పెట్టుబడిదారీ వ్యవస్థను కోలుకోనివ్వరాదు

ఇప్పుడు ప్రపంచం అంతా పెట్టుబడిదారీ వ్యవస్థను కుదిపివేస్తున్న సంక్షోభం గురించి చర్చిస్తోంది. అయితే ఇక్కడ అతి ప్రధానమైన ప్రశ్న ఒకటి ఉండిపోయింది. ఇంత తీవ్ర సంక్షోభంలో ఇరుక్కున్న ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎందుకు కూలిపోవడం లేదు?
పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభం పదే పదే ఏర్పడుతూ వుంటుంది. కాని ఎప్పుడూ పెట్టుబడిదారీ వ్యవస్థ తనంతట తానే, ఆటోమేటిక్‌గా కూలిపోలేదు. ఆ సంక్షోభం నుంచి గట్టెక్కి మళ్ళీ కొనసాగడానికి వీలుగా తనను తాను మార్చుకుంటూ మనుగడ కొనసాగిస్తోంది. ఈ విధంగా ప్రతీసారీ గట్టెక్కడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అనుసరిస్తున్న పద్ధతులేమిటో చూద్దాం. ఏ సంక్షోభం లోనుంచి అయినా బైట పడేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు అయిదు అవకాశాలు ఉన్నాయి.
(అ) యుద్ధం, డాలర్‌, భూగోళ రాజకీయాలు: యుద్ధం ప్రధాన చోదక శక్తిగా ఉండే ఆర్థిక వ్యవస్థను నడపడం, ఆయుధాల వ్యాపారాన్ని సామ్రాజ్యవాదం నేతృత్వంలో నడపడం, వీటికి తోడు దాడులకు దిగడం, బలవంతంగా సంపదను కొల్లగొట్టడం, దోపిడీ చేయడం-ఈ పద్ధతులను అనుసరించి సంక్షోభం నుండి బైట పడడానికి సామ్రాజ్యవాదం ప్రయత్నిస్తూ వుంటుంది. సైనిక బలగాల మోహరింపు, యుద్ధాలు, విద్రోహ చర్యలు, ఆర్థిక దిగ్బంధనాలు, ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న దేశాల సార్వభౌమాధికారాన్ని దెబ్బ తీసేలా జోక్యం చేసుకోవడం (ఇది మరీ ముఖ్యంగా లాటిన్‌ అమెరికాలో, మధ్య ప్రాచ్యంలో, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాలలో, యూరప్‌్‌లో సైతం జరుగుతోంది), అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదపు నగ రూప లక్షణాలు. గ్రీన్‌ల్యాండ్‌ను, పనామా కాలువను, గాజాను స్వాధీనం చేసుకుంటాం అంటూ తాజాగా ట్రంప్‌ చేస్తున్న యుద్ధ ప్రకటనలు రాబోతున్న దాడులను తెలియజేస్తున్నాయి.
పాలస్తీనా మీద 15 నెలల కాలంలో జరిగిన దాడుల్లో 48,000 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. వారిలో అత్యధికులు మహిళలు, చిన్న పిల్లలు. ఈ ఘనకార్యానికి గాను అమెరికా ఇజ్రాయిల్‌కు అందించిన సహాయం అత్యధిక స్ధాయికి చేరింది. 2023, 2024 సంవత్సరాలలో అమెరికా ఇజ్రాయిల్‌కు అందించిన సహాయం ఏడాదికి 3.8 బిలియన్‌ డాలర్లు. ఒక్క 2022 లోనే అమెరికాలోని అతి పెద్ద మిలిటరీ కాంట్రాక్టర్లు అయిదుగురు 196 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించారు.
ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా రష్యాపై విధించిన ఆంక్షల వలన ఏర్పడిన పరిస్థితిని తమకు అనుకూలంగా వాడుకుని అమెరికన్‌ ఇంథన సంస్థ ఎక్సాన్‌ మొబిల్‌ 55 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. ఆ సంస్థ లాభాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. 2022లో షెనియర్‌ ఎనర్జీ అనే సహజ వాయువు వ్యాపారం చేసే సంస్థ తన లాభాలను 200 శాతం పెంచుకుంది. అంటే శతకోటీశ్వరులు యుద్ధాల వలన లాభాల పంట పండించుకుం టారన్నమాట.
అమెరికా ఆధిపత్యం చెలాయించడంలో కీలక భూమిక పోషించేది అమెరికన్‌ డాలర్‌, అమెరికా విధించే ఆంక్షలు.
అత్యధిక దేశాల వాణిజ్యం డాలర్ల రూపంలోనే సాగుతుంది. అమెరికాకు దేశీయంగా సంక్షోభం ఏర్పడితే, అది భారీగా డాలర్లను ముద్రించి విడుదల చేస్తుంది. ఆ మేరకు ఆ దేశ జాతీయ రుణం భారీగా పెరుగుతుంది (2008లో అమెరికా జాతీయ రుణం 10.7 ట్రిలియన్ల డాలర్లు ఉంటే అది కాస్తా 2023 నాటికి 33 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది !). అయితే అన్ని దేశాలకూ డాలర్లు అవసరం కనుక ఆ డాలరు విలువ పడిపోకుండా కొనసాగుతుంది. యుద్ధం, డాలర్‌ అనేవి అమెరికా చేతుల్లో సంక్షోభాన్ని అధిగమించడానికి ఉపయోగపడే సాధనాలు.
(ఆ) పారిశ్రామిక రంగంలో కొత్త విభాగాలను ప్రారంభించడం: సంక్షోభం తీవ్రంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త పారిశ్రామిక విభాగాలను ప్రారంభిస్తుంది. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఆ విభాగాలు అత్యంత గరిష్ట స్థాయిలో లాభాలను ఆర్జిస్తాయి. స్పెక్యులేషన్‌ ఎక్కువగా సాగుతున్న ప్రస్తుత యుగంలో లాభాలను ఎక్కువగా ఆర్జించే ఈ కొత్త విభాగాలపట్ల ఆకర్షణ మరింత ఎక్కువగా ఉంటుంది.
2000 అనంతర సంక్షోభ కాలంలో ఇంటర్నెట్‌ను ఎక్కువమంది ప్రజానీకం వినియోగించేలా ప్రవేశపెట్టారు. 2008 రియల్‌ ఎస్టేట్‌ బుడగ పేలిపోయిన అనంతరం సాంప్రదాయేతర ఇంధన వినియోగం వైపు మారాలన్న చర్చ బాగా ముందుకొచ్చింది. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు రెండు ట్రిలియన్ల డాలర్లను దాటుతాయని అంచనా. కోవిడ్‌-19 సంక్షోభం సమయంలో వ్యాక్సిన్‌ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు పెట్టారు.
తాజాగా పెట్టుబడులు ప్రవహిస్తున్న రంగం కృత్రిమ మేధ. ఎ.ఐ. డిసెంబర్‌ 2024 వరకూ ఈ ఎ.ఐ సాంకేతికతపై పూర్తి ఆధిపత్యం అమెరికాకే ఉండేది. అందుచేత తక్కిన జి7 దేశాలను దాటి అమెరికా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టింది. ప్రధాన ఎ.ఐ చిప్‌ డిజైనర్‌ ఎన్‌విడియా సంస్థ తన సంపద విలువను ఏకంగా ఒక ట్రిలియన్‌ డాలర్ల మేరకు అదనంగా పెంచుకుంది. 2024లో మొత్తం ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల సమస్త ఆదాయంలో ఇది ఒక్కటే ఐదో వంతు. యాపిల్‌ను, మైక్రోసాఫ్ట్‌ను సైతం ఈ సంస్థ దాటి ముందుకు పోయింది. ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, యాపిల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌, ఎన్‌విడియా, టెస్లా-ఈ ఏడు సోషల్‌ మీడియా-సాఫ్ట్‌వేర్‌, చిప్‌ కంపెనీలనూ ‘మాగ్నిఫిసియంట్‌ సెవెన్‌’ అని పిలుస్తారు. ప్రపంచంలోని అతి పెద్ద 500 లిస్టెడ్‌ కంపెనీల్లోనూ ఈ ఏడింటి మార్కెట్‌ విలువ 12 ట్రిలియన్‌ డాలర్లు అయితే, తక్కిన 493 కంపెనీలూ ఎదుగూ బొదుగూ లేకుండా నిలిచిపోవడమో, దిగజారిపోవడమో జరుగుతోంది.
ఎ.ఐ సాంకేతికతపై అమెరికాకు ఉన్న స్థాయి ఆ దేశానికి చాలా ఎక్కువ వృద్ధి నమోదు కావడానికి దోహదం చేసింది. ఎ.ఐ సాంకేతికతను వినియోగించాలంటే అందుకు కావలసిన గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఎన్‌విడియా వద్ద మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా మాత్రమే ఎ.ఐ వినియోగానికి కావలసిన చిప్స్‌ తయారౌతాయి.
అయితే, చైనాకు ఈ ఎ.ఐ చిప్స్‌ను ఎగుమతి చేయరాదని అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, వాటన్నింటినీ అధిగమించి చైనా కంపెనీ హాంగ్‌జౌ జనవరి 2025లో డీప్‌ సీక్‌-ఆర్‌1 ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎ.ఐ సాంకేతికతను వినియోగంలోకి తేవడానికి ఈ డీప్‌ సీక్‌ సహాయకారిగా ఉంటుంది. విడుదల అయిన నెల లోపే ఈ హాంగ్‌జౌ మార్కెట్‌లో తనకు పోటీదారులుగా ఉన్న చాట్‌ జిపిటి, జెమిని, క్లాడ్‌ వంటి సంస్థలను అధిగమించి నెంబర్‌ వన్‌ స్థానానికి వచ్చేసింది. తక్కిన కంపెనీల కన్నా డీప్‌ సీక్‌ 93 శాతం తక్కువ చార్జీలు వసూలు చేస్తుంది.
డీప్‌ సీక్‌ మార్కెట్‌లో ప్రవేశించగానే ఎన్‌విడియా మార్కెట్‌ విలువ ఏకంగా 600 బిలియన్ల మేరకు అంతర్ధానం అయిపోయింది. మైక్రోసాఫ్ట్‌ షేర్ల విలువ 2.1శాతం పడిపోయింది. ఆల్ఫా బెట్‌ షేర్ల విలువ 4.2శాతం పడిపోయింది. డెల్‌ టెక్నాలజీస్‌ షేర్ల విలువ 8.7శాతం పడిపోయింది. యాపిల్‌ పేర్ల విలువ 3.18శాతం, విస్త్రా షేర్ల విలువ 28.3శాతం పడి పోయాయి. స్పెక్యులేటివ్‌ మార్కెట్‌ ఎంత దుర్బలమైనదో, అమెరికా వృద్ధి ఎంత అస్థిరమో దీనినిబట్టి తెలుస్తోంది. ఇంకా అసలైన తుఫాను ముందే వుంది!
(ఇ) చౌకగా కార్మిక శక్తిని మార్చి ఉత్పాదకతను బాగా పెంచుకోవడం: ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంక్‌ నిర్దేశించిన విధంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు, సరుకులు దేశాల హద్దులను దాటి యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. అయితే అదే మోతాదులో శ్రమ (కార్మికులు) సంచరించడంలేదు. సంపన్న దేశాలలో కార్మిక శ్రమ ఖరీదుతో పోల్చితే మూడవ ప్రపంచ దేశాలలో కార్మిక శ్రమ చాలా చౌకగానే కొనసాగుతోంది. ఇది వలసకాలం నుంచి కొనసాగుతున్నదే. ఇందువలన సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు సంపన్న దేశాల నుండి మూడవ ప్రపంచ దేశాలకు తమ ఉత్పత్తి కేంద్రాలను మార్చాయి. ఆ ఉత్పత్తుల బ్రాండ్లు మాత్రం తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. ఈ మార్పు ఫలితంగా అతి తక్కువ వేతనాలకే మూడవ ప్రపంచ దేశాల కార్మికుల శ్రమను కొల్లగొట్టి తమ లాభాలను అపరిమితంగా ఆ బ్రాండ్ల కంపెనీలు పెంచుకున్నాయి. దానితోబాటు మూడవ ప్రపంచ దేశాలలోని చిన్న ఉత్పత్తిదారులను బాగా దెబ్బ తీశాయి. దాని ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయి దుర్భర పేదరికంటోకి నెట్టబడ్డారు.
ఇంకోపక్క కొత్తగా పెంపొందుతున్న టెక్నాలజీలపై తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, సరుకులకు అత్యధిక ధరలను నిర్ణయించడం ద్వారా లాభాలను పెంచుకుంటూ, సంపన్న ఉత్తరాది దేశాలు భూమండలం మీద తక్కిన ప్రాంతాలలో ఉన్న ఇతర పెట్టుబడిదారులనందరినీ వెనక్కి నెట్టేస్తున్నాయి. ప్రపంచ పెట్టుబడిపై తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాయి.
ఎక్కువ పెట్టుబడి కలిగిన సంస్థలు మాత్రమే యంత్రాలపై ఎక్కువగా పెట్టుబడి పెట్టగలవు. తద్వారా ఉత్పాదకతను పెంచుకోగలవు. దాని ఫలితంగా తక్కిన పరిశ్రమల కన్నా ఎక్కువ లాభాలను అప్పటి వరకు సంపాదించగలవు. మార్కెటింగ్‌, అకౌంటింగ్‌, భూగర్భ ఇంధన నిల్వల అన్వేషణ వంటి రంగాలలో యాంత్రీకరణను ప్రవేశపెట్టి ఉత్పాదకతను, లాభాలను పెంచుకోగలవు. అంటే ఉత్పాదకత పెరుగుదల, లాభాల పెరుగుదల మొత్తం పెట్టుబడిదారీ వ్యవస్థకంతటికీ కాకుండా అందులోని కొన్ని పరిశ్రమలలో మాత్రమే జరుగుతుంది. ఈ పెరుగుదల సమాజ అవసరాలను తీర్చేదిగా ఉండదు. అదే సమయంలో సామ్రాజ్యవాద దేశాల నడుమ వైరుధ్యాలు మళ్ళీ తీవ్రం కావడం ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికాకు, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకు నడుమ ఉత్పాదకత పెరుగుదల రేటులో ఉన్న తేడా నుండే ఈ వైరుధ్యం బయలుదేరింది. యూరో ప్రాంతంలో శ్రామిక ఉత్పాదకత వృద్ధి రేటు కరోనా మహమ్మారికి ముందు కాలంలో 0.5 శాతంగా ఉండేది. కరోనా అనంతర కాలంలో అది 0.2 శాతానికి పడిపోయింది. అదే అమెరికాలోనైతే వ్యవసాయేతర రంగాల్లో శ్రామిక ఉత్పాదకత వృద్ధి రేటు 1.8గా 2018 నుండీ కొనసాగుతోంది. అంటే అమెరికన్‌ సరుకుల కన్నా యూరోపియన్‌ సరుకుల ధర ఎక్కువగా ఉంటుంది. దీనిని తట్టుకోవడానికి యూరోపియన్‌ దేశాలు తమ కార్మికవర్గంపై పొదుపు చర్యల పేరుతో వేతనాల కోతలను విధించడం ప్రారంభించాయి. దీని పర్యవసానంగా కలుగుతున్న ప్రజాగ్రహాన్ని అక్కడి మితవాద రాజకీయ శక్తులు వినియోగించుకుంటున్నాయి.
(ఈ) కేంద్రీకరణ, కొల్లగొట్టే దోపిడీ ద్వారా గుత్తాధిపత్యాన్ని పెంచడం: సాధారణ లాభాల రేటు పడిపోతున్నప్పుడు గుత్తాధిపతులు తమకు నచ్చినట్టు సరుకుల ధరలను నిర్ణయించగలరు. తద్వారా వాళ్ళు మరింత ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. ఈ క్రమంలో బడా కంపెనీలు చిన్న కంపెనీలను సంక్షోభ సమయంలో స్వాహా చేసేస్తాయి. అదే సమయంలో గుత్త సంస్థలు జాతి సంపదలను , సహజ వనరులను కారుచౌకగా తమకు అప్పజెప్పమని ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తాయి.
ప్రపంచ అసమానతల గణాంకాలను పరిశీలిస్తే ఈ సంక్షోభ కాలంలోని ముఖ్యమైన మరికొన్ని ధోరణులు వెల్లడి అవుతాయి. 2008 నుండి చూస్తే ప్రపంచ సంపదలో అత్యంత సంపన్నులుగా ఉన్న ఒక్క శాతం సంపన్నుల వాటా ఇప్పటిదాకా 21 శాతంగానే కొనసాగుతోంది. అందులో పెద్ద మార్పు లేదు. అయితే, అత్యంత సంపన్నులుగా ఉన్న 10 శాతం మందిని తీసుకుంటే వారి వాటా 56.6 నుండి 53.5 శాతానికి తగ్గింది. అంటే, అత్యంత సంపన్నులైన ఒక్క శాతం మందీ ఆ పది శాతంలోని తక్కిన సంపన్నులను సైతం కొల్లగొడుతున్నారన్నమాట. వారి నడుమ కూడా పెట్టుబడి కేంద్రీకరణ జరిగిపోతోందన్నమాట. సంక్షోభ కాలంలో గాని, సాధారణ పరిస్థితులలో కాని గుత్తాధితుల వద్ద సంపద పేరుకుపోయే రేటు మాత్రం ఎక్కడా తగ్గలేదన్నది మరో అంశం.
(ఉ) కార్మికవర్గంపై దాడి: పైన తెలిపిన నాలుగు పద్ధతులతోబాటు భారీ నిరుద్యోగాన్ని సృష్టించడం, వేతనాలను తగ్గించడం, పని గంటలను పొడిగించడం, తద్వారా ఆర్థిక సంక్షోభ భారాలను కార్మికవర్గగం పైకి నెట్టివేయడం పెట్టుబడిదారులకు అత్యంత ప్రీతిపాత్రమైన విధానం.
ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్త నిరుద్యోగ రేటు 5 శాతం వద్ద ఉంది. మే 2024లో అమెరికాలో పార్ట్‌ టైం ఉద్యోగాలు 286,000 పెరిగాయి. అదే కాలంలో పూర్తి కాలం ఉద్యోగాలు 625,000 తగ్గిపోయాయి. ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలను చేస్తున్న అమెరికన్ల సంఖ్య మే నెలలో 84 లక్షలకు చేరింది. కుటుంబం గడవాలంటే ప్రతీ ఒక్కరూ రెండేసి ఉద్యోగాలు చేయవలసి వస్తోంది!
అత్యధిక జి-20 దేశాలలో నిజవేతనాలు పడిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తీవ్ర పేదరికంలో జీవిస్తున్న కార్మికుల సంఖ్య ఒక్క నెలలోనే 10 లక్షలకు పైగా పెరిగింది. సంపదలో కార్మికుల వాటా 2019లో 52.9 శాతంగా ఉంటే అది 2022 నాటికి 52.3 శాతానికి పడిపోయింది. కార్మికుల నుండి మరింత ఎక్కువగా అదనపు విలువను పిండుకోడానికి పెట్టుబడిదారీ వర్గం చేస్తున్న ప్రయత్నాల ఫలితమే ఇదంతా. మరోపక్క ఆ కార్మికుల బేరసారాల శక్తిని హరించే విధంగా నిరుద్యోగాన్ని, భద్రత లేని ఉద్యోగాలని పెంచివేస్తున్నారు.
ఇప్పుడు మనం పెట్టుబడిదారీ వర్గం ఆర్థిక సంక్షోభం నుండి బైటపడడానికి అనుసరిస్తున్న ప్రధాన మార్గాలను గుర్తించాం. వాటి రాజకీయ పర్యవసానాలనూ గుర్తించాం. ఇక మనం ఆ మార్గాలన్నింటినీ మూసివేసి పెట్టుబడిదారీ వ్యవస్థ కోలుకోవడానికి ముందు దారి లేకుండా చేయాలి. ఇందుకోసం సంపన్న దేశాలలోని కార్మికుల పోరాటాలతో మూడవ ప్రపంచ దేశాల కార్మికులు తమ పోరాటాలను జోడించాలి. ఇప్పుడు ఉత్పత్తి పలు దేశాల్లో, పలు ప్రాంతాల్లో జరుగుతోంది. అందుచేత వివిధ దశల్లో జరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా, ఉత్పత్తుల వారీగా, కంపెనీ వారీగా, అంతర్జాతీయ ఉద్యమాలను నిర్మించి పెట్టుబడి మెడలు వంచాలి. ఈ కొండచిలువ ఎంత పొడవున విస్తరించి వుందో అంత పొడవునా, దానిమీద దాడి జరగాలి.

– సుదీప్‌ దత్తా
(స్వేచ్ఛానుసరణ)

➡️