సెకితో సౌర విద్యుత్‌ ఒప్పందం నష్టదాయకం

Nov 30,2024 05:25 #loss, #SECI, #Solar power deal

అదాని గ్రూపుకు చెందిన రాజస్థాన్‌లోని ప్రాజెక్టుల నుండి ఏడాదికి 7000 మెగావాట్ల (17,000 మిలియన్‌ యూనిట్లకు మించకుండా) సౌర విద్యుత్‌ కొనుగోలుకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీలు భారత సౌర విద్యుత్‌ సంస్థ (సెకి)తో చేసుకున్న 25 ఏళ్ళ ఒప్పందం (పవర్‌ సప్లై అగ్రిమెంట్‌ పిఎస్‌ఎ) అనేక విధాలుగా నష్టదాయకమైనది. మోడి ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో భాగంగా, మధ్య దళారిగా సెకి టెండర్లలో పేర్కొంటున్న షరతులు తమకు కావలసిన పెట్టుబడిదారీ సంస్థలకు ఎంపిక చేయడానికి వీలుగా తొత్తడం చేస్తున్నది. సౌర విద్యుత్‌ పరికరాలను తయారు చేసే సామర్ధ్యం ఉన్న (ఉత్పత్తి చేయకపోయినా) సంస్థలే ఎంపికయ్యేలా టెండరు షరతులను రూపొందించింది. దీనితో, అలాంటి సామర్ధ్యం లేని సంస్థలు టెండర్లు వేయడానికి వీలు లేకుండా పోయింది. నిజమైన పోటీకి తావు లేకుండా పోయింది. తొలుత పేర్కొన్న రేటును అదాని గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఎజిఈఎల్‌), అజూర్‌ పవర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎపిఐఎల్‌) యూనిట్‌కు రూ.2.93 నుంచి రూ.2.42కు తగ్గించాక, సెకి వాటిని ఎంపిక చేసింది. దీనికి తోడు మధ్య దళారిగా సెకికి యూనిట్‌కు ఏడు పైసలు చొప్పున కొనుగోలు సంస్థలు (ఎపి డిస్కాంలు) చెల్లించాలి. డిస్కాములే నిజమైన పోటీకి, అత్యధికంగా సంస్థలు పాల్గొనేందుకు వీలు కల్పించే షరతులతో నేరుగా టెండర్లు పిలిచి, అతి తక్కువ రేట్లను పేర్కొన్న సంస్థలను ఎంపిక చేస్తే పలు విధాలుగా ప్రయోజనకరంగా ఉండేది. సెకికి యూనిట్‌కు చెల్లించాల్సిన కమిషన్‌ 7 పైసలు చొప్పున భారీ మొత్తం ఆదా అయ్యేది. అంటే, ఏడాదికి రూ.119 కోట్ల చొప్పున 25 ఏళ్ళలో రూ.2975 కోట్ల మేరకు ఆదా అయ్యేది.

సెకి పై రెండు సంస్థలను ఎంపిక చేసిన నాటికి పోటీ బిడ్డింగు ద్వారా తేలిన సౌర విద్యుత్‌ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. యూనిట్‌కు రూ.1.99 వరకు ఆ రేట్లు తగ్గాయి. ఆ విధంగా చూస్తే, యూనిట్‌కు 50 పైసల చొప్పున (సెకి కమిషన్‌తో కలుపుకుని) 17000 మి.యూ కు ఏడాదికి రూ.850 కోట్ల చొప్పున 25 ఏళ్ళలో రూ.21,250 కోట్ల మేరకు డిస్కాంలకు కొనుగోలు వ్యయం తగ్గేది. పోటీ బిడ్డింగులో తేలిన తక్కువ చార్జీలను బట్టి ఈ మొత్తంలో కొంత మార్పు ఉండవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఎపిఈఆర్‌సి) వివరాలను వెల్లడించకుండా, బహిరంగా విచారణ జరపకుండా ఇచ్చిన ఆమోదంతో, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కాంలు సెకితో 2021 డిసెంబరు మొదటి తేదీన పిఎస్‌ఎ చేసుకున్నాయి. ఒకేసారి 7000 మె.వా సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం చేసుకోవటం అసాధారణం. సెకితో తాము చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పిపిఎ) ప్రపంచంలోనే అతి పెద్దది అని అదాని కంపెనీ 2021 డిసెంబరు 14న ప్రకటించింది. 2025 సెప్టెంబరు, 2026 సెప్టెంబరుల నుండి 3000 మె.వా చొప్పున, 2027 సెప్టెబరు నుండి మరో 1000 మె.వా. చొప్పున ఈ సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఎపి డిస్కాంలు, రాష్ట్ర ప్రభుత్వం సెకితో పిపిఎ చేసుకున్నాయి. ఆ మేరకు సరఫరా ప్రారంభమయ్యే నాటికి అంత సౌర విద్యుత్‌ రాష్ట్రానికి అవసరం లేదు. అనేక సంవత్సరాలుగా మిగులు విద్యుత్‌ను బ్యాక్‌ డౌన్‌ చేయాలని (ఉత్పత్తి తగ్గించాలని) ధర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఆదేశించటం, అలా ఉత్పత్తి చేయని విద్యుత్‌కు స్థిర చార్జీలను చెల్లించటం, మరోపక్క పీక్‌ కొరతను తీర్చటానికి మార్కెట్లో చాలా అధిక ధరలకు స్వల్పకాలిక విద్యుత్‌ కొనుగోళ్ళు చేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. విద్యుత్‌ డిమాండు పెరుగుదల, విద్యుత్‌ లభ్యత, మిగులు, పీక్‌ సమయాలలో కొరత అంచనాల ప్రకారం చూస్తే వచ్చే మూడేళ్ళలో కూడా ఇలాంటి నష్టదాయక పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం అవుతుంది. అంటే, అదాని సౌర విద్యుత్‌ను కొనేందుకు డిస్కాంలు ఏ మేరకు ధర్మల్‌ విద్యుత్‌ను బ్యాక్‌ డౌన్‌ చేయాల్సి వస్తే ఆ మేరకు నివారించదగిన స్థిర చార్జీలను చెల్లించాల్సి వస్తుంది. అవన్నీ ఎఫ్‌పిపిసిఎ రూపంలో వినియోగదారులపై పడతాయి. ఉత్పత్తి సామర్ధ్యాన్ని బ్యాక్‌ డౌన్‌ చేయాల్సిన మేరకు ఎపి జెన్‌కో, ఎపిపిడిసిఎల్‌ వంటి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఎన్‌టిపిసి వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలే సాంకేతికపరంగా, ఆర్థికంగా నష్టపోతాయి.

ఏటేటా డిమాండు పెరుగుదల, విద్యుత్‌ లభ్యత, అదనంగా చేర్చాల్సిన విద్యుత్‌ సామర్ధ్యాన్ని వాస్తవికంగా అంచనా వేసుకుని, హెచ్చుతగ్గులుండే డిమాండును తీర్చేందుకు సాంకేతికంగా సాధ్యమైన మేరకు విద్యుత్‌ మిశ్రమం (ధర్యల్‌, జల విద్యుత్‌, పునరుత్పత్తి అయ్యే సౌర, పవన విద్యుత్‌ వంటి వాటి మిశ్రమం) సమ తూకంలో ఉండేటట్లు పిపిఎలు చేసుకోవాలి. దానివల్ల మిగులు విద్యుత్‌ సాధ్యమైనంత తక్కువగా ఉండేటట్లు చూసేందుకు వీలవుతుంది. వినియోగదారులపై భారాలు కూడా ఆ మేరకు తగ్గుతాయి. ఒకేసారి 7000 మె.వా. సౌర విద్యుత్‌కు పిఎస్‌ఎ చేసుకోవటం వల్ల అదనపు భారాలు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం సౌర విద్యుత్‌ ఏ మేరకు అవసరమౌతుందో వాస్తవిక అంచనాలు వేసుకుని, ఆ మేరకు లభ్యమయ్యే విధంగా పిపిఎలు చేసుకుని అనవసర భారాలను నివారించుకునే అవకాశాలను సెకితో చేసుకున్న ఒప్పందం వల్ల డిస్కాములు కోల్పోయాయి.


 వ్యాసకర్త విద్యుత్‌ రంగ నిపుణులు ఎం. వేణుగోపాలరావు

➡️