/1982 ఆగస్టు 10వ తేదీన ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ (నిషేధం) బిల్లు, 1982పై శాసనసభలో పుచ్చలపల్లి సుందరయ్య చేసిన ప్రసంగం నుంచి కొన్ని భాగాలు/
- నేను ప్రతిపాదించినవి మూడు ముఖ్యమైన సవరణలు వున్నవి. ల్యాండు గ్రాబింగ్ డిఫినెషన్ బాగానే వుంది. ల్యాండు గ్రాబింగ్ పదం 100 స్క్వేర్ మీటర్లు వుండి దానిలో చిన్న ఇల్లో, గుడిసెనో కట్టుకుని ఒక నిరుపేదవాడువుంటే ఎక్కడ కూడా అతనికి ఆస్తి లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు అతని ఆస్తి రూ.25 వేలు కన్నా ఎక్కువ లేనప్పుడు అటువంటి వాడు ల్యాండు గ్రాబర్ కాదు, అతను నివసించే ల్యాండు.. ల్యాండు గ్రాబింగ్ కాదు అన్నాము. ఎవరు మూల కారకులో వారిని బయటపెట్టి వారి గొంతు పట్టుకుంటే సరిపోతుంది. మిగిలినవారిని పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. వారికే ఈ బిల్లు ఉద్దేశించాలి అంటే అది చేయడం లేదు.
- జంట నగరాలలో 100 గజాలు తీసుకున్న వారిని ల్యాండు గ్రాబరు అంటే ఎలాగా? పెద్దవారిని పట్టుకోండి అంటే మావల్ల కాదని అంటున్నారు. అందుచేత చిన్నవారిని పట్టుకుంటారన్న మాట. వారిమీద దాడి చేయడానికి, ఈ బిల్లును సర్వనాశనం చేయడానికి ప్రభుత్వానికి ఒక ఆయుధంగా ఉంటుంది తప్ప ఇంకొకటికాదు.
- రూ.25 వేలు విలువ చేసే ఆస్తి లేనటువంటి వారు నెలకు రూ.500 కన్నా ఎక్కువ ఆదాయం లేనటువంటివారు ఎక్కడో గుడిసె వేసుకుంటే వారిని పట్టుకుంటామని అంటున్నారు. మీ వెనకాల కోటీశ్వరులు, అధికారులు ఉండవచ్చు. వారిని పట్టుకోము కనుక చిన్నవారిని పట్టుకుంటామని అంటున్నారు. అది చాలా తప్పుడు పద్ధతి.
- ఎవరు ల్యాండు గ్రాబరు? ఎవరైతే చిన్నవాడిని అడ్డంపెట్టుకుని అమ్ముకున్నాడో, లక్షల రూపాయలు సంపాదించుకున్నారో అటువంటి వారు ఎవరో మీకు తెలుసు. ఈ రకంగా ప్రభుత్వ భూములను వ్యాపారం చేసిన వారిని పట్టుకోండి. అది ఒకరి తరువాత మరొకరు మార్చుకున్నా అసలు వాడిని పట్టుకోకుండా వాడి ఆస్తిని, డబ్బును పట్టుకోకుండా ఎవరి స్వాధీనంలో ఉంటే వారికి శిక్ష వేస్తామంటే ఎలాగా? గవర్నమెంటు ఇళ్ల స్థలాలు ఎలాట్ చేయకపోతే పేదవారినందరినీ పోగుచేసి ప్రభుత్వ భూములను ఆక్రమించండి, అది మీ హక్కు, నివశించడానికి గుడిసె వేసుకుంటే ల్యాండు గ్రాబర్సు కాదు అని చెప్పండి. ఈ బిల్లు వారికి వ్యతిరేకంగా ఉండకూడదని మనవి చేస్తున్నాను.
- రెండవ సవరణ ఏమిటంటే ల్యాండు గ్రాబింగు జరిగింది. కోటీశ్వరులు అయినారు. వారి చేతులలో ఈ భూమి లేదు. అమ్ముకున్నారు. కొనుక్కున్నవారు గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఒక చిన్న ఉద్యోగి, చిన్న వర్తకుడు 100 గజాలు కొనుక్కుంటాడు. చౌకగా వస్తుందని ఆశతో కొంటారు. 250 స్క్వేర్ మీటర్లు కొనుక్కుని చిన్న బిజినెస్ పెట్టుకుంటే ఈనాడు ఆ ఇల్లు, స్థలం, ఆ బిజినెస్ అంతా కలిసి లక్ష రూపాయలకన్నా మించకుండా వుండే మినహాయింపు ఇవ్వండి. 250 మీటర్లు కాకపోతే 200 గజాలు అని పెట్టండి.
- అసలు భూమిని అడ్డంపెట్టుకుని, రూ.కోట్లు సంపాదించుకుని అధికారం ఉండి ఎమ్మెల్యేలను కొనేస్తారు. జడ్జిలను కొనేస్తారు. ఆఫీసర్లను కొనేస్తారు. వాళ్లను పట్టుకోండి. అటువంటి వారిని పట్టుకోవడం చేతకాకపోతే మాకు చేతకాదు అని చెప్పండి తప్ప నాకు దొరికినవాడు వీడు అని చెప్పేది మాత్రం తప్పు. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే మీరు బీదలను పనిష్ చేయడం కాకుండా ఈ కోటీశ్వరులను పనిష్ చేసి వారి భూములను లాక్కొని చేస్తే ఇది అమలులోకి వస్తుంది.