ఎస్‌ఇజెడ్‌లో అభిజిత్‌ కార్మికుల విజయం

Jan 22,2025 04:55 #Abhijit workers, #Articles, #edit page, #SEZ

అప్పజెప్పిన పని మౌనంగా చేసి వెళ్లాలి తప్ప హక్కుల గురించి మాట్లాడకూడదని, కార్మిక సంఘాలు ఏర్పాటు చేయకూడదని ఆంక్షలు విధించే ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో సైతం కార్మికులు పోరు బాట పడితే యాజమాన్యం దిగిరావాల్సిందేనని చూపిన ఉద్యమమిది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని అభిజిత్‌ ఫెర్రో ఎల్లాయీస్‌ కంపెనీ 2024 అక్టోబర్‌ 13న అక్రమ లే ఆఫ్‌ ప్రకటించింది. కనీసం లే ఆఫ్‌ సమాచారం కార్మికులకుగాని, కార్మికశాఖకు గాని తెలుపలేదు. ఈ పరిశ్రమలో పని చేస్తున్న వెయ్యి మంది కాంట్రాక్టు, పర్మినెంట్‌ కార్మికుల్లో అత్యధిక మంది సెజ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలవారే. వీరిలో అత్యధికులు పదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. 40 సంవత్సరాల వయసు దాటిన కార్మికులు ఎక్కువ మంది వున్నారు. వీరిని ఇతర పరిశ్రమల్లో పనిలోకి తీసుకోరు. అభిజిత్‌ పరిశ్రమ అక్రమ లే ఆఫ్‌ ఎత్తి వేసి…పనులు కల్పించాలని, దసరాకు ఇవ్వాల్సిన బోనస్‌ చెల్లించాలని, కంపెనీ తెరవకపోతే చట్టప్రకారం సెటిల్మెంట్‌ చేయాలన్న డిమాండ్‌పై పోరాటం జరిగింది. లే ఆఫ్‌ ప్రకటించిన అక్టోబర్‌ 13న కంపెనీ గేట్‌ దగ్గర ఈ పోరాటం ఆరంభమైంది. స్థానిక పోలీసులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెబుతూనే, ఎస్‌ఇజెడ్‌లో ఆందోళన చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ధర్నాలు చేస్తే కేసులు పెడతామని భయపెట్టారు. కార్మికులు ఏ మాత్రం బెదరలేదు. పోరాటం నుంచి వెనక్కు తగ్గలేదు. కార్మికుల పోరాటాన్ని బలహీనపర్చేందుకు పలువురు రాజకీయ నేతలూ ప్రయత్నించారు. వారు పోరాటాల్లోకి వెళ్లకుండా నిరోధించారు. పట్టు వీడకుండా, ధైర్యం సడలకుండా సిఐటియు నేతృత్వంలో 35 రోజుల పాటు వివిధ రూపాల్లో కార్మికులు పోరాటం నిర్వహించారు.

కార్మికులు విఎస్‌ఇజెడ్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ కార్యాలయానికి కూర్మన్నపాలెం జంక్షన్‌ నుండి దువ్వాడ వరకు నాలుగు కిలోమీటర్లు ర్యాలీ, నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. లేబర్‌ అధికారులు, కాంట్రాక్టర్లు, యాజమాన్యం-కార్మికులు, సిఐటియు ప్రతినిధులతో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు. అంతవరకు మొండికేసిన అభిజిత్‌ యాజమాన్యం దిగొచ్చింది.

ఎస్‌ఇజెడ్‌ పరిశ్రమల్లో కార్మికుల సమస్యపై కార్మిక సంఘ (సిఐటియు) ప్రతినిధులను చర్చలకు పిలవడం ఇదే తొలిసారి. కంపెనీ నడపలేమని, కార్మికులకు ఇవ్వాల్సిన 44 రోజుల వన్‌ మంత్‌ నోటీసు పే, బోనస్‌, ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి గ్రాడ్యుటి, పరిశ్రమ తెరిస్తే మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్న అంశాలతో లిఖిత పూర్వక ఒప్పందం జరిగింది. యాజమాన్యం వారం రోజుల్లో బోనస్‌ చెల్లించింది. ఇంకా బకాయి పడ్డ గ్రాట్యూటీ 50 శాతం చెల్లింపు కోసం సిఐటియు పోరాడుతోంది. ఎస్‌ఇజెడ్‌లో సమ్మెలు, ధర్నాలు చేయకూడదని ప్రభుత్వ యంత్రాంగం పదేపదే హెచ్చరికలు చేసినా, ఆందోళన చేసినా, వారికి ఏ పరిశ్రమల్లో పనులు లేకుండా చేస్తామని బెదిరించినా అభిజిత్‌ కార్మికులు ఐక్యంగా పోరాడి చట్ట ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు సాధించుకున్నారు. ఈ పోరాటం ఎస్‌ఇజెడ్‌ పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులలో ధైర్యం నింపింది.

– ఆర్‌. రాము,
అనకాపల్లి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు,
సెల్‌: 9492343600

➡️