సనాతన మనుధర్మమా? సామాజిక సమధర్మమా?

పది రోజులుగా తిరుపతి లడ్డు చుట్టూ పరిభ్రమిస్తున్న వివాదాలు పాలక వర్గ పార్టీల రాజకీయాల తీరునూ, మోడీ హయాంలో ప్రబలిపోయిన మత రాజకీయాల లోతునూ బహిర్గతం చేశాయి. తిరుపతి కొండపై అనేక రకాల అక్రమాలనూ అందులో భాగంగా ఈ కల్తీ దుమారాన్ని కూలంకషంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలనడంలో సందేహం లేదు. కొండ మీద మంట అన్నట్టు ఇలాంటి మతలబులు ఇదే మొదటిసారి కాదు, చివరి సారీ కాకపోవచ్చు. దేశంలోని ఆలయాలన్నిటా ప్రసాదాల కల్తీ జరుగుతూనే వుందని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వయంగా వారణాసి లోనే వాకృచ్చారు. యోగి ఆదిత్యనాథ్‌ ఏలుబడిలో ప్రస్తుతం ప్రయాగరాజ్‌గా మారిన త్రివేణీ సంగమంలో ఆలయాలలో కాశీ, మధుర అన్ని చోట్ల అదే పరిస్థితి దాపురించడం వెనక అంతర్జాతీయ కుట్ర దాగి వుందని అయోధ్య రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్రనాథ్‌ దాస్‌ ప్రకటించారు. కాస్త వెనక్కు వెళితే తిరుపతి లడ్డూ కోసం కర్ణాటక పాల ఉత్పత్తిదార్ల సంఘం (కె.ఎం.ఎఫ్‌) నెయ్యి సరఫరా కాకపోవడం హిందూ వ్యతిరేక చర్య అని ఏడాది కిందటే బిజెపి ఆ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై దాడి చేస్తే అది మీ హయాంలోనే జరిగిందని ఆయన ఎదురు వడ్డించారు. కనుక ఈ కథకు ముందూ వెనకా చాలా తతంగం వుంది. చాలా శక్తులూ వున్నాయి. అవి ప్రజలందరూ ఇష్టంగా తినే తియ్యనైన లడ్డూతో సంబంధం లేనివి. కాకపోతే ఈ వివాదం కూడా చినికి చినికి గాలివానగా అదే దారి పట్టడం వల్ల వాటిని ముచ్చటించాల్సి వచ్చింది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానమే దీనిపై మూడు పిటిషన్లను రేపు విచారించనుంది గనక పరిష్కారం ఏం చూపిస్తుందో వేచిచూడొచ్చు. ఈ లోగా ముఖ్యమంత్రి నియమించిన సిట్‌ దర్యాప్తు ప్రారంభించింది గనక అదేం తేలుస్తుందో, కోర్టు దానికి ఏమి చెబుతుందో కూడా చూడాలి. ఈ లోగా సంయమనం పాటించడం అందరి బాధ్యత.

పరివార్‌ భాషలో పవన్‌
కాకపోతే ఈ లోగా రాజ్యాంగ పదవిలో వున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆవేశ భాషణలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్య పరచాయి. తెలుగునాట బాధ్యతాయుత పదవిలో వున్న ఒక బిజెపి యేతర నాయకుడి నోట అలాంటి మాటలు వినడం చాలా అరుదు. ఆఖరుకు బిజెపి నాయకులు కూడా ఈ విషయంలో అప్పటికి ఆ విధంగా మాట్లాడలేదు. లౌకికవాదంపై లౌకిక వాదులపై దాడి చేయడానికి పవన్‌ కళ్యాణ్‌ లడ్డూ వివాదం ఉపయోగించుకోవడం జనసేన అధ్యక్షుడి ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో తొంగిచూసింది. ఈ సందర్భంగా ఆయన ప్రయోగించన భాష సంఘ పరివార్‌ ఘనాపాటీలను మించిపోయిందంటే అతిశయోక్తి కాదు. హిందువుల మనోభావాలపై దాడి జరిగితే ఎవరికీ కనిపించదని ఆయన ఆక్రోశం వెలిబుచ్చారు. ఇదే మసీదులోనో చర్చిలోనో జరిగితే ఇలా వుంటారా అని ఇతర మతాల ప్రార్థనా స్థలాలను పోటీకి తెచ్చారు. ఇతర మతాలపై జరిగితే విమర్శలు కురిపించే లౌకిక వాదులు హిందువులపై జరిగితే పట్టించుకోరా అని ధ్వజమెత్తారు. ఇందులో ఏ ఒక్కదానికి ఆయన ఎలాంటి ఉదాహరణ గానీ, సందర్భం గానీ చూపించింది లేదు. ఎందుకంటే అన్ని రకాల మతోన్మాదాలను లౌకికవాదులు విమర్శిస్తూనే వున్నారు. తప్పులు జరిగితే మీ అధికారంతో చర్య తీసుకోండి గానీ మత భాషలో మాట్లాడటమెందుకని హితవు చెప్పిన సాటి నటుడు ప్రకాశ్‌ రాజ్‌పై పవన్‌ విరుచుకుపడ్డారు. ‘లడ్డు వివాదంపై ఏమంటారు?’ అని అడిగితే ‘అది సున్నితమైన విషయం’ అని దాటేసిన తమిళ నటుడు కార్తీకి హెచ్చరికలు జారీ చేసి సారీలు చెప్పించారు. తన కొత్త సినిమా ప్రమోషన్‌ కోసం ప్రయాస పడుతున్న కార్తీ సహజంగానే సారీ చెబుతూనే ఆ సందర్భం తెలియక మీరు ఆగ్రహించారని ముక్తాయించారు. ఇక మోడీ దాడినే లెక్క పెట్టని ప్రకాశ్‌ రాజ్‌ అసలు పవన్‌ విషయాలు తెలుసుకోకుండానే దాడి చేస్తున్నారని వరుస ట్వీట్లతో వెంటాడుతున్నారు. దీన్ని చక్కదిద్దుకోవడం కోసం పవన్‌ తర్వాత చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఢిల్లీలోని స్నేహితుల కోసం తాను ఇలా మాట్లాడుతున్నానని, ప్రకాశ్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యను తాను అర్థం చేసుకున్నానని కూడా సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. నిజంగానే ఎన్‌డిఎలో భాగస్వాములుగా నితీశ్‌ కుమార్‌ సీతామర్హిలో జానకి జన్మభూమి పిలుపునివ్వడం, చంద్రబాబు లడ్డూ వివాదం తేవడం జరిగాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఓ కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్‌ పోటీ ప్రభావం కూడా వుందని పేర్కొంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి గనక దాన్ని అడ్డుకోవడానికే ఈ వివాదం రగిలించినట్టు కనిపిస్తుందని ‘హిందూ’ సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. అంతేగాక పక్కనే మైసూరులో ఎన్‌.డి.బి.బి పరిశోధనశాల వుండగా ఎప్పటిలాగా అక్కడికి పంపకుండా ఎక్కడో వున్న గుజరాత్‌కు ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఘజియాబాద్‌కు ఎందుకు పంపలేదని ‘హిందూ’ కూడా ప్రశ్నించింది.

సగటు హిందువుగా ఏమిటి?
ఇవన్నీ ఒక ఎత్తు గానీ, తాను సగటు హిందువుగా మాట్లాడుతున్నానని ఉప ముఖ్యమంత్రి లౌకిక వాదంపై దాడి చేయడమే అన్నిటికన్నా తీవ్రమైన విషయం. మొదటిది తను సగటు హిందువు కాదు. ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ కథానాయకుడు కూడా. సగటు హిందువులు మామూలుగానే తిరుపతి సందర్శించుకుంటున్నారు. ఈ వివాదం రగిలిన మూడు రోజుల్లోనూ రోజుకు 3 లక్షలపైన లడ్డూలు ఎప్పటిలానే విక్రయమయ్యాయి. కనుక సగటు హిందువు పేరిట ఇతర మతాలను పోటీ పెట్టి మాట్లాడటం రాజ్యాంగ లౌకిక సూత్రాలకే విరుద్ధమైన విషయం. కుల, మత, లింగ తేడాలకు అతీతంగా విధి నిర్వహిస్తామని వీరంతా ప్రమాణం చేస్తారు. భారత రాజ్యాంగం కూడా అదే లౌకిక విలువలు బోధిస్తుంది. పీఠికలోనే లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద, సార్వభౌమిక, గణతంత్ర రాజ్యంగా పేర్కొంటుంది. దీన్ని అత్యవసర పరిస్థితిలో ఇందిరా గాంధీ చేర్చారని బిజెపి వారు అంటుంటారు గాని అది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి అనుగుణమైన చేర్పు మాత్రమే. ఆ మాట సుప్రీం కోర్టు తీర్పులోనే చెప్పింది. దాంతోపాటు అప్పుడే చేర్చిన ప్రజాస్వామిక సార్వభౌమిక అనే మాటలు తీసేస్తారా? లౌకిక తత్వం అనేది ఒకవైపునే వుండకూడదని, హిందువులకు కూడా వర్తించాలని పదేపదే అనడంలో పవన్‌ ఉద్దేశమేమిటి? అసలు లౌకిక తత్వమంటే రాజకీయాలకు మతానికి సంబంధం లేకుండా వుండటం. లోక సంబంధమైన విషయాలు తప్ప పార లౌకిక అంశాల జోలికి పోకూడదని అవి వ్యక్తిగతానికి వదిలేయాలని సారాంశం. దీన్ని మైనార్టీల పట్ల బుజ్జగింపుగా వక్రీకరించింది బిజెపి, ఆరెస్సెస్‌, సంఘ పరివార్‌. పవన్‌ మరో భాషలో అదే చెబుతున్నారన్నమాట. సచార్‌ కమిటీ నివేదికతో సహా అనేక అధ్యయనాలు చూస్తే ఆయన వాస్తవాలకు ఎంత దూరంగా వున్నారో తెలుస్తుంది. రకరకాల వివక్షలకు గురవుతున్న వారిలోనూ, అనేక విధాల వెనకబడిన వారిలోనూ మైనార్టీ ముస్లింలు ఎక్కువగా వున్నారు. పైగా భాషా సాంస్కృతిక మైనార్టీలకు ప్రత్యేక రక్షణ కల్పించింది రాజ్యాంగమే. మైనార్టీ అంటే ముస్లింలు అన్నది సామాన్య భావన తప్ప ఒకోచోట ఒకరు మైనార్టీగా వుండొచ్చు. దేశ సరిహద్దులు దాటితే మైనార్టీలై పోవచ్చు. భారత దేశం ముందునుంచి భిన్న మతాలతో కూడింది తప్ప ఏక మత దేశం కాదు. హిందూ మతం కూడా ఏకశిలా సదృశ్యమైంది కాదు. ఈ ప్రాథమిక వాస్తవాలు గుర్తించకుండా పవన్‌ కళ్యాణ్‌ వంటి వారు మతావేశానికి లోనై అందరలోనూ అదే రగిలించాలని చూడటం దురదృష్టకరం. హిందూ మత భావనకు భిన్నంగా రాజకీయం దట్టించిన హిందూత్వను దామోదర సావర్కర్‌ కచ్చితంగా వందేళ్ల కిందట 1923లో ప్రతిపాదించారని ఆయన తెలుసుకోవాలి. తమలాంటి వారు మోడీకి జైకొట్టినా సగటు భారతీయులు దాన్ని ఆమోదించలేదు గనకే మూడోసారి కనీస మెజార్టీ కూడా రాలేదు. హిందూత్వను మరింతగా రగిలించాలనే ప్రయత్నంలోనే బుల్డోజర్‌ రాజ్యాలు, హక్కుల అణచివేత, కవులూ రచయితలు పాత్రికేయులపై దాడుల వంటివి జరుగుతున్నాయి. తను కూడా సినిమా నేపథ్యం నుంచి వచ్చినా అదే రంగానికి చెందినవారికి హెచ్చరికలు జారీ చేయడం మతపరమైన అసహనానికి నిదర్శనం. ఈ సమయంలోనే తమిళనాడు (బిజెపి) గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి లౌకికవాదం (సెక్యులరిజం) పాశ్చాత్య భావన తప్ప భారతీయం కాదని ప్రవచించడం యాదృచ్ఛికం కాదు. లౌకికతత్వం కోసం పోరాటం, ప్రజాస్వామ్య సమరం విడదీయరానివిగా వుంటాయి. తెలంగాణ ముస్లిం రాజ్యం, ఆంధ్ర ప్రదేశ్‌ క్రైస్తవ రాజ్యం అయిపోయాయని గతంలో బండి సంజరు ట్వీట్‌ చేస్తే దాన్ని రీట్వీట్‌ చేసిన వారు ఇప్పటికైనా కళ్లు తెరిస్తే మంచిది. బిజెపితో జత కట్టాక ఎలాంటి భావాలు ఆవరిస్తాయో, ఒత్తిళ్లు ఎలా పని చేస్తాయో అర్థం కావడానికీ ఇదో ఉదాహరణగా వుంటుంది.

సనాతనమా, సమధర్మమా?
అలాగే సనాతన ధర్మం కోసం కంకణబద్దులం కావాలని పవన్‌ కళ్యాణ్‌ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నాటి నుంచి చెబుతున్నారు. దాన్ని కాపాడటం కోసం జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన తాజా పిలుపు! సతీ సహగమనం, కుల వివక్ష, అస్పృశ్యత, పితృస్వామ్య దురహంకారం, ఆధిపత్య కులాల దురహంకారం వంటి అసంఖ్యాక జాడ్యాలతో నిండిన సనాతన ఆచారాలను సంస్కరించడానికి సంస్కర్తలు, మహనీయులు ఎంతగానో పోరాడవలసి వచ్చింది. తన పిఠాపురం పక్కన రాజమండ్రిలోనే కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహం కోసం చేసిన కృషి ఆయనను ధృవతారగా నిల్పింది. కానీ చేగువేరా బొమ్మతో బయిలుదేరి సావర్కర్‌ను భుజానికెత్తుకున్న పవన్‌ పదేపదే సనాతన మంత్రం జపించడం ఈ సంస్కర్తల, విప్లవకారుల స్ఫూర్తికే కళంకం. దేశభక్తి అంటూ నిరంతరం మాట్లాడేవారు ఈ దేశమంటే మనుషులోరు అనీ, అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నియు మెలగవలెనోరు అనీ తెలుసుకోవాలి. వెనకచూసిన కార్యమేమోరు మంచి గతమున కొంచెమేనోరు అనీ ఆ గురజాడ ప్రబోధించిన పరమ సత్యం గ్రహిస్తే అప్పుడు సనాతనమంటూ ఇంకా ఇంకా వెనక్కు చూసే పరిస్థితి వుండదు. కాలం వెనక్కు నడవదు కూడా. వివక్షలకు మారు పేరైన సనాతన ధర్మం స్థానంలో సమ ధర్మం కోసమే సామాన్యులు పోరాడతారు. మనుధర్మం కన్నా మానవ ధర్మం మిన్న అని నినదిస్తారు. సరళీకరణ ప్రపంచీకరణలో సమిథలవుతున్న సామాన్యులను సమరాల నుంచి దూరం చేసేందు కోసం మత ప్రాతిపదికన విడదీసే ప్రయత్నాలు ఎవరు చేసినా ప్రజలు తిరస్కరిస్తారు.

తెలకపల్లి రవి

➡️