- కామ్రేడ్ సీతారాం ఏచూరి ఇంటర్వ్యూ
కామ్రేడ్, మార్క్సిస్టు అధ్యయనం ఆవశ్యకత ఎంత వరకూ ఉంది?
మార్కిస్టు అంటేనే అధ్యయనశీలి. అధ్యయనం లేకుండా మార్క్సిస్టు ఎన్నటికీ మనలేడు. మార్క్సిస్టుకు అధ్యయనం అనేది స్వాభావికంగా ఉంటుంది. ఉండాలి. అది కమ్యూనిస్టులో అంతర్భాగంగా ఉండాలి. లెనిన్ చెప్పినట్టు ‘మార్క్సిజం ఈజ్ ద కాంక్రీట్ ఎనాలిసిస్ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్’ (నిర్దిష్ట పరిస్థితిని నిర్దిష్టంగా అధ్యయనం చేయడం).అధ్యయనం జీవితాంతం ఉండాలి. దీన్ని గుర్తించకపోతే డీజనరేషన్ (దిగజారిపోవడం) కు… తద్వారా డీవియేషన్స్ (పెడధోరణులు) కూ గురవుతాము. తప్పుదారి పడతాము. ఈ రెండింటినీ సరి చేసుకోవాలి. మరోవైపు ప్రజలంతా ఎందుకు మార్క్సిజం వైపు ఆకర్షితులవుతున్నారు అని చూస్తే ఇప్పటి వరకు ప్రపంచంలో మార్క్సిజం ఒక్కటే శాస్త్రీయం. లెనిన్ మాటలనే చూస్తే మార్క్సిజంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి విప్లవకర స్వభావం. రెండు శాస్త్రీయత. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా మార్క్సిజమే తప్పుదోవ పడుతుంది.
శాస్త్రీయ అధ్యయనాన్ని ఎలా నిర్వచించవచ్చు? సమగ్ర అధ్యయనం ఎలా ఉండాలి?
అధ్యయనానికి చదవడం మౌలిక అవసరమే కానీ, చదవడంతోనే అధ్యయనం పూర్తికాదు. అధ్యయనం అనుభవాల మీద కూడా ఆధారపడుతుంది. మార్క్సిస్టుకు అనుభవాలు ఉద్యమాల ద్వారా వస్తాయి. ఉద్యమాలంటే ప్రజానీకంతో కలసి ఉండటం, పోరాడటం, చదవడం,అధ్యయనం, ఉద్యమాలలో పని చేసిన అనుభవం. ఇవన్నీ కలుపుకుంటేనే సమగ్ర అధ్యయనం అవుతుంది. పుస్తక అధ్యయనం..సామాజిక అధ్యయనం.. ఉద్యమాల అధ్యయనం… మూడింటి కలయికే సమగ్ర అధ్యయనం.
ఒక సామాన్య కార్యకర్త అధ్యయనాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించాలి. మీ అనుభవాల నుంచి చెప్పండి?
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అనుభవాలుంటాయి. వాటిని జనరలైజ్ చేయడం కష్టం. సాధ్యం కూడా కాదు. సామాజికంగా పరిస్థితులు ఏవి, ఎలా మారుతున్నాయి? ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? అనే సందేహాలు వస్తాయి. ఆ ప్రశ్న నుంచే అధ్యయనం చేయాలన్న అవసరం, ఆసక్తి మొదలవుతాయి. మార్క్స్ కూడా ‘డౌట్ ఎవ్రీ థింగ్’ అన్నారు. జిజ్ఞాస, ప్రశ్న అధ్యయనానికి పురిగొల్పుతుంది. ఆ సందేహం ఎక్కడ నుంచి మొదలవుతుందో అక్కడి నుంచే అధ్యయనం ప్రారంభించాలి.
నేను ఎకనమిక్స్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు అర్థశాస్త్రంలో మార్క్సిస్టు అవగాహన మొదట పరిచయమైంది. మార్క్స్ ఒక చోట ‘ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనమిక్ జస్టిస్ కెన్ నెవర్ రైజ్ అబౌ ది సోషల్ కండిషన్స్’ అని చెప్తారు. ఈ వాక్యమే నన్ను అధ్యయనానికి పురికొల్పింది. న్యాయం అనేది సామాజిక పరిస్థితులకు సంబంధం కలిగి ఉంటుంది. నేటి ఆధునిక నాగరిక సమాజంలో న్యాయం సాధ్యమా? ‘జస్టిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ రిలేటివ్ టర్మ్ అండ్ సోషల్ కండిషన్స్, దెమ్ సెల్ఫ్ ఛేంజ్’ (న్యాయమనేది సాపేక్షమైనది…సామాజిక పరిస్థితులు మారుతుంటాయి).
ఎకడమిక్ స్టడీలో నుంచి ఆసక్తి మొదలవడం ఒక భాగమైతే, రెండో వైపు నుంచి మన సామాజిక పరిస్తితితులు కూడా కారణమయ్యాయి. నేను స్కూలు, కాలేజీ హైదరాబాద్‌లో చదివాను. 1967-68లో నక్సలైట్లు, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చూశాను. ప్రత్యేక తెలంగాణ వల్ల హైదరాబాద్ వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ సమయంలో ఏడాది చదువు పోయింది. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? ఎందుకు జరుగుతున్నాయి ఈ ఆందోళనలు? అని వాటి నుంచి కూడా ఆలోచించాను.
మన సమాజంలో పరిణామాలను విశ్లేషిస్తూ… వచ్చే సందేహాలన్నింటికీ పరిష్కార మేమిటి? అని ఆలోచించడం అలవర్చుకున్నాను. చుట్టూ పరిస్థితులు, పరిణామాలకు కారణాలేమిటి?.. వాటికి పరిష్కార మేమిటి విశ్లేషించుకుంటూ నేను వామపక్షం వైపు రావటం జరిగింది. కానీ అసలు అధ్యయనం మొదలెట్టాల్సింది ఒక పుస్తకం నుంచి కాదు అనుభావాల నుంచి.
లెఫ్ట్ వైపు చూస్తున్న తొలి దశలో మీరు చదివిన పుస్తకాలేమిటి?
అప్పటికి ప్రోగ్రెసివ్ లిటరేచర్ బాగా ఉండేది. రాబర్ట్ ఫ్రాస్ట్ పుస్తకాలు ఉండేవి. స్పార్టకస్, అమెరికాలో కార్మికోద్యమ ఎదుగుదలపై పుస్తకాలు వచ్చేవి. అవి చదివాను. మార్క్సిస్ట్ లిటరేచర్ ముఖ్యంగా చదవడం మొదలెట్టింది ఎకనమిక్స్ గ్రాడ్యుయేట్‌గా ఉన్నప్పుడే. ఆ పరిస్థితుల్లో క్యాపిటలిజం అంటే ఏమిటి ? అసలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అని తెలుసుకోవడం కోసమే మార్క్సిస్టు సాహిత్యం వైపు మళ్ళటం జరిగింది. లెనిన్ ‘స్టేట్ అండ్ రివల్యూషన్’ నేను సీరియస్‌గా చదివిన తొలి పుస్తకం. అంతకు ముందూ చదివే వాళ్ళం కానీ సీరియస్‌గా చదివింది, ప్రభావితం చేసింది ఇదే. అపుడే సోషలిజం కోసం మనం చేసే పోరాటం ఏ విధంగా ఉండాలన్నది అర్థమయింది.
మార్క్సిస్టు సాహిత్యం పరిచయమయ్యాక పూర్తిస్థాయి ప్రణాళికా బద్ధంగా చదవడం ఎప్పుడు ప్రారంభమైంది?
ఒకసారి మొదలెట్టాక ఇక అది నిరంతర కార్యక్రమంగా కొనసాగింది. గ్రాడ్యుయేషన్ కాలమంతా ఇలా చదివినా, పరిణతి వచ్చిందనుకున్న దశ మాత్రం ఢిల్లీ జె.ఎన్.యు లో ఉన్నప్పుడే. అక్కడ రెగ్యులర్‌గా స్టడీ గ్రూప్స్ నిర్వహించుకునే వాళ్ళం. ఒక గెస్ట్‌ని పిలిచి లెక్చర్ ఇప్పించుకోవడం, పుస్తకాలపై స్టడీ గ్రూప్స్ నిర్వహించుకోవడం ఆరేడుగురం స్వచ్ఛందంగా చేసేవాళ్ళం. క్యాపిటల్ మూడు సంపుటాలూ అప్పుడే అలా చదివాం… ప్రతి శనివారం సాయంత్రం. మార్క్సిస్టు క్లాసిక్స్‌ని అలా చదివేశాం.
విద్యార్థి దశ కాబట్టి…చదవడం కోసం స్టడీ గ్రూపులు నిర్వహించుకునే వాళ్ళా? స్టడీ గ్రూపు కోసం చదివే వాళ్లా?
రెండూ కాదు… చదివింది అర్థం చేసుకోవడం కోసం. చదివేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమయ్యేది. స్టడీ గ్రూపులో ఇలా పంచుకున్న అవగాహన నుంచి ప్రామాణిక అవగాహనకొచ్చేవాళ్ళం.
మార్కిస్టు సాహిత్యం చదవడానికి ముందు ఇతర సాహిత్యం చదివే అలవాటుండేదా? లేక నేరుగా ఇవే చదివారా?
చిన్నప్పటి నుంచీ సాహిత్యం చదివే అలవాటుండేది. దానికి ముఖ్య కారణం మా తాతగారు (అమ్మ తండ్రి). ఆయన హైకోర్టు జడ్డిగా ఉండేవారు. ఇల్లే పెద్ద లైబ్రరీగా ఉండేది. ఆయన ద్వారా చిన్నప్పటి నుంచీ చదవడం అలవడింది. ఆ అలవాటు తర్వాత కాలంలో చాలా ఉపయోగపడింది. అసలు చదవడానికి ఒక ఇంటలెక్చువల్ డిసిప్లిన్ అవసరం. అది ఎంత ముఖ్యమో ఇప్పటికీ అనిపిస్తుంటుంది. అనుభవంలో తెలుస్తుంటుంది. తరచూ ప్రయాణాల వల్ల చదవడం ఈ మధ్య సరిగ్గా సాగటం లేదు. కానీ ప్రయాణాలనే చదవడానికి ఉపయోగించుకుంటాను.
ఆ కాలంలో ఏయే పుస్తకాలు చదివారు?
ఆ రోజుల్లో కొత్తగా వస్తున్న భారతీయ ఆంగ్ల రచయితల పుస్తకాలు చదివేవాణ్ణి. ఆర్.కె. నారాయణన్ అప్పుడే పావులర్ అవుతున్న రచయిత. భారత పరిస్థితుల్లోని వాస్తవికతను వీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు.. అని తెలుసుకోవడానికి కూడా చదివే వాణ్ణి. మరోవైపు మరో తాతగారి (నాన్న తండ్రి)కి మత సంబంధ పురాణేతిహాసాల పట్ల ఆసక్తి ఉండేది. ఆయన మూలంగా రామాయణ, భారత, భాగవతాలు చదివాను. వాటిల్లో నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. వాటిని నిరాకరించాల్సిన అవసరం లేదు. ఆ అభూతకల్పన నుండి రియాలిటీని గ్రహించడం కోసం అనేక ప్రశ్నలు తలెత్తేవి. అడుగుతూండే వాణ్ణి కాని ఆయన చెప్పగలిగేవారు కారు.
రామాయణంలో దక్షిణాది రాజులను… రాముడి మిత్రులు, భక్తులు సైతం జంతువులుగా చిత్రించడంలోని అంతరార్థం ఏమిటి? ఎందువల్ల అలా చిత్రీకరించారు? అనేది నా నందేహాలలో ఒకటి. రామాయణం కథ వచ్చిన రోజుల్లో ద్రావిడులపై ఆర్యుల అధిక్యత కారణంగా అలా రాశారని కొన్నేళ్ళ తరువాత అర్థమయింది. అప్పటి సోషల్ రియాలిటీ ఆ కథలో అలా ప్రతిబింబించింది. వీటిని అధ్యయనం చేయడాన్ని అభివృద్ధి నిరోధకంగా చూడకూడదు. వాస్తవికతను అర్థం చేసుకోవడానికి వాటిని చదవాలి….ఒకవైపు సమకాలీన సాహిత్యం, మరోవైపు పురాణాలు, ‘స్పార్టకస్’ లాంటి పుస్తకాల్లోని తిరుగుబాట్లు.. ఇవన్నీ అభ్యుదయ సాహిత్యం వైపు రావడానికి దోహదపడతాయి
అభ్యుదయ సాహిత్యాన్ని ఎంచుకునే చదివేవారా?
అనలు చదివితే గదా ఏది అభ్యుదయ సాహిత్యం తెలిసేది. ఇది ప్రోగ్రెసివ్…, ఇది రియాక్షనరీ అని ఎంచుకుని చదవాలనుకుంటే.. అసలు చదవడం సాగదు.
రాజకీయ పాఠశాలకు వెళ్లక ముందూ వెళ్ళిన తరువాత.. అవగాహనా, అధ్యయన వేగంలో ఏమైనా తేడా కనిపించిందా?
తొలి రాజకీయ పాఠశాలకు 1978లో అనుకుంటా వెళ్ళాను… జలంధర్ పార్టీ కాంగ్రెస్ తరువాత ఆ పాఠశాల జరిగింది. రాజకీయ పాఠశాలలకు వెళ్ళడం చాలా ప్రధానం. నా వ్యక్తిగత అనుభవం ఏమిటంటే వాటికి వెళ్లడం వల్ల చద వడం క్రమానుగతమైంది. స్టడీ గ్రూపులకు వెళ్ళడం కూడా. ఏ యే అంశాల కోసం ఏ పుస్తకాలు చదవాలి అనేది క్రమబద్ధమైంది. వేటిని ఎంచుకుని చదవాలనే ప్రాధాన్యతా క్రమం తెలిసింది.
ఆసక్తితో చదివేవి, అవసరాల కోసం చదివేవి ఉంటాయి. అధ్యయనంలో వీటిని ఎలా ప్లాన్ చేసుకోవాలి?
ఈ రెంటి మధ్య వైరుధ్యం ఉందని నేననుకోను. ఆసక్తి ఉండే వాటిలో కూడా విషయాలు, రాజకీయాలు ఉంటాయి. రిలాక్స్ కోణం డిటెక్టివ్ నవలలు కూడా చదివేవాణ్ణి.. పెట్టుబడిదారులు, ఆయుధ వ్యాపారులు యుద్ధాన్ని ఎందుకు కోరుకుంటారో, వారు యుద్ధాల వల్ల ఎలా లాభపడతారో మొదటిసారి ఒక డిటెక్టివ్ నవల ద్వారానే తెలిసింది. కాబట్టి చదివే వాటి ద్వారా మనం ఏమి గ్రహిస్తామనే దానిపైనే ఇది అధారపడి ఉంటుంది తప్ప ఆసక్తి ఉన్న విషయాలను చదవకూడదని కాదు. కానీ మార్క్సిస్టు మౌలిక క్లాసిక్స్ చదవకుండా వీటి నుంచే అన్ని అర్ధం చేసుకుంటామనేది, చైతన్యం పొందుతామనేది తప్పు. అలాగే క్లాసిక్స్ చదివేసి… అంతా అర్థమయిందనుకోవడమూ సరి కాదు.
అనేక పుస్తకాలు చదువుతాము కదా! అందులోంచి విషయాలను డ్రా చేయడం గుర్తుంచుకోవడం, నిక్షిప్తం చేసుకోవడం మీరు ఎలా చేస్తారు?
ఎందుకు చదువుతున్నామనే స్పృహ మనకు ఉండాలి. మన జీవితంలోని అనుభవాల కంటే మించి ఇంకా అనేక అనుభవాలున్నాయి. వాటిని మనం అనుభవించే అవకాశం లేదు ఆ అనుభవాల్లోంచి.. మానవ సంబంధాలు.. అనుభూ తులు ఎలా వుంటాయనేది చదవడం వల్లే తెలుసుకోగలం. అవసరమైతే చదివేప్పుడు నోట్సు తీసుకోవాలి. మననం చేసు కోవడం, రాసుకోవడం చేయాలి. నా జేబులో ఎప్పుడూ చిన్న కాగితాలుంటాయి. ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నా, చదివినా.. ఏ విధంగా గ్రహించినా వెంటనే రాసుకుంటాను.
ఆత్మవిమర్శతో చెప్పాలంటే..ఈ పనిని నేను కూడా చేయాల్సినంత చేయలేకపోతున్నాను చదివినదీ తెలుసుకున్నదీ, నేర్చుకున్నవీ సహచరులతో పంచుకోవాలి. ఇది క్రమబద్ధంగా జరగాలి. అప్పుడే ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. కొందరు చాలా చదువుతారు. బాగా జ్ఞానం సంపాదిస్తారు. కానీ అది వారికే పరిమితం చేసుకుంటారు. ఇందువల్ల ఉద్యమాలకు లాభం జరగటం లేదు. ఇందుకోసం మానసిక క్రమశిక్షణ అవసరం.అలాగే, ఎంత సాధికారత ఉన్న అంశమైనా సభలు, పాఠశాలలకు వెళ్ళేప్పుడు ప్రిపరేషన్ ఉండాలి. ప్రిపరేషన్ ఉంటే విషయం, క్రమం, పద్ధతీ బాగా ఉంటాయి. చెప్పాలనుకున్నది అవతలి వారికి చేరుతుంది.
అంత బిజీ షెడ్యూల్‌లో అధ్యయనానికి సమయం ఎలా కేటాయిస్తున్నారు?
దీనికి మానసిక క్రమశిక్షణ అవసరం. ఎక్కువగా ప్రయాణాల్లో గడుపుతూంటాను. చదవడం, రాయడం కూడా ప్రయాణాల్లోనే చేస్తుంటాను. సాంకేతిక అభివృద్ధి వల్ల రాసింది పంపించడమూ సాధ్యమవుతున్నది. ప్రాథమికంగా ప్రతి రోజూ కొంత సమయం అధ్యయనానికి కేటాయించడం అవసరం. కామ్రేడ్ ఇ.ఎం.ఎస్ నుంచి ఇది నేను నేర్చుకున్నాను. ఆయన రోజు ఉదయాన్నే రెండు మూడు గంటలు చదివేవారు. ఆ సమయానికి ఆటంకం ఏర్పడితే ఆ రోజులో ఏదో ఒక సమయాన్ని అందుకోసం సర్దుబాటు చేసుకునేవారు. నేనూ ఉదయాన్నే అలా కేటాయిస్తాను. ఆటంకం ఏర్పడితే సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తాను.
మొదలుపెట్టిన పుస్తకం అనేక కారణాలతో మధ్యలోనే ఆపేస్తుంటారు. ఈ సమస్య మీరు ఎలా అధిగమిస్తూంటారు?
ఏ పుస్తకమైన చదవాలని ఉండి పూర్తి చేయలేదంటే అది వ్యక్తిగత బలహీనతే. ఆ పుస్తకం పూర్తి చేయాలంటే అది పూర్తయ్యే వరకూ మనతోనే ఉంచుకోవాలి. దానిని పూర్తి చేయాలనే తపనా, ఆసక్తి ఉంటే అది సాధ్యమవుతుంది. భారతీయ రచయితల్లో మార్క్సిస్ట్ ఫిలాసఫర్‌గా చెప్పుకునే దేవీప్రసాద్ చటోపాధ్యాయ అముద్రిత రచనలను ఇటీవలే ముద్రించారు. వాటిని చదవడం రెండు నెలల క్రితం మొదలెట్టాను. పూర్తి చేయడం కోసం నా వెంటే ఉంచుకుంటున్నాను. ఆసక్తికరంగా ఉన్న పుస్తకం చదివేప్పుడు ఆకస్మికంగా వేరే పనులేవో తగిలితే స్వల్పంగా చికాకు కలుగుతుంది. నిభాయించుకుని తక్షణావశ్యమైన పనికి దిగుతుంటాను.
అధ్యయనంలో అప్పటికీ.. ఇప్పటికీ తేడా? ఆ రోజులే బాగున్నాయి… ఈ రోజుల్లో చదవడానికి టైమ్ ఉండటం లేదు – అనే ఫీలింగ్ వస్తుంటుందా?
తేడా ఉంది కానీ, అలాంటి ఫీలింగ్ కలుగదు. వాస్తవానికి ఇప్పుడు సమయం మిగులుతోంది. టెక్నాలజీ పెరగడం వల్ల ఇప్పుడు సమాచారం, వెంటవెంటనే తెలిసిపోతోంది. ఇప్పుడు టెక్నాలజీ, టీవీ ఛానళ్ల వల్ల సమాచారం కోసం ఎక్కువ సేపు ఎదురుచూడాల్సిన పని లేకుండా పోయింది. వీటి వల్ల గతం కంటే చదవడానికి ఎక్కువ సమయం మిగులుతోంది రోజుల్లో సమాచార సేకరణకే ఎక్కువ సమయం పట్టేది.
వేర్వేరు రంగాలు, సామాజిక వర్గాలకు నంబంధించి వస్తున్న నమకాలీన సాహిత్యం చదవాల్సిన అవసరం ఉందా?
కచ్చితంగా ఉంది. అలా వస్తున్న మంచి సాహిత్యంతో పాటు అంతకు మించి పనికిరానిది కూడా వస్తున్నది. వాటిని వేరు చేసుకుని సమకాలీన సాహిత్యం చదవాల్సిందే.
విషయాధ్యయనంలో స్పెషలైజేషన్లు సంబంధించి..?
స్పెషలైజేషన్ అంటే మిగతా చదవకూడదని కాదు. జనరల్‌గా అన్ని విషయాల గురించిన ప్రాథమిక అవగాహన కోసం చదవడం, అలాగే పనిచేస్తున్న అంశంమీద స్పెషలైజేషన్ చేయడం అవసరం. ఒకే విషయం స్పెషలైజేషన్ చేసి, మిగతా వదిలేయడం సరికాదు. సమగ్రతా రాదు. స్పెషలైజేషన్ లేకుండా అన్ని విషయాలు చదవడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు.
ఇప్పటికీ మీకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చే పుస్తకం రచయిత?
చెప్పడం కష్టం. చాలామంది ఉన్నారు. చాలా పుస్తకాలున్నాయి. అయినా నా దృష్టిలో క్లాసిక్ మాస్టర్ పీస్ మాత్రం మార్క్స్ రాసిన ‘లూయీ బోనపార్టీ ఎయిటీంత్ బృమెర్’. ఆలసట పోగొట్టుకోవడం కోసం తరచూ చదువుతూండే పుస్తకం అది.
అందులోని ఒక వాక్యం.
‘మేన్ మేక్స్ హిస్టరీ బట్ నాట్ ఆన్ ది సర్కమ్‌స్టెన్సెస్ ఛూజన్ బై హిమ్!’ (మనుషులే చరిత్ర నిర్మాతలు. అయితే వాళ్లనుకున్న పరిస్థితుల ఆధారంగా కాదు).