సేవ్‌ కప్పట్రాళ్ల

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల అటవీ ప్రాంతంలో ప్రమాదకర యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అనుమతులివ్వడం నిరంకుశ పోకడకు అద్దంపడుతుంది. తమ బతుకులను ఛిద్రం చేసే యురేనియం మైనింగ్‌ వద్దే వద్దంటూ కప్పట్రాళ్ల పరిసర గ్రామాల ప్రజానీకం పలు విధాలుగా వ్యతిరేకత తెలియజేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెవికెక్కించుకోలేదు. గత్యంతరం లేక 12 గ్రామాల ప్రజలు శుక్రవారం పార్టీలకతీతంగా సమావేశమై యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకుపోయేందుకు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జెఎసి)గా ఏర్పడ్డారంటే ఆ ప్రాంత వాసులు యురేనియం మైనింగ్‌ పట్ల ఎంతగా బెంబేలెత్తుతున్నారో అర్థమవుతుంది. జెఎసి పిలుపు మేరకు శనివారం నాడూ గ్రామాల ప్రజలు కదిలొచ్చి రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. మైనింగ్‌ను ఆపించలేని రాష్ట్ర ప్రభుత్వం, ఆందోళనలో పాల్గొనకుండా ప్రజలను, స్వచ్ఛంద సంస్థల, ప్రజాసంఘాల, వివిధ పార్టీల నేతల కట్టడికి యత్నించింది. విపక్షాలతో పాటు అధికార టిడిపి నాయకులను సైతం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నిర్బంధాలను, బెదిరింపులను ప్రజలు లెక్క చేయలేదు సరికదా తవ్వకాలు ఆపే వరకు ఉద్యమిస్తామని ప్రతినబూనడం హర్షణీయం. వారి ఏకైక నినాదం ‘సేవ్‌ కప్పట్రాళ్ల’.
రాయలసీమలో యురేనియం నిక్షేపాలున్నాయని దశాబ్దాల కిందటనే ఆటమిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎఎండి) ప్రాథమిక అంచనాకొచ్చింది. కడప జిల్లా తుమ్మలపల్లెలో 2007 ప్రాంతంలో తవ్వకాలకు అంకురార్పణ జరిగింది. అక్కడి ప్రజలు మైనింగ్‌ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పర్యావరణం, నీటి వనరులు కలుషితమవుతున్నాయని నెత్తీనోరు బాదుకుంటున్నారు. కడప బేసిన్‌కు సబ్‌ బేసిన్‌ కప్పట్రాళ్ల. అక్కడ 2017 లోనే పరిశోధనల కోసం తొమ్మిది బోర్లను డ్రిల్లింగ్‌ చేసి యురేనియం నిక్షేపాలున్నట్లు గుర్తించారు. మరిన్ని పరిశోధనలు, నిర్ధారణల కోసం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పలు చోట్ల 68 బోర్ల తవ్వకాలకు ఎఎండి ప్రతిపాదించగా కేంద్రం అనుమతులిచ్చింది. గత నెలలో నోటిఫికేషన్‌ జారీ అయింది. ఇదంతా టిడిపి, వైసిపి, ఇప్పుడు టిడిపి ప్రభుత్వాల హయాంలోనే చోటు చేసుకుంది. కేంద్రంలో ఉన్నది బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం. యురేనియం తవ్వకాల వలన కప్పట్రాళ్ల ప్రాంతంలోని 1,200 ఎకరాల అటవీ భూమి, పచ్చని పంట పొలాలు, తోటలు ధ్వంసం అవుతాయని, హంద్రీ-నీవా సహా అన్ని నీటి వనరులు కాలుష్యమవుతాయని, తాము తీవ్ర అనారోగ్యం పాలవుతామని, భవిష్యత్‌ తరాలకు ముప్పు అనే జనం భయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సరైన సమాధానం లేదు.
యురేనియాన్ని అణు ఇంధన ఉత్పత్తికి, ఐసోటోపులు, మెడికల్‌, ఇండిస్టియల్‌, డిఫెన్స్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. ప్రమాదమనే యురేనియం తవ్వకాలను, న్యూక్లియర్‌ పవర్‌ ప్రాజెక్టులను అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు తగ్గించాయి. భారత్‌ వంటి దేశాలకు తరలిస్తున్నాయి. అమెరికా ఒత్తిడితో మన కేంద్ర ప్రభుత్వం ప్రమాదమని, అధిక ఖర్చని తెలిసినా ఆ వైపు చూస్తోంది. బిజెపి సర్కారుకు మైనింగ్‌ విషయంలో ప్రజలు పట్టట్లేదు. కార్పొరేట్ల లాభాలే పరమావధిగా పని చేస్తోంది. దండకారణ్యం, ఇతర అటవీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులపైనా, రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులు, చట్టాలపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో చూస్తున్నాం. విశాఖ మన్యంలో బాక్సైట్‌ అయినా, కప్పట్రాళ్లలో యురేనియం అయినా ప్రజలు, వారి అభిప్రాయంతో పని లేదు. రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉంది. కప్పట్రాళ్లలో తవ్వకాలు జరపాలంటే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి అటవీశాఖ సహకారం తప్పనిసరి. కూటమి సర్కారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి యురేనియం తవ్వకాల అనుమతులను రద్దు చేయించాలి. ప్రజాభీష్టాన్ని గౌరవించాలి.

➡️