ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 225 పేజీల స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 విజన్ పత్రాన్ని ఎంతో ఆర్భాటంగా విడుదల చేసింది. పేదరికం లేని సమాజం, ఉపాధి, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, రైతు-వ్యవసాయ సాంకేతికత, ప్రపంచంలో అత్యుత్తమ లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ-ఇంధన వనరులు, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంద్ర, అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత (డీప్ టెక్) వంటి పది సూత్రాల ఆధారంగా 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను సాధిస్తామని విజన్ పత్రంలో పేర్కొన్నది.
ఈ విజన్ ద్వారా 2047 నాటికి ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే గాక ప్రపంచంలోనే ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా మారుతుందని తెలిపింది. అలాగే రాష్ట్ర స్థూల ఉత్పత్తి (ఎస్.జి.డి.పి) 2.4 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయం 42 వేల డాలర్లకు, ఎగుమతులు రాష్ట్ర జిడిపిలో 18 శాతానికి పెరుగుతాయంది. వీటి సాధనకు రాబోయే 25 ఏళ్లలో ఏడాదికి సగటున 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వృద్ధి రేటు సాధించాలంటే ఈ విజన్ కాలంలో 40 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించాలని అందుకు చేపట్టాల్సిన విధి విధానాలను కూడా పత్రంలో పేర్కొన్నారు. ఈ విజన్ లక్ష్యాల సాధనకు అనుబంధంగా జిల్లా స్థాయిలో విజన్ మేనేజ్‌మెంట్ యూనిట్స్ (విఎం యుఎస్)ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ఈ తరహా విజన్ పత్రాలు తయారు చేయించి విడుదల చేయటం చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదు. ప్రపంచ బ్యాంకు కనుసన్నలలో అమెరికాకి చెందిన మెకెన్సే అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన 357 పేజీల పత్రాన్ని 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజన్ 2020 పేరుతో విడుదల చేశారు. నయా ఉదారవాద విధానాలు ప్రారంభమైన తరువాత ఆ విధానాలను ప్రపంచ బ్యాంకు డైరెక్షన్‌లో దేశంలో అమలుకు ప్రయత్నం చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పేర్కొనొచ్చు. నేడు విజన్ 2047లో పేర్కొన్నట్లే 2020 నాటికి సాధించాల్సిన లక్ష్యాలను విజన్ 2020 పత్రంలో కూడా పేర్కొని రాష్ట్రమంతా హడావుడి చేసి అమలుకు ప్రయత్నం చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్-2029 పేర మరో విజన్ పత్రాన్ని విడుదల చేశారు. రెండంకెల వృద్ధితో 2022 నాటికి దేశంలో బాగా అభివృద్ధి చెందుతున్న ఉన్నతమైన మూడు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఒకటిగా నిలుస్తుందని అలాగే 2029 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని ఊదరగొట్టారు. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచారాలు సన్ రైజ్ ఆంధ్రా అభివృద్ధికి మూల స్తంభాలుగా ఉంటాయని తెలిపింది. అయితే ఈ విజన్ పత్రాల అమలు తర్వాత జరిగిందేంటి? తెలుగుదేశం పార్టీని ఆ తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించారు.
ఇప్పుడు స్వర్ణాంధ్ర-2047 విజన్ పత్రం ద్వారా గతంలో అమలు జరిపిన నయా ఉదారవాద ప్రపంచ బ్యాంకు విజన్‌ల వ్యూహాలను, విధానాలను మరింత విస్తృతంగా, వేగంగా అన్ని రంగాల్లో అమలుకు పూనుకోవటమే స్వర్ణాంధ్ర విజన్ పత్రం లక్ష్యం. గత విజన్ పత్రాలకి ఇప్పటి విజన్ పత్రం మధ్య ముఖ్యమైన పరిణామమేమంటే నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నయా ఉదారవాద విధానాలను మరింత ముందుకు తీసుకు పోవటానికి వికసిత్ భారత్ పేర విజన్ పత్రాన్ని విడుదల చేయటం. ఈ విజన్ పూర్తిగా అంతర్జాతీయ ఫైనాన్స్ మార్గదర్శకత్వంలో రూపొందించబడింది. ఈ విజన్ విధానాల ద్వారా 2047 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనా తరువాత అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా, అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా అవతరి స్తుందని దేశ ప్రధాని నరేంద్ర మోడి చెబు తున్నారు. దీనికి అనుసంధానంగానే స్వర్ణాంధ్ర విజన్-2047ను చూడాలి. కేంద్రంలోని బిజెపి సర్కార్, రాష్ట్రంలో టిడిపి-జన సేన కూటమి ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా నయా ఉదారవాద విధానాలను ఈ విజన్ ముసుగులో వేగంగా అమలుకు పూనుకోవటంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలుచేసే సంస్కరణలన్నింటిని, కొత్తగా చేపట్టబోయే విధానాలన్నింటిని రాష్ట్రంలో అమలుకు ప్రయత్నం చేయడమే.
ఈ విజన్ ద్వారా రాబోయే రెండున్నర దశాబ్దాల్లో రాష్ట్ర జిడిపి 13 రెట్లు పెరిగి ప్రస్తుత 0.18 ట్రిలియన్ డాలర్ల (రూ.14.39 లక్షల కోట్లు) నుండి 2.4 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.200 లక్షల కోట్లు)కు చేరుతుందని, దేశ జిడిపిలో 8 శాతం వాటాకి భాగస్వామ్యం వహిస్తుందని ప్రకటించారు. తలసరి ఆదాయం కూడా 12 రెట్లు పెరిగి ప్రస్తుత 1700 (రూ.2.42 లక్షలు) డాలర్ల నుండి 42 వేల డాలర్ల (35.25 లక్షలు)కు చేరుతుందనీ, ఎగుమతులు కూడా 22 రెట్లు పెరిగి ఆంధ్ర రాష్ట్రం సౌభాగ్యవంతమైన రాష్ట్రంగా దేశంలోనేగాక ప్రపంచంలో నిలుస్తుందని నమ్మిస్తున్నారు.
విజన్ 2020 సమయంలో వ్యవసాయం దండగ అని మాట్లాడారు. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ఎగుమతి ఆధారిత, ఆహార ప్రాసెసింగ్, పకృతి వ్యవసాయ, వాణిజ్య కేంద్రంగా రాష్ట్ర వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకు రావాలని ఈ విజన్ పత్రంలో పేర్కొన్నారు. దీనికి ఆధునిక సాంకేతికతను జోడించారు. రాబోయే ఐదేళ్లలో సగటున 11.05 శాతం చొప్పున వ్యవసాయ వృద్ధి రేటు సాధించాలని, దీనికి సుమారు 5.85 లక్షల కోట్లు పెట్టుబడి సమీకరించాలని తెలిపారు. మొత్తం వ్యవసాయ భూమిలో 47 శాతాన్ని పకృతి వ్యవసాయం కిందకి మార్చాలని, దీనిలో కనీసం 40 శాతం పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలకు మార్పు జరిగేలా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ, ఇతర వాణిజ్య పంటలే రాష్ట్ర వ్యవసాయాభివృద్ధికి ముఖ్యమని తెలిపింది. 252 వ్యవసాయ ఆధారిత, ఎగుమతి, ఆహార ప్రాసెస్ పార్కులు ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ రంగ దుస్థితి, రైతుల పరిస్థితి, పంటలకు ప్రభుత్వ మద్దతు, ప్రభుత్వ మార్కెటింగ్, పెట్టుబడి కల్పన వంటివి ఎక్కడా ఈ పత్రంలో కనిపించవు. వ్యవసాయ కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. కీలకమైన నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల కేటాయింపు వంటి వాటికి ఈ విజన్‌లో స్థానంలేదు. కేవలం నదుల అనుసంధానం, పోలవరం ప్రాజెక్టుల ప్రస్తావనకే పరిమితమైంది.
మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ సంస్కరణకు బ్లూ ప్రింట్‌లా వ్యవసాయ రంగంలో చేపట్టబోయే మార్పులు ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ రంగం నేడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లేకపోగా వ్యవసాయాన్ని మరింత సంక్షోభంలోకి తీసుకెళ్ళేలా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ భూములు పెద్దయెత్తున వివిధ పేర్లతో ధనవంతులకు కట్టబెట్టేలా, భూ కేంద్రీకరణకు దారితీసే చర్యలకు సిద్ధమయ్యారు. కార్పొరేట్ వ్యవసాయానికి రాచబాట వేశారు. ఆహార భద్రతకు ముప్పు కలుగుతుంది. ఈ నమూనాలో ప్రాథమిక ఆహార పంటలను, వాటి ధరలను దెబ్బతీస్తారు. చిన్న సన్నకారు రైతుల భూములు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ మార్పులు వ్యవసాయ ఉపాధిని దారుణంగా దెబ్బ తీసి పట్టణాలకు వలసలను తీవ్రతరం చేస్తాయి.
ఇక పారిశ్రామిక రంగంలో రంగుల కల చూపించారు. చాలా అద్భుతాలు జరగబోతున్నట్లు, పెట్టుబడులు వరదలా రూ.11.97 లక్షల కోట్లు రాబోతున్నట్లు చూపించారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరుపారిశ్రామిక కారిడార్ల పొడవునా అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా, రసాయనాలు వంటి 9 ప్రాధాన్యతా భారీ పారిశ్రామిక కేంద్రాలు నెలకొల్పటం, 25 పారిశ్రామిక క్లస్టర్లు, 500 పారిశ్రామిక ఎస్టేట్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను విస్మరించి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లను నెలకొల్పుతామంటున్నారు. వీటన్నింటికి 2 లక్షల ఎకరాల భూమి సిద్ధం చేయడంతో పాటు భూ బదలాయింపు, విద్యుత్ రాయితీలు, మంచి నీరు, రోడ్లు, రైల్, పోర్టు కనెక్టివిటీ సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందనీ పత్రం పేర్కొంటున్నది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణకు, వాటిల్లో పని చేయటానికి ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన యువతను కూడా తయారు చేస్తామని పేర్కొన్నారు.
వాస్తవ పరిస్థితి ఏమిటి? రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా క్షీణించింది. వస్తు తయారీ రంగం ఎదుగు బొదుగు లేకుండా పడుంది. ఇప్పటికే కేటాయించిన భూముల్లో, ఎస్‌ఇజెడ్ లలో, క్లస్టర్లలో పరిశ్రమలు రాక ఖాళీగా ఉన్నాయి. కొన్ని చోట్ల మూతబడటం, వాటిని వేరే అవసరాలకు ఉపయోగించుకోవలసిన పరిస్థితి. మరోవైపు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను కేంద్ర బిజెపి ఒక్కొక్కటి అమ్మకానికి పెడుతున్నది. గత పదేళ్ళలో అనేక పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా పెద్దగా ఫలితం లేదు. ఈ ఆర్థిక సంక్షోభ కాలంలో వస్తాయని గ్యారంటీ లేదు. మన రాష్ట్రం వలె మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రైవేట్ పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పేర జరగబోతున్నది ఏంటంటే పెద్దయెత్తున రైతుల భూములు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులు, మౌలిక సదుపాయాలు, సర్వీసులు, సహజ వనరులు, అటవీ సంపద వంటివి పెద్దయెత్తున పెట్టుబడిదారులకు ధారాదత్తం చేయబడుతుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రక్షణ కరువై మూతపడతాయి. ప్రభుత్వ పెట్టుబడి పారిశ్రామిక, మౌలిక, సేవా తదితర రంగాల్లో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ముందుకొస్తుంది.
పెట్టుబడుల అవసరాల కోసం అందరికీ విద్య, ఉపాధి కల్పన పేర ప్రస్తుత విద్యా విధానాన్ని, బోధనా పద్ధతులను, పాఠ్యాంశాలను పూర్తిగా మార్చివేసి నైపుణ్యం కేంద్రంగా విద్యా విధానాన్ని మార్చాలని, 6వ తరగతి నుండే నైపుణ్య కోర్సులను తీసుకొస్తున్నట్లు విజన్ పత్రం తెలియజేస్తున్నది. విద్యను పూర్తిగా వ్యాపార సరుకుగా, పెట్టుబడి దారుల అవసరాలకు అనుగుణంగా కేంద్ర బిజెపి తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలుకు పూనుకుంటున్నది. బ్రిటీష్ వలస కాలంలో జరిగిన విధంగా పూర్తిగా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య పెట్టుబడిదారుల అవసరాల కోసం, వారి లాభాల కోసం ఉపయోగపడే యువతను తయారు చేయటమే ఈ విద్యా విధానం లక్ష్యం. ఈ విజన్ అందరికీ ఉపాధి కల్పిస్తుందనేది ఒక భ్రమ మాత్రమే. విజన్ పత్రం చెప్పే 20 లక్షల ఉద్యోగ కల్పన అంతా అతి తక్కువ వేతనాలతో, హక్కులు, భద్రత లేకుండా పెద్దయెత్తున దోపిడీకి గురయ్యేవే. రెండో వైపు ఆర్థిక సంక్షోభం పెరిగేకొద్దీ పెద్ద యెత్తున నిరుద్యోగం పెరుగుతుంది. ఇప్పటికే ఈ విధానాల వల్ల నిరుద్యోగ సైన్యం పెరిగిపోతున్న విషయం తెలిసిందే.
పేదరిక నిర్మూలనకు చాలా విచిత్రమైన పరిష్కారాలను ముందుకు తీసుకొచ్చారు. సమాజంపై భాగంలో బాగా సంపద ఉన్న 10 శాతం సంపన్నులు అట్టడుగున పేదరికంలో మగ్గుతున్న 20 శాతం పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయటానికి ప్రత్యేక సహాయం చేస్తారని తద్వారా పేదరికం తగ్గుతందని తెలుపుతున్నది. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టబోయే వివిధ ఆర్థిక కార్యకలాపాల ద్వారా జిడిపి, తలసరి ఆదాయం పెరిగి ఆటోమేటిక్‌గా పేదరికం తొలగిపోతుందని తెలియజేశారు. 2047కి పేదరికాన్ని పూర్తిగా రూపుమాపుతా మంటున్నారు. ఇవన్నీ ప్రజలను మోసాగించ టానికే. గత మూడు దశాబ్దాల నుండి ఇవే విధానాలు దేశంలో అమలు చేస్తున్నారు. పేదరికంపై ఇవే మాటలు ఊదరగొడుతున్నారు. పేదరికం తగ్గలేదు సరికదా ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం 125 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉంది. నేడు రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఇంకా ప్రభుత్వ రేషన్ బియ్యం మీదే ఆధారపడి వున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కనుక ఈ విజన్ వల్ల రాష్ట్రంలో పేదరికం మరింత విస్తరిస్తుందే తప్ప ఏమీ తగ్గదు. (సశేషం)
వ్యాసకర్త : డా|| బి. గంగారావు సెల్ : 9490098792 /