సంక్రాంతి ముంగిట్లో సినీ, రాజకీయ పందేలు

సమాజంలో చిరకాలంగా సినిమాలకు రాజకీయాలకూ వాటి వాటి స్థానాలున్నాయి. తమిళనాడులో అన్నాదురైతో మొదలుపెట్టి కరుణానిధి, ఎంజిఆర్‌ల ద్వారా సినిమా రంగ ప్రముఖులు రాజకీయాలలో చక్రం తిప్పడం కూడా ఒక ప్రాతిపదికపైనే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ అగ్ర కథా నాయకుడైనప్పటికీ నాటి కాంగ్రెస్‌పై ప్రజల అసంతృప్తికి ప్రతిరూపంగానే అధికారంలోకి వచ్చారు. తర్వాత కూడా ఆయన రెంటినీ కలగాపులగం చేసింది తక్కువేనని చెప్పాలి. కానీ గత కొన్నేళ్లలో ఈ పరిస్థితి క్రమేణా మారిపోతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశంలోనే వసూళ్లలో రెండవ స్థానంలోకి వచ్చిన ‘పుష్ప2’ త్వరలో రాబోతున్న ‘గేమ్‌ చేంజర్‌’ మధ్య కాలంలో ఘటనలు దానికి పరాకాష్ట. ఏది సినిమానో ఏది రాజకీయమో ప్రజలకు ఏ ప్రయోజనమో తెలియని గందరగోళం నెలకొంది. ‘పుష్ప2’ విడుదల సందర్భంలో జరిగిన దురదృష్టకర సంఘటనలపై ఎడతెగని చర్చ వాతావరణాన్ని అత్యంత వివాదాస్పదం చేసింది. ఈలోగా రాజమండ్రి దగ్గర జరిగిన ‘గేమ్‌ చేంజర్‌’ ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనతో ఈ సినీ రాజకీయ చర్చ ఎ.పి కి మారింది. తమ తమ అవసరాల కొద్దీ, అక్కసుల కొద్దీ మాట్లాడటం తప్ప ఒక సామాజిక కోణంలో ఎలా స్పందించాలనే దానికి అవసరమైన సంయమనం గానీ సమతుల్యత గానీ బొత్తిగా లోపించాయి. పాలక పార్టీలు, కొన్ని సినిమా వర్గాలు స్వప్రయోజనం నెరవేర్చుకోవడానికి పడే తంటాలు హాస్యా స్పదంగా మారుతున్నాయి. కొంతమంది దీన్ని మరీ ముందుకు తీసుకుపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, కొన్ని కులాల మధ్య లేదంటే కుటుంబాల మధ్య సమస్యలాగా చేసి చూపడం మరీ దారుణంగా తయారైంది.

మసాలాలు దట్టి లాభాల పోటీ

‘బాహుబలి’తో మొదలుపెట్టి పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ పాట హిందీలోనూ తెలుగు, తమిళ సినిమాలలోనూ బాగా వినిపిస్తున్నది. చిన్న పరిశ్రమ అయిన కన్నడ కూడా కెజిఎఫ్‌ తర్వాత ఈ హడావుడిలో భాగస్వామి అయింది. ఈ క్రమంలో ఖర్చులు విపరీతంగా పెంచి అవసరం లేని హంగులతో అతి భారీగా తీస్తేగానీ నడవబోవనే భావం బలపడింది. భారీగా పెట్టుబడులు కుమ్మరించగలిగిన లేదా భారాలు భరించగలిగిన కొన్ని కుటుంబాలు సంస్థలే చక్రం తిప్పుతున్నాయనే భావం బలపడింది. చిన్న చిత్రాలు, భిన్న చిత్రాలు కొన్ని విజయం సాధించినా ఆ ప్రయత్నాలకు పెద్దగా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వాలు కూడా స్థిరమైన విధానాలతో ముందుకు రావడం లేదు. తారల తళుకులు, పైపై మెరుగులకు వచ్చిన ప్రాధాన్యత ప్రతిభకు, కొత్త గొంతులకు దక్కడం లేదు. రెండు వందల సినిమాలు వస్తుంటే పది కూడా విజయం సాధించడం లేదనే మాట అందరూ అంటున్నారు గాని అందుకు కారణాలు అన్వేషించడం లేదు. మొత్తం చర్చలో సాంకేతిక నిపుణులు అంతకు మించి పని చేసే సినీ కార్మికుల గురించి అసలు చర్చ జరగడం లేదు.
అంతకంతకూ ఖర్చులు పెంచుకుంటూ, అందులో పారితోషికాలకే అత్యధికంగా వెచ్చిస్తూ పరిశ్రమ ఏం చేసినా తమ హీరోల చిత్రాలకు కేరింతలు కొడుతూవున్న, సొమ్ములు వెచ్చించే అభిమానులనే వారే పునాది. ఒకప్పటి అభిమాన సంఘాల పరిస్థితి మారి సోషల్‌ మీడియా, మీడియాల ద్వారా వీరిని మరింత గట్టిగా ఉపయోగించుకోవడం ఒక వ్యూహంగా మారింది. పదేపదే ఈవెంట్‌లు, జాతరలు, ప్రీరిలీజ్‌, సాంగ్‌ రిలీజ్‌…ఇలా తొక్కిసలాటతో ఒకటి రెండు వేడుకలను రద్దు చేసుకోవలసిన పరిస్థితులు. వేలాది థియేటర్లలో ఒకేసారి విడుదల చేసి, ఎక్కువ షోలు వేసిి తాజా సరుకులా అమ్మేసి సొమ్ములు చుట్టేసుకోకపోతే చల్లబడిపోతుంది. అందుకోసం మల్టీ స్క్రీన్‌ప్లెక్స్‌లు, వీటిపైనా కొద్ది మంది పట్టు. గతంలో లేని విధంగా విడుదల తేదీలు సీజన్లు కూడా కలసి నిర్ణయించుకోవడం నెలల తరబడి వాయిదాలు వేసుకోవడం అంతా మార్కెట్‌ వ్యూహం. ఆ మార్కెట్‌ కూడా తెలుగు రాష్ట్రాలను దాటి హిందీ ప్రేక్షకులకూ విదేశాల్లోని వారికి నచ్చేలా రూపొందించడం ఒక వలయంగా మారింది.

‘పుష్ప’ వివాదం

‘పుష్ప2’ విడుదల సందర్భంగా తొక్కిసలాట ఎవరూ కోరుకున్నది కాదుగానీ ఊహించలేనిది కూడా కాదు. పోలీసులు ఆ అంచనాతోనే హీరోను రావద్దని చెప్పామంటున్నారు. వచ్చిన తర్వాతనైనా జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపించదు. ఇందుకు బాధ్యత గురించి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా ఆకర్షణ వున్న హీరో పరివారం జాగ్రత్త తీసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. రేవతి అనే మహిళ మృతి చెందడం నిజంగా విషాదకరం. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ విషమంగా గాయపడి ప్రాణాలతో బయటపడటం ఊరట కలిగించినా అతను ఆరోగ్యపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వుంటుంది. ఈ మరణం ఆలస్యంగా స్పందించిన చిత్ర బృందం అందిస్తామన్న సాయం అందడానికి కూడా అనేక దశలు, విమర్శలు కావలసి వచ్చింది. ఈ ఘటనలను బట్టి పరిశ్రమనే పంపించేయాలన్నట్టు మాట్లాడిన వారిది కూడా తప్పే. అందులో ఆంధ్ర, తెలంగాణ తేడాలు తీసుకొచ్చిన వారిది మరింత పొరబాటు. కావాలని చేయలేదనేది ఒకటైతే కావలసిన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తప్పక దిద్దుకోవలిసిన విషయం.

ప్రచార జాతరలు, ప్రమాదాలు

హీరో ఫంక్షన్‌లో తన పేరు మర్చిపోయారు గనక అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ కక్ష సాధింపుగా కొన్ని పార్టీలు తీవ్రారోపణలు చేశాయి. బిఆర్‌ఎస్‌, బిజెపిలు ఈ విషయంలో ముందున్నాయి. కాంగ్రెస్‌తో తమ రాజకీయ వైరాన్ని తీర్చుకోవడానికి, సినిమా పరిశ్రమకూ హీరో అభిమానులకు దగ్గర కావడానికి అవి ఈ మార్గాన్ని ఎంచుకున్నాయా? ఎ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అల్లు అర్జున్‌ బయటికి రాగానే పోన్‌ చేసి సంఘీభావం ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఎన్‌డిఎ భాగస్వామి కూడా. ఎపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కూడా అరెస్టును ఖండించడం చూస్తే బిజెపి ప్రత్యక్ష, పరోక్ష మిత్రులు ఒక విధానం తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. అల్లు అర్జున్‌ అరెస్టు అవకాశంగా తనపై రాజకీయ దాడికి పాల్పడుతుంటే పరిశ్రమ విడగొట్టుకోకపోవడం, హీరోకు తప్ప బాధిత కుటుంబాన్ని పట్టించుకోకపోవడం సరికాదని రేవంత్‌ చెప్పడంలో తప్పేమీ కనిపించదు. అసలు ఆ సమావేశానికి వెళ్లడమే తప్పని ఒక వర్గం వాదన. ‘పుష్ప2’ రేట్లు, షోలు విపరీతంగా పెంచుకోవడానికి అనుమతినిచ్చిన రేవంత్‌ రెడ్డి ఇకపై ఆ అవకాశం వుండదని ప్రకటించారు. కానీ తాను అనుమతి తెచ్చుకొంటానని మూడు సంక్రాంతి సినిమాల నిర్మాత దిల్‌ రాజు చెబుతున్నారు. ‘పుష్ప’ ఘటనల తర్వాత చాలా రోజులకు పవన్‌ కల్యాణ్‌ అల్లు అర్జున్‌ అరెస్టును సమర్థించారు. జాగ్రత్తలు లోపించాయని, పరామర్శకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. అధికార హోదాలో ఎ.పి లో ‘గేమ్‌ చేంజర్‌’ ఈవెంట్‌లో పాల్గొని చేసిన ప్రసంగంలో మాత్రం ఆయన సినిమాలు, రాజకీయాలు అన్నీ కలిపేసి మాట్లాడారు. ఆయన స్వయంగా నటిస్తున్న ఒజి (ఒరిజినల్‌ గూండా) చిత్రం పేరు ప్రతి అధికార కార్యక్రమంలోనూ వినిపిస్తూనే వుంది. ఆ ఈవెంట్‌కు హాజరై వెళుతున్న ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలుకావడం విషాద వివాదంగా మారింది. రోడ్లు గత ప్రభుత్వంలో దెబ్బతిన్నాయి గనక ఈ ఘటన జరిగిందని పవన్‌ వ్యాఖ్యానించడం ఒకటైతే ‘పుష్ప’ ఘటనలతో పోటీ పెట్టి పవన్‌ను అరెస్టు చేయాలని కొంతమంది వైసిపి అభిమానులు పోస్టులు పెట్టడం, మాజీ అంబటి రాంబాబు దీనిపై రాజకీయ దాడి చేయడం మరోవైపు చూశాం. ఇవన్నీ రాజకీయ వ్యూహాల ఫలితమే. జగన్‌ ముఖ్యమంత్రిగా వుండగా రేట్ల పెంపునకు ఒప్పుకోకపోవడం వచ్చిన హీరోలు, దర్శకుల పట్ల అవమానకరంగా వ్యవహరించారనే విమర్శ వుంటూనే వుంది. వ్యక్తిగత ప్రవర్తన కన్నా పరిశ్రమకూ సమాజానికి ఏం జరుగుతుందనేది ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన అంశం.

బిజెపి రాజకీయాలు?

‘బాహుబలి’ రచయిత, ఆ చిత్ర దర్శకుడి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు బిజెపి రాజ్యసభకు నామినేట్‌ చేయించింది. ఆయన ఆరెస్సెస్‌పై చిత్రం తీస్తానని ప్రకటించారు. అందులో నటించడం కోసం ఎన్టీఆర్‌ను ఒప్పించేందుకు కొన్నేళ్ల కిందట స్వయంగా హోంమంత్రి అమిత్‌ షా ప్రయత్నించడం తెలిసే వుంటుంది. వైసిపి హయాంలో సైబర్‌నెట్‌ను ఎలా వాడారు? తమకు అనుకూలమైన వ్యూహం చిత్రానికి గాను రాం గోపాల్‌ వర్మ బృందానికి డబ్బులు ఎలా అందించారనే దానిపైనా కేసులు, ఫిర్యాదుల యుద్ధం నడుస్తున్నది. తాజాగా పాటల రచయిత అనంత శ్రీరాం హిందూ వ్యతిరేక చిత్రాలను బహిష్కరిం చాలంటూ పైత్య ప్రకోప ప్రలాపాలకు పాల్పడుతున్నారు. కళాకారులు, పాత్రికేయులపై అనేక విధాల నిర్బంధానికి నిషేధాలకు పాల్పడిన సంఘ పరివార్‌ ఇక్కడ సంరక్షకురాలిగా మాట్టాడ్డం చెల్లుబాటయ్యేది కాదు. అందరూ ఆనందించవలసిన కళలను సంకుచిత కోణాలతో చూడటం, సులభ లాభాల కోసం సామాన్య ప్రేక్షకులపై భారాలు మోపడం సరైంది కాదు. ఈ విషయంలో పొడుగు చేతుల పందేరంలా ఇష్టానుసారం అనుమతివ్వడం సరైంది కాదు. పరిశ్రమ కూడా మంచి చిత్రాలకు ప్రోత్సాహం, ప్రేక్షకులకు భద్రత కల్పించడం, భారం తగ్గించడం గురించి యోచించాలి. ఇప్పుడు గేమ్‌ ఛేంజర్‌, ఢాకూ మహరాజ్‌ సినిమాలకు రేట్ల పెంపుపై పవన్‌ కల్యాణ్‌ ముందే ప్రకటన చేయడం ఆసక్తికరం. అయితే స్వయంగా హైకోర్టు పెంపును 14 నుంచి 10 రోజులకే తగ్గించడంలోనూ భారం తగ్గించే భావనే కనిపిస్తుంది.

– తె.ర

➡️