నిజానికి భారత అత్యున్నత న్యాయస్థానం భావ ప్రకటన స్వేచ్ఛకు ద్వారాలు తెరవడంపై సర్వత్రా హర్షధ్వానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఒక్కసారిగా భారతీయ పౌర సమాజం ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో పౌరుల భావప్రకటన స్వేచ్ఛ అత్యంత కీలకమైనదని, వ్యక్తులు లేదా వ్యక్తుల సమూహం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయటం నాగరిక సమాజంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తేల్చిచెప్పింది. ‘ఆ అభిప్రాయాలతో లేదా ఆలోచనలతో విభేదించవచ్చు. ఆ అభిప్రాయాలకు భిన్నంగా మరో అభిప్రాయాన్ని ప్రకటించటం ద్వారా దాన్ని ఎదుర్కొనాలి తప్ప అణచివేస్తామనడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే అవుతుంది’ అని తెలియజేసింది. ఇన్‌స్టాలో, ఎక్స్‌లో గుజరాత్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి పెట్టిన కవిత వల్ల సమాజంలో విద్వేషాలు రగులుతాయని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు కేసు పెట్టారు. దీన్ని తప్పుబడుతూ, కేసును కొట్టివేస్తూ ఇచ్చిన ఈ తీర్పు అనేక విధాల ఎన్నదగినది. రాజ్యాంగ విలువల పట్లా, పౌరుల హక్కుల పట్లా వీసమెత్తు గౌరవం లేని అనైతిక పాలకులు ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం ఈమధ్య బాగా ముదిరింది. నిజానికి గుజరాత్ పోలీసులకు అభ్యంతరకరంగా కనిపించిన ఈ కవితలో దేశ ద్రోహనికి సంబంధించిన అంశాలు ఏమీ లేవు. అది ఒక విశ్వజనీనమైన భావనే. ఆ కవితను ఒకసారి మనం చూస్తే ‘ఓ రక్త పిపాసులారా వినండి…’ అంటూ మొదలయ్యే ఆ కవితలో అలాంటి వారికి ప్రేమను పంచుతామన్న సందేశమే ఉంటుంది. అన్యాయానికి ఒడిగట్టినా దాన్ని న్యాయంతోనే ఎదుర్కొంటాం అంటుంది. ఇందులో పోలీసులకు ఏది అభ్యంతరమనిపించిందో గానీ వెనకా ముందూ చూడకుండా కేసు పెట్టారు. విచారణ సందర్భంలో గుజరాత్ ప్రభుత్వం తరపున వాధించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ‘ఒక్కొక్కరు దీన్ని ఒక్కోవిధంగా విశ్లేషించుకుంటారు’ అని పోలీసులను సమర్థిస్తుండగా సృజనాత్మకతను గౌరవించే సంస్కృతి లేకపోవటాన్ని ధర్మాసనం ఎత్తిచూపింది.
నిజానికి భావ ప్రకటన స్వేచ్ఛ మీద భారత రాజ్యాంగం ఏమంటుందో చూద్దాం. అధికరణం 19:భావ ప్రకటనా స్వేచ్ఛ మొదలైనవి:1) పౌరులందరూ ఈ క్రింద ఉదహరింపబడిన హక్కులను కలిగి ఉంటారు: ఎ)భావ ప్రకటనా స్వేచ్ఛ, బి) ఆయుధములు లేకుండా శాంతియుతముగా సమావేశము జరుపుకొను స్వేచ్ఛ, సి) అసోసియేషన్లు లేక యూనియన్లు లేక సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొను హక్కు (97వ రాజ్యాంగ సవరణద్వారా ‘సహకార సంఘాలు’ అనే పదం చేర్చబడింది. 13-2-2012), డి) భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించే హక్కు, ఇ) భారత భూభాగంలో ఏ ప్రాంతంలో అయినా నివసించే హక్కు, ఎఫ్) (ఆస్తి హక్కుకు సంబంధించిన ఈ క్లాజు 1978లో, 44వ రాజ్యాంగ సవరణ సందర్భంగా తొలగించబడినది), జి) ఏవిధమైన వృత్తినైనా, వ్యాపారాన్ని అయినా చేసుకునే హక్కు. 2) క్లాజు (1)లోని సబ్ క్లాజు (ఎ)లో ఏమి చెప్పబడినప్పటికి, భారతదేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ దృష్ట్యాగాని లేక దేశ భద్రత దష్ట్యాగాని లేక విదేశాలతో సంబంధాల దృష్ట్యాగాని లేక శాంతి భద్రతలు, నైతిక విలువలు, సభ్యత, కోర్టు ధిక్కారం, పరువు నష్టం, నేరములు చేయుటకు ప్రోత్సహించుట మొదలైన వాటిని నియంత్రించే లక్ష్యంతోగాని, క్లాజు (ఎ)లో ఉదహరింపబడింది.
భావ ప్రకటన స్వేచ్ఛ చట్టాన్ని ఫ్రెంచ్ రెవల్యూషన్ స్ఫూర్తితో అంబేద్కర్ తీసుకొచ్చారు. ఆయన తన జీవితం మొత్తం భావ ప్రకటన స్వేచ్ఛ కోసమే పోరాడారు. కార్ల్‌మార్క్స్, బెట్రాండ్ రసెల్ వంటి మేధావులంతా భావప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడినవారే. నిజానికి భారత రాజ్యాంగం శాంతియుతంగా సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కును కూడా ప్రభుత్వాలు నిరోధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కవిత్వం, ఉపన్యాసం, రచన, విశ్లేషణ, జీవించే హక్కు ఇవన్నీ ప్రపంచ జీవన వ్యవస్థల విస్తృతికి ఉపకరిస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛతో అధికరణం (29) సాంస్కృతిక విద్యా హక్కులు కూడా ముడిపడి ఉన్నాయి. ఇటీవల సాంస్కృతిక విప్లవానికి అవరోధం కలిగించే అనేక పోకడలు దేశంలో కన్పిస్తున్నాయి. మొత్తం లౌకికవాదం ప్రజాస్వామ్యవాదం, సామ్యవాదం, భావప్రకటన స్వేచ్ఛ మీద ఆధారపడి ఉన్నాయి. మొత్తం భారత రాజ్యాంగమే భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంది. దేశంలో భారత రాజ్యాంగం ప్రతిఫలించాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
ఆంధ్ర సాహిత్యంలో వేమన, జాషువా, శ్రీశ్రీ, చెరబండరాజు, దళిత కవులు, స్త్రీవాద కవులు, హేతువాద కవులే కాక…ఈనాడు ఆధునిక యుగంలో సైతం భావ ప్రకటన స్వేచ్ఛతోనే కవులు తమ రచనలు చేస్తున్నారు. ఈ తీర్పు వీరందరికి కూడ ఉత్సాహశక్తిగా నిలుస్తుంది. అయితే అంబేద్కర్, మార్క్స్ చెప్పినట్టు భావ ప్రకటన స్వేచ్ఛ కోసం దేశంలోను, ప్రపంచంలోను నిరంతరం పోరాటం జరగాల్సిందే. ఆ పోరాటంలో అందరం భాగస్వాములం అవుదాం.
వ్యాసకర్త : డా|| కత్తి పద్మారావు, సెల్ : 9849741695 /