వ్యంగ్యానికి సంకెళ్లు

‘వికటన్‌’ వెబ్‌సైట్‌ను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అన్‌బ్లాక్‌ చేయాలని మద్రాస్‌ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వు వ్యంగ్యానికి కేంద్ర ప్రభుత్వం వేసిన సంకెళ్లను సడలించడమే! ఇది స్వాగతించదగినది. అయితే, వివాదానికి మూలమైన కార్టూన్‌ను తాత్కాలికంగా తొలగించాలని చెప్పడం ద్వారా కేంద్ర నిరంకుశాధికారాల్ని న్యాయస్థానం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చకపోవడం ప్రజాస్వామ్య ప్రియులకు, భావ ప్రకటనా స్వేచ్ఛను బలపరిచే వారికీ బాధ కలిగిస్తుంది. అమెరికాలో నివసించడానికి తగు చట్టబద్ధ పత్రాలు లేవన్న కారణంతో వేలాదిమంది భారతీయ సంతతి పౌరులను అక్రమ వలసదారులని ముద్ర వేసి, వారిని ఆ దేశం నుండి వెళ్లగొడుతున్న సంగతి లోకానికి ఎరుకే. అయితే, వారిని కరుడుగట్టిన నేరస్తులు లేదా ఉగ్రవాదుల మాదిరి కాళ్లను గొలుసులతో బంధించి, చేతులకు సంకెళ్లు వేసి మాతృదేశానికి పంపడంతో యావత్‌ భారతీయులు తల్లడిల్లిపోయారు. అయినా పాలక బిజెపి కి, ప్రధాని మోడీకి ఇది పట్టలేదు. పైపెచ్చు తగిన పత్రాలు లేకుండా మరో దేశంలో నివసించడం నేరమేనంటూ భారతీయ మూలాలున్న పౌరులను కించపరుస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి ఖట్టర్‌ దారుణమైన వ్యాఖ్యలు మరింత బాధాకరం. అక్రమ వలసదారుల పేరిట మన పౌరులను గొలుసులు, బేడీలతో అమృతసర్‌ విమానాశ్రయానికి తరలించిన సమయంలోనే ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల భేటీ జరిగింది కానీ భారత సంతతి పౌరులకు జరిగిన అవమానాన్ని గురించి ప్రశ్నించడం కాదు సరికదా కనీస ప్రస్తావన కూడా చేయలేదు. ఇటువంటి దుర్మార్గాన్ని ఎండగడుతూ ‘వికటన్‌’ వెబ్‌సైట్‌ ఒక కార్టూన్‌ను ప్రచురించింది. ఇరు దేశాధినేతల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ సంకెళ్లతో పాల్గొన్నట్లు దాంట్లో చిత్రించడం వాస్తవ పరిస్థితిని కళ్లకు కట్టింది. ఒక్క కార్టూన్‌లో ట్రంప్‌ దుర్మార్గాన్ని, నరేంద్ర మోడీ అచేతనత్వాన్ని, భారతీయుల ఆవేదననూ వ్యక్తం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారతీయ ఆత్మను, భారతీయుల ఆవేదననూ ప్రతిబింబించిన ఆ కార్టూన్‌పై ఆగ్రహించిన బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం, సమాచార ప్రసార శాఖ ‘వికటన్‌’ వెబ్‌సైట్‌ మొత్తాన్ని బ్లాక్‌ చేయడమూ ఆగమేఘాలపై జరిగిపోయాయి. ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లి అరదండాలతో వెనుదిరిగిన వేలాదిమంది భారత యువతీయువకుల గురించి ఏమాత్రం చింతించని కమలం పార్టీ నేతలు ఈ కార్టూన్‌కు అంతలా కలత చెంది, ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేయించడం వారి నిరంకుశ పోకడలకు నిలువెత్తు నిదర్శనం. 1975-77 మధ్య దేశంలో సాగిన మీడియా సెన్సార్‌ కు దీనికి ఏమీ తేడా లేదు కదా! అందుకే నరేంద్ర మోడీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందన్న కొందరి వ్యాఖ్యలు ఎంతమాత్రం సత్యదూరం కాదు. జాతీయోద్యమ కాలం నుండి వందేళ్ల చరిత్రగల ‘వికటన్‌’ వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేసిన కేంద్ర మంత్రిత్వశాఖ కనీసం ఆ సమాచారాన్ని పదిహేను రోజులకు కూడా తెలియజేయక పోవడంతో మద్రాస్‌ హైకోర్టు గడప తొక్కవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో జరిగిన విచారణలో ధర్మాసనం ‘వికటన్‌’ వెబ్‌సైట్‌ను అన్‌బ్లాక్‌ చేయాలని ఉత్తర్వులీయడం సానుకూలమైనదే! అయితే, ఆ కార్టూన్‌ను తాత్కాలికంగా తొలగిస్తేనే అన్‌బ్లాక్‌ చేయాలనడాన్ని ఎవరూ సమర్ధించలేని పరిస్థితి. ఏది ఏమైనా మోడీ సర్కారు నిరంకుశ పోకడలపై ప్రజాస్వామ్యానికి నాలుగవ స్తంభంగా పేరున్న మీడియా ఇలా ప్రచురించడం, నిర్బంధం విధిస్తే దాన్ని ప్రశ్నించడం అభినందనీయం. న్యాయస్థానం పరిమితంగానైనా ఊరటనివ్వడం మంచిదే! అయితే విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ‘వికటన్‌’ వెబ్‌సైట్‌కు ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాతో సహా తమిళనాట అనేక మీడియా సంస్థలు సంఘీభావం తెలపడం శుభసూచికం. నిరంకుశ పోకడలను ఆదిలోనే ప్రశ్నించాలి, ఎదుర్కోవాలి, తిప్పికొట్టాలి. లేకపోతే అది తొండ ముదిరి ఊసరవెల్లి అయిన చందంగా ఒకనాటి హిట్లర్‌, ముస్సోలినీల పాలనను తిరిగి తేవాలనుకుంటున్న శక్తుల ప్రమాదం పెరుగుతుంది. ప్రజాస్వామ్య ప్రియులు, భారత రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛ పరిఢవిల్లాలని కోరుకునే వారందరూ అప్రమత్తంగా ఉండాలి. ముప్పును నివారించుకోవాలి!

➡️