ముందడుగు

రాష్ట్ర విభజన జరిగాక పదేళ్లయినా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య పెండింగ్‌ పడ్డ సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భేటీ కావడం స్వాగతించదగిన పరిణామం. సమావేశానికి చంద్రబాబు చొరవ చూపి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాయడం, వెంటనే రేవంత్‌రెడ్డి స్పందించడం అభినందనీయం. శనివారం హైదరాబాద్‌లో ఇద్దరు సి.ఎం.లు, ఇరు రాష్ట్రాల మంత్రులు, అధికారుల భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య పేరుకుపోయిన విభజన సమస్యల పరిష్కారానికి తొలి సమావేశంలోనే ప్రాథమిక రోడ్‌ మ్యాప్‌ ఖరారైంది. మూడంచెల వ్యవస్థ ఏర్పాటుకు ఉభయులూ ముందుకొచ్చారు. తొలి దశలో అధికారుల కమిటీ చర్చించి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అక్కడ తేలని అంశాలు మంత్రుల కమిటీ ముందుకు వెళతాయి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే చివరిగా ముఖ్యమంత్రులు పరిష్కరిస్తారు. చర్చలు, పరిష్కారాలను సాగదీయకుండా నిర్ణీత కాల వ్యవధి నిర్ణయించుకొని పూర్తి చేయడానికి ఇరు పక్షాలూ పరస్పర అంగీకారానికి రావడం హర్షణీయం. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపిణీ, చట్టంలో పేర్కొనని ఆస్తుల పంపిణీ, విద్యుత్‌ బకాయిలు, ఉద్యోగుల విభజన, రాష్ట్ర ఆర్థిక సంస్థ వంటి ప్రధాన అంశాలపై చర్చకు మొదటి సమావేశంలో ప్రాధాన్యమిచ్చారు. మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాల కట్టడికి ఉమ్మడిగా పని చేయాలని నిర్ణయించారు. ఇద్దరు సి.ఎం.ల మధ్య మరోసారి భేటీ ఉంటుందని సంకేతాలిచ్చారు.
రాష్ట్ర విభజనకు ముందు రెండు ప్రాంతాల మధ్య తలెత్తిన ఆవేశకావేశాలను విభజన అనంతరం కూడా కొందరు పనిగట్టుకొని కొనసాగించారు. ఓటుకు నోటు, ఫోన్‌ ట్యాపింగ్‌, నదీ జలాలు, కరెంట్‌, విలీన మండలాలు…ఇలా తడవకో అంశాన్ని ముందుకు తెచ్చి రెండు వైపులా సెంటిమెంట్‌ను సజీవంగా ఉంచడానికి పడరాని పాట్లూ పడ్డారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ నాడే వెంటనే నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతలు, రెండు రాష్ట్రాల పోలీసుల మోహరింపు పరాకాష్ట. కరోనా సమయంలో ఆంధ్రా నుంచి తెలంగాణలోకి అంబులెన్స్‌లను అడ్డుకోవడం మరో దురాగతం. సెంటిమెంట్‌ను రేగ్గొట్టడంలో బిజెపి అన్ని విధాలుగా ముందుంది. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల సమస్యను పరిష్కారించాల్సిన కేంద్ర ప్రభుత్వం తనే తరచు వివాదాలకు కారణమైంది. విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరు సి.ఎం.ల మధ్య గడచిన పదేళ్లల్లో ప్రత్యేకంగా సమావేశమైంది లేదు. కేవలం మర్యాదపూర్వక కలయికలు, లేదంటే ప్రారంభోత్సవాలకే! గతానికి భిన్నంగా ఇప్పుడు విభజన సమస్యల పరిష్కారానికి ఇరు వైపులా చొరవ చూపడం, ఆచరణాత్మకంగా అడుగు ముందుకేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంతోషం కలిగిస్తుంది.
ఎంతటి జటిల సమస్య పరిష్కారానికైనా చర్చలే ఏకైక మార్గం. రెండు తెలుగు రాష్ట్రాలూ కూర్చొని పరస్పరం సామరస్యపూర్వకంగా చర్చించుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కేంద్రంలో బిజెపి అధికారంలోకొచ్చాక సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించింది. రాష్ట్రాల హక్కులను కాలరాయడంతోపాటు అధికారాలను కేంద్రీకృతం కావించి పెత్తనం చెలాయించి రాజకీయంగా పబ్బం గడుపుకుంటోంది. ఈ తరుణంలో కేంద్రానికి అవకాశం ఇవ్వకుండా రెండు తెలుగు రాష్ట్రాలూ తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి. ఇప్పటికే కృష్ణా, గోదావరి జలాలపై అధికారాలు కేంద్రం చేతికి చేరిన విపత్కర విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. విభజన హామీలు, హోదాపై కేంద్రం మాట తప్పింది. విభజన హామీలు, ఆర్థిక మద్దతు, బకాయిల చెల్లింపులు, హోదా కోసం రెండు రాష్ట్రాలూ కేంద్రంపై పోరాడాలి. ప్రత్యేక హోదా అంశానికి ప్రాధాన్యత లేదని ఢిల్లీ పర్యటన అనంతరం ఎ.పి ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం తగదు. రాష్ట్ర ఖజానాకు ఇవ్వాల్సిన నిధులను, ఆర్థిక తోడ్పాటును కేంద్రం హోదాతో ముడిపెట్టడం అభ్యంతరకరం. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి. కేంద్రం నుంచి వాటిని సాధించేందుకు తగిన కృషి చేయాలి.

➡️