తమిళనాడు గవర్నర్ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల్ని చట్ట వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చారిత్రాత్మకం. ఆయన తొక్కిపెట్టిన పది బిల్లులను ఆమోదించినట్టుగానే భావిస్తూ తీర్పునివ్వడం సరైన చర్య. ముందు ముందు అలా తొక్కిపెట్టే అవకాశాల్ని తగ్గిస్తూ గవర్నర్ విధులకు అవసరమైన పరిమితుల్ని విధించడం కూడా మంచిదే. గవర్నర్ స్థానానికి పెద్దరికం కట్టబెడుతూ, రాజ్యాంగం అస్పష్టంగా వదిలివేసిన లక్ష్మణ రేఖల్ని నేడు న్యాయస్థానం దిద్ది బాగా కనబడేట్టు చేయాల్సి రావడం రాజకీయాల పుణ్యమే.
మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజలెన్నుకున్న ప్రతినిధుల ద్వారా సాగే ప్రజాపాలన. వారి అభీష్టం మేరకు, వారు చేసే చట్టాలు అమల్లోకి రావాలి. రాష్ట్రమైనా, కేంద్రమైనా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా వ్యక్తమయ్యే అంగీకారానిదే పై చేయి కావాలి. ఇక్కడ రాష్ట్రపతి, గవర్నర్లది కేవలం నామమాత్రపు పాత్ర. గౌరవం కోసం, అత్యవసరపు పరిస్థితుల్లో కొంత క్రియాశీలం కావడం కోసం సృష్టించుకున్న పాత్ర తప్పించి, రోజువారీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు ఉండాల్సిన పాత్ర. అయితే దానికి రాజకీయ వాసనల్ని అంటగట్టే ప్రయత్నాలతోనే చిక్కులొస్తున్నాయి.
కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, రాష్ట్రానికి గవర్నర్లను నియమిస్తుంది. ఆ పార్టీ ఇష్టం పైనే ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో నిర్ణయింపబడుతుంది. రాష్ట్రంలో విపక్షం అధికారంలో ఉన్నప్పుడు, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలోని ప్రభుత్వం వ్యవహరించాలని భావించినప్పుడు ఆ పని గవర్నర్ ద్వారా చెయ్యడానికి పూనుకుంటుంది. అలాంటి స్థితిలో కొంతమంది అత్యుత్సాహపు గవర్నర్లు ఇంకొంచెం ముందుకుపోయి తమ బాధ్యతలు అతిక్రమిస్తారు. రాజ్యాంగం స్పష్టపరచని పరిమితుల్ని దాటి కేంద్రం పట్ల విధేయతను చాటుకుంటారు తప్ప రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటన్నది పట్టించుకోరు. తమిళ నాడు గవర్నర్ చేసింది ఇదే. అక్కడి శాసన సభ ఆమోదించి పంపిన బిల్లుల్ని అవుననకా, కాదనకా ఏళ్ళకు ఏళ్లుగా తొక్కిపట్టారు. అయితే అవుననాలి లేదా కాదని శాసన సభకు తిప్పి పంపితే, తిరిగి వారు మళ్లీ పంపితే తప్పనిసరిగా ఆమోదించాలి. లేదంటే రాష్ట్రపతికి ముందే నివేదించాలి. అయితే వీటికి కాల వ్యవధి నిర్ణయించక పోవడం వల్ల, దాన్ని అలుసుగా తీసుకుని గవర్నర్ పది బిల్లుల్ని తొక్కిపట్టారు. పైగా అవి శాసనసభ రెండోసారి కూడా ఆమోదించి పంపినవి. ఇలా రెండు రకాలుగా ఆయన తన పెద్దరికపు పాత్రను అతిక్రమించారు.
ఇప్పుడు సుప్రీం ఆ తప్పుని ఎత్తి చూపడమే కాకుండా దిద్దింది. ఆ బిల్లుల్ని ఆమోదించినట్లు భావించాలని ప్రకటించింది. ఇకపై గవర్నర్లు బిల్లులపై తీసుకొనే నిర్ణయాలకు వ్యవధి నిర్ణయించింది. వ్యవధి దాటితే ఆమోదం పొందినట్లుగా తీర్పునిచ్చింది. ఇది సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామిక వ్యవస్థను బలపర్చడమే కాకుండా రాజ్యాంగ వ్యవస్థల బాధ్యతల్ని గుర్తు చేసే మంచి తీర్పు.
– డా.డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపీ, విజయనగరం.