బడ్జెట్‌తో దశ మారేనా?

జిల్లాలో 3.90 లక్షల మంది రైతులు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో

కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌లో మన రాష్ట్రానికి రావాల్సినంత రాలేదు. అరవై ఐదు శాతం యువత ఉన్న భారతం బలోపేతం కావాలంటే వారంతా నైపుణ్యత ఉన్న మానవ వనరులుగా మారాలి. అందుకు పూర్తి సహకారం ప్రభుత్వం అందించాలి. ఆ మేరకు విద్య, ఉపాధి పట్ల కేటాయింపులు పెరగాలి. ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయం లాంటివి నిధుల లేమి వల్ల వెనకడుగు వెయ్యకుండా శరవేగంతో పూర్తికావాలి. గ్రామీణ ప్రాంతాలకు ఉపాధికి హామీ ఇస్తున్న పథకానికి కేటాయింపులు తక్కువగా ఉండడం కూడా సరి కాదు. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కొన్ని పంటలను సాగు పెంచేలా ప్రోత్సహించడం బాగుంది కానీ సమగ్రంగా రైతుకి అన్నివిధాలా లాభం కలిగేలా పొలం నుండి మార్కెట్‌ వరకూ మద్దతు దొరికేలా చూస్తే అది భారతావనికి లాభదాయకం అవుతుంది. సంపన్న వర్గాలకు సంపద పన్ను విధించి కొంత బాధ్యత ఇస్తే బాగుండేది. జీఎస్టీ కూడా ప్రజానుకూల దిశగా మారాలి. మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో, రూపాయి విలువ, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై పూర్తి అదుపు ఎటూ ఉండదు కాబట్టి అదుపు ఉన్న అంశాలపై పూర్తి దృష్టి పెట్టడం ద్వారా దెబ్బ తీవ్రత తగ్గించుకోవచ్చు. విద్య, ఆరోగ్యం, నిరుద్యోగితపై శ్రద్ధ చూపి, కేటాయింపులు భారీగా పెడితేనే వికసిత భారతం సాధ్యం. ఆ దిశ వైపు తిరగడమే కాదు…ముందుకు నడవాలి.

– డా.డి.వి.జి. శంకరరావు, మాజీ ఎంపీ, విజయనగరం.

➡️