ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో రాత పూర్వక హామీ లేనందున దీనిపై వ్యాజ్యంగా తీసుకోలేమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం ధర్మం కాదు. ప్రత్యేక హోదా అంశం రెండు ప్రభుత్వాల పరిధిలోని విషయమని, ప్రభుత్వాలు ఏం చేయాలో కోర్టులు చెప్పలేవని పేర్కొనడం నిరాశ కలిగించింది. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ పాల్ దాఖలు చేసిన పిల్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేకహోదాపై మౌఖికంగానే కేంద్రం హామీ ఇచ్చిందని, రాతపూర్వకంగా లేనప్పుడు కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రశ్నించడం తెంపరితనమే. అంతేగాక ఈ రాష్ట్ర ప్రజలను, వారి ఆకాంక్షలనూ తృణీకరించడమే ఔతుంది. పార్లమెంటులో ప్రధాని చేసిన ప్రకటనకు విలువ లేదని వాదించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కూడా. వామపక్ష ఎంపిలతోపాటు బిజెపి సభ్యులు కూడా ప్రత్యేక హోదా కోసం ఆనాడు డిమాండ్ చేశారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ప్రకటన కూడా చేశారు. అప్పుడు రాత పూర్వక హామీ ఇవ్వలేదని, దానికి విలువ లేదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పడం ముమ్మాటికీ విద్రోహమే! కమలనాథులకు ఇది వెన్నతో పెట్టిన విద్యని మరోమారు విదితమయింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలన్న డిమాండ్ అత్యంత న్యాయసమ్మతమైనది, ధర్మబద్ధమైనది. కేంద్ర ప్రభుత్వ విద్రోహంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. కార్యాచరణకు పూనుకోవాలి. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ బిజెపితో అధికారం పంచుకుంటున్నారు కనుక టిడిపి, జనసేన నాయకులు కిమ్మనకుండా ఉండరాదు. ఒకప్పుడు ధర్మపోరాట దీక్షలని ఊరూరా తిరిగి యువతను, విద్యార్థులనూ సమీకరించిన ఈనాటి ముఖ్యమంత్రి ఒకసారి వాటిని గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. ఆనాడు పాచిపోయిన లడ్డూలంటూ ఎద్దేవా చేసిన నేటి ఉప ముఖ్యమంత్రి తన వైఖరిని తెలుగు ప్రజలకు వెల్లడించాలి. తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీని స్థాపించి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను ఎదిరించిన ఎన్‌టి రామారావు వారసులమని చెబుతున్న ఆ పార్టీ నేతలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రాల హక్కుల కోసం ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, రాజ్యాంగంలోని ఫెడరలిజాన్ని కాపాడడానికి అవిరళ కృషి చేసిన యోధుడు ఎన్‌టిఆర్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన ద్వారానే అటువంటివారి కలలు నెరవేరుతాయి. ఆ దిశగా టిడిపి శ్రేణులు యోచిస్తే పాలక కూటమిపై ఒత్తిడి పెరుగుతుంది.
భారతదేశ చరిత్రలో మొట్టమొదట ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్, బిజెపి కూడబలుక్కొని నిలువునా చీల్చాయి. తీవ్రమైన నష్టాన్ని కలిగించే రాష్ట్ర విభజనను కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలు వ్యతిరేకించడంతో పార్లమెంటులో ప్రత్యేక హోదా, అదేవిధంగా ఇంకొన్ని హామీలనూ ఇచ్చారు. అంతేగాక 2014 ఎన్నికల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామనీ, విభజన హామీలు నెరవేరుస్తామనీ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభలో వాగ్దానం చేసి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారానికి వచ్చారు. కానీ మోడీ సర్కారు మాట మార్చి ‘హోదా ముగిసిన అధ్యాయం’ అని ప్రకటించి రాష్ట్ర ప్రజలను మోసపుచ్చింది. ఆ తరువాత రాష్ట్రంలో అధికారానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి కూడా హోదాపై ఏమీ చేయలేమని చేతులెత్తేయడం దారుణం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఒక తప్పనిసరి అవసరం. రాష్ట్ర పారిశ్రామికీకరణకు, యువతకు ఉపాధి కల్పనకూ, రాష్ట్ర బడ్జెట్ సహాయానికీ… ఇలా సకల విధాలా ఇది ఎంతో ప్రయోజనకరం. దాన్ని సాధించుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి. పాలకులను నిలదీయాలి.