విద్యార్థులకు వేదాలు బోధించాలా?

మొన్న 12వ తేదీన భూపాల్‌ లోని ‘నేషనల్‌ లా ఇన్‌స్టిట్యూట్‌ యూనివర్సిటీ’ నిర్వహించిన ఒక సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్‌ మిట్టల్‌ మాట్లడుతూ వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను, గీతను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని హితవు పలికారు! వాటిలో యువత నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పారు! ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆయన వ్యక్తిగతమైన భావాలను ప్రజలపై రుద్దాలనుకోవడం సరైనది కాదు. ఆయన కోర్టు తీర్పులు ఇచ్చేటపుడు రాజ్యాంగం ప్రకారం తీర్పు ఇస్తారా? లేక వేదాలలో, పురాణాలలో ఏముందో వాటి ప్రకారం తీర్పులిస్తారా? అసలు వేదాలలో, పురాణాలలో ఏముందో ఇలా మాట్లాడేవారికి తెలుసా! వాటి ముఖం ఎపుడైనా చూశారా? లేక కేంద్రంలో ఉన్నవారి మెప్పుకోసమా!!

సైన్సు ఇంతగా పెరిగిన రోజుల్లో, ఇంకా వేదాలు చదవండి, పురాణాలు చెప్పండి అనే వారిని ఆ యా పదవుల నుండి తొలగించాలి. సుప్రీంకోర్టు చాలా ఉన్నతమైనది. అలాంటి స్థానంలో ఉండి ఒక సామాన్య మతవాదిలా మాట్లాడడం ఆ పదవికే మచ్చ. పురాణాలన్నీ కూడా బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ప్రచారం చేయటంకోసం, ఆధిపత్యాన్ని నిలపటం కోసం రాసినవి. వేదాల నిండా ఎక్కువ శ్లోకాలు ఇంద్రుడి గురించి ఉంటాయి. ఈయన దేవతలకు అధిపతి. సోమపాన ప్రియుడు. చెరువులు చెరువుల సోమపానం తాగుతాడు. ఒక రాక్షసుడిని చంపేందుకు మూడు చెరువుల సోమపానాన్ని తాగాడట. బహుశా ఆ రోజుల్లో చెరువుల్లో సోమపానం నిల్వ ఉండేదేమో! అతనే చెప్పాలి. ఇంద్రుడు తాగి తాగి రోగమొస్తే, దేవతలు యాగం చేసి రోగం పోగొట్టారట. అంతేకాదు, ఇంద్రుడు మారువేషంలో అహల్యను చెరపట్టాడట. ఇలాంటివన్నీ వేదాల్లో ఉన్నాయి. వీటిని విద్యార్థులకు నేర్పి భావితరాల పౌరులను చెడగొట్టాలనా ఈయన ఉద్దేశం? ఏదైనా ప్రకటన ఇచ్చేటపుడు ఆలోచించాలి. ఎందుకంటే అయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి. శాస్త్రీయమైన విద్యను విద్యార్థులకు అందించినపుడే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది.

– నార్నె వెంకట సుబ్బయ్య,
ఎ.పి హేతువాద సంఘం అధ్యక్షులు.

➡️