాత ఇప్పుడు సంభాల్ లో) మనం చూసింది ఒక క్రమపద్ధతిలో సాగుతున్నదే. హిందూ ఆధిక్యత నెలకొల్పడం కోసం శతాబ్దాల నాటి మసీదులను రణరంగాలుగా మార్చడం. ఇందులో అత్యంత ఆందోళనకరమైన అంశమేమంటే సాక్షాత్తూ సుప్రీం కోర్టు జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో అవకాశం కల్పించడం. అందుకోసం అంతకు ముందు తనే అందరూ అమలు చేయాలని ఆదేశించిన చట్టాన్ని బేఖాతరు చేయడం. వినాశకరమైన ఈ పంథాను వెనక్కు కొట్టాలంటే సుప్రీం కోర్టు తక్షణం జోక్యం చేసుకోవాలి. ఒక ప్రార్థనా స్థలంలో 1947 ఆగష్టు 15వ తేదీ తర్వాత ఎలాంటి న్యాయ వివాదాలకు అవకాశం లేదని చెబుతున్న ప్రార్థనా స్థలాల చట్టం శిరోధార్యతను గట్టిగా చెప్పడం జరగాలి.
(నవంబరు 27 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)