వైసిపి ఓటమి – కొన్ని కారణాలు

Jun 8,2024 05:15 #editpage

రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు మూడవసారి జరిగిన ఎన్నికలలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలై కేవలం 11 సీట్లకు పరిమితమైంది. తెలుగు దేశం పార్టీ కూటమి 164 సీట్లతో ప్రభంజనాన్ని సృష్టించింది. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాలలో ఒకే రకమైన విజయాన్ని కూటమి సాధించింది. వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రి వర్గంలో ఉన్న 26 మంది మంత్రులలో 24 మంది ఘోర పరాజయం పాలయ్యారు. పాత 13 జిల్లాలలో 8 జిల్లాలలోని వెసిపికి ఒక్క సీటు కూడా లభించలేదు. 2024 ఎన్నికలలో కూటమిలో తెలుగుదేశం పార్టీకి 45.60 శాతం, జనసేనకు 6.85 శాతం, బిజెపికి 2.83 శాతం ఓట్లు లభించాయి. వైసిపి 39.37 శాతం ఓట్లకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 25 స్థానాలకుగాను 21 స్థానాలు కూటమికి, 4 స్థానాలు వైసిపికి లభించాయి. ఇంత పెద్ద స్థాయిలో ఓటమికి కొన్ని కీలకమైన కారణాలను పరిశీలిద్దాం.
జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంకుశ ధోరణి
2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రజలతో మమేకమైన జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రజాస్వామ్య ధోరణికి భిన్నంగా నిరంకుశ, అహంభావ ధోరణితో పరిపాలన కొనసాగించారు. ప్రజలకు, ఆయనకు మధ్య ‘ఇనుప తెర’ ఏర్పడింది. వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి 2004-2009 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఒక క్రమపద్ధతిలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను, అధికారులను కలిసేవారు. ఉదయం 9 గంటల కల్లా బేగంపేట క్యాంప్‌ కార్యాలయంలో అనేక మందిని కలిసి వాళ్లు చెప్పే విషయాలను శ్రద్ధగా విని పరిష్కారానికి ప్రయత్నించేవారు. ఐదేళ్ల పాటు పాలన చేసిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాప్రతినిధులను, శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను, మంత్రులను, శాసనమండలి సభ్యులను, వివిధ యూనియన్ల నాయకులను, మేథావులను కలవడానికి ఇష్టపడలేదు. అనేక మార్గాల ద్వారా అందే సమాచారాన్ని ఆయన స్వీకరించలేదు. ఫలితంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వంటి వారు ప్రధాన వ్యక్తులుగా రూపొంది…సమాచారం ముఖ్యమంత్రి వరకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు అంగన్‌వాడీలు 1,05,000 మంది 42 రోజుల పాటు సమ్మె చేస్తే దాని పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రిని కలిసే అవకాశమే లభించ లేదు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ ప్రాతినిధ్యాలు ముఖ్యమంత్రికి అందించే అవకాశం కార్యాలయంలో కాకుండా, జిల్లాలలో హెలిపాడ్‌ల వద్ద మాత్రమే లభించేది. దీని వలన ప్రజా ప్రతినిధులలో స్థానిక సంస్థల ప్రతినిధులలో తీవ్ర అసంతృప్తి, నిస్తేజం ఏర్పడింది. దీనితో పాటు ‘వాలంటీర్ల వ్యవస్థ’ పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకుండా చేయడంతో కార్యకర్తలలో పార్టీ పరంగా ఉత్సాహం లోపించింది. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో స్థానిక సంస్థలు, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రాధాన్యత కోల్పోయారు.
మౌలిక వసతుల కల్పన ఏదీ?
ఐదేళ్ల పాలనలో సంక్షేమం కోసం ‘బటన్‌ నొక్కుడు’ (డి.బి.టి) ద్వారా ప్రజలకు రూ.2,70,000 కోట్లు అంద చేశామని ముఖ్యమంత్రి అనేక బహిరంగ సభలలో ప్రకటించారు. కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలను పూర్తిగా విస్మరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నాలుగేళ్లలో రూ.62,000 కోట్లు కేటాయించి కేవలం రూ.31,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వెలిగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులు పూర్తి కావటానికి ఎటువంటి ఆసక్తి చూపించలేదు. గుంటూరు చానల్‌, వరికపూడిశెల వంటి చిన్న నీటి పారుదల ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించలేదు.
రాష్ట్రంలో మౌలిక వసతులు ముఖ్యంగా రోడ్ల నిర్మాణం పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపించారు. ప్రధానమైన రోడ్లు వేలాది కిలోమీటర్లు దెబ్బ తిన్నప్పటికీ వాటి నిర్మాణానికి ప్రయత్నించలేదు. రోడ్లకు పడిన గుంతల వలన అనేకమంది మరణించారు. మంత్రులు ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు
ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను పూర్తిగా దూరం చేసుకున్నది. ప్రధానమైన యూనియన్లతో చర్చించడం కానీ, వారితో అనేక సమస్యలపై కానీ ముఖ్యమంత్రి మాట్లాడలేదు. చర్చలు కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణలకే పరిమితమయ్యేవి. ప్రభుత్వం తమకనుకూలంగా ఉండే నలుగురు నాయకుల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నది. విజయవాడ బి.ఆర్‌.టి.ఎస్‌ రోడ్డులో 2022 ఫిబ్రవరి 3న జరిగిన మహోద్యమం తరువాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా ఉద్యమాలను అణచివేయడానికి పూనుకున్నది.
ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇచ్చే వేతన సంఘం సిఫార్సులలో ముఖ్యంగా 11వ పి.ఆర్‌.సిలో పూర్తిగా అన్యాయం చేసింది. ప్రతి నెలా ఒకటవ తేదీకి జీతం రావడం గగనమైపోయింది. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు ఇప్పటికీ దాదాపు రూ.18,000 కోట్ల బకాయిలు చెల్లించవలసి ఉంది. వీటితో పాటు సి.పి.యస్‌ రద్దు చేస్తామన్న హామీని అమలు పరచకుండా జి.పి.యస్‌ అనే కొత్త విధానాన్ని సృష్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. అదే విధంగా ఉపాధ్యాయులను యాప్‌ల పేరుతో, ప్రవీణ్‌ ప్రకాష్‌ విజిట్ల పేరుతో వేధించడంతో పాఠశాలల మౌలిక వసతులు కొంత మెరుగుపడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయినది.
కక్ష సాధింపు ధోరణి
గెలుపొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా, నాయకుడైనా సంయమనంతో వ్యవహరించాలి. ప్రత్యేకించి పరిపక్వత కలిగి ఉండాలి. కానీ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించింది. అధికారంలోకి వచ్చిన కొద్దికాలంలోనే ప్రజావేదికను కూల్చివేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ పేరుతో చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేసి అనేక రోజులపాటు జైలులో ఉంచటం ప్రజలలో సానుభూతి కలగచేసింది. అంతేగాక ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం పట్ల రైతులలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో రాజకీయ కక్షలతో ప్రతిపక్ష పార్టీలపై దాడులు జరగటాన్ని కూడా ప్రజలు వ్యతిరేకించారు. ఎన్‌.టి.ఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పును ప్రజలు హర్షించలేదు.వీటితోపాటు ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు అతి సహజమైన విషయం. ఏ ప్రభుత్వం ఉన్నా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వీటిని నిర్వహిస్తూ ఉంటాయి. కానీ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమాలను క్రూరంగా అణచివేయడానికి పోలీస్‌ యంత్రాంగాన్ని పూర్తిగా ఉపయోగించింది.
నిరుద్యోగం
ఆంధ్రప్రదేశ్‌ విభజన (2014లో) తర్వాత రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలలో నిరుద్యోగం ప్రధానమైనది. రాష్ట్రంలో ఐ.టి రంగ పరిశ్రమలుగాని, ఇతర పరిశ్రమలుగాని అభివృద్ధి చెందలేదు. గత ఐదేళ్లుగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో వైఫల్యం చెందింది. లక్షకు పైగా సచివాలయ ఉద్యోగాలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఉద్యోగాలు మినహా మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రతి సంవత్సరం ‘జాబ్‌ క్యాలెండర్‌’ విడుదల చేస్తామని చెప్పి, ఒక్కసారి మాత్రమే 10 వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారు. గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో దాదాపు 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే, నిరుద్యోగ అభ్యర్థుల ఒత్తిడి వల్ల చివరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇంకా పరీక్ష జరగ లేదు. మెగా డిఎస్సీ ఇవ్వాలని ఎమ్మెల్సీలు, నిరుద్యోగులు, యువజన సంఘాలు ఒత్తిడి చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గ్రూప్‌-2, గ్రూప్‌-1, గ్రూప్‌-3 వంటి పోస్టుల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉండగా వాటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. వయోపరిమితి పెంచలేదు. ఈ ఎన్నికలలో నగదు బదిలీ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలలోని నిరుద్యోగులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేశారు.
ప్రజా వ్యతిరేకత
మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేసిన వైనం, రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో అంటకాగడం వంటి కారణాల వల్ల…గత ఐదేళ్లుగా పాలించిన వైసిపి ప్రభుత్వం పట్ల వివిధ తరగతుల ప్రజలలో అసంతృప్తి ఏర్పడింది. ప్రజలను సంతృప్తి పరచాలంటే ‘బటన్‌ నొక్కుడు’ ఒక్కటే చాలదని ఈ ఎన్నికలు నిరూపించాయి. సమాజంలోని రైతులు, కార్మికులు, సంఘటిత ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మధ్య తరగతి ప్రజలు, యువకులు మొదలగు వారందరినీ సంతృప్తి పరచాలి. ‘బటన్‌ నొక్కుడు’ (డి.బి.టి)…నయా ఉదారవాద విధానాల అమలులో ప్రపంచ బ్యాంక్‌ ఆదేశాలతో అమలు జరుగుతున్న ఒక విధానం మాత్రమే. వైసిపికి శాసనసభ స్థానాలు 11 మాత్రమే వచ్చినప్పటికీ 39.37 శాతం ఓట్లు వచ్చాయి. ఇవి తక్కువేమీ కాదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షానికి ముఖ్యమైన పాత్ర ఉన్నది. బాధ్యతాయుత ప్రతిపక్షంగా రాబోయే ఐదేళ్లు వైసిపి సమర్థవంతంగా పని చేయాలని ఆశిద్దాం.

కె. యస్‌. లక్ష్మణరావు

/ వ్యాసకర్త శాసనమండలి సభ్యులు, సెల్‌ : 8309965083/

➡️