టెన్షన్‌ – అటెన్షన్‌

Jun 4,2024 05:25 #Articles, #edit page

కప్పు మీద కప్పు మ్యాచులు జరుగుతూ ఉన్నాయి. ఐ.పి.ఎల్‌ ఐపోయింది. ఇప్పుడు ఐ.సి.సి. ప్రపంచ కప్పు మొదలవబోతోంది. క్రికెట్టే కాదు, బ్యాడ్మింటన్‌, హాకీ, టెన్నిస్‌, చదరంగం ఇలా ప్రతి సంవత్సరం ఎన్నెన్నో పోటీలు, కప్పులు జరుగుతూ ఉంటాయి. కప్పును గెలిచే వాళ్ళు గెలుస్తుంటారు, ఓడేవాళ్ళు తరువాత సంవత్సరం తప్పకుండా గెలవాలి అనుకొని ఇళ్ళకు పోతారు. అలా అనుకొని ఇంటికిపోయి నిద్రపోతే సరిపోదు. సంవత్సరమంతా శ్రమించాలి, గెలుపుకై తహతహలాడాలి. అన్ని శక్తులూ కలుపుకొని అంతకు ముందు కంటే పోటీనివ్వాలి. అప్పుడు తరువాత సంవత్సరం కప్పుపై ఆశ పెట్టుకోవాలి. లేదంటే ఈ వాయిదా ప్రతి సంవత్సరం, నాలగు లేదా ఐదేళ్లకొకసారి జరుగుతూనే ఉంటుంది. ఏ జట్టు గెలుస్తుంది అన్న టెన్షన్‌ చాలామందికుంటుంది. అక్కడే ముఖ్యమైన విషయాల మీద అటెన్షన్‌ కోల్పోతారు. అలాంటి ఒత్తిడిని పెంచి మన ధ్యాసను పక్కకు తిప్పడమే ఈ టెన్షన్‌ల ఉద్దేశ్యం. ఇక్కడే మనం జాగ్రత్త వహించాలి.
టీ ట్వెంటీ క్రికెట్‌ ప్రపంచ కప్‌ అంటే ఇరవై ఇరవై ఓవర్ల ప్రపంచ కప్పు మొదలవబోతోంది. దాని గురించి రాసి రాసి, చూపించి చూపించి ఆసక్తి పెంచుతారు మీడియా వాళ్ళు. అందులో భాగంగానే భారత్‌ ఫేవరేట్‌గా రంగంలోకి దిగుతోంది అని రాస్తారు ఒక పేపర్లో. ఈసారి ఇండియాకే కప్పు గెలిచే అవకాశం ఉంది అని ఇంకో పేపర్లో రాస్తారు. రెండూ ఒకే అర్థంగా కనిపిస్తాయి చదివేటోళ్ళకు. ఇప్పుడు భారత్‌, ఇండియా అంటే ఒకటి కాదని, రెండూ వేరువేరనీ జనాల మెదళ్ళలో నూరిపోశారు మన నాయకులు. భారత్‌ తప్పకుండా గెలుస్తుంది అంటే కాదు కాదు ఇండియానే తప్పకుండా గెలుస్తుంది అంటారింకొందరు. మనం తల పట్టుకొని ఇదేమిరా దేశంలో ప్రజల్ని విడగొట్టడం ఒకటైతే దేశం పేరును కూడా ఇలా రాజకీయం చేసి తమాషా చూస్తున్నారా అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది.
ఈ టెన్షన్‌కు కారణం ఒక ఫేవరేట్‌ జట్టును ఊహించుకోవడం. ఫేవరేట్‌ జట్టంటే ఇష్టమైన జట్టు. ప్రతి ఒక్కరికి ఒకటుంటుంది. మనిషిని బట్టి, మీడియా ఐతే పేపరు, టీవీ ఇలా ఎవరికి వారు ”ఇష్టులు” ఉంటారు. ఐనా మధ్య మధ్యలో ఇంకో జట్టునూ తీసివేయలేము, ఫలానా జట్టుకి కూడా గెలిచే అవకాశముంది అంటూ ఉంటారు. అండర్‌ డాగ్‌ జట్లూ ఉంటాయి. అండర్‌ డాగ్‌ అంటే ఏ మాత్రం కప్పు గెలిచే అవకాశం లేని జట్టు అని అందరికీ తెలుసు. చెప్పలేము 1983లో అండర్‌ డాగ్‌గా ప్రవేశించిన కపిల్‌ సారథ్యంలోని భారత జట్టు అదేనండి ఇండియా జట్టు ఏకంగా ప్రపంచ కప్పునే తీసుకొచ్చింది. అదీ ఫైనల్‌ మ్యాచులో రెండుసార్లు ప్రపంచ కప్పు గెలిచిన వెస్ట్‌ ఇండీస్‌ జట్టు మీద గెలిచి. పెద్ద పెద్ద స్టార్లనబడే వాళ్ళు ఈ కప్పులో అరివీర భయంకరరగా ఆడి కప్పు తేవడం జరగలేదు. ఇండియా కంటే అండర్‌ డాగ్‌ జట్టు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టుకు ముచ్చెమటలు పట్టిస్తే… నాయకుడు కపిల్‌ దేవ్‌ 175 కొట్టి మ్యాచ్‌ గెలిచి ఫైనల్‌ దాకా తీసుకొచ్చాడు. ఫైనల్‌ మ్యాచులో అమర్‌నాథ్‌, మదన్‌ లాల్‌ లాంటి వారు ఎదురుగా వెస్ట్‌ ఇండీస్‌ బౌలర్లు వేసే బంతులను భయపడకుండా ఎదుర్కొని, తరువాత వాళ్ళ వికెట్లు కూడా పడగొట్టి కప్పును ముద్దాడేలా చేశారు. ఇదంతా చెప్పడమెందుకంటే పెద్ద పెద్ద స్టార్లనబడే వాళ్ళు ఏమీ చేయలేరు ఒక్కొక్క సారి. ఫేవరేట్‌ ఐనా అండర్‌ డాగ్‌ ఐనా జట్టంతా సమైక్యంగా ఆడితేనే టెన్షన్‌ వదిలేసి గెలుస్తారన్న మాట మాత్రం వాస్తవం. మొన్నామధ్య కపిల్‌ దేవ్‌ కాలేజి పిల్లలకు విషయాలు చెబుతూ మనకిష్టమైన పని చేస్తుంటే టెన్షన్‌ ఎందుకొస్తుంది అని ఒక ప్రశ్న వేశాడు. నిజమే కదా!
రెండుసార్లు ప్రపంచ కప్పు గెలిచిన జట్టు మూడోసారీ ముచ్చటగా హ్యాట్రిక్‌ చేస్తుందని ఊహలు గుసగుసలాడించేసి పేపర్లు నింపిన వారికి, చర్చలు పెట్టి నమ్మబలికించిన వారికి ఆ హ్యాట్రిక్‌ తప్పిపోయినప్పుడు పెద్ద షాకే తగులుతుంది. అలాంటి షాకులు క్రీడాకారులిస్తారు, ప్రజలూ ఇస్తారు. ప్రజల అటెన్షన్‌ పక్కకు మరల్చడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం. ”రాక్షసత్వం పోయి, రాచరికములు పోయి, ప్రజలదే పైచేయి, ఓ కూనలమ్మ” అని ఆరుద్రగారి కూనలమ్మ పదాలు పాడుకోవాలప్పుడు. అలాగే ఎవరిని నమ్మకూడదో చెప్పిన పాత కూనలమ్మ పదాలూ ఉన్నాయి ”ఆడి తప్పిన వాని, నాలి నేలని వాని, నాదరించుట హాని, ఓ కూనలమ్మ”, ఇది ఎవరు రాశారో కాని ఆరుద్ర గారికి నచ్చినది.
గాంధీ గురించి ఎవరికిష్టమొచ్చింది వాళ్ళు చెబుతున్నారిప్పుడు. అసలు స్వాతంత్య్రం వచ్చి ఢిల్లీలో వేడుకలు చేసుకుంటుంటే గాంధీజీ అటెన్షన్‌ మాత్రం కలకత్తా మీద ఉంది. దేశ విభజన వేళ మతపరమైన అల్లర్లు జరుగకుండా అక్కడ తానే స్వయంగా ఉండి మరీ పరిస్థితి చేయి దాటిపోకుండా చూశాడు. నాయకుండంటే అలా ఉండాలి. అంతెందుకు సుందరయ్య లాంటి నాయకులు కూడా ప్రజల కోసం ఇలాగే పనిచేశారు. నిన్న ఎగ్జిట్‌ పోల్స్‌ మీద ధ్యాసతో అన్ని పార్టీలవారూ టెన్షన్‌తో ఉంటే సీతారాం ఏచూరి, బృందా కరత్‌ పాలస్తీనాలో మారణహోమం ఆపాలంటూ ఢిల్లీ జంతర్‌ మంతర్‌ దగ్గర ర్యాలీ తీశారు. శ్వాశ మీద ధ్యాసలాగా ప్రజలే శ్వాశగా ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు. ప్రజలంటే ఓట్లు అనుకొని చూసేవాళ్ళు ఇంకో విధంగా ఉంటారు.
ఎగ్జిట్‌ పోల్సుని కూడా రీపోలింగ్‌ చేయించాలని వాట్సప్పులో నిన్న జోక్‌ ఒకటొచ్చింది. ఎవరి సంస్థలు వారివి కదా! అందుకే వాటి ఫలితాలు రకరకాలుగా ఉన్నాయి. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా ప్రజల గురించి ఆలోచించే వాళ్ళ అటెన్షన్‌ ఎప్పుడూ ప్రజా సమస్యల పైనే ఉంటుంది. టెన్షన్‌ అటెన్షన్‌ రెండూ రెండు కళ్ళలా సింహాసనం మీద ఉండేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకే టెన్షన్లోనైనా మన అటెన్షన్‌ కోల్పోకూడదు. మన శ్రద్ధ ఎప్పుడూ ప్రజలపైనే వుండాలి.

– జంధ్యాల రఘుబాబు,
సెల్‌ : 9849753298

➡️