చిత్తశుద్ధి చూపాలి

Feb 13,2025 06:15 #articales, #edit page

ఏజెన్సీకి రక్షణ కవచమైన 1/70 చట్ట పరిరక్షణ కోసం ఆదివాసీ ప్రజానీకం ఉద్యమించిన తీరు శ్లాఘనీయం. ఆదివాసీ అఖిలపక్ష రాజకీయ, ప్రజాసంఘాలు రెండురోజుల మన్యం బంద్‌కు పిలుపునిస్తే ఉద్యమ తీవ్రతతో 24 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి స్పందించి ఆ చట్టాన్ని కొనసాగిస్తామంటూ హామీ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రెండవరోజు బంద్‌ను విరమిస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. ఇంతటి పోరాటపటిమ చూపిన ప్రజానీకానికి, వారిని నడిపించిన వివిధ ప్రజాసంఘాలకు, పక్షాలకు అభినందనలు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని గిరిజన ప్రజానీకం కొనసాగించాల్సి వుంటుంది. మన్యం బంద్‌కు పార్టీ అభిమానాలకు అతీతంగా గిరిజనం కదిలారు. విద్యార్థులు, యువత రోడ్లమీదకు వచ్చారు. సామాన్య ప్రజానీకం కూడా ఎక్కడికక్కడ బంద్‌లో భాగస్వామ్యమైంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు, హోటళ్లు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. వాహనాలు నిలిచిపోయాయి. నిరసనలు, బైఠాయింపులతో ఏజెన్సీ ప్రాంతం మారుమ్రోగింది. తమ మనుగడకు మూలమైన వివిధ ఏజెన్సీ చట్టాల అమలు, పరిరక్షణ విషయంలో గిరిజన ప్రజానీకంలో నెలకొన్న ఆందోళనే బంద్‌ పిలుపునకు ఈ స్థాయిలో స్పందన రావడానికి కారణం. ఈ వాస్తవాన్ని విస్మరించి ఎవరో తప్పుడు ప్రచారం చేసి, అపోహలు సృష్టిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. కొద్ది రోజుల క్రితం కార్పొరేట్లకు ఏజెన్సీని అప్పచెప్పడానికి వీలుగా 1/70 చట్టాన్ని సవరించాలంటూ రాష్ట్ర స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు గిరిజనులు ఆగ్రహంతో రోడ్డెక్కడానికి తక్షణ కారణం. స్పీకర్‌ వ్యాఖ్యలపై చర్చలు, నిరసనలు జరుగుతున్న సమయంలో కిమ్మనకుండా ఊరుకోవడం, బంద్‌ పిలుపు తరువాత కూడా అణచివేత చర్యలకు, ముందస్తు అరెస్ట్‌లకు దిగడం పట్ల సర్కారు ఆత్మశోధన చేసుకోవాలి.

నిజానికి దేశ వ్యాప్తంగా అటవీ ప్రాంతాలపై కార్పొరేట్ల కన్ను ఇప్పటిది కాదు. మైనింగ్‌ కోసమో, టూరిజం పేరుతోనో పచ్చటి అడవులను కబళించడానికి ఎప్పటినుండో ఆ శక్తులు పావులు కదుపుతున్నాయి. వామపక్షాల చొరవతో రూపొందిన అటవీ హక్కుల చట్టంతో పాటు ఏజెన్సీ ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ యాక్టు (1/70), అటవీ సంరక్షణ చట్టం, పంచాయతీ రాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్డ్‌ ఏరియాస్‌ యాక్టు (పెసా) వంటివి వారి ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీటిని నీరుగార్చి, అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రక్రియను ప్రారంభించింది. మోడీ ప్రభుత్వం చేపడుతున్న ఈ గిరిజన వ్యతిరేక కార్యక్రమాలను టిడిపి ఏనాడూ ఖండించకపోగా, ఇటీవల అటవీ సంరక్షణ చట్టానికి ప్రతిపాదించిన సవరణలను పార్లమెంటులో బలపరిచింది. టిడిపి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన విజన్‌ 2047 డాక్యుమెంటుతో పాటు అనుబంధ పాలసీల్లోనూ కార్పొరేట్లకు భూ పందేరమే కీలకం కావడం, ఏజెన్సీ ప్రాంతానికీ అందులో పెద్ద పీట వేయడం గమనార్హం. ఈ పాలసీలు విడుదలైన తరువాతే అయ్యన్నపాత్రుడు వంటి నేతలు ఏదో ఒక సాకుతో గిరిజనుల హక్కులపై దాడికి తెగబడుతున్నారు. గత వైసిపి ప్రభుత్వం అదానీ సంస్థలకు, తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నవయుగ వంటి సంస్థలకు ఏజెన్సీ ప్రాంతంలో హైడ్రో, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కూడా గిరిజనులకు, అటవీ భూములకు పొంచి ఉన్న ముప్పునకు నిదర్శనం. ఒకదాని తరువాత ఒకటిగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలే గిరిజనుల్లో భయాందోళనలకు, ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అడవిబిడ్డల్లో నెలకొన్న భయాందోళనలను పూర్తిగా తొలగించాలి. త్వరలో జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో అసెంబ్లీ వేదికగా 1/70తో సహా ఇతర అటవీ చట్టాల పట్ల ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి విస్పష్టంగా ప్రకటించాలి. ఈ ప్రాంతంలో జరిగే ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాలను 100 శాతం గిరిజనులకే రిజర్వ్‌ చేస్తూ జిఓ నెంబర్‌ 3ని పునరుద్ధరించాలి. ఆదివాసీ స్పెషల్‌ డిఎస్‌సిని నిర్వహించాలి. గిరిజనుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వికాసానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడం ద్వారా చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!

➡️