ఎన్నికల ప్రాంగణంలో తెలుగు రాష్ట్రాల తీరు

Apr 21,2024 05:45 #artical, #edit page, #telakapalli ravi

భారత రాజకీయాల్లో అతి కీలకమైన ఎన్నికల పోరాటం ప్రారంభమైంది. 102 నియోజకవర్గాల్లో ఓటర్లు తీర్పునిచ్చేశారు కూడా. అతి చిన్నదైన లక్షద్వీప్‌లో 82 శాతం అత్యధిక ఓటింగు నమోదైంది. ఇండియా, ఎన్‌డిఎల మధ్య హోరాహోరీ పోరాటం జరిగే బీహార్‌లో బాగా తక్కువగా 48.8 శాతం, తమిళనాడులో 69.4 శాతం పోలింగు జరిగింది. తీవ్రమైన ఎండల మధ్య కూడా ఓటర్లు ఎంతో ఆసక్తి చూపించారని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెల్పింది. మొత్తం పది రాష్ట్ల్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్‌ ఘట్టం ముగిసింది. తెలుగు రాష్ట్రాలతో సహా ఇంకా పోలింగ్‌ జరగాల్సి వుండగా నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. వైసిపి, ఎన్‌డిఎ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌్‌ తదితర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు కూడా. ఎ.పి ముఖ్యమంత్రి జగన్‌పై రాయి దాడి ఘటనతో రెండు ప్రధాన పార్టీల వేడెక్కిన వాగ్వాదాలు, వివేకానందరెడ్డి హత్య ఆరోపణల చర్చపై కడప కోర్టు ఆంక్షలు, సి.ఎం రేవంత్‌, కెసిఆర్‌ ఆరోపణలు వీటి మధ్యనే ప్రజలు తీర్పునకు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల తర్వాతా ఎన్‌డిఎ కూటమిలో అభ్యర్థుల మార్పులు, చేర్పులు సాగుతున్నాయి. వైసిపి విషయంలో బయటికి పైకి పెద్దగా కనిపించకపోయినా అసంతృప్త నేతలు అటూ ఇటూ మారడం నిరంతర ప్రక్రియగా తయారైంది. మౌలిక విధానాలు సమస్యల విషయంలో నిబద్దత కంటే తమ అవకాశాలు, టికెట్లను బట్టి ఆయా నేతలు మారుతున్నారు గనక నామినేషన్ల ఉపసంహరణ దాకా ఈ ప్రహసనం సాగుతూనే వుంటుంది.

పోలికలు, తేడాలు
ఎ.పి లో టిడిపి, జనసేన, వైసిపి మూడూ బిజెపికి ప్రధాని మోడీకి లోబడిపోయిన పార్టీలే కాగా తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపి మధ్య పోటీ జరుగుతోంది. బిఆర్‌ఎస్‌ నాయకులు చాలామంది కాంగ్రెస్‌లో చేరి అభ్యర్థులుగా వుండగా బిజెపిలోనూ కొందరు చేరారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమేనని రెండేళ్ల కిందటే హడావుడి చేసి సీట్లు మాత్రం పెంచుకున్న బిజెపి ఇప్పుడు కూడా తమకు అత్యధిక స్థానాలు వస్తాయని చెప్పుకుంటున్నది. సి.ఎం రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపైనర్‌ హోదాలో పర్యటిస్తూ ప్రధానంగా బిఆర్‌ఎస్‌కి సవాళ్లు విసురుతూ బిజెపిని కూడా విమర్శిస్తున్నారు. విచిత్రంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి బిజెపిలో చేరతారని విడ్డూరపు ఆరోపణ వినిపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వుండబోదని జోస్యం చెప్పడంలో మాత్రం బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. తాను తలుపులు తీస్తే బిఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని రేవంత్‌రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఎ.పి లో కాంగ్రెస్‌ సిపిఎం, సిపిఐ ఒక అవగాహనకు వచ్చి అభ్యర్థులను నిలబెట్టాయి. కాని తెలంగాణలో అటువంటి స్థితి ఏర్పడలేదు. స్థానికంగా మాత్రం కొన్ని చోట్ల వారి ఆహ్వానంపై కమ్యూనిస్టులు కూడా ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. రెండు చోట్లా ఒకేరోజు పోలింగ్‌ గనక సమన్వయం కోసం అధికారులు కొన్ని ఏర్పాట్లు చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో వున్న ఎ.పి ఓటర్లనూ తెలుగు ఓటర్లనూ కూడా ఈ ఎన్నికల్లో ఉపయోగించే వ్యూహాలపై టిడిపి, వైసిపిల మధ్య ఆరోపణల యుద్ధం జరిగిన నేపథ్యంలో, జిహెచ్‌ఎంసి ప్రాంతంలో బిఆర్‌ఎస్‌ అత్యధిక స్థానాలు తెచ్చుకున్న రీత్యా ఈ ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ కోయంబత్తూరు వెళ్లి బిజెపి అభ్యర్థి అన్నామలై తరపున ప్రచారం చేశారు గాని తెలంగాణలో వారు ఒక వైఖరి తీసుకోలేదు. అలాగే జనసేన, బిఆర్‌ఎస్‌కూ వైసిపికి సత్సంబంధాలు వుండటంతో ముఖ్యమంత్రి జగన్‌…కాలుకు గాయమైన కెసిఆర్‌ను పరామర్శించి వెళ్లారు గానీ తనకు అభినందనలు తెల్పలేదని రేవంత్‌ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఎ.పి లో ఏం జరుగుతుందనే దానిపై తాము మాట్లాడబోమని కెటిఆర్‌, హరీశ్‌రావు వంటి వారు ప్రతిస్పందించారు. రెండు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితిలో తేడాలు, పోలికల తీరిది.

సమస్యలు వదలి ఉద్రిక్తతలతో..
విభజన తర్వాత మూడోసారి ఎన్నికలు జరుగుతున్న ఎ.పి లో ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎన్నికల సర్వేలు రకరకాలుగా వస్తుంటే ఎవరివైపు వస్తే వారు మురిసిపోతూ మిగిలినవి పెయిడ్‌ సర్వేలని ఈసడిస్తున్నారు. దేశ వ్యాపితంగా బిజెపి అనుకూల సర్వేలు గుప్పిస్తున్న బడా మీడియా ఇక్కడ మాత్రం రెండు రకాలుగా వ్యవహరిస్తున్నది. తెలుగు మీడియా ఎలాగూ రెండుగా విడిపోయి చాలా కాలమైంది. అందుకే ఏ సందర్భమైనా ఏ సమస్య అయినా వారు ఒకలా వీరు ఒకలా ఇస్తారనేది ప్రజలకు అర్థమైపోయింది. వాస్తవానికి ప్రజాశక్తి, విశాలాంధ్ర వంటివి మాత్రమే తమ పరిధిలో అవకాశం మేరకు ఇరుపక్షాల సమాచారం విశ్వసనీయంగా ఇస్తున్నాయి. రెండు పాలక పార్టీల యుద్ధంలో బూతులు, రాళ్ల చుట్టూ తిరగడమే సరిపోతుందని సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య సరైందే. ఈ క్రమంలో రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు, కేంద్రం వివక్ష, నిర్లక్ష్యం వంటి వాటి ఊసే లేకుండా పోయింది. ఇరు శిబిరాలూ మోడీకి అనుకూలమే గనక తమను తాము తిట్టుకోవడానికే పరిమితమవుతున్నారు. సిపిఎం ఇరు శిబిరాలకు అనేక ప్రశ్నలు సంధించినా ఎవరూ స్పందించిన పాపాన పోలేదు. ఇరు పక్షాలూ ఇంతవరకూ ఎన్నికల ప్రణాళికలు కూడా విడుదల చేసింది లేదు. మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో ఎన్నికలకు వెళుతున్నామని చెప్పిన ఎ.పిలో ఎన్‌డిఎ ఉమ్మడి ప్రణాళిక ఇచ్చే అవకాశం వుండదేమో. ఎందుకంటే అప్పుడు ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విభజన సమస్యలు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై హామీలివ్వాలి. పదేళ్లు పూర్తవుతున్నాయి గనక ఆ హామీలకు కాలం చెల్లిపోతుందనే భయాందోళనలూ వున్నాయి. ఇన్నేళ్లలో వాటిని ఘోరంగా ఉపేక్షించిన కేంద్ర బిజెపి ఇప్పుడు స్పందిస్తుందనే ఆశ ఏ కోశానా లేదు. ప్రజల్లో దానికి ఆదరణా లేదు. తమకు ఉమ్మడి ప్రణాళిక ఇచ్చే ఆలోచన లేదని బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఇప్పటికే ప్రకటించేశారు కూడా. ‘ఇద్దరం కలసి ప్రణాళిక’ అన్న జనసేన, టిడిపి కూడా ఆరు గ్యారంటీలతో ఆగిపోయాయి. ఇక ముఖ్యమంత్రి రూ.270 వేల కోట్ల పథకాల నగదు బదిలీ గురించే ప్రచారం చేసుకుంటున్నారు. దీర్ఘకాల పథకాలు, అయిదేళ్లలో అమలు కాని హామీలు, ప్రాజెక్టుల వంటి వాటిపై మాట్లాడ్డం లేదు. సంక్షేమ పథకాలు మంచివైనా ఉపాధి, ఉత్పత్తి పెంపు వంటి వాటిపై స్పందనే లేదు. దీనిపై ప్రజల్లో ప్రశ్నలు రావడంతో తామే ఎక్కువ పెట్టుబడులు తెచ్చామని ఈ మధ్య ప్రచారం ఎత్తుకున్నారు. పేదలకు సంక్షేమ పథకాల గురించే చెబుతూ అదానీ వంటి వారికి అపారమైన అవకాశాలు, వనరులు కట్టబెట్టిన సంగతి కప్పిపుచ్చుతున్నారు. ముగ్గురి మధ్య పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టంభనలో పడేశారు. ప్రాణప్రదమైన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పైన కూడా గట్టి వైఖరి లేదు. ఈ సమయంలోనే దాని పీక నులిమేందుకు కుట్రలు జరుగుతుంటే మూడు పార్టీలూ పెదవి మెదపలేదు. గెలిస్తే విశాఖ పాలనా రాజధానిగా అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ అర్థంతరంగా ఆగిపోయిన అమరావతి భవిష్యత్తు ఊసెత్తడం లేదు. రాష్ట్రం అప్పుల భారం ఆందోళన కలిగిస్తుంటే వైసిపి మాట్లాడదు. కోటిన్నర కోట్ల అప్పులు చేసిన కేంద్రం గొప్పదైనట్టు ఎన్‌డిఎ కబుర్లు చెబుతుంది. వ్యవసాయం, ఉపాధి హామీ, వృత్తిదారుల మనుగడ, పట్టణాల సదుపాయాలు వంటి అనేక సమస్యలు చర్చకు నోచుకోలేదు. ఇరువైపులా వున్న మీడియా అంతకు మించి సోషల్‌ మీడియా నిరర్థక వివాదాలను, పాక్షిక కోణాలను భూతద్దంలో చూపుతూ ఎజెండానే పక్కదోవ పట్టిస్తున్నది. బాధ్యత గల సీనియర్‌ నాయకులు, అధికార హోదాల్లో వున్నవారు కూడా సంయమనం చూపకపోగా ఈ ధోరణులనే ఎగదోస్తూ వస్తున్నారు. ఎ.పి లో పరాకాష్టకు చేరిన ఈ తిట్ల పురాణం తెలంగాణలోనూ కొనసాగుతున్నది. విధానపరమైన విశాల జనరాశులకు సంబంధించిన విస్తృత అంశాలు తెర మరుగైపోతున్నాయి. ఇక లౌకికతత్వం, సమాఖ్యతత్వం, రాష్ట్రాల హక్కులు, సామాజిక న్యాయం వంటివి ప్రస్తావనకే రావడం లేదు. సోషల్‌ జస్టిస్‌కు భిన్నంగా ఒకప్పుడు బిజెపి సిద్ధాంతకర్త గోవిందాచార్య తీసుకొచ్చిన సోషల్‌ ఇంజనీరింగ్‌ ఇప్పుడు పాలక పార్టీల మంత్రజపమైంది. విచిత్రంగా మంద కృష్ణ మాదిగ వంటి వారు వర్ణ వ్యవస్థ సమర్థించే సంఘపరివార్‌ ప్రధాని దళితోద్ధారకుడని భజన చేస్తున్నారు. ఎ.పి రాజకీయ రంగం ఎప్పటి కంటే ఎక్కువగా కులాల కుంపట్లు చూస్తున్నది. అంతర్వేది నుంచి రామతీర్థం దాకా బిజెపి ఎ.పి లో రగిలించాలని చూసిన మత రాజకీయాలు ప్రజలు ఆదరించకపోవడం మాత్రం స్వాగతించదగింది. అదే హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీ, బిజెపి కార్పొరేట్‌ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత పోటీలో సంఘ పరివార్‌ మతతత్వ పైత్యం గుమ్మరిస్తూంటే మజ్లిస్‌ తన తరహా ఆరోపణలు చేస్తున్నది. నిజానికి సికింద్రాబాద్‌లోనూ కిషన్‌రెడ్డిపై అసంతృప్తి పెరిగిందనే మాట వినిపిస్తోంది.

నా సర్వే నా ఇష్టం!
అభ్యర్థుల ఎంపిక దశలోనే వైసిపి ముందే మల్లగుల్లాలుపడి దాదాపు సగం మందిని రకరకాలుగా మార్చింది. ఇక బిజెపి వెంటబడి మరీ నేరుగా పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన సీట్ల పంచాయితీ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ‘వైనాట్‌ 175’ అని జగన్‌ ప్రచారం, 165 వస్తాయని చంద్రబాబు అతిశయాల మధ్య ఇరుపక్షాలు కూడా వాస్తవంలో 110-120కి అటూ ఇటుగా తెచ్చుకుంటే పదివేలని పాచికలేస్తున్నాయి. తెలంగాణలోనైతే పది స్థానాలకు పైగా తెచ్చుకుంటేనే రేవంత్‌ సర్కారు స్థిరపడుతుందనే భావన వుంది. 129 స్థానాలున్న దక్షిణ భారతంలో గతంలో 25 మాత్రమే తెచ్చుకున్న బిజెపి ఇప్పుడు వాటిని కూడా నిలబెట్టుకునే అవకాశం లేదనేది స్పష్టం. క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్న ప్రజలను కలుసుకుంటున్న సీనియర్‌ నాయకులు, పరిశీలకులకు కొన్ని అంచనాలు స్థూలంగా వున్నా వాటిని ఎన్నికల ముందు వెల్లడించడం లేదు. ఎవరి సర్వేలు ఎవరూ నమ్మే పరిస్థితి దేశంలో లేదని రాజ్‌దీప్‌ సర్దేశాయి సూటిగానే చెప్పేశారు. కనుక ప్రజల సమస్యలపై సమగ్రమైన వైఖరితో ప్రచారం చేయడం, ఎన్నికల పోరాటాన్ని ప్రశాంతంగా ముగిసేట్టు చూడటం ఇప్పుడు కర్తవ్యం. తుది తీర్పు ప్రజలే ఇస్తారు.

తెలకపల్లి రవి

➡️