ఈ ప్రశ్నకు బదులేది?

Aug 18,2024 05:45 #Articles, #edit page, #India, #rape case

వందే మాతర గీతం వరస మారుతున్నది/ తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది/ పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ/ చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది/ …ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది’ అంటారు సినారె. వందేమాతం పల్లవించిన నేలపై ఆమె తల్లడిల్లుతున్నది. ‘పంజాబు, సింధు, గుజరాత్‌ మహారాష్ట్రలతో కూడిన పశ్చిమ తీర ప్రాంతం, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతం, ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కళ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్‌ ప్రాంతం, వింధ్య హిమాలయ పర్వతాలు, యమున గంగలు పై కంటే ఎగసే సముద్ర తరంగాలు- ఇవన్నీ… తమరి శుభ నామమే తలుచుకుంటున్నాయి. తమరి శుభ ఆశిస్సులనే కోరుకుంటున్నాయి. తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి. ఓ జనసమూహాల మనసుల అధినాయక… మీకు జయము! ఓ భారత భాగ్య విధాత.. మీకు జయము’ అని ఆసేతు హిమాచలము ‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరుల’ని పాడుకుంటున్న దేశంలో… 77 ఏళ్ళ స్వాతంత్య్రమా… నాకు స్వేచ్ఛెక్కడీ అని దేశంలోని ప్రతి ఆడపడుచూ ప్రశ్నిస్తోంది. ఈ ప్రశ్న… ‘ఆడపిల్ల అర్థరాత్రి ఒంటరిగా నడిచిన నాడే అసలైన స్వాతంత్య్రం’ అన్న గాంధీజీ ఆకాంక్షను సవాలు చేస్తోంది.
గృహ బంధనాలను, పురుషాధిక్యతను ఛేదించుకొని ఇప్పుడిప్పుడే మహిళలు బయటి ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో తమ ప్రతిభా సామర్థ్యాలను చాటుకుంటున్నారు. అయితే, పనిచేసే చోట సాధారణ శ్రామికుల నుంచి ఉన్నతోద్యోగుల వరకూ ఎదురౌతున్న లైంగిక వేధింపులు సమాజాన్ని చీడ పురుగులా పట్టి పీడిస్తున్నాయి. మహిళలకు భద్రత కరువౌవుతోంది. బయటకు వెళ్లినవారు క్షేమంగా తిరిగి రావడం ప్రశ్నార్థకంగా మారింది. కొల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం… దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఆందోళనలు నిరసనలు జరుగుతుండగానే… ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళుతున్న నర్సుపై హత్యాచారం జరిగింది. మహిళలకు కనీస భద్రత లేని సమాజాన్ని నాగరికమైందని అనగలమా? ఆడపిల్లలపై అకృత్యాలకు తెగబడుతోన్న కీచకులను శిక్షించలేనప్పుడు అది చట్టబద్ధమైన పాలన అనగలమా? ఇది ఏ ఒక్కరి ప్రశ్నో కాదు… దేశంలో జరుగుతున్న హత్యాచార ఘటనలపై ఎందరో మహిళలు అడుగుతున్న ప్రశ్నలు. ‘అర్థరాత్రి స్వతంత్రం అంధకార బంధురం/ అంగాంగం దోపిడైన కన్నతల్లి జీవితం/ ఇదే నేటి భారతం భరతమాత జీవితం’ అంటాడు మహాకవి శ్రీశ్రీ. ‘ఎఫ్‌బి వాల్‌పైనో, ఎక్స్‌ హ్యాండిల్‌లోనో స్పందిస్తే సమాధానం దొరకదు. మువ్వన్నెల జెండా రెపరెపలాడే వేళ ఈ హత్యాచారంపై స్వతంత్ర భారతం స్పందించాలని, నడివీధిలోకొస్తేనే పాలకుల్లో కదలిక వస్తుందని, అదీ అర్థరాత్రి రోడ్డు ఎక్కి నిరసన తెలపాలని’ కొల్‌కతాకు చెందిన 29 ఏళ్ల రిమ్‌జిమ్‌ సిన్హా పిలుపునిచ్చింది. సిన్హా పిలుపు సామాజిక మాధ్యమాల్లో జాతీయ గీతంలా మార్మోగింది. ఎందరో యువతీ యువకులు రోడ్డెక్కారు. మహిళలకు భద్రత కల్పించాలని దేశమంతా ఒక్కటిగా నినదిస్తోంది.
కొల్‌కతా వీధుల్లో గొంతువిప్పిన నిరసన జ్వాలలు…ఇప్పుడు దేశమంతా వెల్లువెత్తుతున్నాయి. ‘అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సెమినార్‌ హాల్‌కి వెళ్లడం ఎందుకు?’ అని స్వయానా ఆర్జీకార్‌ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ అంటే, ‘పెందరాళే ఇంటికి చేరుకోక… ఎందుకీ పెత్తనాలు’ అని మరో పురుషపుంగవుడు సణిగితే, ‘ఆడవాళ్లంతా రోడ్డెకుతున్నారు మంచిదే… కానీ, మిమ్మల్ని మీ మొగుళ్లు కొడితే, మా పూచీకాదు’ అని సాక్షాత్తూ ఆ రాష్ట్ర మంత్రే వాక్రుచ్చితే… ఇలా నోరు పారేసుకున్నవారందరి మస్తిష్కాల మకిలి వదలగొడుతూ… బాలికల నుంచి వృద్ధుల వరకూ అంతా పిడికిలి బిగించారు. తమ భద్రతపై నినదిస్తున్నారు. వీరికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. భారతావని ప్రగతిపథంలో దూసుకుపోవాలంటే…మహిళా భాగస్వామ్యం పెరగాలి. పని ప్రదేశాల్లోనే కాదు, సురక్షితంగా ఇంటికి చేరగలిగే పరిస్థితి వుండాలి. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చెయ్యాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాధికారమౌతుంది.

➡️