అచ్చే దిన్ గురించి అస్తమానూ కబుర్లు వల్లించే మోడీ ప్రభుత్వం సామాన్య జనం నెత్తిన మళ్లీ గ్యాస్ బండ భారం మోపింది. అటు పెట్రోలు, డీజిల్ పైనా రూ.2ల చొప్పున సుంకం బనాయించింది. ‘ఏడ్చిపోదురు గాక నాకేటి వెరపు?’ అన్న చందంగా జనంపై భారాలు మోపటం మోడీ హయాంలో ఇదే మొదటిసారి కాదు. ప్రజలు కోవిడ్ కష్టకాలంలో విలవిల్లాడిపోయిన సందర్భాల్లో కూడా వంట గ్యాస్, పెట్రో భారాలు మోపిన ఘనత కేంద్ర ప్రభుత్వానిది. ఎల్‌పిజిపై ప్రజలకు బోలెడంత రాయితీ ధారబోస్తున్నామంటూ బొంకి, నెమ్మది నెమ్మదిగా సబ్సిడీ మొత్తానికి సర్వమంగళం పాడిన మోసకారితనం మోడీ అండ్ కోది. దాదాపు పదేళ్ల క్రితం నగదు బదిలీపై గొప్పగా ఢంకా బజాయించి, సబ్సిడీ సొమ్మును నేరుగా వినియోగదారుల ఖాతాల్లోనే జమ చేస్తామంటూ చెప్పారు. ఆ తరువాత 14.2 కేజీల సిలిండరు ధరను రూ.420 నుంచి రూ.1100 వరకూ పెంచుకుంటూ పోయారు. ప్రారంభంలో రూ.రెండొందలకు పైగా ఖాతాల్లో జమైన రాయితీ సొమ్ము ఇప్పుడు రూ.15ల నామమాత్రానికి కరిగిపోయింది. ఈ విధంగా దేశంలోని 32.83 కోట్ల మంది ఎల్‌పిజి వినియోగదారులను చెప్పాపెట్టకుండా రాయితీని తెగ్గోసి, మోసగించింది బిజెపి ప్రభుత్వం.
పాతికేళ్ల క్రితం వరకూ ఏడాదికొకసారి పెట్రో ఉత్పత్తుల ధరలను సవరించటం, పూలింగ్ పద్ధతిలో ధరల సర్దుబాటు చేయటం విధానంగా ఉండేది. దానిని పూర్తిగా నిర్వీర్యం చేసి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్టులోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరల్లో మార్పులు ఉంటాయని కేంద్ర పాలకులు ప్రకటించారు. ధరలు పెరిగినప్పుడు పెంచటం, తగ్గినప్పుడు తగ్గించటం సహజంగానే జరిగిపోతుందని చెప్పుకొచ్చారు. నిజానికి ఆచరణలో జరుగుతున్నదేమిటి? భారం పెరిగితే జనం మీదికి నెట్టటం, ధర తగ్గితే చమురు కంపెనీల ఖాతాల్లోకి మళ్లించటం మామూలుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకాన్ని పెంచటం రివాజు అయింది. 2014 నవంబరు నుంచి 2016 జనవరి వరకూ తొమ్మిదిసార్లు సుంకాన్ని పెంచారు. వినియోగదారులకు దక్కాల్సిన తగ్గింపును ప్రభుత్వమే కొట్టేయటం మోసకారితనం కాక మరేమిటి?
అంతర్జాతీయ చమురు మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా వాస్తవానికి పెట్రో ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాల్సి ఉంది. 2014 నాటితో పోలిస్తే ఇప్పుడు 41 శాతం మేర చమురు ధరలు తగ్గాయి. దానిని యథాతథంగా అమలు చేస్తే లీటరు పెట్రోలు, డీజిలు ధరలు రూ.70ల లోపే ఉండాలి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా మనకు గతంలో కన్నా తక్కువ ధరకే ముడి చమురును విక్రయిస్తోంది. ఈ అవకాశాన్ని దేశీయ కార్పొరేటు కంపెనీలు అధిక లాభాలు ఆర్జించటానికి మోడీ ప్రభుత్వం అందిస్తోంది తప్ప ఆ తగ్గింపును ప్రజల వైపు మళ్లించటం లేదు. పైగా ఎన్నికల వేళ చమురు ధరల ఆధారంగా లబ్ధి పొందేందుకు కుయుక్తులకు దిగుతోంది. కోవిడ్ విపత్తు కాలంలోనూ ప్రజలపై కనికరం చూపని మోడీ ప్రభుత్వం… ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలోనూ, సార్వత్రిక ఎన్నికల తరుణంలోనూ తగ్గింపు జిమ్మిక్కులు ప్రదర్శించింది. రూ.1050 వరకూ పెంచిన వంట గ్యాస్‌పై రూ.200, రూ.111 వరకూ పెంచిన పెట్రోలు ధరపై రూ.2లు తగ్గించి, పెద్ద ఉపశమనం చేకూర్చినట్టు ప్రచారం చేసుకొంది. కార్పొరేట్ల సేవ, అధికార యావ తప్ప ప్రజలపై భారాలు తగ్గించే బాధ్యతాయుత ఆచరణ బిజెపి ప్రభుత్వానికి లేదనటానికి తాజా పెంపు ఉదాహరణ.
తగిన ఆదాయాలు లేక ప్రజల్లో కొనుగోలు శక్తి రోజురోజుకీ తగ్గిపోతున్న వాస్తవం అనేక రూపాల్లో కళ్ల ముందు కనిపిస్తోంది. కోవిడ్ తరువాత నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి, మళ్లీ కిందికి చూడడం లేదు. ధరలను అదుపులోకి తేవాల్సిన పాలకులు ఆ పని చేయకపోగా, అవి మరింత పెరగటానికి కారణమయ్యే ఎల్‌పిజి, పెట్రో ధరలను పెంచటం బాధ్యతారాహిత్యం. పేదల జీవితాల్లో వెలుగులు నింపటానికి అంటూ తీసుకొచ్చిన ఉజ్వల పథకం వినియోగదారులపైనా రూ.50ల పెంపు గ్యాస్ వినియోగాన్ని పక్కన పెట్టి, మళ్లీ కట్టెల మోపు వైపు నెట్టటానికే ఉపయోగపడుతుంది. కాబట్టి, పెంచిన ఎల్‌పిజి ధరను ఉపసంహరించటంతో పాటు రాయితీని భారీగా పెంచాలి. అన్ని తరగతులపైనా, నిత్యావసర ధరల పైనా ప్రభావం చూపే ఈ పెంపును తక్షణం ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
