ఇంకా ఇంకా పని చెయ్యి ! జీతాలు పెంచమని అడగకు !

Feb 7,2025 05:06 #Articles, #Capitalism, #working hours

పెట్టుబడిదారుల అంతులేని దురాశ

ఉద్యోగులు, కార్మికులు వారానికి 70 గంటలు పని చెయ్యాలని గత ఏడాది ఇన్ఫోసిస్‌ అధిపతి నారాయణ మూర్తి ఒక ప్రతిపాదన చేశారు. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నేవాడుంటాడు అంటారు కదా. అలానే ఇప్పుడు ఉద్యోగులు, కార్మికులు వారానికి 90 గంటలు పని చెయ్యాలని ఎల్‌ అండ్‌ టి కంపెనీ చైర్మన్‌ పిలుపునిచ్చారు. ఆర్థికాభివృద్ధి సాధించి ప్రపంచంలోనే మన దేశం అగ్రగామిగా నిలవాలంటే ఆదివారాలు కూడా పనిచెయ్యాలని మరీ సెలవిచ్చారు. ప్రపంచంలోనే ఆర్థిక అసమానతలు అతి తీవ్రంగా ఉన్న దేశాల సరసన మనమూ ఉన్నాం. అయినా పెట్టుబడిదారులు మాత్రం కార్మికులు, ఉద్యోగులు ఎక్కువెక్కువ గంటలు పని చెయ్యాలని డిమాండ్‌ చేస్తున్నారే తప్ప జీతాల పెంపుదల గురించి మాత్రం మౌనం వహిస్తున్నారు. అదనపు విలువలో కార్మికుల వాటా గత మూడు దశాబ్దాలుగా వేగంగా పడిపోతూ వస్తున్నది. కార్మికుల నిజ వేతనాలు స్థంభించిపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సరిచూస్తే కొన్ని సందర్భాలలో ఈ నిజ వేతనాలు తగ్గు ముఖం పట్టాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2022-23 సంవత్సరంలో ఈ తరుగుదల పెరిగింది. ఇదే కాలంలో పెట్టుబడిదారులు ఆర్జించిన లాభాలు స్థూల జాతీయోత్పత్తితో పోలిస్తే ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. శత కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. వీరి జీవనశైలి అగ్రగామి ధనిక దేశాల శత కోటీశ్వరుల జీవనశైలి స్థాయికి చేరుకున్నది. అంటే పెట్టుబడిదారులు ఈ స్థాయిలో సంపద పోగేసుకోవడానికి ప్రజలు, ముఖ్యంగా కార్మికులు, కష్టజీవులు త్యాగాలు చేసి పేదరికంలోకి దిగజారిపోవాలన్నమాట.
ఏ సమాజంలో అయినా అదనపు విలువ సృష్టించేది శ్రామికులే. కానీ ఉత్పత్తి క్రమంలో కార్మికులు పడే కష్టంలో వెయ్యవ వంతు శ్రమ కూడా చెయ్యని వాళ్లు ఈ అదనపు విలువలో సింహ భాగాన్ని మింగేస్తున్నారు. ఈ అవకాశాన్ని దక్కించుకోవడానికి వాళ్లకి ఏవో అపారమైన తెలివితేటలు ఉన్నాయనుకోవడానికి లేదు. పోనీ ఏమన్నా ‘రిస్క్‌’ తీసుకుంటున్నారా అనుకోవడానికి… అలాంటి రిస్క్‌ పర్యవసానాలను సామాజికం చేసే ఆర్థిక వ్యవస్థ ఉండనే ఉన్నది. మరయితే వాళ్లకి ఆ శక్తి ఎక్కడ నుండి వచ్చింది అంటే ఉత్పత్తి సాధనాల మీద వాళ్లకి ఉన్న హక్కుతోనే ఇది సాధ్యపడుతున్నది.
ఉత్పత్తి సాధనాల నుండి కార్మికులు పరాయీకరించ బడుతున్నారు. కష్టం అంతా వాళ్లే చెయ్యాలి. కానీ ఫలితం మాత్రం వాళ్లకి దక్కదు. అయినాగానీ పెట్టుబడిదారులు మరిన్ని లాభాలు ఆర్జించడానికి కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని మరీ మరింత కష్టం చెయ్యాలని కోరుకుంటున్నారు. నిజంగానే ఎక్కువ శ్రమించాల్సిన అవసరం, పని ఉంటే మన దేశంలో నిరుద్యోగులకు కొదవా? వాళ్లలో కొంతమందికైనా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించవచ్చుగా. కానీ యజమానులు, పెట్టుబడిదారులు ఆ పని మాత్రం చెయ్యరు. ఎక్కువమందిని పనిలో పెట్టుకుంటే జీతాల వ్యయం పెరిగి వాళ్ల లాభాలు తగ్గుతాయి. పైపెచ్చు కార్మికుల సంఖ్య పెరిగిన కొద్దీ వాళ్లు సంఘటితపడి యూనియన్‌లు పెట్టుకుని తమ బేరసారాల శక్తిని పెంచుకునే ప్రమాదం ఉంటుంది. అందుకే వాళ్లు ఉన్న ఉద్యోగులు, కార్మికుల నుండే మరింతగా శ్రమ పిండుకోవాలని చూస్తారు. దాని కోసం పని గంటలు ఎక్కువ చెయ్యాలని చూస్తారు తప్ప దేశాభివృద్ధి, ఆర్థిక ప్రగతి, ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం వంటి మాటలు అన్నీ మెరమెచ్చుల కోసమే. నిజంగానే వాళ్లు మన దేశం ప్రగతి సాధించాలని కోరుకునే వాళ్ళయితే మరింత మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించి తమ నిజాయితీ నిరూపించుకోవాలి.

కార్మికులపై అధిక పని గంటల భారం
కార్పొరేట్‌ అధినేతలు కాస్త కళ్ళు తెరచి వాస్తవాలు ఏమిటో గ్రహించాలి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐ.యల్‌.ఓ) వెలువరించిన 2024 గణాంక నివేదికలను బట్టి చూస్తే మన దేశంలో కార్మికులు వారానికి సగటున 46.74 గంటలు పని చేస్తూ మొత్తం 170 దేశాలలో అత్యధిక గంటలు శ్రమ చేసే కార్మికులుగా 17వ స్థానంలో ఉన్నారు. మన తర్వాత స్థానంలో ఉన్న దేశాలు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లు. అత్యధిక పని గంటలు ఉన్నది భూటాన్‌ దేశంలో (వారానికి 54.44 గంటలు). ఆ తర్వాతి స్థానంలో ఉన్నది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (వారానికి 50.93 గంటలు). చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మలేషియా, వియత్నాం, శ్రీలంక, క్యూబా, థారులాండ్‌, కొరియా వంటి అభివృద్ధి చెంతున్న దేశాలలో కార్మికులు భారతీయ కార్మికుల కన్నా తక్కువ గంటలు పనిచేస్తూ ఉన్నారు. అదే కెనడాలలో 32.24 గంటలు, నెదర్లాండ్స్‌లో 31.55 గంటలు, జర్మనీలో 34.24 గంటలు, బ్రిటన్‌లో 35.85 గంటలు ఫ్రాన్స్‌లో 35.9 గంటలు, అమెరికాలో 37.96 గంటలు పని చేస్తున్నారు. వారానికి 49 గంటలు అంతకు మించి పని చేస్తున్న కార్మికుల శాతం మొత్తం కార్మిక వర్గ సంఖ్య తేల్చి చూస్తే అత్యధికంగా ఉన్న మొత్తం 170 దేశాలలో మన దేశం రెండవ స్థానంలో ఉన్నది. 49 గంటలు అంతకు మించి పని చేస్తున్న కార్మికుల శాతం భూటాన్‌లో 61.3 శాతంగా ఉంది. రెండవ స్థానంలో ఉన్న మన దేశంలో ఇది 51.4 శాతంగా ఉన్నది. కాబట్టి ప్రపంచంలోనే 49 గంటలకు మించి శ్రమ చేసే కార్మికులు అత్యధికంగా మన దేశంలో ఉన్నందుకు…అదుపు లేకుండా వారి శ్రమను ఈ రకంగా దోచుకునేందుకు అవకాశం దక్కినందుకు కార్పొరేట్‌ యజమానులు, పెట్టుబడిదారులు పండుగ చేస్కోవాలి.
కార్మికులు, ఉద్యోగులతో ఎక్కువ పని చేయించుకుని తక్కువ వేతనాలు ఇవ్వడంలో భారతీయ పెట్టుబడిదారులు అంతర్జాతీయంగా పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నారు. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవడానికి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి బదులు కార్మికుల మీద చేసే వ్యయాన్ని తెగ్గోసే దగ్గరి మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్టుబడిదారీ విధానం తొలి దశలో పెట్టుబడిదారీ వర్గం ఎంచుకున్న మార్గం ఇది. అదనపు విలువ పోగేసుకోవడానికి కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించుకునేవారు. ఈ శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పంతొమ్మిదవ శతాబ్దం అంతా యూరప్‌, అమెరికా దేశాల్లో కార్మికవర్గం సమరశీల ప్రతిఘటనా పోరాటాలు నిర్వహించింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రోజుకి 8 గంటల పని దినం అమలులోకి వచ్చింది. దీనితో పెట్టుబడిదారులు నికర అదనపు విలువకు బదులు సాపేక్ష అదనపు విలువ గడించడం మీద దృష్టి పెట్టారు. అంటే కార్మికుల జీతభత్యాలు పెంచకుండా వారి ఉత్పాదక శక్తిని పెంచే మార్గాన్ని ఎంచుకున్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్మికుల ఉత్పాదకత రెట్టింపు అయ్యేలా చూశారు. జీతాలు, పని గంటలు పెంచకుండా కార్మికుల నుండి అదనపు ఉత్పత్తిని దోచుకోవడం మొదలు పెట్టారు.

సాంకేతిక పరిజ్ఞానం-అదనపు పని గంటలు
అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించే పరిస్థితి లేకపోవడంతో పెట్టుబడిదారీ వర్గం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించింది. భారత్‌ సహా వర్ధమాన దేశాలన్నింటా కార్మిక హక్కులను పరిరక్షించేందుకు ఉద్దేశించిన సంస్థాగత రక్షణలు బలహీనంగా ఉండడం, అవి కూడా మెజారిటీ కార్మిక వర్గానికి వర్తించే పరిస్థితి లేకపోవడంతో ఉమ్మడి బేరసారాల శక్తి బలహీనంగా ఉండడం మూలంగా కార్మిక వర్గానికి తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయించుకునే వెసులుబాటు పెట్టుబడిదారులకు దక్కింది. ఈ కారణంతోనే భారత పెట్టుబడిదారీ వర్గం కార్మిక వర్గం వారానికి 70 గంటలు, 90 గంటలు పని చెయ్యాలని పిలుపునిస్తూ దానికి దేశ ప్రయోజనాలు అన్న పైపై మెరుగులు అద్దుతూ ఉన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పాదకత పెంచుకునే మార్గానికి అయ్యే వ్యయం కన్నా ఈ రకంగా కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ గంటలు పని చేయించుకోవడం లాభసాటి వ్యవహారం. వర్ధమాన దేశాల్లో ఉత్పత్తి క్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండడానికి ఇదే మూల కారణం. మిగిలిన వర్ధమాన దేశాలతో పోలిస్తే భారతీయ పెట్టుబడిదారులు శాస్త్ర పరిశోధన, అభివృద్ధి రంగాల మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో కార్పొరేట్‌ రంగం పెట్టిన ఉత్పాదక పెట్టుబడులు తగ్గు ముఖం పట్టాయి.

– సంజయ్ రాయ్

➡️