సర్‌ ఎడ్విన్‌ అర్నాల్డ్‌ ‘ద లైట్‌ ఆఫ్‌ ఆసియా’

బ్రిటీష్‌ కవి, జర్నలిస్ట్‌ ఎడ్విన్‌ అర్నాల్డ్‌ 1879లో ‘ద లైట్‌ ఆఫ్‌ ఆసియా’ అనే గ్రంథం ప్రకటించాడు. చరిత్రలో ఇది ఒక మహోన్నత ఘట్టం. ఒక విదేశీయుడు ప్రపంచ పరిజ్ఞానంతో తిరిగి వచ్చి, బుద్ధుడి గురించి అధ్యయనం చేసి-అతణ్ణి ‘ఆసియా ఖండపు వెలుగు’గా ప్రకటిస్తూ ఇంగ్లీషులో ఒక ఉద్గ్రంథం ప్రకటించడమంటే అల్లాటప్పా విషయం కాదు కదా? పైగా ఎప్పుడు రాశాడూ? అంటే-బ్రాహ్మణార్యుల కుట్రల వల్ల బుద్ధుడు నేల మీది కన్నా భూమి పొరల్లో ఎక్కువగా పాతుకు పోయిన సమయంలో రాశాడు. ఎక్కడ ఏ చిన్నపాటి తవ్వకం జరిగినా. బయట పడే శిధిలాలు ఇది బుద్ధ దేశమని గొంతెత్తి చెబుతున్న కాలంలో రాశాడు. ఎడ్విన్‌ అర్నాల్డ్‌ (10 జూన్‌ 1832-24 మార్చి 1904) తన ఇరవై అయిదవ యేట ఇండియా వచ్చి, యువకుడిగా ఆ వయసులోనే పూనా కాలేజికి ప్రిన్సిపాల్‌ అయ్యాడు. తర్వాత కాలంలో అది దక్కన్‌ కాలేజి గా మారింది. తనకు ఉన్న పరిధిలోనే బాలికల విద్యను ప్రోత్సహించాడు. ఛాందస సంప్రదాయ విద్యా విధానాన్ని మార్చడానికి ప్రయత్నించాడు.
బుద్ధుడి కాలం, అశోకుడి కాలం గడిచిపోయాక ప్రపంచంలో అనేక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. ఆసియా దేశాలలో బౌద్ధం బలంగా ఉన్నా, యూరోప్‌ దేశాలకు అది అందాల్సినంత అంద లేదు. కారణం బౌద్ధాన్ని వాళ్ళు అర్థం చేసుకునే భాషలో ఎవరూ చెప్పలేదు. సర్‌ ఎడ్విన్‌ అర్నాల్డ్‌ ఆ లోటు తీర్చాడు.’ద లైట్‌ ఆఫ్‌ ఆసియా’ శీర్షికతో బుద్ధుడి జీవిత చరిత్రకు కావ్య రూపమిచ్చాడు. బుద్ధుడి గొప్పతనాన్ని ఆధునిక ప్రపంచానికి చాటి చెప్పాడు. ‘బుద్ధిస్ట్‌ హిస్టోగ్రఫీ’గా అది ప్రపంచ పాఠకుల మన్ననలు పొందింది. సామాజిక సమానత్వానికి వివిధ దేశాల్లో జరిగిన ఉద్యమాలకు ఆ పుస్తకం స్ఫూర్తినిచ్చింది. కవులకు, కళాకారులకు, చిత్రకారులకు, చలన చిత్ర దర్శకులకు ఎంతో మందికి ఎన్నో రకాలుగా అది ఉత్తేజాన్నిచ్చింది. 1927లో ‘లైట్‌ ఆఫ్‌ ఆసియా’ ఇంగ్లీషు మూల గ్రంథం ఇంగ్లాండులో అరవై, అమెరికాలో వంద పునర్ముద్రణలు జరిగి, ప్రపంచ వ్యాస్తంగా తన రికార్డును తానే అధిగమిస్తూ పాఠకులకు అందింది. మరొక విశేషమేమంటే దాదాపు అన్ని ప్రపపంచ భాషల్లోకి ఈ గ్రంథం అనువాదమైంది.
ప్రపంచ భాషలతో పాటు అర్నాల్డ్‌ పంచిన వెలుగు మన భారతీయ భాషల్లో కూడా ప్రసరించింది. ఎడ్విన్‌ అర్నాల్డ్‌, లైట్‌ ఆఫ్‌ ఆసియాలోని తొలి అధ్యాయాలలో బుద్ధుడి జీవిత చరిత్రను వివరించాడు. కపిలవస్థు యువరాజు సిద్ధార్థుడిగా నేపాల్‌ లోని లుంబిని వనంలో జన్మించడం: ఎదుగుతున్న దశలో సమాజ స్థితిగతుల్ని పరిశీలించడం, ప్రపంచంలో ఇంత దు:ఖం, వేదన ఎందుకు ఉన్నాయని తనలో తానే ప్రశ్నించుకోవడం; సమాధానాలు అన్వేషించు కోవడం మొదలైన విషయాలు రాశాడు. తర్వాత అధ్యాయాల్లో – కొన్నేళ్ళు ధ్యానం మీద ధ్యాస పెట్టి సమాధిలో కూర్చుని తీవ్రమైన ఆలోచనల్లో పడిపోవడం… ఆ క్రమంలో అర్యస్టాంగ మార్గం/ అష్టసమ్యన్‌ మార్గాన్ని కనుక్కోవడం-సంసార బంధనాల్లోంచి విముక్తమై నిర్వాణను సాధించడం ఎలాగని బుద్ధుడు తపన పడడం గురించి వివరంగా రాశాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో సమ్యక్‌ సంబుద్ధ ఎలా సాధించాడో వివరించాడు. అలాగే బుద్ధుడి బోధనల గురించి కొంత చర్చించాడు. సరిగా అర్థంచేసుకోవడం, సరిగా ఆలోచించడం, సరిగా సంభాషించడం సరైన చర్యలు చేపట్టడం, సరైన జీవన విధానాన్ని రూపొందించుకోవడం, సరైన కృషి చేయడం, వివేకాన్ని కలిగి ఉండడం. ధ్యాస సరైన వాటిపై కేంద్రీకరించడం-ఇవన్నీ పాటించిన వారి జీవితం ప్రశాంతంగా గడవకుండా ఎలా ఉంటుంది?
విశ్వజనీయమైన ప్రేమ, జాలి, కరుణల అవసరాన్ని బుద్ధుడు గ్రహించినట్టే ఎడ్విన్‌ అర్నాల్డ్‌ కూడా గ్రహించాడు. అందుకే ఆ విషయాలన్నింటినీ తన రచనలో పొందుపరిచాడు. ఎడ్విన్‌ స్వయంగా కవి గనుక ఈ గ్రంథంలోని సరళతకు, పద లాలిత్యానికీ ప్రపంచ పాఠకులు ముగ్ధులయ్యారు. 19వ శతాబ్డంలో సాహిత్య ప్రపంచానికి అర్నాల్డ్‌ అందించిన గొప్ప కావ్యంగా అది క్లాసిక్స్‌ లిస్ట్‌లో చేరింది. అందుకే ప్రపంచ పాఠకలోకం ఆయనకు జేజేలు పలికింది.

– వ్యాసకర్త సాహిత్యవేత్త, జీవశాస్త్రవేత్త- మెల్బోర్న్‌ నుంచి డా|| దేవరాజు మహారాజు

➡️