ముందడుగు

భారత, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) పొడవునా నాలుగున్నరేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడటం ముదావహం.. 2020 నాటి పరిస్థితి పునరుద్ధరణకు ఇరు దేశాలు నిర్ణయించడంతో ఉద్రిక్తతలు సడలి, సరిహద్దుల్లో మళ్లీ శాంతి పవనాలు వీయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
లడఖ్‌లోని గాల్వాన్‌ నది నుంచి షొంగోంగ్‌ నది వరకూ ఉన్న ప్రాంతానికి సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానైనట్లుగా 2020 జూన్‌ 15లో గాల్వాన్‌ ఘర్షణలకు దారి తీసింది. 1962 భారత్‌ – చైనా యుద్ధం తరువాత 58 ఏళ్లకు జరిగిన ఈ ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది, చైనాకు చెందిన నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాకు చెందిన టిక్‌ టాక్‌ వంటి ప్రసిద్ధ యాప్‌లపై నిషేధం, ఆ దేశానికి చెందిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తులు, పెట్టుబడులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ఇన్ని ఆంక్షలు, నిషేధాలు ఉన్నా భారత్‌ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఇప్పటికీ కొనసాగుతున్నది.. ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ మధ్య 56, 290 కోట్ల డాలర్ల వాణిజ్యమే ఇందుకు నిదర్శనం. మ్యానుఫాక్చరింగ్‌ రంగంలోకి చైనా టెక్నాలజీ, పెట్టుబడుల అడ్డుకోవడం తప్పిదమే. ఇరుదేశాల విదేశాంగ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు మధ్య పలుమార్లు జరిగిన చర్చలు, డబ్ల్యుఎంసిసి నిపుణుల కమిటీ, కోర్‌ కమాండర్లు మధ్య పదుల సంఖ్యలో చర్చలు సానుకూల ఫలితాలనిచ్చాయి. నాటి ఘటన తరువాత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు, చైనా వ్యతిరేకత పెంచేందుకు ఇక్కడి మితవాద, మతతత్వ శక్తులు యత్నించి భంగపడ్డాయి.
ఇరు దేశాలు హిమాలయాల దగ్గర నుంచి నదులు, లోయల మీదుగా 3,400 కిలోమీటర్ల పొడవున్నా సరిహద్దును పంచుకుంటున్నాయి. కొన్ని నదులు సహజంగానే వేసవిలో మార్గాన్ని మార్చడంతో సరికొత్త సరిహద్దు తగాదాలకు ఆస్కారమేర్పడుతోంది. సరిహద్దుకు సంబంధించి కచ్ఛితమైన విభజన రేఖ రూపుదిద్దుకునేంత వరకు ఎక్కడో ఒక దగ్గర వివాదాలు, ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. వాటిని నివారించేందుకు ఏం చేయాలన్నదానిపై ఇరు దేశాల మధ్య మరింత ఎక్కువగా చర్చలు జరగాలి. సైనికులు వివాదాస్పద ప్రాంతాలను క్రమం తప్పకుండా సందర్శించి, కొన్ని జాడలను విడిచిపెడతారు. సరిహద్దు ఆక్రమణలు అని పిలవబడే వందలాది ఘటనలు అడపాదడపా చోటుచేసుకుంటుంటాయి.. వీటిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు కొన్ని శక్తులు యత్నిస్తుంటాయి. వాటి ఆధీనంలోని కార్పొరేట్‌ ప్రచార బాకాలు దీనికి మరింత మసాలా దట్టించి పొరుగు దేశంపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు యత్నిస్తుండడం మనం చూస్తున్నాం. సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత కొనసాగించేందుకు, వివాదాన్ని పరిష్కరించేందుకు 1993, 2003, 2005లో కుదిరిన ఒప్పందాలను ఇరు దేశాలు అమలు చేయకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గాల్వాన్‌ ఘటన జరిగిన మూడు నాలుగు నెలల్లోనే ఇరు దేశాలు చర్చల ప్రక్రియను పునరుద్ధరించడం, దౌత్యపరంగా, మిలట్రీపరంగా చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ సరిగానే వ్యాఖ్యానించారు.. చాలా ఓపికగా, నికరంగా సాగించిన దౌత్య నీతి ఫలితమే ఈ ఒప్పందమనడంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యాలోని కజాన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృత నిశ్చయం వ్యక్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. .
ఇరు దేశాలు ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాలు. ఆర్థిక పరంగా రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న చైనా, అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ మధ్య సత్సంబంధాలు ఈ ఇరు దేశాల ప్రయోజనాలకే కాదు, ఆసియా ఖండ అభివృద్ధికి, తద్వారా ప్రపంచ అభివృద్ధికి చాలా కీలకం. భారత్‌ ఇప్పటికే అమెరికా నిర్దేశిత ఇండో పసిఫిక్‌ వ్యూహంలో ప్రధాన భాగస్వామిగా చేరడం ద్వారా పొరుగు దేశానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నది. అమెరికాను నమ్ముకునే కన్నా పొరుగు దేశమైన చైనాతో సంబంధాల మెరుగుదల దేశానికి ఎంతో ప్రయోజనకరం. అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు అతి పెద్ద దేశాల మధ్య శాంతి, సుహృద్భావ సంబంధాలు నెలకొనడం అత్యంతావశ్యకం. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు భారత్‌, చైనా తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ఆ దిశగా వేసిన ఒక ముందడుగు అనే చెప్పాలి.

➡️