‘మద్దతు’ మోసం

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటనలో మోడీ ప్రభుత్వం ఈ మారు కూడా రైతులకు ద్రోహమే చేసింది. పంట ఉత్పత్తికి రైతు చేసే మొత్తం వ్యయాన్ని లెక్కగట్టి (సి2), దానికి యాభై శాతం కలిపి ఎంఎస్‌పి నిర్ణయించాలని స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు చేసింది. తాము అధికారంలోకొస్తే ఆ విధంగా ఎంఎస్‌పి ఇస్తామని పదేళ్ల క్రితం మోడీ హామీ ఇచ్చారు. కేంద్రంలో రెండు పర్యాయాలు ఫుల్‌ మెజార్టీతో ప్రభుత్వాలను నడిపించిన బిజెపి సర్కారు, ఒకటిన్నర రెట్ల ఎంఎస్‌పి హామీని తుంగలో తొక్కింది. అంతేకాదు, ఆ హామీని అమలు చేయలేమని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా అఫిడవిట్‌ ఇచ్చింది. ఇంకోవైపు తాము ఒకటిన్నర రెట్ల ఎంఎస్‌పి ఇచ్చేశామని అబద్ధపు ప్రచారం లంకించుకోవడం బిజెపికే చెల్లింది. మూడవసారి మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్‌డిఎ సంకీర్ణ సర్కారు ఏర్పడగా, ఇప్పుడు సైతం ప్రభుత్వం మనసు మారలేదనడానికి 2024-25లో 14 ఖరీఫ్‌ పంటలకు బుధవారం మోడీ కేబినెట్‌ ఆమోదించిన ఎంఎస్‌పిలను చూస్తే అర్థమవుతుంది. గతేడాది ధరల కంటే ఈ తడవ పెంచామని సర్కారు తప్పుడు ప్రచారం చేస్తుండగా, స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం చూస్తే మోడీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఎంఎస్‌పిల వలన ఖరీఫ్‌ రైతులు ఆర్థికంగా భారీగా నష్టపోనున్నారని తేటతెల్లమవుతోంది.
వ్యవసాయ పంట ఉత్పత్తుల వ్యయాలు, ధరల కమిషన్‌ (సిఎసిపి) అంచనాల ప్రకారం క్వింటాలు సాధారణ రకం వరి ధాన్యం ఉత్పత్తికి రైతు చేసే వాస్తవ వ్యయం రూ.2 వేలకుపైమాటే. స్వామినాథన్‌ సిఫారసు ప్రకారం ఆ వ్యయానికి యాభై శాతం కలిపి ప్రభుత్వం ధర నిర్ణయించాలి. కానీ 2,300 మాత్రమే ప్రకటించింది. ప్రభుత్వ చర్య వలన రైతు క్వింటాలు ధాన్యానికి 700 కోల్పోతున్నాడు. మోడీ ప్రభుత్వ వాదన వేరేలా ఉంది. నిరుడు 2,183 ఇచ్చాం, ఈ సంవత్సరం 117 పెంచాం అని వాస్తవాలకు మసిపూసే యత్నం చేయడం దారుణం. ఒక్క వరి విషయంలోనే కాదు అన్ని పంటల ధరలూ ఇలాగే ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్న మరో వంచన సిఎసిపి వ్యయ అంచనాల్లో కొంత భాగాన్ని లెక్కలోకి తీసుకొని ఒకటిన్నర రెట్ల ఎంఎస్‌పి ఇచ్చేశామనడం. స్వామినాథన్‌ సూచించింది పంట పండించడానికి రైతు చేసే మొత్తం వ్యయం (సి2). కానీ మోడీ సర్కారు సి2ను కాకుండా కొంత భాగాన్నే లెక్కలోకి తీసుకొని దానిపై 50 శాతం అంటోంది. ఇది మోడీ సర్కారు అన్నదాతలను నిలువునా చేస్తున్న పెద్ద మోసం.
పిఎం కిసాన్‌ కిస్తును విడుదల చేసే ఫైల్‌పై ప్రధానిగా మోడీ తొలి సంతకం చేస్తూ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమని గొప్పగా చెప్పారు. రైతులకు ఎంఎస్‌పి ఇచ్చే విషయంలో ఇచ్చిన వాగ్దానాన్ని పాతిపెట్టి రైతుల సంక్షేమం అనడం ఎంతమాత్రం నప్పదు. రైతులకు ఎంఎస్‌పి ఇవ్వకుండా వారి ఆదాయాలు రెట్టింపు చేస్తామనడం దగా. మోడీ గ్యారంటీ చెల్లనిచీటీనే! వ్యవసాయ ప్రధాన దేశంలో రైతులను సంక్షోభంలోకి నెట్టి, ఆత్మహత్యలు కొనసాగుతుండగా వికసిత భారత్‌ అనడం వంచనే. స్వామినాథన్‌ సిఫారసునులను అటకెక్కించి ఆయనకు భారతరత్న ఇవ్వడం గౌరవించడం కాబోదు. మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో 2020-21 ఏడాదిపాటు రైతులు వీరోచిత పోరాటం చారిత్రాత్మకమైనది. ఆ పోరాటం నుంచి పుట్టిందే ఎంఎస్‌పికి చట్టబద్ధ గ్యారంటీ డిమాండ్‌. మూడు చట్టాల రద్దు తర్వాత కూడా మోడీ ప్రభుత్వంలో మార్పు రాలేదు. ఢిల్లీకి అనుకొని ఉన్న యుపి, హర్యానా, రాజస్థాన్‌లలో మొన్నటి ఎన్నికల్లో బిజెపి ఓడింది రైతుల ఆగ్రహం వల్లనే. ఎంఎస్‌పి నిర్ణయంలో, వ్యవసాయ బడ్జెట్‌ రూపకల్పనలో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం)తో మోడీ సర్కారు సంప్రదింపులు జరపలేదు. పంటల వ్యయాలపై కనీసం రాష్ట్రాలు ఇచ్చిన అంచనాలను, సిఎసిపి గణాంకాలను పట్టించుకోలేదు. ఇది మోడీ ప్రభుత్వ ఏకపక్ష, ఒంటెత్తు పోకడలకు పరాకాష్ట. మోడీ సర్కారు ఖరీఫ్‌నకు ప్రకటించిన ఎంఎస్‌పిలను వెనక్కితీసుకొని రైతుల ఆకాంక్షలకనుగుణంగా సరికొత్త ప్రతిపాదనలతో ముందుకు రావాలి. అందుకు మోడీ ప్రభుత్వంపై రైతాంగం ఒత్తిడి తేవాలి.

➡️