- ఉరుగ్వేలో మరోసారి వామపక్షాల జయకేతనం
లాటిన్ అమెరికాలోని ఉరుగ్వే అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికల్లో అక్కడి వామపక్ష కూటమి ‘విశాల వేదిక’ (బ్రాడ్ ఫ్రంట్) మరోసారి విజయం సాధించింది. గతంలో 2005 నుంచి 2020 వరకు అధికారంలో ఉన్న ఈ కూటమి ఐదు సంవత్సరాల క్రితం మితవాద శక్తుల చేతిలో ఓటమి పాలైంది. ఈ సారి తిరిగి అధికారానికి వచ్చింది. అక్టోబరు 27న జరిగిన ఎన్నికల్లో నిబంధనల ప్రకారం 50 శాతం పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య నవంబరు 24న తుది ఎన్నిక జరిగింది. విశాల వేదిక కూటమి అభ్యర్ధి, గతంలో చరిత్ర అధ్యాపకుడిగా, మేయర్‌గా పనిచేసిన యమండు ఆర్సి (57) 52.08 శాతం ఓట్లతో గెలిచారు. తొలి రౌండులో 46.12 శాతం తెచ్చుకున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో దిగువ సభ ఛాంబర్‌లో 99 డిప్యూటీల స్థానాలకుగాను ఆర్సి నాయకత్వంలోని కూటమికి 48, ఎగువ సభ సెనెట్‌లోని 30 సీట్లకు గాను 16 వచ్చాయి. తొలి రౌండులో ప్రత్యర్థులుగా ఉన్న రెండు మితవాద పార్టీల అభ్యర్థులు ఇద్దరికీ కలిపినా 45.09 శాతమే రావటంతో తుది పోరులో వామపక్ష అభ్యర్థి విజయం ఖాయంగా కనిపించినప్పటికీ పోటీ తీవ్రంగా మారింది. మీడియా, ఇతర శక్తులు వామపక్ష వ్యతిరేకతను ఎంతగా రెచ్చగొట్టినప్పటికీ విశాల వేదిక విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నూతన ప్రభుత్వం 2025 మార్చి ఒకటవ తేదీన కొలువు తీరనుంది.
ఉరుగ్వే నిబంధనల ప్రకారం పార్లమెంటు ఎన్నికలు దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో జరుగుతాయి. పార్లమెంటు ఎన్నికల్లో విశాల వేదిక కూటమికి 43.94 శాతం ఓట్లు వచ్చాయి. రద్దయిన సభలో ఉన్న సీట్లతో పోల్చితే దిగువ సభలో 42 నుంచి 48కి, ఎగువ సభలో 13 నుంచి 16కు పెరిగాయి. అధ్యక్ష పదవికి వేసిన ఓటునే ఉపాధ్యక్ష పదవి అభ్యర్థికి కూడా వర్తింపచేస్తారు. ఆ విధంగా కరోలినా కోసె ఎన్నికయ్యారు. పార్లమెంటు దిగువ సభలో ఫ్రంట్‌కు వచ్చిన 48 సీట్లలో కమ్యూనిస్టు పార్టీకి ఐదు, సెనెట్‌లోని 16 సీట్లలో రెండు వచ్చాయి.
చిన్న దేశమైనప్పటికీ ఉరుగ్వే ప్రపంచానికి పెద్ద సందేశమిచ్చిందనే చెప్పవచ్చు. ఈ ఏడాది ప్రపంచంలో జరిగిన అనేక ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువ చోట్ల ఓడిపోయాయి. మితవాద ఫాసిస్టు శక్తులు ముందుకు వచ్చాయి. అయితే ఇక్కడ మితవాదులను ఓడించి జనం వామపక్షానికి పట్టం కట్టారు. గత పాతిక సంవత్సరాలలో ఏ రాజకీయ పక్షం కూడా పది లక్షల ఓట్ల మార్కును దాటలేదు. తొలిసారిగా వామపక్షం ఆ ఘనతను సాధించింది. ఈ కూటమి ఇప్పటికి ఆరుసార్లు ఎన్నికల్లో పోటీ చేసింది. నాలుగు సార్లు అధికారానికి వచ్చింది. గతంలో గెలవని ప్రాంతాలు, నియోజక వర్గాలలో ఈసారి తన పలుకుబడిని పెంచుకుంది. పందొమ్మిది ప్రాంతాలలో (మన జిల్లాల వంటివి) పన్నెండు చోట్ల ప్రథమ స్థానంలో ఉంది. అన్ని చోట్లా దిగువ సభలో ప్రాతినిధ్యం పొందింది. ఈ ఎన్నికల సందర్భంగానే రెండు రాజ్యాంగబద్దమైన ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఓటింగ్ జరిగింది. లాటిన్ అమెరికాలో అధికారానికి వచ్చిన చోట్ల అధ్యక్ష పదవులు పొందినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేని కారణంగా అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఉరుగ్వేలో ఎగువ సభలో మెజారిటీ ఉంది. దిగువ సభలో 99కి గాను 48 ఉన్నాయి.
మొత్తం లాటిన్ అమెరికా వామపక్షాలు ఎదుర్కొంటున్న సమస్యలనే ఉరుగ్వేలోని విశాల వేదిక కూడా ఎదుర్కొంటున్నది. గతంలో మూడు సార్లు అధికారానికి వచ్చినప్పటికీ అమల్లో ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థ పునాదులను కొనసాగిస్తూనే కార్మికులు, ఇతర తరగతులకు కొన్ని ఉపశమన, సంక్షేమ చర్యలను అమలు జరిపింది. దాంతో సహజంగానే అసంతృప్తి తలెత్తి గత ఎన్నికల్లో మితవాదులను గెలిపించారు. గత పాలకుల వైఫల్యం తిరిగి వామపక్షాలకు అవకాశమిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికైన ఆర్సి ఒక పెద్ద జిల్లా గవర్నర్‌గా పనిచేశాడు. రెండవ దఫా ఎన్నికలలో ఓట్ల లెక్కింపు ఇంకా మిగిలి ఉండగానే 49.8 శాతం ఓట్లు పొందిన ఆర్సి విజయం ఖాయంగా తేలటంతో ప్రత్యర్థి అల్వారో డెల్‌గాడో తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేశాడు. దేశంలో వామపక్ష శక్తులు విజయోత్సవాలను ప్రారంభించాయి. విశాల వేదికలో కమ్యూనిస్టు, సోషలిస్టు, క్రిస్టియన్ డెమోక్రాట్లు భాగస్వాములు కాగా ప్రతిపక్ష రిపబ్లికన్ కూటమిలో నాలుగు పార్టీలు ఉన్నాయి. అవన్నీ కూడా మితవాద భావజాలానికి చెందినవే.
లాటిన్ అమెరికాలో ఉన్నంతలో ఉరుగ్వే మెరుగైన స్థితిలో ఉన్నవాటిలో ఒకటి. అయితే పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్నందున దానికి ఉండే జబ్బులకు కార్మికవర్గం గురవుతున్నది. వామపక్షాల పదిహేనేళ్ల పాలనలో మెరుగ్గా ఉన్నప్పటికీ కరోనా సమయంలో లాక్‌డౌన్‌లు, ఇతర ఆర్థిక సమస్యలను ఆసరా చేసుకొని ప్రతిపక్షం గత ఎన్నికల్లో లబ్ధి పొందింది. జవాబుదారీతనంతో కూడిన స్వేచ్ఛను ఇస్తామని, జనాన్ని తాళం వేసి ఉంచేది లేదని ఓటర్ల ముందుకు వెళ్లింది. గత ఐదు సంవత్సరాలలో ఇరుగు పొరుగు దేశాలలో తలెత్తిన సమస్యల కారణంగా విదేశీ పెట్టుబడులు ఉరుగ్వేకు వచ్చినప్పటికీ అక్కడి ప్రమాణాల ప్రకారం చూస్తే నేరాలు, మాదక ద్రవ్యాల జాఢ్యం సవాలుగా మారింది. భద్రత లేదని జనం భావించారు. నేరగాళ్లను రాత్రిపూట అరెస్టు చేసేందుకు అనుమతించాలంటూ తాజా ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీల కూటమి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రతిపాదించిందంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. లాటిన్ అమెరికాలో సురక్షితమైనదిగా ఒకప్పుడు పరిగణించిన ఉరుగ్వేలో ఇప్పుడు సంఘటిత నేరగాళ్ల ముఠాలు రెచ్చిపోతున్నాయి. అందుకే ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలలో 47 శాతం మంది అభద్రత ప్రధాన సమస్యగా ఉందని చెప్పగా 18 శాతం ఉపాధి, 12 శాతం ద్రవ్యోల్బణం గురించి చెప్పారు. జీవన వ్యయం, ఆర్థిక అసమానతల పెరుగుదల వంటి సమస్యలను ఉరుగ్వే ఎదుర్కొంటున్నది. మితవాద ప్రభుత్వం 2030 నుంచి ఉద్యోగ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచుతామని చెప్పగా విశాల వేదిక 60 ఏళ్లుగా ప్రతిపాదించింది. పిల్లల్లో దారిద్య్రరేటు 25 శాతం ఉంది. ఆర్థిక అసమానతలు బాగా పెరిగాయి. తమకు అధికారమిస్తే వామపక్ష నూతన మార్గంలో జనానికి సంక్షేమ విధానాలను, వ్యవసాయానికి పన్ను రాయితీలు ఇస్తామని ఆర్సి వాగ్దానం చేశాడు. గత వామపక్ష ప్రభుత్వాల పాలనలో అబార్షన్లను చట్టబద్దం కావించారు. స్వలింగ వివాహాలను అనుమతించారు. గత పది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ పురోగతిలో పెద్ద మార్పు లేకపోగా ఈడికగా సాగుతున్నది. ధనికుల గురించి గాక తమ గురించి విశాల వేదిక శ్రద్ధ చూపుతుందనే ఆశాభావాన్ని కార్మికవర్గం వ్యక్తం చేసిందనటానికి ఈ విజయం ఒక సూచిక అని చెప్పవచ్చు. దాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది కొత్త ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలు. దేశ ఆర్థిక లోటును తగ్గించేందుకు నూతన ప్రభుత్వం ఏం చేయనుందనే ప్రశ్నలను పరిశీలకులు సంధిస్తున్నారు. బలమైన ప్రభుత్వ పాత్ర ఉండాలని వామపక్ష వేదిక చెబుతున్నది. ధనికులపై పన్ను మొత్తాన్ని పెంచకుండా ఇది ఎలా సాధ్యమన్నది ప్రశ్న. అయితే ఈ అంశం గురించి ఎన్నికల ప్రచారంలో ఆర్సి స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక వృద్ధి ద్వారా అదనపు రాబడిని సాధిస్తామని చెప్పాడు. వామపక్ష ప్రభుత్వాల పట్ల అమెరికా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పూర్వ రంగంలో ఉరుగ్వే-చైనా సంబంధాలు ఎలా ప్రభావితం అయ్యేది చూడాల్సి ఉంది. చైనాకు ఎగుమతులపై ఉరుగ్వే ఎక్కువగా ఆధారపడి ఉంది.
ఎం. కోటేశ్వరరావు