శ్రీలంక అధ్యక్ష పదవికి సెప్టెంబరు 21న జరిగిన ఎన్నికల్లో జనతా విముక్తి పెరుమున (జె.వి.పి), నేషనల్ పీపుల్స్ పవర్ (వామపక్ష ప్రగతిశీల శక్తుల కూటమి-ఎన్.పి.పి) నాయకుడు అనుర కుమార దిసనాయకె 57,40,179 (42.3 శాతం) ఓట్లతో విజయం సాధించారు. ఇవి 2019లో ఆయన పోటీ చేసినప్పుడు వచ్చిన 4,18,553 (3.16 శాతం) కన్నా గణనీయమైన పెరుగుదలగా వున్నాయి. శ్రీలంకలో తొలిసారి ఒక వామపక్ష నాయకుడు గెలుపు సాధించిన చారిత్రిక విజయమిది.
దేశాన్ని కుదిపివేసిన ప్రజా పోరాటంలో ఆయన పార్టీ భాగం పంచుకున్న ప్రత్యక్ష ఫలితమే దిసనాయకె మద్దతు ఇంతగా పెరగడం, విజయం లభించడం. వ్యవస్థాగతమై పోయిన రాజకీయ అవినీతి, పెట్రోలు, గ్యాస్ వంటి నిత్యావసరాల కొరతతో ప్రజలు విసుగెత్తిపోయారు. అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్ష నాయకత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసనల్లో కదలివచ్చారు. గత ఏడు దశాబ్దాలలో అనుసరించిన వినాశకర ఆర్థిక విధానాల కారణంగా రైతుల కష్టాలు, నిరుద్యోగం పెరిగిపోయాయి. జీవన ప్రమాణాలు క్షీణించిపోయాయి. వీటిపై పేరుకుపోయిన ఆగ్రహం నిరసనల రూపంలో బద్దలైంది. దేశాధ్యక్షుడు రాజపక్ష రాజీనామా చేసి పారిపోవలసి వచ్చింది. రెండు ప్రధాన పాలక పార్టీల మధ్యనే అధికారాన్ని అట్టిపెట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా రణైల్ విక్రమ్ సింఘె పూర్తిగా రాజపక్ష మద్దతుపై ఆధారపడి అధికారం స్వీకరించారు.
వైఫల్యాలు, నిర్బంధాలకు తిరస్కారం
దేశాన్ని ఎదుర్కొంటున్న వ్యవస్థాగతమైన అంశాలను సరిదిద్దడానికి సుముఖంగా లేని విక్రమ సింఘె పరిస్థితిని దారికి తేవడంలో విఫలమైనాడు. అనేక కఠోర షరతులకు తలవంచి ఐ.ఎం.ఎఫ్ దగ్గర అప్పు కోసం చర్చలు జరిపాడు. అవినీతి జాడ్యాన్ని అరికట్టలేకపోయాడు. ఆయన విధానాలు పరిస్థితిని మెరుగుపర్చకపోగా ప్రజలపై భారం మరింత పెరగడానికి కారణమైనాయి. అసమానతలు మరింత పెరిగిపోయాయి. దేశ జనాభాలో 20 శాతం మంది మొత్తం సంపదలో సగానికి పైగా పొందుతుంటే అట్టడుగున వున్న 20 శాతం మంది కేవలం 5 శాతం మాత్రమే పొందగలిగారు. తన వైఫల్యాలపై తలెత్తే ఎలాంటి నిరనసనైనా నిర్బంధ బల ప్రయోగంతో అణచివేసే ప్రభుత్వ వైఖరి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రజాస్వామిక హక్కులను, స్వేచ్ఛలను అణచి వేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ భద్రతా చట్టం, టెర్రరిజం వ్యతిరేక చట్టం వంటివి తీసుకొచ్చింది.
ఇలాంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలూ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ఎలాగనే దాని చుట్టూనే తిరిగాయి. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఎలా పరిష్కరించాలో చెప్పిన ఎన్.పి.పి, దిసనాయకేల ప్రచారం వారిని ఆకట్టుకుంది. ఆర్థిక వ్యవస్థను సంస్కరించాలనే దానికే దిసనాయకె ఎన్నికల ప్రణాళిక ప్రాధాన్యతనిచ్చింది. పెరిగిపోతున్న అసమా నతలను పరిశీలించి సమానత్వాన్ని పెంపొందించేందుకు విధానాలలో మార్పులు తీసుకు వస్తామని కూడా అది వాగ్దానం చేసింది. కనీస సేవలూ అవకాశాలూ పౌరులందరికీ అందుబాటులో వుండేలా చూస్తామన్నది. ఇందులో భాగంగానే విద్యారంగం, వైద్య సేవల వ్యవస్థాగత పరిమితులను సంస్కరించగలననీ వాగ్దానం చేసింది.
ఎన్నికల వాగ్దానాలు, విశ్వసనీయత
నిర్లక్ష్యానికి గురై కష్టాలపాలైన తరగతులను ఆదుకోవడానికి గాను సంక్షేమ పథకాలూ, ప్రభుత్వ మద్దతూ కల్పిస్తామని కూడా ఆ ప్రణాళిక నొక్కి చెప్పింది. భాషా పరమైన, మతపరమైన మైనార్టీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం గురించి కూడా ప్రస్తావించింది. 2009లో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి తమిళులు అధికార వికేంద్రీకరణ, పునరేకీకరణ కోరుతున్నారు. వరసగా వచ్చిన ప్రభుత్వాలు ఈ రెండు విధాలుగానూ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోక పోవడం మైనార్టీలలో ఇబ్బంది కరమైన భావనలకు దారితీసింది. వెంటనే ఎన్నికలు జరిపిస్తామనీ, వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకునేలా కొత్త రాజ్యాంగం తీసుకొస్తామనీ ఎన్.పి.పి వాగ్దానం చేసింది.
రాజకీయ రంగంలో చూస్తే దిసనాయకె అధ్యక్ష తరహా పాలనను రద్దు చేస్తామని వాగ్దానం చేశారు. 1978 నుంచి ఏదో ఓ విధంగా ఇది అమలులో వుంది. పార్లమెంటును వెంటనే రద్దు చేస్తామనీ కొత్త పార్లమెంటు కోసం ఎన్నికలు జరిపిస్తామనీ ఆయన మాటిచ్చారు. అవినీతి జాత్యహంకార సంస్కృతిని నిర్మూలిస్తాననీ, వాగ్దానం చేశారు. వ్యవస్థను వెంటాడుతున్న బేఖాతరు తనాన్ని అంతమొందించి జవాబుదారీతనాన్ని పాటించేలా సంస్కరణలు తెస్తామన్నారు. ఈ వాగ్దానాలకు ప్రజల ఆమోదం లభించింది.
రెండు ప్రధాన పాలక పార్టీల పరిమితులేమిటో 2022 పోరాటం బహిర్గతం చేసింది. వాటితో ప్రజలు విసిగిపోయారు. తమను చుట్టుముట్టిన ఆర్థిక రాజకీయ ఊబి నుంచి బయిటపడేయడం కోసం సంప్రదాయ రాజకీయ పార్టీలను విశ్వసించలేమని వారు భావించారు. వారు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తుండగా జె.వి.పి/ఎన్.పి.పి ఆ ప్రత్యామ్నాయంగా రూపొందాయి. వారు పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్న వారు కావడం, రాజకీయాలలో విశుద్ధంగా నిజాయితీగా వుండటం సహాయపడింది.
ముందున్న పెను సవాళ్లు
ఎన్నికల విజయం తర్వాత ఇప్పుడు దిసనాయకె, ఆయన కూటమి ముందు పెద్ద సవాళ్లు ఎదురు చూస్తున్నాయి. ఆయన వెనువెంటనే ఆలోచించవలసింది ఐ.ఎం.ఎఫ్ రుణం పట్ల అనుసరించాల్సిన చర్యల గురించి. షరతులపై మరోసారి సంప్రదింపులు జరుపుతాననీ ప్రజల సంక్షేమం విషయంలో రాజీ పడకుండా చూస్తాననీ ఆయన వాగ్దానం చేశారు. దీంతోపాటే వివిధ అంతర్జాతీయ ఒప్పందాల సమస్య, వివిధ దేశాలతో సంబంధాలను పునర్ నిర్వచించుకోవాల్సి వుంటుంది. ప్రత్యేకించి పక్కనే వున్న దేశాలు, ఈ ప్రాంతంలోని దేశాల విషయంలో సంబంధాలపై మరోసారి దృష్టి సారించాలి. హిందూ మహా సముద్రంలో శ్రీలంక ఉనికి వ్యూహాత్మక ప్రదేశంగా వుంది. ఈ జలాలను తన కాపలాలో వుంచుకోవాలని అమెరికా ప్రయత్నాలు చేస్తున్న రీత్యా ఈ కర్తవ్యం సవాలు అవుతుంది. తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కాపాడుకోవడం, బహుళ ధృవ స్వభావాన్ని బలోపేతం చేసుకోవడం జరగాలి. సార్క్‌లోనూ, అలీనోద్యమంలోనూ సభ్యురాలిగా తన సముచిత పాత్ర పోషించడం ద్వారా ఈ పని చేయవలసి వుంటుంది.
మైనారిటీల పట్ల ప్రభుత్వం అనుసరించే వైఖరి ఏమిటన్నది మరో ప్రధాన సవాలుగా వుంటుంది. వాస్తవం చెప్పాలంటే దిసనాయకె తమిళుల ఓట్లలో కొద్ది భాగం మాత్రమే తెచ్చుకోగలిగారు. మైనార్టీలు ప్రత్యేకించి తమిళుల పట్ల ఆయన పార్టీ వైఖరి ఎలా వుంటుందనే సందేహాన్ని ఇది వెల్లడిస్తుంది. యుద్ధం, ఆర్థికంగా వెనుకబడిపోవడం మైనార్టీలలో విస్తారమైన భాగాన్ని దూరం చేశాయి. ఈ గాయాలను మాన్పవలసిన బాధ్యత దిసనాయకె మీద వుంది. ఉత్తరంలో తూర్పులో తమిళులకు అధికార వికేంద్రీకరణ ఎలా చేయాలన్నది ప్రశ్న.
దిసనాయకె కూ ఎన్.పి.పి కూటమి నిజాయితీపై నమ్మకంతో ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చిన కొత్త గాలులతో ప్రజలు వారికి ఓట్లేశారు. ఇప్పుడు తమ వాగ్దానాలను నిలబెట్టుకోవడం, ప్రజల ఆకాంక్షలను అందుకోవడం విజేతల ముందున్న బాధ్యత. దిసనాయకె కు జె.వి.పి కి అత్యుత్తమ ఫలితాలు కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నాము. వాగ్దానం చేసిన మార్పులను వారు తీసుకొస్తారనీ వామపక్షాన్ని బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.
పాలకవర్గ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల విజయాలు సాధించాలంటే అది పోరాటాలు నడిపించడం వాటిలో పాల్గొనడం ద్వారానే సాధ్యమన్న నమ్మకాన్ని మరోసారి తీసుకు రావడంలో దిసనాయకె విజయం ఎంతైనా ప్రభావం చూపిస్తుంది.
(సెప్టెంబరు 25 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)