పుస్తకాల సంచిని
గుండెలకు హత్తుకుని
పరుగుతీసిన ఆ చిన్నారిలో
నాకు సావిత్రీబాయి ఫూలే కనిపించింది.
మానవీయత చూపని
అధికార బుల్డోజర్ బలగం
పేదల గుడిసెలపై ఉన్నట్టుండి
పంజా విసిరింది.
అక్కడ ఇళ్ళను
ఎందుకు కూల్చుతున్నారో
ఆ చిన్నారికి తెలియదు.
ఇళ్ళన్నీ నేలకూలుతున్న
సమయంలో..
వ్యాపించిన మంటల్ని
చిన్నారి గమనించిందో లేదో
ఒక్క ఉదుటున లేచి…
గుడిసెలోని తన పుస్తకాల
సంచిని భద్రంగా గుండెలకు
హత్తుకుని బయటకు
పరుగు తీసింది.
పుస్తకాల సంచి లోనే
తన జీవితం ఉందనుకుంది
అందుకే తన ఇంటిలోని
వస్తువుల కోసం ఆలోచించలేదు.
చిన్నారి పరుగు
బుల్డోజర్ సంస్కృతిని ప్రశ్నించింది.
ఆ చిన్న పుస్తకాల సంచి
వ్యవస్థకు పెద్ద పాఠమై నిలిచింది.
సుప్రీంకోర్టును తాకిన
ఆ చిన్నిపాదాల పరుగు…
న్యాయమూర్తుల
హృదయాలను కలవరపెట్టింది.
పుస్తకాల సంచి కోసం
చిన్నారి పడిన తపనే
దేశం కళ్లన్నీ ఒక్కసారిగా
తనవైపు చూసేలా చేసింది.
చిన్నారి పరుగులోని
ఒక్కో అడుగు పాలకుల తీరుకు
లెక్కలేని చెంపదెబ్బలే.
– పొనుగుమట్ల అశోక్ కుమార్,
యానాం, సెల్: 9959379709