ఎపిజిబి తరలింపు – కొన్ని అంశాలు

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు (ఎపిజిబి)తో మరో మూడు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి, విలీనానంతర బ్యాంకును అమరావతికి తరలిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒకే గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని, విలీనానంతర రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న ఆలోచన ఔచిత్యాన్ని పరిశీలించడం అవసరం. దేశంలోని గ్రామీణ బ్యాంకులను విలీనం చేసి వాటి సంఖ్యను 43 నుంచి 28కి కుదించాలని, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకే రాష్ట్రస్థాయి బ్యాంకును ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అలస్యమైనప్పటికీ, ఆ నిర్ణయాన్ని మనం మొదటగా స్వాగతించాలి. ఎందుకంటే, దీనివల్ల ఈ బ్యాంకుల ఓవర్‌ హెడ్‌ ఖర్చులు తగ్గుతాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడం సాధ్యమవుతుంది. మూలధనాన్ని విస్తృతపరుచుకోవడం వీలవుతుంది. కార్యకలాపాల పరిధి పెరుగుతుంది. రూరల్‌ బ్యాంకింగ్‌ను కూడా ఆధునిక అవసరాల వెలుగులో పునర్నిర్వచించుకోవడం సులభం అవుతుంది.

దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల సిబ్బంది తమ బ్యాంకులను విలీనం చేసి రాష్ట్రానికి ఒక్క గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయాలని దీర్ఘకాలంగా కోరుతూ వస్తున్నారు. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తాజాగా ‘వన్‌ స్టేట్‌ – వన్‌ ఆర్‌.ఆర్‌.బి’ విధానానికి అనుగుణంగా దీనికి అంగీకరించింది. ఇందులో భాగంగా నూతన ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి రాష్ట్ర స్థాయిలో ఒకే బ్యాంకుగా మారబోతున్నాయి. ఇప్పటివరకు ఈ నాలుగు బ్యాంకుల్లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ కడపలో, సప్తగిరి గ్రామీణ బ్యాంకు చిత్తూరులో, చైతన్య గ్రామీణ బ్యాంకు గుంటూరులో, ఉత్తరాంధ్రలోని గ్రామీణ బ్యాంకులు వరంగల్‌ ప్రధాన కార్యాలయాలుగా పనిచేస్తున్నాయి.

ఇప్పుడు ఎ.పి లోని 26 జిల్లాల్లోని గ్రామీణ బ్యాంకుల విలీనానంతర రాష్ట్రస్థాయి బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండాలన్నది ప్రశ్న. ఈ విషయంలో సంప్రదాయాలు, మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా ఈ ప్రధాన కార్యాలయాన్ని కడపలో కాకుండా అమరావతికి తరలించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

సంప్రదాయం విషయానికొస్తే, గత నమూనా ఒకటి ఉంది. గతంలో అనంత గ్రామీణ బ్యాంకు, పినాకిని గ్రామీణ బ్యాంకు, రాయలసీమ గ్రామీణ బ్యాంకుతో 2006లో విలీనమయ్యాయి.
అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకుల సంస్థాగత కార్యకలాపాల సామర్థ్యం పెంచాలని, గ్రామీణ ప్రాంతాలకు రుణ పరపతి పెంచాలనీ ఈ విలీనం చేసింది. విలీనానంతర బ్యాంకుగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేసి, రాయలసీమ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో ఉంది కాబట్టి దాని ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే ఏర్పాటు చేసింది.

మార్గదర్శకాల ప్రాతిపదికన చూస్తే – తాజాగా, 2024 నవంబర్‌ 4న కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఆర్‌.ఆర్‌.బి సెక్షన్‌ విడుదల చేసిన మార్గదర్శకాల మేరకు -గ్రామీణ బ్యాంకులు ఏదైనా ఒక పెద్ద గ్రామీణ బ్యాంకులో విలీనమైనప్పుడు, ఆ పెద్ద గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడుందో, అక్కడే విలీనం తర్వాత ఏర్పడే రాష్ట్రస్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలి. ఇతర ఆప్షన్ల కంటే తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం ఇది. సాంప్రదాయమే కాకుండా, ఇలా చూసినా, ఎ.పి రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం కడపలో ఏర్పాటు కావాలి.

ఎపిజిబి నేల విడిచి సాము చేయకుండా ఇక్కడి ప్రజల్లో మమేకమై పోయింది. వారి అవసరాలను గుర్తించింది. ఆ మేరకు తన కార్యకలాపాలని మలుచుకొని ఒక ఆదర్శ ప్రాయమైన రూరల్‌ బ్యాంకింగ్‌కి నమూనాగా తనను తాను ఆవిష్కరించుకున్నది.
రాష్ట్రంలో ఎపిజిబిలో విలీనం అవుతున్న ఇతర మూడు గ్రామీణ బ్యాంకుల మొత్తం డిపాజిట్లు, అడ్వాన్సుల కంటే ఎపిజిబి డిపాజిట్లు అడ్వాన్సులు, ఎక్కువైనప్పుడు, అది ప్రస్తుతం ఉన్న కడపలో విలీనానంతర రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయం కొనసాగించడం కంటే మెరుగైన ఆర్థిక విజ్ఞత ఏమున్నది?

ఇక రాష్ట్రంలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల వ్యాపార ఫలితాల విషయానికొస్తే, ఎపిజిబి తర్వాతే ఏదైనా ! రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల మొత్తం వ్యాపారంలో 43 శాతం వ్యాపారం ఎపిజిబిదే. నష్టాలు తట్టుకునే సామర్థ్యం (సిఎఆర్‌), మూలధన అవసరాల్ని తీర్చే శక్తి ఎపిజిబికే ఎక్కువ (25.65 శాతం). కరెంట్‌ అకౌంట్‌, సేవింగ్‌ అకౌంట్లలో కస్టమర్లను బాగా ఆకర్షించే సిఎఎస్‌ఎ నిష్పత్తిలో ఎపిజిబి దే అగ్రస్థానం. అన్ని బ్యాంకుల మొత్తం కస్టమర్ల కంటే ఎక్కువగా ఎపిజిబి కే 86.75 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. బ్రాంచ్‌ల సంఖ్య ఏ ఇతర గ్రామీణ బ్యాంకుతో పోల్చుకున్నా కూడా రెట్టింపే. మిగతా అన్ని గ్రామీణ బ్యాంకుల కంటే కూడా ఎక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నది కూడా ఎపిజిబి లోనే.

ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు అవుతున్నది. ఇప్పటికీ ఆనాటి విభేదాలు అప్పుడప్పుడు పొడచూపుతున్నాయి. విభజన హామీల అమలు విషయంలో న్యాయం జరగలేదని, అభివృద్ధి క్రమంలో తమను భాగస్వామ్యం చేయడం లేదని వెనుకబడిన జిల్లాలు కన్నీళ్లు పెడుతున్నాయి. వచ్చేవి రాకపోగా, విశాల రాయలసీమ నడిబొడ్డున ఉన్న ఎపిజిబి ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తరలించాలన్న కృతనిశ్చయంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉందని వస్తున్న సంకేతాలు…అనుబంధాలకు అతీతంగా ఇక్కడి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఇప్పటికే వామపక్ష సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ముఖ్యమంత్రి దృష్టికి, ప్రతిపక్ష నేత దృష్టికి కూడా ఈ అంశం వెళ్ళినప్పుడు దీనిని విశాల దృక్పథంతో చూడాలన్న అభిప్రాయం వారు వ్యక్తం చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఈ ప్రాంతపు ఆశల్ని సజీవంగా ఉంచుతున్నాయివి. ఏది ఏమైనా, ఎపిజిబి విలీనమైన తర్వాత కూడా దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ వుండాలన్నది స్థానిక ప్రజలు, బ్యాంకు ఉద్యోగుల మనోభీష్టాన్ని దృష్టిలో వుంచుకొని రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలి!

– ఎ.రఘునాథ రెడ్డి,సేవ్‌ పబ్లిక్‌ సెక్టార్‌ కమిటీ, కడప.

➡️